కొబ్బరి నూనె నుంచి తీసిన కొన్ని పదార్థాలు కీటకాలను నాశనం చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయని అమెరికా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కీటకాలతో వచ్చే సమస్యలను అరికట్టేందుకు దాదాపు 60 ఏళ్లుగా డీట్ అనే కృత్రిమ రసాయనాన్ని వాడుతూండగా.. సహజసిద్ధమైన వాటి కోసం ఇటీవలే అన్వేషణ మొదలైంది. ఈ నేపథ్యంలో అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేపట్టారు. వీటి ప్రకారం కొబ్బరి నుంచి సేకరించిన కొన్ని రకాల కొవ్వు పదార్థాలు నల్లులతోపాటు, దోమలు, ఈగల నుంచి రక్షణ కల్పించడంలో కృత్రిమ రసాయనాల కంటే మెరుగైనవని తెలిసింది.
మరీ ముఖ్యంగా దోమల విషయంలో ఈ పదార్థాలు ఎక్కువ ప్రభావశీలంగా కనిపించాయని, ల్యాబొరేటరీ పరిశోధనల్లో ఈ కొవ్వులు కొన్నిరకాల కీటకాల నుంచి రెండు వారాలపాటు రక్షణ కల్పించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జున్ వీ ఝూ అంటున్నారు. కొబ్బరి నూనె నేరుగా కీటకాలను పారదోలదని స్పష్టం చేసిన జున్ వీ ఝూ ఇందులోని లారిక్, క్యాప్రిక్, క్యాప్రిలిక్ యాసిడ్లు, వీటి తాలూకు మిథైల్ ఈస్టర్లు ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ రకమైన కొవ్వుల ఆధారంగా కొత్తరకం మందులు తయారు చేయడం వల్ల జికా వంటి అనేక వ్యాధులను నియంత్రించ వచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment