కొబ్బరి నూనె.. హెయిర్‌ ఆయిలా? వంటనూనా? | Is coconut oil hair oil or edible oil what Supreme Court said | Sakshi
Sakshi News home page

కొబ్బరినూనెపై ‘పన్ను’ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు

Dec 19 2024 7:08 PM | Updated on Dec 19 2024 7:43 PM

Is coconut oil hair oil or edible oil what Supreme Court said

కొబ్బరి నూనె ఎందుకు వాడతారు? తలకు పెట్టుకుంటారు, కేరళలో వంటల్లో కూడా వినియోగిస్తారు. అయితే మరి కొబ్బరినూనె.. హెయిర్‌ ఆయిలా లేక వంటలనూనా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే రెండింటికీ వాడతారు. మనదేశంలో హెయిర్‌ ఆయిల్‌గానే అధికంగా కొబ్బరి నూనె వాడతారు. కాళ్లు, చేతులతో పాటు శరీరాన్ని మర్దన చేయడానికి కూడా కొబ్బరినూనె ఉపయోగిస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? దశాబ్దన్నర కాలం నుంచి కొబ్బరినూనెపై జరుగుతున్న ‘పన్ను’ వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ముగింపు పలికింది. ఎక్సైజ్ శాఖ, తయారీదారుల మధ్య సుదీర్ఘ న్యాయ వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు బుధవారం నాడు తీర్పు చెప్పింది.

ఏమిటా వివాదం?
చిన్నచిన్న సీసాల్లో విక్రయించే కొబ్బరి నూనెను ఎడిబుల్‌ ఆయిల్‌ (తినదగిన నూనె)గా వర్గీకరించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో తయారీదారులు, వినియోగదారులకు ఊరట లభించనుంది. కొకొనట్‌ ఆయిల్‌పై ‘పన్ను’ వివాదం 2009లో ప్రారంభమైంది. మనం కొనే ప్రతి వస్తువుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు విధిస్తుంటాయి. అలాగే రెడీమేడ్‌ కొబ్బరినూనె అమ్మకాలపై కూడా పన్ను ఉంది. జీఎస్టీ అమల్లోకి రాకముందు సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్ (సెట్‌ యాక్ట్‌) 1985 ప్రకారం ఎడిబుల్‌ ఆయిల్‌ కేటగిరీ కింద కొబ్బరినూనెపై 8 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ ఉండేది. సెట్‌ యాక్ట్‌కు 2005లో కేంద్రం సవరణ చేసింది. దీని ప్రకారం 2009, జూన్‌లో కొబ్బరినూనెను కేశసంరక్షణ ఉత్పత్తిగా పేర్కొంటూ సుంకాన్ని 16 శాతానికి పెంచింది.

అయితే 2009లో సర్క్యులర్ జారీ చేయడానికి ముందే, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు 2007లో మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు పలు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హెయిర్ ఆయిల్ ఉత్పత్తిగా వర్గీకరిస్తూ కొబ్బరి నూనెపై అధిక పన్ను రేటు విధించాలని నోటీసుల్లో ప్రతిపాదించారు. మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కొబ్బరి నూనెను 5 మిల్లీలీటర్ల నుంచి 2 లీటర్ల వరకు ప్యాకెట్లలో విక్రయిస్తుంటుంది. పన్ను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నైలోని కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(సెస్టాట్)ను మదన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. సెస్టాట్ తీర్పును సుప్రీంకోర్టులో సేలం సెంట్రల్‌ ఎక్సైజ్ కమిషనర్‌ సవాల్‌ చేశారు.

ఎటూ తేల్చని ద్విసభ్య ధర్మాసనం
కొబ్బరి నూనెను హెయిర్‌ ఆయిల్‌ విభాగంలో చేర్చాలా, వంటనూనెగా పరిగణించాలా అనే దానిపై 2018లో జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఆర్‌ భానుమతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ప్యాకేజీ పరిమాణంతో సంబంధం లేకుండా కొబ్బరి నూనెను తినదగిన నూనెగా వర్గీకరించాలని జస్టిస్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. కొబ్బరి నూనెను హెయిర్‌ ఆయిల్‌గా పరిగణించాలని జస్టిస్‌ భానుమతి పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్లింది.

15 ఏళ్ల న్యాయవివాదం​
15 ఏళ్ల సుదీర్ఘ న్యాయ వివాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్ ఆర్. మహదేవన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. కొబ్బరి నూనెను చిన్న బాటిళ్లలో ప్యాక్ చేసి విక్రయిస్తే ఎడిబుల్‌ ఆయిల్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది. అయితే వంటనూనె, హెయిర్‌ ఆయిల్‌ మధ్య తేడా స్పష్టంగా తెలిసేలా ఏదైనా చేయాలని ధర్మాసం సూచించింది. తినదగిన నూనెగా విక్రయించబడే కొబ్బరి నూనె తప్పనిసరిగా 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టానికి అనుగుణంగా ఉండాలని ఆదేశించింది.

చ‌ద‌వండి: అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్

రూ. 740 కోట్లు పెండింగ్‌
రెవెన్యూ శాఖ లెక్కల ప్రకారం.. ఈ వ్యవహారంలో వడ్డీ, జరిమానాలు కాకుండా పన్నుల రూపంలో ప్రభుత్వానికి  రూ. 740 కోట్లు రావాల్సి ఉంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కేసులు పెండింగ్‌లో ఉండడంతో కొకొనట్‌ ఆయిల్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారింది. ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న‌ జీఎస్టీ ప్రకారం చూసుకుంటే ఎడిబుల్‌ ఆయిల్‌పై 5 శాతం, హెయిర్‌ ఆయిల్‌పై 18 శాతం పన్ను ఉంది. స్వల్ప పరిమాణంలో విక్రయించే కొబ్బరినూనెను ఎడిబుల్‌ ఆయిల్‌ జాబితాలో చేర్చడం వల్ల పన్నుల భారంతో పాటు ధ‌ర కూడా తగ్గుతుంది. ఫ‌లితంగా తయారీదారుడితో పాటు వినియోగదారుడికి ఊరట లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement