నాన్న ఇంటికి రాలేదు! | Special story on funday | Sakshi
Sakshi News home page

నాన్న ఇంటికి రాలేదు!

Published Sun, Mar 4 2018 7:54 AM | Last Updated on Mon, Aug 13 2018 4:22 PM

Special story on funday - Sakshi

తెలుగులో డిఫరెంట్‌ సినిమాలను ఇష్టపడే వారిని బాగా మెప్పించిన ఓ సినిమాలోని సన్నివేశాలివి. ఈ సినిమా స్క్రీన్‌ప్లే పరంగా చూపిన కొత్తదనం, చేసిన ప్రయోగం గుర్తించి, గుర్తుంచుకోదగ్గది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం..

సాయిరామ్‌కు మేనేజర్‌గా ప్రమోషన్‌ వచ్చి రెండు రోజులైంది. సాయిరామ్‌ కంటే మేనేజర్‌ అయ్యేందుకు ఎక్కువ అర్హతలున్న విశ్వనాథ్‌ రెండు రోజుల్నుంచి ఆఫీస్‌కు రాలేదు. ఆఫీస్‌కు వచ్చుంటే విశ్వనాథే మేనేజర్‌ అయ్యేవాడేమో! విశ్వనాథ్‌ ఎక్కడున్నాడు? సాయిరామ్‌ ఆలోచిస్తున్నాడు. ప్రమోషన్‌ వచ్చిన ఆనందం లేదు అతని కళ్లలో. విశ్వనాథ్‌ గురించే ఆలోచిస్తున్నాడు. ‘‘నాన్న ఇంకా ఇంటికి రాలేదంకుల్‌!’’ విశ్వనాథ్‌ కూతురు ముందురోజు రాత్రి ఫోన్‌లో చెప్పిన మాటలు సాయిరామ్‌కు పదేపదే గుర్తొస్తున్నాయి. అతనలా ఆలోచనల్లో ఉండగానే బేకరీ డెలివరీ బాయ్‌ ఒకతను వచ్చి, విశ్వనాథ్‌ ఆర్డర్‌ చేశాడంటూ కేక్‌ ఇచ్చి వెళ్లాడు. విశ్వనాథ్‌ తన కూతురు పుట్టినరోజు కోసం ఆర్డర్‌ చేసిన కేక్‌ అది. ఆ కేక్‌ తీసుకెళ్లి, విశ్వనాథ్‌ ఇంటికెళ్లాడు సాయిరామ్‌.

విశ్వనాథ్‌ భార్య, కూతురు విశ్వనాథ్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా, ఏదో చెడు వార్త వినడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. ‘‘ఆయన ఎక్కడికెళ్లారో మీకు తెల్సా?’’ అడిగింది విశ్వనాథ్‌ భార్య. తెలీదన్నట్టు తలూపాడు సాయిరామ్‌. ఇంట్లో చిన్న చిన్న గొడవలనీ, ఎంత గొడవ జరిగినా, రాత్రి ఫ్రెండ్స్‌ ఇంట్లో పడుకుని, తెల్లారేసరికల్లా వచ్చేస్తారనీ, పాప ఫోన్‌ చేస్తుందని ఫోన్‌ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచుకుంటారనీ, పాప రాత్రినుంచి ఏమీ తినలేదని, వాళ్ల నాన్న వచ్చేదాకా ఏమీ తిననని కూర్చుందని, ఆయన ఎక్కడున్నారో తెలిస్తే ఇంటికి రమ్మని చెప్పండంటూ విశ్వనాథ్‌ భార్య చెప్తూ పోతోంది. సాయిరామ్‌ నోటినుంచి ‘సరే’ తప్ప ఇంకేమాటా బయటకు రావడం లేదు.

 సాయిరామ్‌ లేచి, ఇంటి బయటకొచ్చి, బండి స్టార్ట్‌ చేశాడు. ఇంట్లోనుంచి పాప.. ‘‘అంకుల్‌.. అంకుల్‌.. ఆగండి!’’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘‘మా నాన్నకు కోపమొచ్చినప్పుడు ఫ్రెండ్స్‌ దగ్గరకు వెళ్లరు. ఎక్కడికెళ్తారో నాకు తెలుసు. అక్కడికి తీసుకెళ్తారా? ప్లీజ్‌..’’ బతిమిలాడింది పాప. సాయిరామ్‌ తన బండిమీద పాపను ఎక్కించుకొని వెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లాక, మెయిన్‌రోడ్‌ మీదనే ఉన్న ఒక బార్‌ను చూడడమే.. ‘‘ఇక్కడే.. ఇక్కడే..’’ అంటూ బండి ఆపింది పాప. ‘‘ఈ పైనే అంకుల్‌..’’ అంది ఆ పాప.‘‘మీ నాన్న డ్రింక్‌ చేయడు. ఏదో సరదాగా చెప్పుంటాడు..’’‘‘లేదంకుల్‌! మా నాన్న నాతో అస్సలు అబద్ధాలు చెప్పరు. ఒకసారి వెళ్లి చూద్దాం.. ప్లీజ్‌..’’ అంది పాప. నేను వెళ్లి చూసొస్తానంటూ సాయిరామ్‌ ఆ బార్‌ ఉన్న కాంప్లెక్స్‌ పై ఫ్లోర్‌కి వెళ్లాడు. కానీ సాయిరామ్‌కు తెలుసు.. అక్కడ విశ్వనాథ్‌ ఉండడని. చుట్టూ చూసినట్టు నటించాడు. విశ్వనాథ్‌ అక్కడ లేడని పాపతో చెప్పాడు. టెర్రస్‌పైన చూశారా? అక్కడ చూడండంటూ పాప మళ్లీ బతిమిలాడింది.

సాయిరామ్‌ టెర్రస్‌ మీదకు వెళ్లకుండానే వెళ్లి చూసినట్టు, విశ్వనాథ్‌ అక్కడ కూడా లేడని పాపతో చెప్పాడు. సాయిరామ్‌కు ఎంత ప్రయత్నించినా ఏడుపు తన్నుకొస్తోంది. పాప ముందు మాత్రం స్థిరంగా నిలబడి, ‘‘మీ నాన్న ఎక్కడున్నా నేను తీసుకొస్తాను..’’ అని పాపకు ధైర్యమిచ్చే ప్రయత్నం చేశాడు. అదే సమయానికి సాయిరామ్‌కు ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘‘నమస్తే సార్‌! నా పైసలు రెడీనా?’’ అని ఆ గొంతు పలికింది. ఫోన్లోని వ్యక్తి సాయిరామ్‌తో డబ్బులకోసం బేరాలు సాగిస్తున్నాడు. సాయిరామ్‌ ఒక లెక్క చెబుతూంటే, ఫోన్లోని వ్యక్తి అంతకు ఎన్నోరెట్లు కావాలంటున్నాడు.‘రేయ్‌ దాస్‌! ఇది మోసంరా.. నేన్నిన్ను నమ్మాను..’’ అన్నాడు సాయిరామ్‌.‘‘నీకంటే పెద్ద మోసగాడినా? ఆ విశ్వనాథ్‌ నీతోనే పనిచేశేటోడు.. ఆణ్నే నువ్వు మోసం చెయ్యాలని చూసినవ్‌..’’.. దాస్‌ మాటలను మధ్యలోనే ఆపేస్తూ.. ‘‘అవున్రా.! నాదే తప్పు. చెంపలు వేసుకుంటున్నా. వాణ్ని వదిలెయ్‌రా..’’ అంటూ బతిమిలాడుతున్నాడు సాయిరామ్‌. ‘‘నా బండమ్మి పాతికవేలు ఇస్తాన్రా..’’ ఏడుస్తూ అడిగాడు సాయిరామ్‌.

‘‘నీ బాధలు ఇంటుంటే ఏడుపొస్తోంది సాబ్‌! నా బాధలు చెప్తే నువు గుడ ఏడుస్తవ్‌. విశ్వనాథ్‌ ఏడున్నడో చెప్పాలంటే లక్షా యాభైవేలు రెడీ చేస్కో..’’ ఆ చివరి మాట చెప్పాక దాస్‌ ఫోన్‌ కట్‌ చేశాడు. సాయిరామ్‌కు విశ్వనాథ్‌ ఎక్కడున్నాడో తల్చుకోవాలంటేనే భయంగా ఉంది. తనకు ప్రమోషన్‌ వచ్చేంత వరకు విశ్వనాథ్‌ను ఆఫీస్‌కు రాకుండా చేయమని సాయిరామ్‌ దాస్‌కు డబ్బులు ఇచ్చాడు. దాస్‌ సాయిరామ్‌ ప్లాన్‌ను తిప్పికొట్టి ఎక్కువ డబ్బుకోసం విశ్వనాథ్‌ను కిడ్నాప్‌ చేసి తానొక్కడికే తెలిసిన ప్లేస్‌లో ఉంచాడు. దాస్‌ అడిగినంతా ఇస్తే తప్ప విశ్వనాథ్‌ దొరకడు.సాయిరామ్‌ సరిగ్గా ఆ నిమిషం నుంచి పిచ్చోడిలా తిరిగాడు డబ్బుల కోసం. వాళ్లనడిగి, వీళ్లనడిగి డబ్బు కూడగట్టుకున్నాడు. విశ్వనాథ్‌ జాడ చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి దాస్‌ ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఫోనొచ్చింది.

‘‘పైసల్‌ తీస్కొని ఆల్‌వాల్‌ స్టేషన్‌కి రా.. అక్కడ బ్రిడ్జీ ఎక్కి సరిగ్గా మధ్యలో ఆగు. కింద రెండో నెంబర్‌ ప్లాట్‌ఫాం మీద నేను కనిపిస్తా. పైసలు బ్రిడ్జి మీద పెట్టు. విశ్వనాథ్‌ ఏడున్నడో బల్లమీద చీటీ రాసి పెడతా. తేడా వస్తే నీ దోస్‌ నీకు కనిపించడు. యాదుంచుకో..’’ దాస్‌ చెప్పాల్సిందంతా చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. సాయిరామ్‌ ఆల్‌వాల్‌ స్టేషన్‌కి వెళ్లి బ్రిడ్జి ఎక్కి, మధ్యలో ఆగి చూశాడు. దాస్‌ కనిపించాడు. పిలిచాడు. అతను పలకలేదు. గట్టిగా పిలిచాడు. అయినా అతను పలకలేదు. సాయిరామ్‌ పరిగెత్తుకుంటూ దాస్‌ కూర్చొని ఉన్న బెంచీ దగ్గరికెళ్లి చూశాడు. దాస్‌ అప్పుడే బెంచీ మీద వాలిపోతూ ఉన్నాడు. సాయిరామ్‌ అతణ్ని కదిలించి చూశాడు. అతను అప్పుడే చివరిశ్వాస విడిచాడు. సాయిరామ్‌ వణికిపోతూ అతణ్నుంచి దూరంగా కదిలాడు. చుట్టూ జనం చేరారు. విశ్వనాథ్‌ ఎక్కడున్నాడో చనిపోయిన దాస్‌కు మాత్రమే తెలుసు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement