గురి తప్పడం మంచిదే.
మళ్లీ సరిగా గురి చూడటం తెలుస్తుంది.
ఒక్కసారి విఫలమైతే
అంతా అయిపోయినట్టు కాదు.
పర్వత పాదానికి చేరడం అంటే
శిఖరం అందినట్టు కాదు.
క్రాంతి ఐ.ఏ.ఎస్ కావాలనుకుంది.
రెండుసార్లు తక్కువ ర్యాంకులొచ్చి
రెండు పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి.
కాని తను ఐ.ఏ.ఎస్ కాదల్చుకుంది.
మూడవసారి కచ్చితంగా అయ్యే తీరింది.
యంగ్ ఐ.ఏ.ఎస్. వల్లూరు క్రాంతిరెడ్డితో సాక్షి ఎక్స్‌క్లూజివ్.
వల్లూరు క్రాంతి ఎనిమిది నెలల కిందట తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాకు వచ్చారు. వచ్చిన కొత్తలో ఎవరో ట్రైనీ కలెక్టరట అని అందరూ అనుకున్నారు కానీ నిత్యం జిల్లాలో ఏదో ఒక మండలానికి వెళ్తూ తన శిక్షణలో భాగంగా కొత్త అంశాలను నేర్చుకుంటూ స్థానిక ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొత్త విషయాలను చెబుతున్న ఆమెను చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఐఐటీ చదివినా, పాతికేళ్లు నిండకముందే ఐఏఎస్ సాధించినా నిరాడంబరంగా కనిపిస్తూ వృత్తిగతమైన స్థిరచిత్తాన్ని ప్రదర్శిస్తున్న వల్లూరు క్రాంతిరెడ్డితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే...
ముందుగా కుటుంబం గురించి..
నేను పుట్టి పెరిగింది కర్నూలులో. అమ్మ వల్లూరు లక్ష్మి, నాన్న రంగారెడ్డి. వీళ్లిద్దరూ డాక్టర్లే. మా అక్కయ్య నీలిమకూడా డాక్టరే. అమ్మ నాన్న కర్నూలులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కయ్య మాత్రం అమెరికాలో ఉంది. టెన్త్‌క్లాస్ వరకు కర్నూలులోనే. ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తిచేశాను. ఇంట్లో అందరూ వైద్యులే అయినా నేను ఆ వైపుగా ఆలోచించలేదు. నాన్న ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలంటే ఐఏఎస్ సాధించాలని చెబుతుండేవారు. ఆ క్రమంలో ఇంటర్‌లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులో చేరిపోయాను. అలా ఐఐటీలో సీటు సాధించడం.. ప్రతిష్టాత్మక ఢిల్లీ ఐఐటీలో చదవడం జరిగిపోయాయి.
నాన్న మాటలే నడిపించాయి..
ఐఐటీలో ఉన్నప్పుడే ‘నెక్ట్స్ ఏంటీ..’ అన్న నాన్న మాటలు గుర్తుకు వచ్చేవి. శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని అనేవారు. నాన్న మాటలే నన్ను ఐఏఎస్ ప్రిపరేషన్‌కు సిద్ధం చేశాయి. ఢిల్లీలో ఉన్నప్పుడే సివిల్స్‌కు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. అక్కడి శ్రీరామ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆరునెలలు కోచింగ్ తీసుకున్నాను. అందులో చాలా అనుభవజ్ఞులైన మన తెలుగువాళ్లే ఎక్కువగా పాఠాలు చెప్పేవారు. ఆరునెలల్లో సివిల్స్‌పై ఓ అవగాహన వచ్చింది. ఆ తర్వాత కోచింగ్ మానేసి, సొంతగా ప్రిపరేషన్ మొదలు పెట్టాను.
రెండుసార్లు ఓడిపోయినా..
తొలిసారి 2013లో రాసిన సివిల్స్‌లో 562 ర్యాంకు వచ్చింది. దీంతో ఐఆర్‌టీఎస్ (ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)లో జాబ్ పొందాను. ఇందులో జాయిన్ కావడంతో పాటు వడోదర, లక్నోల్లో ట్రైనింగ్ కూడా పూర్తి చేశాను. మళ్లీ రెండోసారి 2014లో సివిల్స్ యుద్ధంలో పాల్గొన్నాను. ఈసారి 230 ర్యాంక్ సాధించాను. కానీ ఐఆర్‌ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) వచ్చింది. లక్ష్యసాధనలో రెండుసార్లూ ఓడిపోయినా ఐఏఎస్ కోసం 2015లో మళ్లీ సిద్ధమయ్యాను. ఈసారి గురి తప్పలేదు. ఏకంగా 65వ ర్యాంకు వచ్చింది. నా లక్ష్యం నెరవేరింది. 2016లో ప్రకటించిన ఫలితాల్లో 24 ఏళ్లకే ఐఏఎస్‌గా ఎంపికయ్యాను. ఇక ఐఏఎస్ కోసం ముస్సోరిలో చేసిన శిక్షణ ఓ అద్భుతంగా చెప్పవచ్చు. జీవితంలో దేనినైనా ఎదుర్కొనే తత్వాన్ని నేర్పించారు. ప్రజాసేవలో ఎలా ముందుకు సాగాలో చూపించారు. కొండలు, గుట్టలు ఎక్కేందుకు ట్రెక్కింగ్ నేర్పించారు. పచ్చని అడవుల్లో గంటల పాటు నడవడం చేయించారు. ఇలా ఎన్నో అనుభవాల సమాహారం. ‘భారత్ దర్శన్’లో భాగంగా ఎల్.ఓ.సికి వెళ్లి సైనికులను కలవడం గొప్ప అనుభవం.
జిల్లాకు రావడం అదృష్టం..
తెలంగాణ క్యాడర్ కేటాయించిన తర్వాత శిక్షణ కోసం నిర్మల్‌కు రావడం అదృష్టంగా భావిస్తుంటాను. కర్నూలులో పుట్టి పెరిగిన నాకు నిర్మల్ అంటే అప్పట్లో తెలియదు. శిక్షణ కోసం కేటాయించగానే నిర్మల్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. పక్కనే ఉన్న మంచిర్యాలలో ఫ్రెండ్ జాబ్ చేస్తుండటంతో తన ద్వారా వివరాలు సేకరించాను. తను చెప్పినట్లుగానే ఇక్కడ నిర్మలత్వం కనిపిస్తోంది. ప్రజల సహకారం చాలా బాగుంది. సాదాసీదాగా తమ పని తాము చేసుకుంటూ కష్టపడేతత్వం ఆకట్టుకుంటుంది. మొత్తం శిక్షణలో భాగంగా జిల్లాలోని దాదాపు అన్ని మండలాలకు వెళ్తున్నాను. ఒక్కోవారం ఒక్కో డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పనుల గురించి పరిశీలిస్తున్నాను. దాదాపు అన్ని శాఖలూ బాగానే ఉన్నాయి.
ఆటలన్నా.. తెలంగాణ పాటలన్నా..
నాకు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటలు ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువగా బాస్కెట్‌బాల్ ఆడేదాన్ని. ఆ తర్వాత టెన్నిస్.. ఇప్పుడు బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నాను. ఆటలతో పాటు ప్రముఖుల బయోగ్రఫీ పుస్తకాలను చదవడం ఇష్టం. నాకు చాలా నచ్చేవంటే తెలంగాణ పాటలు. ఉద్యమం నేపథ్యంలో, సంస్కృతిపైనా వచ్చిన జానపద పాటలు చాలా బాగుంటాయి. మా రాయలసీమ సంస్కృతికి ఇక్కడి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. తెలంగాణ మహిళలు ఆటపాటలతో ఆడే బతుకమ్మ చాలా బాగుంటుంది. నేను వరంగల్ వెళ్లినప్పుడు అక్కడ బతుకమ్మ ఆడాను.
బాలికావిద్య..వైద్యానికి ప్రాధాన్యం..
ఐఏఎస్ సాధించిన తర్వాత ప్రజాసేవలో భాగంగా నాకంటూ నిర్ధేశించుకున్న లక్ష్యాలు బాలికావిద్య, వైద్యం, ఉపాధి కల్పన అంశాలు. బాలికలకు విద్యను అందించడం చాలా అవసరం. అలాగే ప్రజలందరికీ వైద్యం తప్పనిసరి. అలాగే యువతకు ఉపాధి చూపాలన్న లక్ష్యాన్నీ నిర్దేశించుకున్నాను. జిల్లాలో ప్రధానంగా పర్యాటకాభివృద్ధికి చాలా ఆస్కారం ఉంది.
పాజిటివ్ మైండ్‌సెట్‌తో చదవాలి..
రెండుసార్లు లక్ష్యసాధనలో ఓడిపోయినా.. నన్ను నిలబెట్టింది పాజిటివ్ మైండ్‌సెట్. సానుకూల దృక్పథం ఉంటేనే ఏదైనా సాధించగలం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇదే దృక్పథంతో ఉండాలి. ఓటమిని తట్టుకుని విజయం సాధించే వరకు మొండిగా పోరాటం సాగించాలి. ఆల్ ది బెస్ట్. సంక్రాంతి శుభాకాంక్షలు.
– రాసం శ్రీధర్, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment