సంఘటిత సబల కార్యక్రమంలో బాలికలు (ఫైల్ ఫొటో)
విద్యార్ధినులు, యువతులు, మహిళా ఉద్యోగినులు, అంగన్‌వాడీ, ఆశా మహిళలకు ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇస్తున్నారు లక్ష్మి. శాంతి భద్రతలను కాపాడడంతోపాటు, సమాజానికి రక్షణ కల్పించే పనిలో ఉన్న మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డులు, షీ టీం సభ్యులకు సైతం పోరాట కళలో మెళుకువలు నేర్పిస్తున్నారు. నిత్యం జరుగుతున్న ఆగడాల భయంతో ఆడపిల్లలు ఇంట్లోనే ఉండిపోతే తమ కలల్ని నిజం చేసుకోలేరని లక్ష్మి అంటున్నారు.
ఈ కథ లక్ష్మిదే అయినా, రవి దగ్గర్నుంచి మొదలుపెట్టాలి. రవిది వరంగల్ జిల్లా కొత్తవాడ. కరాటే అంటే ఆసక్తి. చిన్నతనంలోనే ఏడాదిన్నర వ్యవధిలో బ్లాక్ బెల్ట్ సాధించే దశకు చేరుకున్నాడు! ప్రస్తుతం బ్లాక్ బెల్ట్‌లో సెవన్త్ డాన్. కరాటేనే వృత్తిగా ఎంచుకొని పాఠశాల పిల్లలకు నేర్పిచడానికి రాష్ట్రమంతటా తిరుగుతున్నప్పుడు అతడికి లక్ష్మితో పరిచయం అయింది. లక్ష్మిది నిజామాబాద్ జిల్లా మాకులూరు మండలం శాంతినగర్ గ్రామం. అప్పటికే ఆమెకు కరాటేలో ప్రవేశం ఉంది. ఇద్దరూ 1997లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా లక్ష్మి మార్షల్ ఆర్ట్స్‌ను కొనసాగించారు. ప్రస్తుతం ఆమె బ్లాక్‌బెల్ట్‌లో సిక్త్స్ డాన్.
షీ టీమ్‌లకు కోచింగ్!
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీమ్‌లను ఏర్పాటు చేయడంతో లక్ష్మి ప్రాధాన్యం మరింత పెరిగింది. మహిళా ఐపీఎస్‌ల నేతృత్వంలో విధులు నిర్వర్తించే షీ టీమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి లక్ష్మికి అవకాశం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్‌ను నేర్పించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా లక్ష్మికి ప్రాధాన్యం లభించింది. ఆమె చేత పాఠశాలల్లో పని చేస్తున్న పీఈటీలకు శిక్షణ ఇప్పించారు. మూడేళ్ల క్రితం జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ‘సంఘటిత సబల’ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించడం వెనుక లక్ష్మి కృషి, పట్టుదల ఉన్నాయి. ఆమె భర్త సహకారం ఉంది. – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ, ఫోటోలు: గోవర్ధనం వేణుగోపాల్
పోకిరీల భయంతో చదువు ఆగకూడదు
చిన్నప్పటి నుంచే పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. సుమన్, విజయశాంతి, సినిమాలను చూసి అప్పుడే కరాటే నేర్చుకోవడం ప్రారంభించాను. పదో తరగతి చదువుతున్న సమయంలోనే నా స్నేహితురాలిని కొందరు పోకిరీలు వేధించడంతో భయంతో చదువును ఆపేసి ఇంటి వద్దనే ఉండిపోయింది. ఆ సంఘటన తరువాత ప్రతి విద్యార్థినీ ధైర్యంగా చదువుకోవడానికి స్వేచ్ఛగా వెళ్లాల్సిన ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పాలని భావించాను. ఆ విధిని నా భర్తతో కలసి నెరవేరుస్తున్నాను. – లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment