కరోనాని నిలువరిద్దాం! సరేనా! | Some Tips To Avoid Coronavirus By Dr.Lakshmi Narasimha Sastry | Sakshi
Sakshi News home page

కరోనాని నిలువరిద్దాం! సరేనా!

Published Sat, Mar 7 2020 4:05 AM | Last Updated on Sat, Mar 7 2020 4:05 AM

Some Tips To Avoid Coronavirus By Dr.Lakshmi Narasimha Sastry  - Sakshi

మానవుని ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదం వివరించిన అనేక అంశాల్లో ‘ఋతుచర్య’ ఒకటి. వివిధ ఋతువుల్లో చూపే సూర్యుడి ప్రభావం వల్లనే మానవుని బలం, వ్యాధి క్షమత్వక శక్తి మారుతుంటుంది. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువుల్ని (సుమారుగా జనవరి 15 నుంచి జూలై 15 వరకు) ఆయుర్వేదం ‘ఆదాన కాలం’ గా వర్ణించింది. ఇదే ఉత్తరాయణ కాలం. ఈ కాలంలో సూర్యుడు భూమి మీద నుంచి, ప్రకృతిలో నుంచి శక్తిని గ్రహిస్తాడు. కనుక మనిషి నీరసపడతాడు. వర్ష, శరత్, హేమంత ఋతువులు దక్షిణాయన కాలం. ఇది విసర్గ కాలం. సూర్యుడు తన శక్తిని ప్రసాదిస్తాడు. చంద్రుని ఆధిపత్యం వల్ల మనిషిలో శక్తి వృద్ధి చెందుతుంది. ఒక ఋతువు మారి ఇంకొక ఋతువు ప్రవేశించే మధ్య కాలాన్ని ‘ఋతు సంధి’ అంటారు. ఇటువంటి వాతావరణపు మార్పును తట్టుకునేందుకు ఆయుర్వేదం కొన్ని ఆహారవిహార నియమాలతో పాటు మరి కొన్ని జాగ్రత్తలు సూచించింది. ప్రస్తుతం శిశిర వసంతాల మధ్యనున్న ఋతు సంధి. ఇది కఫ ప్రకోపకాలం.

ఋతుచర్య: లఘు, రూక్షాహారం సేవించాలి. అంటే తేలికగా జీర్ణమై, శరీరాన్ని తేలికపరచే ఆహారం. వంకాయ, దొండ, కాకర, బీర మొదలైన శాకాహారం, ఆకు కూరల్ని ఉడికించి వండుకుని వేడివేడిగా భుజించాలి. నూనెలు, నెయ్యి వంటి స్నిగ్ధ పదార్థాలు, పాయసాల వంటి బరువైన ఆహారం విడిచిపెట్టి, సెనగలు, బఠాణీల వంటి శాకాలను వండుకు తినాలి. తీపి, పులుపు తగ్గించి, కారంగా ఉన్న ఊరగాయలు తింటే మంచిది. శరీరానికి నలుగు పెట్టుకుని సాన్నం (ఉద్వర్తనం), వ్యాయామాలు మంచిది. స్నానానంతరం ‘కుంకుమ పువ్వు, కర్పూర చందనం’ వంటి సుగంధ్రద్రవ్యాలు శరీరానికి మంచివి. ఇవి క్రిమిహరంగా ఉపకరిస్తాయి. అల్లం లేక శొంఠి (శృంగవేర) వేసి మరిగించిన నీటిని తాగాలి. స్వచ్ఛమైన తేనె వాడుకోవాలి. (వాగ్భటాచార్యుని శ్లోకంలో: తీక్ష›్ణ, లఘు, రూక్ష భోజనైః, వ్యాయామ ఉద్వర్తన; శృంVý,వేరాంబు వంటి పదాలు కనిపిస్తాయి) ప్రాచీన ఆయుర్వేద వైద్య ఆచార్యులు వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములను వివరిస్తూ క్రిమి/కృమి శబ్దంతో పాటు ‘గ్రహ, భూత, పిశాచ, రాక్షస’ పదాలను కూడా ఉపయోగించారు. ఋతు సంధి సమయాలలో వీటి ప్రాబల్యం అధికమౌతుంది. ఇవి హాని చేసే స్రోతస్సుల (సిస్టమ్స్‌) ను బట్టి కలిగే లక్షణాలను వివరించారు. ప్రాణావహస్రోతస్సు (ముక్కు నుంచి ఊపిరి తిత్తుల వరకు) నకు సంబంధించి, ‘తుమ్ములు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం, జ్వరం’ వంటి లక్షణాల ను వర్ణించారు. కొన్నిరకాల సూక్ష్మాంగ జీవులు వాయు కాలుష్యం ద్వారా సంక్రమించి ప్రజా వినాశనానికి (ఎండెమిక్స్‌/ఎపిడెమిక్స్‌) దారి తీస్తాయని చెప్పారు. అటువంటి క్రిములకు మనం పెట్టే పేరు ఏదైనా లక్షణాలను బట్టి చికిత్స వర్ణించారు. పరిశుభ్రత, వ్యాధి క్షమత్వక శక్తిని పెంపొందించుకోవటం నివారణా సూత్రాలలో ప్రాధాన్యత వహిస్తాయి.
ప్రస్తుతపు కొరోనా వ్యాధికి సంబంధించి నివారణ, చికిత్సల గురించి చూద్దాం.

నివారణ
ఆహారం:
పైన చెప్పినట్లు తేలికపాటి ఆహారం, వేడివేడిగా ఉండే తాజా శాకాహారం మంచిది. బయటి పదార్థాలు, ముఖ్యంగా జంక్, ఫాస్ట్‌ ఫుడ్స్, పానీయాలు, ఐస్‌క్రీములు విడిచిపెట్టాలి. 
విహారం: తేలికపాటి వ్యాయామం. ఇంటబయట పరిశుభ్రత ముఖ్యం. సాంబ్రాణి ధూపాన్ని ప్రతి నిత్యం రెండు సార్లు ప్రయోగించి ఇంటిని, దుస్తుల్ని పరిశుభ్రం చేసుకోవాలి. ముక్కుకు గుడ్డను అడ్డు పెట్టుకోవటం, వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండటం మంచిది. వేప కొమ్మలు, మామిడి ఆకుల తోరణాలు ఇంట్లో ఉంటే అవి సూక్ష్మక్రిముల్ని పీల్చేసుకుంటాయన్నది పరిశోధనా ఫలితాలలో ఒకటి.
ఔషధాలు: ‘లశునాది కషాయం’ : 30 మి.లీ. (ఆరు చెంచాలు) రెండు పూటలా తాగాలి.
తయారీ విధానం: ఐదు గ్రాముల అల్లం ముక్క, ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా దంచి పావు లీటరు నీళ్లలో మరిగించాలి. మరుగుతున్నప్పుడు రెండు చిటికెల పసుపు, ఆరు చిటికెలు దాల్చిన చెక్క చూర్ణం దాంట్లో వేసి, మూడు వంతులు ఇగరగొట్టాలి. మిగిలినదాన్ని వడగట్టి రెండు భాగాలుగా ఉదయం, సాయంత్రం తాగాలి. ఎంతకాలం తాగినా పరవాలేదు.
ఉసిరికాయ: దేశీ ఉసిరి (ఆమలకి) మంచిది. ఒక కాయ రోజూ తినటం మంచిది లేదా 5.మి.లీ. (ఒక చెంచా) రసం తేనెతో సేవించాలి లేదా ఎండబెట్టి తయారుచేసిన పొడి (ఆమలకీ చూర్ణం) 
3 గ్రా.లు తేనెతో రోజూ ఒకసారి సేవించాలి. వ్యోషాదివటి లేదా కంఠసుధారస మాత్రలు (ఆయుర్వేద షాపులలో దొరుకుతాయి): ఒక్కొక్క మాత్రను చప్పరిస్తూ తినాలి. రోజులో ఐదారు వరకు తినవచ్చు.
చికిత్స: 1. త్రిభువన కీర్తి రస మాత్రలు: ఉదయం ఒక మాత్ర 2. మహాలక్ష్మీవిలాసరస మాత్రలు: రాత్రి ఒక మాత్ర మూడు వారాల వరకు వాడుకోవచ్చు. వైద్యుని పర్యవేక్షణ ముఖ్యం
గమనిక: నివారణకు చెప్పినవి కూడా చికిత్సకు ఉపకరిస్తాయి. మహాలక్ష్మీవిలాసరస మాత్రలు నివారణకు కూడా వాడుకోవచ్చు. ఊపిరితిత్తుల క్షమత్వం పెరుగుతుంది. 
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్‌: 9963634484 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement