సమాజం పీలికలు పీలికలైపోయిందివ్యవస్థ చివికిపోయిన వస్త్రంలా అయ్యింది.అనుబంధాలు ఛిద్రమైపోతున్నాయి.మానవత్వం ముళ్లకంచెకు ఓ చిరుగులా వేలాడుతుంది. చొక్కా పట్టుకు లాగారుడొంక కదిలింది.కాలం ప్రయాణంలో కొన్ని ఘాతుకాలు మరుగున పడిపోవచ్చు. కానీ, ఆ కాలమే కొన్ని ఘాతుకాలను పైకి తీసుకురాగలదు. నిజాల నిగ్గు తేల్చగలదు.
1995 సంవత్సరం.తెనాలి దగ్గరి చేబ్రోలు.‘కొడుకా.. నన్నొదిలి ఏడికి పోయినవ్‌రా..! నిన్ను ఎక్కడని వెదికేదిరా’ ఏడుస్తోంది సుగుణమ్మ.అప్పటికి సంవత్సరం దాటిపోయింది.ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది. లేదంటే సుగుణమ్మ ఏడుపుతో నిండి ఉంటుంది. కొడుకు కనపడని దుఃఖం ఒకరు ఆర్చితే ఆరుతుందా, తీర్చితే తీరుతుందా? ‘ఏంటి సుగుణక్కా! కొడుకు కోసం ఎన్నాళ్లని ఏడుస్తా్తవ్. ఎక్కడో ఉండే ఉంటాడులే. నీమీద కోపంతో ఏ పట్నం పోయాడో, లేకపోతే దుబాయే పోయాడో..’ అంది పక్కింటి అలివేలు. ‘ఒక్కగానొక్క కొడుకు. వాళ్ల అయ్య సచ్చి నన్ను దిక్కులేనిదాన్ని చేశాడు. వీడు ఇలా నన్నొదిలిపోతాడు అనుకోలేదు. మోటారు బండి కొంట పైసలు కావాలని ఒకటే గోల చేస్తుంటే తిట్టిన డబ్బులు ఏడున్నాయ్ అని. కాదన్నానని అలిగిపోయాడు. ఇప్పటిదాకా రాలేదు. ఆ పొలం పాడుగాను.దాన్ని అమ్మినా నా కొడుకు నా కళ్ల ముందు ఉండేవాడు..’ కొడుకును తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న సుగుణమ్మ వైపు జాలిగా చూశారు చుట్టూ చేరిన జనం. ‘ఇలా కాదు. పోయి పోలీసులకు చెప్పుపో.. నీ కొడుకు ఏడున్నా వాళ్లే పట్టుకొస్తరు.. ’ అన్నడు అప్పుడే పొలం నుంచి ఇంటికి వస్తున్న రాజయ్య. ‘అదే మంచిది సుగుణక్కా, రాజయ్య చెప్పినట్టు చేయి! పోలీసులకు జెప్తే వాళ్లే తీసుకొస్తారు’ అంది వరసకు చెల్లెలైన వెంకటి.
చుట్టూ చేరిన జనం కూడా అదే మంచిదన్నారు. సుగుణమ్మ కళ్ల నీళ్లు తుడుచుకుని, జుట్టు ముడేసుకొని, తలుపులు మూసి తాళం వేసింది.టౌన్‌లో ఉన్న పోలీసుస్టేషన్‌కి చేరింది. ‘ఏంటీ నీ కొడుకు కనిపించక ఏడాదిన్నర అవుతుందా?! ఇన్నాళ్లూ ఏం చేశావు?!’ ఆశ్చర్యంగా అడిగారు పోలీసులు.‘వాడే వస్తాడులే అనుకున్నా. ఏడాదిన్నర అవుతున్నా జాడ దొరకలేదు. కొంచెం మీరే సూడాలయ్యా’ రెండు చేతులెత్తి దణ్ణం పెట్టింది సుగుణమ్మ.చేతికి అందివచ్చిన కొడుకు దూరమై ఆ తల్లి పడుతున్న బాధను చూస్తుంటే పోలీసుల మనసు చలించిపోయింది. ‘సరే సరే, చివరిసారి నీతో ఏమైనా మాట్లాడాడా .. ఆ వివరాలు చెప్పు’ అన్నాడు ఎస్.ఐ. మిస్సింగ్ కేస్‌గా వివరాలు రాసుకోవడం మొదలుపెట్టారు పోలీసులు.తప్పిపోయినవాడి పేరు వీరేశం. వయసు 20 ఏళ్లు. ‘అయ్యా, నా కొడుకు చివరిసారిగా మా తమ్ముడువీరభద్రంతో కలిసి టౌన్‌కి వెళ్లినట్టు ఎవరో చెప్పారు’ చెప్పింది సుగుణమ్మ. వీరభద్రాన్ని పిలిపించారు పోలీసులు. ‘అయ్యా! మేం ఆ రోజు సినిమాకని వెళ్లాం. కానీ, రాత్రికి తిరిగొచ్చాక ఎవరిళ్లకు వాళ్లం వెళ్లిపోయాం. మరుసటి రోజు మా చుట్టాలింట్లో పని ఉండి ఊరెళ్లాను. తిరిగొచ్చాక తెలిసింది వీరేశం కనపడతలేడని’ అన్నాడు వీరభద్రం. ‘చివరిసారి నీతో ఏమైనా మాట్లాడాడా!’ అడిగాడు ఎస్.ఐ.‘ఎందుకు మాట్లాడలేదు సారూ.. వాడికేమో మోటారు సైకిలు కొనుక్కోవాలని ఉండేది. వాళ్లమ్మ భూమి అమ్మనంది. పట్నంలోనే ఏదైనా పని చూసుకొని బండి కొనుక్కున్నాకే ఊరొస్తానంటే.. నేనే నచ్చజెప్పి తీసుకొచ్చా. అయినా వాడు మళ్లీ వెళ్లిపోయాడంటే మా అక్క తిట్టిన తిట్ల వల్లనే సార్!’ అన్నాడు వీరభద్రం.
‘వీరభద్రం.. ఆ రాత్రి కూడా వాడు ఇంటికి రాలేదురా’ అంది సుగుణమ్మ కళ్లు నీళ్లు తుడుచుకుంటూ. ‘అవునా, ఊరికైతే వచ్చాం సారూ. తర్వాత వాడ్ని ఇంటికి పొమ్మని నేను మా ఇంటికి పోయాను’ అన్నాడు వీరభద్రం.‘సరే, మీరేళ్లండి!’ అని వాళ్లను పంపించారు పోలీసులు. ఆ రోజు వీరభద్రం వెళ్లిన చుట్టాలెవరో వాకబు చేశారు. అతను చెప్పింది నిజమే అని తేలింది. ‘వీరేశం మిస్సింగ్ కేసు అనుమానాస్పదంగా ఉంది. కానీ, రుజువులు కావాలి.. ’ ఆలోచనలో పడ్డాడు ఎస్.ఐ.సిబ్బందిని పిలిచి ‘ముందు వీరేశం ఊరెళ్దాం. ఏమైనా క్లూ దొరుకుద్దేమో’ అన్నాడు. పోలీసులు ఊరు బయల్దేరారు. ఊళ్లో చుట్టుపక్కల వారిని కలిసి, మరికొన్ని వివరాలు రాసుకున్నారు. కానీ, ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. ‘మనం పొరపాటుగా ఆలోచిస్తున్నామేమో! నిజంగానే తల్లి మీద అలిగి వీరేశం పట్నం వెళ్లిపోయుంటాడు. పట్నంలోని అన్నిపోలీసు స్టేషన్లకి వీరేశం ఫొటోలు, వివరాలు పంపి చూద్దాం’ అన్నాడు ఎస్.ఐ. ‘అవున్సార్.. అదే అయ్యుంటుంది. అలాగే చేద్దాం’ అన్నారు సిబ్బంది. తిరుగు ప్రయాణానికి జీప్ స్టార్ట్ అయ్యింది. వీరేశం ఊరికీ టౌన్‌కీ మధ్య మూడు కిలోమీటర్ల మట్టిదారి. ఆ దారంతా కంపచెట్లు ఉన్నాయి. అప్పటికే ఒకసారి పరిశీలించిన ప్రాంతం. ఎస్.ఐ యధాలాపంగా కంపచెట్లవైపు చూస్తూ ఒక చోట ఆగాడు. ‘కానిస్టేబుల్స్ ఆ కంపచెట్లకు కొన్ని పాత గుడ్డలు చుట్టుకొని ఉన్నాయి చూడండి. వాటిని జాగ్రత్తగా విప్పి ఇలా తీసుకరండి’ అని పురమాయించాడు. సిబ్బంది కొంత ప్రయత్నం చేస్తే ముళ్ల చెట్టుకు పట్టుకు వేళాడుతున్న పీలికల గుడ్డలు వచ్చాయి. ఆ చిరిగిపోయిన, పాత గుడ్డ పీలికలను తీసుకొని స్టేషన్‌కి వెళ్లిపోయారు పోలీసులు.మరుసటి రోజు సుగుణమ్మను పిలిపించారు పోలీసులు. ‘చూడమ్మా! పట్నంలోని అన్ని పోలీసు స్టేషన్లకి నీ కొడుకు ఫొటోలు పంపించాం. ఎక్కడున్నా త్వరలోనే పట్టుకుంటాం..’ అన్నాడు ఎస్.ఐ.అలాగేనని తలూపిన సుగుణమ్మ టేబుల్ మీద పీలికలైన గుడ్డ పీలికలను చూసింది. అందులో పీలికలైన ఒక చొక్కాను చూస్తూ ‘ఇది మావాడిదే! చారల చొక్కా. ఆ రోజు ఇదే వేసుకున్నాడు సారూ’ అంది ఏడుస్తూ! పోలీసులు ఉలిక్కిపడ్డారు.ఒకరిమొహాలు ఒకరు చూసుకున్నారు. పోలీసుల ఊహకు సుగుణమ్మ చెప్పిన వాస్తవం తొడయ్యింది. పీలికలైన చొక్కా ‘క్లూ’ అయ్యింది.
ఆ చొక్కా దొరికిన ప్రాంతానికి వెంటనే చేరుకున్నారు పోలీసులు. ఆ ప్రాంతమంతా మళ్ళీ మళ్ళీ పరిశీలించారు. మరే ఆధారమూ దొరకలేదు.ఆ చుట్టుపక్కల ఐదు వ్యవసాయ బావులు మాత్రం కనిపించాయి. బావులకు సంబంధించిన వారిని పిలిపించి, మోటర్లను ఆన్ చేశారు. ఉదయం మొదలైన నీటి ప్రవాహం సాయంత్రం దాకా బయటకు వస్తూనే ఉంది. గంటలు గంటలు గడుస్తున్నాయి. అక్కడున్న అన్ని బావుల నీళ్లూ బయటకు వచ్చేశాయి. సాయంకాలం వేళ ఆ బావులు నీళ్లు మింగేసిన రాకాసి గొంతుల్లా ఉన్నాయి. పోలీసు సిబ్బంది ఒక్కో బావిలోకి దిగి గాలించారు. చెట్లు, గుబురు పొదలతో కప్పబడినట్టుగా ఉన్న ఐదవ బావి వద్దకు వచ్చారు. అడుగున ఇంకా కొన్ని నీళ్లు మిగిలే ఉన్నాయి, ఆ మిగిలిన నీళ్లలోనే గాలించారు. పుర్రె, ఎముకలు చేతికి తగిలాయి. వాటిని బయటకు తీసి, పేరిస్తే మనిషి ఎముకలని తేలింది.
వీరభద్రాన్ని తీసుకొచ్చి కూచోబెట్టారు. చాలా వేడిగా ఉన్న టీ తెచ్చారు. అది తాగమని చెప్పేటందుకు కాదనీ, తేడా వస్తే బొబ్బలెక్కేలా ముఖాన కొడతారని వీరభద్రానికి అర్థమైంది.‘ఎందుకు చేశావీపని’ అన్నాడు ఎస్.ఐ. ‘నేనే మా మేనల్లుడిని హత్య చేశాను. తప్పయిపోయింది సార్. ఆ రోజు నుంచి నా మనసు మనసులో లేదు. చేసిన తప్పుకు కుళ్లి కుళ్లి చస్తున్నాను సార్’ అంటూ రెండు చేతులు జోడించాడు వీరభద్రం. ‘అక్క కొడుకునే చంపేటంత కక్ష నీకేంటి?’ గద్దించారు పోలీసులు.‘మా బావ చనిపోయి మూడేళ్లయ్యింది. అక్క పేరు మీద నాలుగెకరాల పొలం ఉంది. దాని విలువ ఇప్పుడు కోట్లకు పెరిగింది. మేనల్లుడిని అడ్డు తొలగిస్తే వారసులు లేకుండా పోయి.. అక్క తర్వాత ఆస్తి అంతా నాకే వస్తుందని ఈ పని చేశాను. ఆ రోజు సినిమాకు వెళ్లింది నిజమే. తిరుగు ప్రయాణంలో బాగా చీకటి పడింది. దారిలో ఇంకెవరూ లేరు. ముందు వాడు నడుస్తుంటే నేను వెనకగా నడుస్తూ రాయితో తలమీద మోదాను. పెనుగులాటలో వాడి చొక్కా నా చేతికొచ్చింది. వాడ్ని చంపి, నీళ్లలో తేలకుండా ఉండేందుకు. నడుముకు రాయి కట్టి అక్కడే వ్యవసాయబావిలో పడేశాను. చొక్కాను గొయ్యి తీసి పాతిపెట్టి, ఇంటికొచ్చేశాను’ వివరించాడు వీరభద్రం.
నేరం ఎప్పటికీ దాగదు. బయట పడాల్సిందే.వీరభద్రం కంగారులో పైపైన గొయ్యి తీసి, మట్టిలో చొక్కాను కప్పెట్టాడు. కానీ, అది కొన్నాళ్లకి బయటపడి, గాలి వాటానికి కొట్టుకపోయి కంపచెట్టుకు చిక్కుకుని ఉండిపోయింది. పీలికలైన ఆ పాత చొక్కాతోనే కేసును ఛేదించారు పోలీసులు. కొడుకు ఇక రాడని, లేడని తెలిసిన సుగుణమ్మ గుండె పగిలేలా ఏడ్చింది. ‘సారూ, నా కొడుకు ఇక తిరిగి రాడు. కానీ అలా తిరిగి రాకుండా చేసినవాడిని మాత్రం జైలు నుంచి తిరిగి రానంత కాలం ఉంచే బాధ్యత మీదేనయ్యా’ అంటూ పోలీసులకు దణ్ణం పెట్టింది. వీరభద్రం ప్రస్తుతం శిక్ష అనుభశిస్తున్నారు.
(పస్తుత వరంగల్ పోలీస కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ తెనాలిలో పని చేసినప్పుడు చేధించిన కేసు డిటైల్స్ ఆధారంగా)
‘ఏంటీ నీ కొడుకు కనిపించక ఏడాదిన్నర అవుతుందా?! ఇన్నాళ్లూ ఏం చేశావు?!’ ఆశ్చర్యంగా అడిగారు పోలీసులు.‘వాడే వస్తాడులే అనుకున్నా. ఏడాదిన్నర అవుతున్నా జాడ దొరకలేదు. కొంచెం మీరే సూడాలయ్యా’ రెండు చేతులెత్తి దణ్ణం పెట్టింది సుగుణమ్మ.
– కృష్ణగోవింద్, సాక్షి బ్యూరో ఇన్‌చార్జ్, వరంగల్
Comments
Please login to add a commentAdd a comment