
మెదడు హంగూ... మేని రంగు!
అకస్మాత్తుగా ఓ అమ్మాయికి సిగ్గు ముంచుకొస్తుంది.
అకస్మాత్తుగా ఓ అమ్మాయికి సిగ్గు ముంచుకొస్తుంది. వెంటనే ఆమె బుగ్గలు గులాబీ మొగ్గలవుతాయి. అనుకోకుండా ఒక పెద్దాయనకు కోపం వచ్చేస్తుంది. దాంతో ఆయన ముఖమంతా ఎర్రబారిపోతుంది. సిగ్గు లేదా కోపం అనేవి మనసుకు సంబంధించిన భావోద్వేగాలు. ఇలా మెదడులో జరిగే మానసిక ప్రక్రియలైన భావోద్వేగాలకూ, చర్మం రంగులు మారడానికీ సంబంధం ఏమిటి? మెదడూ... మేనుల మధ్య ఈ బంధం ఏమిటి? మేని రంగు, మేనిపై వ్యక్తమయ్యే కొన్ని రకాల లక్షణాలతో తెలిసిపోయే సమస్యలూ, వ్యాధులు ఉంటాయా అన్న అనేక విషయాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం.
సిగ్గు ముంచుకొచ్చినప్పుడు చెంపలు కెంపులవుతాయెందుకు?
చిన్నారి అయినా, యుక్తవయసులోని అమ్మాయి అయినా... ఒకరు సిగ్గుల మొలక అయినప్పుడు బుగ్గలు గులాబిరంగులోకి మారడానికి కారణం ఉంది. మన శరీరమంతా రక్తనాళాల చివరలైన రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్) వ్యాపించి ఉంటాయన్న విషయం తెలిసిందే.
సిగ్గు అనే భావోద్వేగం కలగగానే ఈ రక్తనాళాల చివరల ఉన్న అతి సన్నటి క్యాపిల్లరీస్ మరింత వెడల్పు అవుతాయి. దాంట్లోంచి మరింత రక్తం జివ్వుమంటూ ఒక్కసారిగా ప్రవహిస్తుంది. దాంతో చర్మంలోంచి ఆ రక్తపు రంగు గులాబీ వర్ణంలో అందంగా కనిపిస్తుంది. ఈ క్యాపిల్లరీస్ అనేవి బుగ్గల్లో మాత్రమే కాదు... కొందరిలో చెవులు, మెడ, ఛాతీపై భాగంలోనూ ఉంటాయి. మెదడులోంచి సిగ్గు అనే భావోద్వేగానికి సంబంధించిన సమాచారం అందగానే రక్తం ఒక్కసారిగా పాకుతుంది. ఇలా రక్తం పాకడం అనేది కేవలం సిగ్గు అనే భావోద్వేగం వల్లనే కాకుండా తీవ్రమైన కోపోద్రేకాలకు గురైన సమయంలోనూ, తీవ్రమైన అవమానభారం పొందినప్పుడూ జరుగుతుంటుంది. ఇలా బుగ్గల రంగుమారడాన్ని ‘బ్లషింగ్’ అంటారు. ఇది సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనే ‘అనియంత్రిత వ్యసవ్థ’ ద్వారా జరుగుతుంది.
అవమానం జరిగినప్పుడు ముఖమెందుకు జేవురిస్తుంది?
తీవ్రమైన అవమానం జరిగినప్పుడు కొందరి ముఖం జేవురించడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. వాస్తవంగా మానసిక ఉద్వేగాలలోనూ భౌతికమైన కొన్ని చర్యలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు ఇలా తీవ్ర అవమానం జరిగిన సమయంలో ముఖంపైని చర్మం జేవురించడానికి కారణం ఉంది. ఆ సమయంలో మనలో అడ్రినాలిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది శ్వాసప్రక్రియ, గుండె కొట్టుకునే వేగాలను పెంచుతుంది. మన కనుపాపలు విశాలం అవుతాయి. రక్తం మరింతగా ప్రవహించేందుకు వీలుగా రక్తనాళాలూ మరింత వెడల్పు అవుతాయి. వీటన్నింటి సంయుక్త ప్రభావం వల్ల తీవ్ర అవమానం (ఎంబారాస్‌మెంట్) సమయంలో ముఖం జేవురిస్తుంది.
బుగ్గలు ఎర్రబారేలా చేసే జీవరసాయనాలివే...
ఓ చిన్నారిని అందరూ ఒక్కసారిగా చూస్తుంటే ఆ అమ్మాయి సిగ్గుల మొలకైనప్పుడు బుగ్గలు మాత్రమే ఎర్రబారడం చాలామందిలో కనిపిస్తుంటుంది. ఇలా జరగడానికీ కొన్ని రకాల జీవరసాయనాలూ కారణమే. ఉదాహరణకు ‘ఎడినల్ సైక్లేజ్’ అనే ఒక జీవరసాయనం వెలువడుతుంది. అది సిరల్లోకి మరో జీవరసాయనమైన ‘ఎడ్రినాలిన్’ను ఎక్కువ మోతాదులో పాకేలా చేస్తుంది. దాంతో ఒక్కసారిగా అధిక మోతాదులో రక్తం ముఖంలోకి ప్రవహిస్తుంది. ఇలా ఈ జీవరసాయనాలన్నీ బుగ్గల్ని ఎర్రబారుస్తాయన్నమాట.
బుగ్గలను ఎర్రబార్చే పరిస్థితులివే...
కేవలం సిగ్గు వల్ల మాత్రమేగాక మరికొన్ని పరిస్థితులు కూడా మేని చర్మాన్ని ఎర్రబారుస్తాయి. అవి... కోపోద్రిక్తతలు, తీవ్రమైన అవమానం, తీవ్రమైన అసహనం (ఇరిటేషన్), తీవ్రమైన విచారం, ఉద్విగ్నతకు లోనుకావడం (యాంగ్జైటీ), తనను తాను ఉత్సాహపరచుకోవడం లోపించడం(డీ-మోటివేషన్), ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమయ్యేంత ఉద్రేకం (అగ్రెసివ్‌నెస్), తీవ్రమైన ఒత్తిడి (టెన్షన్), తీవ్రమైన అలసట (ఫెటీగ్)... ఇలాంటి ఎన్నో భావోద్వేగాలు చర్మం (ముఖ్యంగా ముఖంపైని) రంగును మారుస్తాయి.
ఫ్లషింగ్ అంటే ఏమిటి?
ఫ్లషింగ్ అంటే కూడా రక్తం వేగంగా ప్రవహించడం వల్ల మేని రంగు ఎర్రగా మారడం. కాకపోతే బుగ్గలూ, ముఖం వరకే ఎర్రబారితే దాన్ని ‘బ్లషింగ్’ అని వ్యవహరిస్తారు. ఒక్కోసారి ముఖం మినహా... మిగతా మేనంతా ఎర్రబారితే దాన్ని ‘ఫ్లషింగ్’ అని అంటారు. ఇలా ఫ్లషింగ్ అనేది మానసిక భావోద్వేగాలతో కంటే శారీరక కారణాలతోనే ఎక్కువగా ముడిపడి ఉంటుంది.
బ్లషింగ్‌కు చికిత్స ఇలా...
అది స్వాభావికం, సిగ్గు లాంటి తాత్కాలిక భావోద్వేగం వల్ల కాకపోతే ముందుగా ముఖం ఇలా ఎర్రబారడానికి కారణాలను తెలుసుకుని వాటిని దూరం చేసుకోవాలి. ఇంట్లోనే ఈ తరహా చికిత్సలు చేసుకోవచ్చు. ఉదాహరణకు... బ్లషింగ్‌కు కారణమయ్యే ఆహారం, దినుసులు, మసాలాలు వంటి వాటికి దూరంగా ఉండటం అకస్మాత్తుగా పరిసరాల వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో మార్పులు జరగకుండా చూసుకోవడం మద్యం వంటివి ముఖాన్ని ఎర్రబార్చేలా చేస్తున్నప్పుడు ఆ దురలవాటును మానేయడం తీవ్రమైన ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను అంటే శ్వాసవ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్‌సెజైస్), ధ్యానం, యోగా వంటివి ఆచరించడం.
మేని నుంచి మెదడుకు...
చర్మం మీద రంగు మారడం వంటి దుష్ర్పభావాలు పడడంతో చాలామంది మానసికంగా కుంగిపోతారు. దాంతో అది మానసిక వ్యాధులకు దారితీస్తుంది. ఈ విధంగా మెదడు సమస్యలు చర్మంపై... చర్మం సమస్యలు మెదడుపై పరస్పరం ప్రభావం చూపుకుంటాయి.
మెదడు నుంచి మేనికి...
కొన్నిసార్లు మెదడులోని కొన్ని రసాయనాలు సమతుల్యం కోల్పోవడం, అవి అడ్రినల్ వంటి మరికొన్ని రసాయనాలు వెలువడేలా చేయడంతో ఆ ప్రభావం చర్మం మీద పడుతుంది.
చర్మంపై ప్రభావంచూపించే మానసిక సమస్యల్లో కొన్ని...
కొన్ని మానసిక సమస్యలు కేవలం మెదడుకు మాత్రమే పరిమితం కావు. మేనిపైనా ప్రభావం చూపిస్తాయి. ఆ రోగులు కాస్త వింతగానూ, విచిత్రంగానూ ప్రవర్తిస్తుంటారు. వాటిలో కొన్ని వ్యాధులివి... బ్రోమ్‌హైడ్రోఫోబియా : తన చర్మం నుంచి దుర్వాసన వస్తుందేమో అన్న అనుమానం కొందరిని వేధిస్తూ ఉంటుంది. వీరు మాటిమాటికీ తమ చర్మం వాసన చూసుకుంటూ, తమను తాము పరీక్షించుకుంటూ ఉంటుంటారు. ఈ మానసికవ్యాధిలో రోగి తన చర్మాన్ని, దాని నుంచి దుర్వాసన వస్తున్న పరిస్థితులను నిత్యం అనుమానిస్తూ, అదే ఆందోళనలో తలమునకలై ఉంటాడు.
డెల్యూషన్ ఆఫ్ పారాసైటోసిస్: కొంతమంది రోగులకు తమ చర్మం మీద ఏవో పరాన్నజీవులు పాకుతున్నట్లుగానూ, అవి తమ చర్మానికి హాని చేస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. ఈ భ్రాంతితో వారు తమ చర్మంపై పురుగులు పాకుతున్నట్లుగా భ్రమించి, అక్కడ లేని కీటకాలను ఏరుతూ ఉంటారు. తమకు దగ్గర్లో కనిపించిన ఏదైనా చిన్న కీటకాన్ని తమ చర్మంపై నుంచే వచ్చినట్లుగా భావించి, దాన్ని అగ్గిపెట్టెలో దాచి ఉంచి, డాక్టర్ దగ్గరికి తీసుకువచ్చి, దాన్ని సాక్ష్యంగా చూపి, తమ ఒంటిపైన ఇలాంటి ఎన్నో కీటకాలు ఉన్నాయని అంటుంటారు. దాన్ని ‘మ్యాచ్‌బాక్స్’ సైన్ అని పేర్కొంటారు. పైన పేర్కొన్న ఈ జబ్బులకు సైకియాట్రిక్ కౌన్సెలింగ్‌తో పాటు కొన్ని మానసిక చికిత్సకు సంబంధించిన మందులు అవసరమవుతాయి. ‘పైమోజైడ్’ అనే మందు ఈ తరహా జబ్బులకు బాగా పనిచేస్తుంది. కానీ దీన్ని కేవలం డాక్టర్ల సలహా మేరకే వారు సూచించిన మోతాదుల్లోనే వాడాలి.
శరీరపు రంగున ప్రభావితం చేసే వ్యాధులివే...
భావోద్వేగాలకు మేని రంగు మారండం (బ్లషింగ్), కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలు లేకపోయినా శరీరం రంగు మారిపోవడం (రోజేసీయా) వంటివే గాక కొన్ని వ్యాధులు సైతం మేని రంగును మారుస్తాయి. ఇలా మేని రంగును మార్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. అవి ఇవే...
కార్సినాయిడ్ సిండ్రోమ్: ఇది చాలా అరుదైన వ్యాధి. ఈ కార్సినాయిడ్ సిండ్రోమ్‌లో ఒక గడ్డ కొన్ని రకాల రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. వాటి కారణంగా శరీరంలోని రక్తనాళాలు విశాలమైపోతాయి. దాంతో శరీరమంతా రక్తం పాకి మేను ఎర్రబారుతుంది. ఇడియోపథిక్ క్రేనియోఫేషియల్ ఎరిథ్మా: ఇది ముఖంలోకి జివ్వున రక్తం ఎగజిమ్మించేలా చేసి, ముఖం ఎర్రబారేలా చేసే మరో రకం కండిషన్. ఇందులో ‘బ్లషింగ్’ ప్రక్రియ ఏ కారణం వల్ల జరుగుతుందో కూడా తెలియదు. స్నేహితులతో మాట్లాడుతుండగానో, కళ్లతో కళ్లు కలపడం వల్లనో, చివరకు అపరిచితుడిని అడ్రస్ అడగడం వల్ల కూడా ఇలా ముఖంలోకి రక్తం చిమ్మి, బుగ్గలు ఎర్రబారవచ్చు.
తీవ్రమైన జ్వరం: కొన్ని సార్లు జ్వరం చాలా తీవ్రమైనప్పుడు అది ముఖంలోనూ కనిపిస్తుంది. తీవ్రంగా జ్వరపడ్డ వారి ముఖం ఎర్రగా అవుతుంది.
రుతుస్రావం ఆగిపోవడం: రుతుస్రావం ఆగిపోయే కండిషన్‌ను మెనోపాజ్ అంటారన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో జరిగే హార్మోన్లలోని మార్పుల వల్ల కూడా ‘బ్లషింగ్’ చోటుచేసుకోవచ్చు.
ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా మార్పు : కొందరు అకస్మాత్తుగా తీవ్రమైన చలి వాతావరణం నుంచి తీవ్రమైన వేడి ప్రదేశంలోకి వచ్చినా లేదా సరిగ్గా దీనికి వ్యతిరేకంగా జరిగినా ముఖం ఎర్రబారవచ్చు.
నియాసిన్ మోతాదు మించడం : బీకాంప్లెక్స్‌లో ఉండే ఒక విటమినే ‘విటమిన్ బి3’. దీన్ని వైద్యపరిభాషలో నియాసిన్ అంటారు. శరీరంలో దీని మోతాదు పెరిగినా ‘బ్లషింగ్’ చోటు చేసుకుంటుంది.
ప్యానిక్ డిజార్డర్ : ఒక్కసారిగా ఏంచేయాలో తెలియనంత ఆందోళనకు గురై అచేతనమై, అవాక్కయ్యే పరిస్థితిని ప్యానిక్ కావడం అంటారు. కొందరు ఇలాంటి పరిస్థితికి గురయ్యే వ్యాధిని ‘ప్యానిక్ డిజార్డర్’ అంటారు. ఇలాంటప్పుడూ మేని రంగు మారి ముఖం ఎర్రబారుతుంది.
హైపర్ థైరాయిడిజమ్: మన మెడ భాగంలో ఉండి, అనేక జీవక్రియలు సజావుగా జరిగేలా చూసే గ్రంథి థైరాయిడ్. ఇది అతిగా పనిచేయడాన్ని ‘హైపర్ థైరాయిడిజమ్’ అంటారు. ఇలాంటి హైపర్‌థైరాయిడిజమ్ కండిషన్‌లోనూ మేని రంగు మారుతుంది.
ఫిఫ్త్ డిసీజ్ : ఇది ఒక రకం వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్‌ను ‘పార్వో వైరస్’ అంటారు. ఇలాంటి పార్వో డిసీజ్ వచ్చినప్పుడు బుగ్గల రంగు ఎంతగా మారుతుందంటే... చెంపలపై ఎవరైనా సాచి కొట్టారేమో అనిపించేంత ఎర్రబడతాయవి. అందుకే దీన్ని ‘స్లాప్‌డ్ చీక్ సిండ్రోమ్’ అని కూడా అంటారు.
స్కార్లెట్ ఫీవర్ : బ్యాక్టీరియాలలో ఒక రకానికి చెందిన ‘స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియమ్’ కలగజేసే ఇన్ఫెక్షన్ వల్ల చెంపల రంగు ఎర్రబారుతుంది. దీన్నే ‘స్కార్లెట్ ఫీవర్’ అంటారు.
చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్: కొందరికి చైనీస్ ఫుడ్ అంతగా సరిపడదు. చైనీస్ ఫుడ్‌లో... వారు మాత్రమే వాడే కొన్ని రకాల పదార్థాల వల్ల (ఉదాహరణకు అజినమోటో వంటివి) వాటిని తినగానే బుగ్గలు ఎర్రబారతాయి. దీన్ని ‘చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్’ అంటారు.
క్లస్టర్ హెడేక్: అనేక రకాల తలనొప్పుల్లో ఇదొకటి. ఇందులో ముఖం ప్రాంతంలో ఉన్న రక్తనాళాలలో అకస్మాత్తుగా రక్తం ప్రవహిస్తుంది. దాంతో అక్కడ రక్తం ఒత్తిడి పెరిగి పక్కనుండే నరాలపై తీవ్రమైన ఒత్తిడి పడి తలనొప్పికి దారితీస్తుంది. ఇలా వచ్చే ఈ నొప్పి చాలా తీవ్రమైన తలనొప్పి. ఇది దఫ దఫాలుగా వస్తుంటుంది. అందుకే దీన్ని క్లస్టర్స్‌గా పేర్కొంటారు. కొందరిలో ఈ తరహా తలనొప్పి నెలలో 10-15 సార్లు వస్తే మరికొందరిలో ఇది ఏడాదిలో 20-25 సార్లు రావచ్చు. ఈ తరహా క్లస్టర్ హెడేక్ వచ్చినప్పుడు కూడా ముఖం ఎర్రబారుతుంది.
అగోరఫోబియా : ఎక్కువ సంఖ్యలో ఒక చోట పోగైన జనాల గుంపులను (క్రౌడ్) చూసి భయాందోళనలకు గురికావడాన్ని అగోరఫోబియా అంటారు. ఇలాంటప్పుడు కూడా చెంపలు ఎర్రబారతాయి.
రోజేసియూ కండిషన్ అంటే...
కొందరిలో పైన పేర్కొన్న ఎలాంటి భావోద్వేగాలు లేకపోయినప్పటికీ బుగ్గలు ఎర్రబారడం జరుగుతుంది. భావోద్వేగాలతో బుగ్గలు ఎర్రబారడాన్ని ‘బ్లషింగ్’ అంటారు. కానీ... ఎలాంటి భావోద్వేగాలు లేకపోయినా బుగ్గలు లేదా చర్మం ఎర్రబారడాన్ని ‘రోజేసియా’ కండిషన్‌గా పేర్కొంటారు.
రోజేసియాకి దోహదం చేసే మరికొన్ని పరిస్థితులు...
కొందరిలో చాలా ఎక్కువ మసాలాలతో కూడిన ఆహారం తీసుకోవడం, చాలా ఎక్కువగా కారం తినడం జరిగినప్పుడు వారి ముఖం తీవ్రంగా ఎర్రబారడం గమనిస్తుంటాం. అంటే రోజేసియా కండిషన్ వస్తుందన్నమాట. ఇక కొందరిలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా రోజేసీయా కండిషన్ రావడం చాలా సాధారణం.
డాక్టర్‌ను కలవాల్సిందెప్పుడు?
మామూలుగా సిగ్గు పడ్డప్పుడో, బాగా కోపం వచ్చినప్పుడో బుగ్గలు, చెంపలు ఎర్రబారడం జబ్బేమీ కాదు. అది సహజమైన సహజాతం (ఇన్‌స్టింక్ట్) కూడా. కానీ అలా బుగ్గలపై ఏర్పడ్డ ఎరుపురంగు అస్తమానం కొనసాగుతూ ఉన్నా, లేదా బుగ్గల మీద ఎరుపుతో పాటు శ్వాసతీసుకుంటున్నప్పుడు పిల్లికూతలు వినిపించడం, ఒళ్లంతా దద్దుర్లు, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, ఆయాసం వంటివి ఉంటే... శారీరకమైన ఈ ఎరుపు లక్షణంతో పాటు... సామాజికపరమైన, మానసికమైన ఇతర లక్షణాలను కలగలపుకొని చూసుకొని డాక్టర్‌ను సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు అసలు కారణాన్ని వెదికి దానికి సరైన చికిత్స అందిస్తారు.
న్యూరోటిక్ ఎక్స్‌కోరియేషన్స్ / ఫ్యాక్టీషియల్ డర్మటైటిస్
పైన పేర్కొన్న మానసిక వ్యాధులతో రోగి తన సొంత చర్మాన్ని తానే ధ్వంసం చేసుకుంటుంటాడు. తన గోళ్లతో తన చర్మాన్ని తీవ్రంగా దెబ్బతినేలా గీరుకుంటుంటాడు. కొన్నిసార్లు ఇలా తన చర్మానికి హాని చేసుకునే ఈ తీవ్రత ఎంతగా ఉంటుందంటే... సిగరెట్లతో తన సొంత చర్మాన్ని కాల్చుకుంటూ ఉంటాడు లేదా రసాయనాలతో నాశనం చేసుకుంటాడు లేదా పదునైన వస్తువులతో కోసుకుంటుంటాడు. ఇలాంటి వారికి తప్పనిసరిగా మానసిక చికిత్స అవసరం. వీళ్లకు యాంటీడిప్రెసెంట్ మందులతో తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.
ఇన్ని ఉదాహరణలూ, ఇన్ని దృష్టాంతాలు, తర్వాత తేలే విషయం ఏమిటంటే... మీ మెదడు గురించి మీ మేనే మరింత స్పష్టంగా మాట్లాడుతుంది. మెదడు మాట్లాడే మేని భాష వినండి. తగిన జాగ్రత్తలు లేదా చికిత్సలు తీసుకోండి.
మేనిపై (శరీరంపై) మార్పులతో వ్యక్తమయ్యే ఇతర వ్యాధులు
కొన్ని రకాల మానసిక వ్యాధులలో - మానసిక లక్షణాలతో పాటు శారీరకంగా అంటే చర్మంపైన కూడా మార్పులతో కూడా అవి వ్యక్తమవుతాయి. అందుకు ఉదాహరణే ఈ కింది జబ్బులు...
డిప్రెషన్ : తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడేవారి చర్మంపై మొటిమలు విపరీతంగా వస్తాయి. వీటి వల్ల అసలే డిప్రెషన్‌తో బాధపడే కౌమార బాలబాలికలు మరింతగా న్యూనతకు గురవుతారు. దాంతో ఇతరులతో కలవలేక మరింత డిప్రెషన్‌కు లోనవుతారు. డిప్రెషన్ వ్యాధి మొటిమలను (ఆక్నే) ప్రేరేపించే అంశంగా (ట్రిగరింగ్ ఏజెంట్‌గా) మారుతుంది. డిప్రెషన్ వల్ల మొటిమలు రావడం... వాటిని చూసుకుని మరింతగా డిప్రెషన్‌లోకి కూరుకుపోవడం... మళ్లీ వాటి వల్ల మొటిమలు పెరగడం... ఇదో విషవలయంగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటేనే మొటిమలు తగ్గుతాయి తప్ప... కేవలం మొటిమలు తగ్గడానికి పైపూత మందులు వాడినంత మాత్రాన తగిన ప్రయోజనం ఉండదు. అంటే ఇలాంటి సందర్భాల్లో అటు మానసిక చికిత్సతో పాటు... ఇటు చర్మవ్యాధి చికిత్స ఏకకాలంలో జరగాలన్నమాట.
ఎగ్జిమా : చాలామందిలో కాళ్ల పగుళ్లు... అవి లోపల ఎరుపుగా కనిపించేంతగా పగిలిపోయి ఉండటాన్ని చూస్తుంటాం. ఇలాంటివి చికిత్సకు చాలా అరుదుగా లొంగుతాయి. ఇలా కాళ్లలో లోతైన పగుళ్లు ఉండటం కూడా అంతర్గతంగా డిప్రెషన్‌కు ఒక సూచనగానే తీసుకోవాలి. కాళ్లపగుళ్లు (ఎగ్జిమా)కు ఎంతగా మందులు వాడినా అవి తగ్గనప్పుడు... చర్మానికి వాడే మందులతో పాటు మనసుకూ చికిత్స తీసుకోవాలని అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ తరహా ఎగ్జిమా (కాళ్ల పగుళ్లు, ఒంటి పగుళ్లు, ఒళ్లంతా పొడిబారడం, దురద) తగ్గుతాయి.
హైవ్స్ లేదా అర్టికేరియా : కొందరిలో డిప్రెషన్ ఉన్నప్పుడు ఒంటిపై దద్దుర్లలా రాష్ వస్తుంది. ఇలా వచ్చే రాష్‌ను అర్టికేరియా అంటారు. శరీరంపై ఇలా వచ్చే ర్యాష్ కేవలం పూతమందులు, శారీరకమైన మందులతో తగ్గనప్పుడు డిప్రెషన్ కూడా ఉందని భావించి మానసిక చికిత్స కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది.
రోజేసియా : ప్రాథమిక డిప్రెషన్ లేదా మరింత పెరిగిన సెకండరీ స్థాయి డిప్రెషన్‌తో పాటు బుగ్గలపై ఎరుపు (రోజేసీయా) ఉన్నప్పుడు... ఆ సూచనను వ్యాధి మరింత తీవ్రస్థాయిలో (ముదిరి) ఉందన్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో రోజేసియాతో పాటు డిప్రెషన్‌కూ మందులు వాడాలి.
సోరియాసిస్ : దీర్ఘకాలిక సోరియాసిస్ వ్యాధికి ఇచ్చే మందులతో పాటు యాంటీడిప్రెసెంట్స్ కూడా వాడినప్పుడు సోరియాసిస్ వేగంగా తగ్గడాన్ని డాక్టర్లు గమనించారు.
అలొపేషియా : తలపై జుట్టు రాలిపోవడాన్ని అలొపేషియాగా వ్యవహరిస్తారు. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. ‘అలొపేషియా ఏరేటా’ అంటే పేనుకొరుకుడు. దీంట్లో కేవలం తలలో గానీ, మీసంలోగానీ, గడ్డంలోగాని కొంత భాగంలోనే వెంట్రుకలు మొలవకుండా పోతాయి.
‘యాండ్రోజెనిక్ అలొపేషియా’ అంటే బట్టతల. ఇందులో పురుషుల్లో తలపై జుట్టు రాలిపోతుంది. పైన పేర్కొన్న వెంట్రుకలు రాలడం అన్న అంశం కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డిప్రెషన్ లేదా ఉద్విగ్నత వల్ల కావచ్చు. అందుకే నేరుగా వెంట్రుకలు రాలడానికి ఇచ్చే చికిత్సతోనే ప్రయోజనం ఉండదు. మానసిక చికిత్స కూడా అవసరం.
విటిలిగో: ఇందులో చర్మం తన స్వాభావిక రంగును పూర్తిగా కోల్పోయి తెల్లగా మారుతుంది. బొల్లి అని వాడుకభాషలో పిలిచే ఈ వ్యాధికి గురైన వారు ఎంతో న్యూనతకు గురువుతుంటారు. ఇలా చర్మం తెల్లగా మారడానికి కూడా డిప్రెషన్ ఒక కారణం కావచ్చు. ఒక్కోసారి విటిలిగో వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. ఇది మళ్లీ ఈ రెండు వ్యాధుల మధ్య ఒక విషవలయంలా మారుతుంది. విటిలిగో చికిత్స చేసే సమయంలో డిప్రెషన్‌కూ వైద్యం అందించడం వల్ల ఈ రెండు వ్యాధులూ త్వరగా తగ్గుతాయి.
ఏటోపిక్ డర్మటైటిస్ : మడమలు పగిలినట్లుగా ఒళ్లంతా పగలడం, ఎర్రబారడం, దద్దుర్ల వంటివి వ్యాపించడం ఇవన్నీ ఏటోపిక్ డర్మటైటిస్ లక్షణాలు. డిప్రెషన్‌తో బాధపడుతున్నవారికి సైతం ఏటోపిక్ డర్మటైటిస్ అనే చర్మవ్యాధి వస్తుంది. కాబట్టి వ్యాధి నిర్ధారణ సమయంలోనే చాకచక్యంగా వ్యవహరించి, చర్మవ్యాధితో పాటు మానసిక చికిత్స కూడా అవసరమా కాదా అన్నది నిర్ధారణ చేయాలి.
డాక్టర్ స్మిత ఆళ్ళగడ్డ, చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్.