రెస్పెక్టెడ్ ట్రంప్ ట్రయోగ్రఫీ | special story on donald trump married life biography | Sakshi
Sakshi News home page

రెస్పెక్టెడ్ ట్రంప్ ట్రయోగ్రఫీ

Published Sun, Oct 23 2016 11:27 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

రెస్పెక్టెడ్ ట్రంప్ ట్రయోగ్రఫీ - Sakshi

రెస్పెక్టెడ్ ట్రంప్ ట్రయోగ్రఫీ

ట్రంప్ జీవితంలో కోటి వివాదాలు. ముక్కోటి ఆరోపణలు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ... అతడిపై వాదనలు, విమర్శలు పదునెక్కుతున్నాయి. అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో ఉన్న ట్రంప్ జీవితంలో మూడు పూలు, అరకొర ముళ్లు కూడా ఉన్నాయి. ఒక మనిషి జీవితానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. అందుకే దాన్ని ‘బయోగ్రఫీ’ అంటారు. మరి... మూడు పార్శ్వాలు ఉంటే.. దాన్ని ట్రయోగ్రఫీ అనాలి. - మాధవ్ శింగరాజు

అమెరికా 45వ సారథిగా ప్రపంచం ఎవరిని చూడబోతున్నదనేది నవంబర్ 8వ తేదీ రాత్రికి తేలిపోతుంది. ఎవరిని చూడకూడదని ప్రపంచం అనుకుంటోందన్నది మాత్రం ఇప్పటికే తేలిపోయింది! అయితే ప్రపంచం, అమెరికా ఎప్పుడూ ఒకటి కాదు కాబట్టి; ప్రపంచంలోని ఒక  దేశంగా అమెరికా తనను తను అనుకోదు కాబట్టి.. ప్రపంచ అభీష్టానికి వ్యతిరేకంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినా ఆశ్చర్యం లేదు.

నిజానికి ఈ అంచనా కొద్ది రోజుల క్రితం నాటిది. గెలుపు అవకాశాలు హిల్లరీకి, ట్రంప్‌కీ సరి సమానంగా ఉన్నప్పటిది. ఇప్పుడు అలా లేదు. ట్రంప్‌కు ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ అని గట్టిగా చెప్పడానికి లేదు. డెమోక్రాట్‌లు ట్రంప్‌పై ఊహించని అస్త్రం ప్రయోగించారు. స్త్రీల గురించి ట్రంప్ ఎంత అమర్యాదగా మాట్లాడాడో చూడండని అతడి పాత ఇంటర్వ్యూల టేపులను అమెరికన్‌లకు వినిపించారు. అంతే! ఒక్కసారిగా ట్రంప్ ఇమేజ్ గ్రాఫ్ పడిపోయింది. ట్రంప్ నేను అలాంటి వాడిని కాదు అన్నారు. ‘కావాలంటే నా భార్యను అడగండి,  క్లింటన్ తన భార్యకు క్షమాపణ చెప్పినట్టు, నేను నా భార్యకు క్షమాపణ కూడా చెప్పలేదు’ అన్నారు.

ఇదంతా డెమోక్రాట్‌ల కుట్ర అన్నారు. గత మంగళవారం మూడో డిబేట్‌లో మాట్లాడుతూ...Nobody has more respect for women that I do. Nobody...అన్నారు. ఆడియెన్స్ గొల్లుమన్నారు. ట్రంప్ నొచ్చుకోలేదు. Nobody has more respect అని... అదే మాటను బలంగా, స్థిరంగా రిపీట్ చేశారు. స్త్రీల గురించి తనేం మాట్లాడినా, స్త్రీలతో తను ఎలా ఉన్నా, అది స్త్రీల మీద ఉన్న గౌరవంతోనే అన్న భావన కలిగించేలా ఉంది ట్రంప్ టోన్. బహుశా ఆ టోన్‌లోని నిజాయితీని అమెరికన్ మగాళ్లు పట్టేసే ఉంటారు. మగాళ్లు కాబట్టి! బహుశా ఆ టోన్‌లోని నిజాయితీకి అమెరికన్ ఆడవాళ్లు కన్విన్స్ అయ్యే ఉంటారు. ఆడవాళ్లు కాబట్టి!

ఈ వారం రోజుల్లో మళ్లీ ట్రంప్ గ్రాఫ్ పెరిగింది! ఇంట్లో మొండి పిల్లవాడి మీద ఉండే ప్రత్యేకమైన ప్రేమ వంటిదేదో ట్రంప్‌పై అమెరికన్ పౌరులకు కలిగినట్లుగా అనిపిస్తోంది. వైట్ వర్కింగ్ క్లాస్‌లో 37 శాతం మంది ట్రంప్ వైపు వచ్చేశారట! హిల్లరీకి మద్దతు ఇస్తున్న 25 శాతం అవివాహిత యువతుల్లో, 10 శాతం మంది చదువుకున్న మహిళల్లో ట్రంప్ వైపు చూస్తున్నారట! వచ్చే పదిహేను రోజుల్లో ట్రంప్‌పై ఉన్న ‘మిసాజినిస్ట్’ (స్త్రీ ద్వేషి) ముద్ర మాయం కావచ్చు. హిల్లరీని ద్వేషించినంత మాత్రాన స్త్రీద్వేషి అయిపోతారా అనే ప్రశ్న ట్రంప్ తరఫున వినిపించడం అమెరికాలో ఆల్రెడీ మొదలైంది. 

ఈ క్రెడిట్‌ను ట్రంప్ ముఖ్యంగా ముగ్గురు ఆడవాళ్లకు ఇవ్వాలి. ఇవానా మ్యారీ, మార్లా మేపుల్స్, మెలానియా ట్రంప్. ఇవానా, మార్లా ఒకప్పుడు ట్రంప్ భార్యలు. మెలానియా ప్రస్తుత జీవితభాగస్వామి. ‘‘ట్రంప్ మౌనంగా ఉండలేరు. అవుట్ స్పోకెన్. ఒబామా తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకోలేరు. కానీ ట్రంప్ తీసుకోగలరు’’ అని ట్రంప్ మొదటి భార్య ఇవానా అనడం ట్రంప్‌కు ఏనుగంత బలాన్ని ఇచ్చింది. రెండో భార్య మార్లా కూడా ట్రంప్ కోసం బరిలోకి దిగారు. ‘‘అభిప్రాయభేదాలు తప్ప మా మధ్య అహంకార యుద్ధాలు లేవు’’ అని లోకానికి వెల్లడించారు. ఇక ఇప్పటి భార్య మెలానియా ఇచ్చిన సర్టిఫికెట్ అల్టిమేట్. ‘‘ట్రంప్‌ది వట్టి బాయ్ టాక్. మనసులో ఏమీ ఉండదు. నా కొడుకు ఎంతో, నా భర్త అంత’’ అన్నారు.

ట్రంప్ ఎన్నికల అజెండాలోని అంశాలన్నిటినీ  పక్కకు తోసి, స్త్రీల వివాదం ఏదైతే అకస్మాత్తుగా భూతంలా పైకి లేచి ఆయన ప్రతిష్టను దెబ్బతీసిందో... అదే వివాదాన్ని పక్కకు తోసి ఆయన ప్రతిష్టని తిరిగి ప్రతిష్ఠించింది మళ్లీ ఆ స్త్రీలే కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడిగా గెలిచినా, గెలవకున్నా ట్రంప్ అమెరికన్ స్త్రీలందరి ప్రతినిధులుగా ఈ స్త్రీమూర్తులు ముగ్గురికీ రుణపడి ఉండాలి.

1 ,ఇవానా మ్యారీ (67) ట్రంప్ మొదటి భార్య
ట్రంప్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు. కూతురు, ఇద్దరు కొడుకులు. పెళ్లయిన కొత్తల్లో ట్రంప్‌కు నెత్తిపై బట్ట తలలా చిన్న ప్యాచ్ మొదలైంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొమ్మని ఇవానా సలహా ఇచ్చారు. అయితే ట్రీట్‌మెంట్ వికటించి ప్యాచ్ మరింత పెద్దదైంది! ఆ కోపాన్ని భార్య మీద చూపించాడు ట్రంప్. ఇవానా జుట్టు పట్టి లాగి, ఆమె మాడు పగిలేలా కొట్టాడు. ఇలాంటి చేష్టలతో విసుగెత్తి పోయిన ఇవానా ఇక అతడితో కలిసి ఉండలేనని తీర్మానించుకున్నారు.

ట్రంప్‌కంటే ముందు ఇవానాకు 1971లో ఆల్ఫ్రెడ్ అనే రియల్ ఎస్టేస్ ఏజెంటుతో పెళ్లయింది. రెండేళ్ల కన్న ఎక్కువ కాలం ఆ దాంపత్యం నిలవలేదు. ట్రంప్‌తో విడిపోయాక ఇవానా మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆ పెళ్లిళ్లూ ఒకటి రెండేళ్లకే విడాకులయ్యాయి.

హాలీవుడ్ మూవీ ‘ది ఫస్ట్ వైఫ్స్ క్లబ్’ లో ఇవానా చిన్న పాత్ర వేశారు.  అందులో ఆమె ఒక డైలాగ్ చెబుతారు. ‘లేడీస్ యు హ్యావ్ టు బి స్ట్రాంగ్  అండ్ ఇండిపెండెంట్. అండ్ రిమెంబర్: డోంట్ గెట్ మ్యాడ్, గెట్ ఎవ్రీథింగ్’.

ప్రస్తుతం ఇవానే ఒక్కరే  ఉంటున్నారు. పిల్లలు మాత్రం తల్లింటికీ, తండ్రి ట్రంప్ ఇంటికీ తిరుగుతుంటారు.
మొదటి భర్తతో విడాకులు (1973) తీసుకున్నాక చెక్ నుంచి కెనడా వచ్చేశారు. మెక్ గిల్ యూనివర్సిటీలో స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకున్నారు. కెనడాలో ఫర్ ఫ్యాషన్ వస్త్రాలను ఉత్పత్తి చేసే ప్రసిద్ధ కంపెనీలకు మోడల్‌గా పని చేశారు.

న్యూయార్క్‌లో ఇవానాకు ఫ్రెడ్ అనే ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ పుత్రరత్నంతో పరిచయం అయింది. ఆ రత్నమే... డొనాల్డ్ ట్రంప్. పరిచయం పెళ్లి (1977) వరకు వెళ్లింది. భార్యగా ట్రంప్ ఆమెను నెత్తి మీద పెట్టుకున్నాడు. యు.ఎస్. పౌరసత్వాన్నీ తెచ్చి ఆమె తలపై కిరీటంలా అలంకరించాడు. అయితే సడెన్‌గా ‘భర్త ప్రేమ’ అనే కిరీటం ఇంట్లో మిస్ అయింది! ఆ కిరీటం... జార్జియా మాజీ బ్యూటీ క్వీన్ మార్లా మేపుల్స్ ఇంట్లో ఉందని ఇవానాకు తెలిసింది. భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. ఇవానా వివాహ బంధం నుంచి బైటపడ్డారు.

ఇవానా.. ట్రంప్ నుంచి విడిపోయాక  నవలు రాశారు. ‘ఫర్ లవ్ ఎలోన్’, ‘ఫ్రీ టు లవ్’ అనే నవలలకు, ‘ది బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్: కోపింగ్ విత్ డైవోర్స్ అండ్ ఎంజాయింగ్ లైఫ్ అగైన్’ అనే సెల్ఫ్‌హెల్ప్ పుస్తకానికి మంచి పేరొచ్చింది. ‘డైవోర్స్ మ్యాగజీన్’లో కొన్నాళ్ల పాటు సలహాల శీర్షికను కూడా ఇవానా నిర్వహించారు. హాలీవుడ్ మూవీ ‘ది ఫస్ట్ వైఫ్స్ క్లబ్’ లో చిన్న పాత్ర వేశారు. అందులో ఆమె ఒక డైలాగ్ చెబుతారు. ‘లేడీస్ యు హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. అండ్ రిమెంబర్: డోంట్ గెట్ మ్యాడ్, గెట్ ఎవ్రీథింగ్’.

2. మార్లా మేపుల్స్ (52) ట్రంప్ రెండో భార్య
ట్రంప్‌తో మార్లా ఎనిమిదేళ్లు మాత్రమే కలిసి ఉన్నారు. ట్రంప్ తర్వాత ఇంకెవరితోనూ కలిసి లేరు. ఇంటర్నెట్ సెలబ్రిటీ టిఫానా ఏరియానా (23) వీళ్ల అమ్మాయే. ట్రంప్‌తో ప్రేమలో పడేనాటికే మార్లా పేరున్న హాలీవుడ్ నటి, టెలివిజన్ పర్సనాలిటీ.

పెళ్లికి ముందు నాలుగేళ్ల పాటు సౌథాంప్టన్ బీచ్ హౌస్ ‘ట్రంప్ ప్రిన్సెస్ యాట్’లో  ట్రంప్, మార్లా రహస్య దాంపత్య జీవితం గడిపారు. పెళ్లయ్యాక మాత్రం అంత దీర్ఘవ్యవధిలో ప్రేమ జీవితాన్ని గడపలేక పోయారు. ‘‘ఆయన కోరుకున్నంతగా నేను, నేను కోరుకున్నంతగా అయన ఒకరికొకరం ఇచ్చుకోలేకపోయాం’’ అని ఈ మధ్యే ‘యాక్సెస్ హాలివుడ్’ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్లా చెప్పారు.

బాల్యంలో మార్లాపై తల్లి ప్రభావమే ఎక్కువగా ఉంది. ఆమె గృహిణి, మోడల్ కూడా. తండ్రి ఎప్పుడూ బిజీగా ఉండేవారు. ఆయన రియల్ ఎస్టేట్ డెవలపర్. ఉండటం జార్జియాలో. టీనేజ్‌కి వచ్చేసరికి.. మార్లా ‘జార్జియా’ అందాల రాణి అయిపోయింది. తర్వాత కొన్ని హాలీవుడ్ చిత్రాల్లోనూ ఆమె నటించారు. టెలివిజన్‌లో, సోషల్ వర్క్‌లో, స్టేజ్ నాటకాలలో, ఆరోగ్య కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు.

‘నాకు టైమ్ ఇవ్వవేంటీ’ అని ట్రంప్. ‘ఇద్దరం వేర్వేరు కానప్పుడు ఒకరి కోసం ఒకరం వేచి ఉండడం ఏమిటి?’ అని మార్లా.
ట్రంప్‌కు ఒక విషయం అర్థమైంది. మార్లా ‘ఇండిపెండెంట్ ఉమన్’ అని!

విడాకులు తీసుకున్న మరుసటి ఏడాదే మార్లా తన ఆత్మకథను రాసుకున్నారు. ‘ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్’ ఆ పుస్తకం పేరు. మెరిసేదంతా బంగారం కాదని. ట్రంప్ గురించే ఆవిడ రాసి ఉంటారని అంతా అనుకున్నారు. ఏం రాసి ఉంటారా అని ఎదురు చూశారు. హార్పర్స్ కాలిన్స్ పబ్లిషర్స్ పుస్తకాన్ని వెయ్యడానికి ముందుకు వచ్చారు. వేస్తున్నట్లు ప్రకటించారు కూడా. కానీ ఏం జరిగిందో! రెండేళ్ల తర్వాత పబ్లిషర్స్ నుంచి మరో ప్రకటన వెలువడింది. ‘రచయిత్రి, మేము కలిసి పరస్పర ఒప్పందంతో ఈ పుస్తకాన్ని ప్రచురించకూడదు అని నిర్ణయించుకున్నాం’ అని!! దీని వెనుక ట్రంప్ ఒత్తిడి ఉండివుంటుందని అప్పట్లో అంతా అనుకున్నారు.

మార్లా దగ్గర దాపరికాలు ఉండవు. 1990 క్రిస్మస్ సీజన్‌లో తొలిసారిగా ఇవానా, మార్లా ఒకరినొకరు చూసుకున్నారు. ముందుగా మార్లానే  ఇవానా దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు.. ‘‘నేను మీ భర్తను ప్రేమిస్తున్నాను’’ అని. ఇవానా అలా చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఒక టీవీ షోలో..  భార్య వదిలేసిన భర్తను ప్రేమించవచ్చు కానీ, భార్య ఉన్న భర్తను ప్రేమించే తప్పును అమ్మాయిలు ఏ పరిస్థితుల్లోనూ చెయ్యకూడదు అని ఇవానా అన్నారు.  మార్లా ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్నారు.

3. మెలానియ (46) ట్రంప్ మూడో భార్య
మెలానియ గ్లామర్ మోడల్. ట్రంప్ తొలిసారి 1998లో ఈ అమ్మాయిని న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో చూశాడు. అప్పటికి అతడు రెండో భార్యతోనూ విడిపోయాడు కానీ, విడాకులు తీసుకోలేదు. ఎవరీ అమ్మాయి అని ఆరా తీశాడు. మనమ్మాయి కాదు, స్లొవేనియా మోడల్ అని చెప్పారు. పరిచయం చేసుకున్నాడు. ఫోన్ నెంబర్ అడిగాడు. మెలానియ ఇవ్వలేదు!

మెలానియా ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వచ్చేస్తున్నాడు ట్రంప్. అలా కొంతకాలం అన్‌లు, ఆఫ్‌లుగా వాళ్ల రిలేషన్ నడిచింది. ఫస్ట్ టైమ్ ‘హోవార్డ్ స్టెర్న్ టీవీ షో’లో ఇద్దరి మధ్య ప్రేమ బయటపడింది. తమ అనుబంధం గురించి ట్రంప్ తొలిసారి ఓ టీవీ చానెల్‌లో మాట్లాడారు. ‘‘మా మధ్య వాదులాటలు ఉండవు. మా గురించి ప్రపంచం వాదులాటలు పెట్టుకోవడం తప్ప’’ అన్నారు. 2004లో వీళ్ల ఎంగేజ్‌మెంట్ అయింది. 2005లో పెళ్లి. 2006లో మెలానియ తల్లి అయింది. కొడుకు పుట్టాడు.

‘‘నా భర్త గురించి నాకు తెలుసు. ఆడవాళ్ల విషయంలో అబ్బాయిలు చెప్పుకునే గొప్పల్లాంటివే ఆయన మాటలు. ఇంట్లో నాకు ఇద్దరు కొడుకులు. నా కొడుకు, నా భర్త’’   - మెలానియా

మెలానియకు 2005లో అమెరికన్ పౌరసత్వం లభించింది. ఆమె తండ్రి స్లొవేనియా ప్రభుత్వ మోటార్ వెహికల్స్ డీలర్. స్లొవేనియా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. తల్లికి బట్టల కంపెనీ ఉంది. మెలానియాకు ఒక చెల్లి ఉంది. మెలానియ డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేశారు. ఫ్యాషన్ మోడలింగ్‌లోకి వచ్చేశారు. స్లొవేనియా, సెర్బియా, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్.. భాషలు మాట్లాడతారు మెలానియ.

ఇన్ని భాషలు వ చ్చినా... ప్రస్తుతం ట్రంప్‌పై వస్తున్న ఆరోపణల్ని తిప్పి కొట్టడానికి  ఏ భాషకూ బలం సరిపోవడం లేదు. అంతగా ట్రంప్‌పై దాడి మొదలైంది. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని మెలానియా అంటున్నారు. ‘‘నా భర్త గురించి నాకు తెలుసు. ఆడవాళ్ల విషయంలో అబ్బాయిలు చెప్పుకునే గొప్పల్లాంటివే ఆయన మాటలు’’ అని మెలానియా వెనకేసుకొస్తున్నారు. ఎంత వెనకేసుకొచ్చినా.. మొదటి భార్య కూతురు ఇవాంక విషయంలో తన భర్త చేసిన కామెంట్‌లను మాత్రం ఆమె నిజాయితీగా ఖండించారు.

ఏమైనా మెలానియ తన భర్తపై విమర్శల్ని పట్టించుకునే వ్యక్తి కాదు. ట్రంప్ ధోరణి గురించి అడిగితే ఆమె ఎప్పుడూ ఒకే మాట చెబుతారు : ‘సెన్సేషన్ కోసం ఆయన్ని మాట్లాడిస్తారు తప్ప, సెన్సేషన్ కోసం ఆయనకై ఆయన మాట్లాడరు’ అని. ఇటీవలే ఇంకో ఒక అందమైన మాట కూడా అన్నారు మెలానియ. ఇంట్లో తనకు ఇద్దరు కొడుకులట. తన కొడుకు. తన భర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement