పండేది నేల కింద...  ఉండేది నాల్క మీద! | special story to Potato food | Sakshi
Sakshi News home page

పండేది నేల కింద...  ఉండేది నాల్క మీద!

Published Fri, Feb 9 2018 11:53 PM | Last Updated on Fri, Feb 9 2018 11:53 PM

special story to Potato food  - Sakshi

గాజర్‌ హల్వా

దుంప వంటకాల టేస్టే వేరు.  ఒక్కసారి గానీ వాటి రుచిమరిగితే  మళ్లీ మళ్లీ తినేదాకా దుంపతెంపుతాయవి.   క్యారట్‌తో హల్వా చేసినా  బిట్‌రూట్‌తో కబాబ్‌ కాల్చినా  ముల్లంగి కోఫ్తా, ఆలూగోబీల ఫీస్టును మరవలేక  మనసు మళ్లీ మళ్లీ ఆ రుచులనే కోరుతుంది. రుచి మూలాలన్నీ కందమూలాల్లోనే ఉన్నాయన్న   వాస్తవం మనందరికీ తొలి టేస్టులోనే తెలిసొస్తుంది. 

స్వీట్‌ పొటాటో రబ్డీ
కావలసినవి: చిలగడ దుంప (కొద్దిగా పెద్దది) – 1 (ఉడికించి తొక్కతీసి మెత్తగా చేయాలి); పాలు – కప్పు; పంచదార – అర టీ స్పూను; గోరు వెచ్చని నీరు – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; నేతిలో వేయించిన జీడిపప్పులు + కిస్‌మిస్‌ + బాదం పప్పులు – 2 టీ స్పూన్లు.
తయారి: ఒక గిన్నెలో పాలు పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙పంచదార, ఉడికించిన చిలగడ దుంప ముద్ద జత చేసి, బాగా కలిపి, చిక్కపడేవరకు ఉడికించాలి ∙అర కప్పుడు గోరు వెచ్చని నీటిలో కుంకుమ పువ్వు వేసి, కరిగించి, ఉడుకుతున్న పాల మిశ్రమంలో వేసి కలిపి, మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి ∙ఏలకుల పొడి, నేతిలో వేయించిన జీడిపప్పు మిశ్రమాన్ని జత చేసి బాగా కలిపి దించేయాలి.చల్లారాక ఫ్రిజ్‌లో సుమారు గంట సేపు ఉంచి గ్లాసులలో పోసి, చల్లగా అందించాలి.

మూలీ  కే  కోఫ్తా
కావలసినవి: తెల్ల ముల్లంగి – అరకిలో; పచ్చి కొబ్బరి తురుము – టేబుల్‌ స్పూను; పల్లీలు – అర టేబుల్‌ స్పూన్‌; వేయించిన సెనగపప్పు – 2 టేబుల్‌ స్పూన్లు; గరం మపాల – టీ స్పూను; ఎండు మిర్చి – 2; పచ్చి మిర్చి – 1 (చిన్న ముక్కలు చేసుకోవాలి); ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి)
సన్నగా తరిగిన  కొత్తిమీర – టేబుల్‌ స్పూను; ఉప్పు తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

గ్రేవీ కోసం... ఎండు మిర్చి – 4; వెల్లుల్లి ముద్ద – టీ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ఉల్లిపాయ ముద్ద – రెండు టేబుల్‌ స్పూన్లు; నూనె – 100
మిలీ; పెరుగు – కప్పు; గరం మసాల – టీ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; 
తయారి: ∙ముల్లంగిని శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా తరిగి, తగినన్ని నీళ్ళు జతచేసి మెత్తగా అయ్యే వరకూ ఉడికించి దింపేయాలి ∙చల్లారాక నీళ్ళు ఒంపేసి ఉడికిన ముల్లంగిని మిక్సీలో వేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙కొబ్బరి తురుము, పల్లీలు, వేయించిన సెనగపప్పు, గరం మసాల, ఎండు మిర్చిలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, చిన్న పాత్రలోకి తీసుకోవాలి. ∙మెత్తగా చేసిన ముల్లంగిలో...  పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, మెత్తగా చేసిన కొబ్బరి తురుము మిశ్రమం జత చేసి బాగా కలపాలి ∙బాణలిలో నూనె కాగాక, ముల్లంగి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి.

గ్రేవీ తయారీ: ∙మిక్సీలో ఎండు మిర్చి, ఉప్పు, వెల్లుల్లి, ధనియాల పొడి, పసుపు వేసి మెత్తగా చేయాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి మిశ్రమం వేసి దోరగా వేయించాలి ∙ఉల్లి తరుగు, ఉల్లిపాయ పేస్ట్, జత చేసి సుమారు ఐదు నిమిషాలు వేయించాలి ∙పెరుగు, గరం మసాల, ఏలకుల పొడి, అల్లం తురుము ఒకదాని తరవాత ఒకటి జత చేసి బాగా కలపాలి. కప్పుడు నీళ్లు జత చేసి సుమారు మూడు నిమిషాలు ఉడికించాలి ∙తయారుచేసి ఉంచుకున్న మూలీ కోఫ్తాలు వేసి బాగా ఉడికించి వేడివేడిగా అందించాలి.

భర్వాన్‌ ఆలు గోబీ
కావలసినవి: బంగాళదుంపలు – 2 (తొక్కు తీసి ముక్కలు చేయాలి); క్యాలీఫ్లవర్‌ తరుగు – కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; ఫిల్లింగ్‌ కోసం... చీజ్‌ తురుము – అర కప్పు;  కిస్‌మిస్‌ – 15; దానిమ్మ గింజలు – 3 లేబుల్‌స్పూన్లు; సన్నగా తరిగిన జీడిపప్పు – 3 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; అల్లం తురుము – 2 టేబుల్‌ స్పూన్లు; పచ్చి కోవా – 4 టేబుల్‌ స్పూన్లు పిండి కోసం... సెనగ పిండి – 2 కప్పులు; వాము – టేబుల్‌ స్పూను; వెల్లుల్లి ముద్ద – టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; మిరపపొడి – కొద్దిగా; నీళ్లు – తగినన్ని

తయారి: ∙ఒక పాత్రలో నీళ్లు, ఉప్పు, క్యాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు, పసుపు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించి పక్కన ఉంచాలి ∙పిండి కోసం తీసుకున్న పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి, తగినన్ని నీళ్లు జత చే సి, పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙ఒక పాత్రలో ఫిల్లింగ్‌ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి బాగా కలపాక, ఉడికించిన బంగాళదుంప ముక్కల మిశ్రమం జత చేసి మరోమారు కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన  ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక సెనగపిండి మిశ్రమంలో ... బజ్జీల మాదిరిగా ఈ ఉండలను ఒక్కక్కటిగా ముంచుతూ కాగిన నూనెలో వేసి ముదురు గోధుమ రంగులోకి వచ్చాక తీసేయాలి ∙టొమాటో సాస్‌తో వేడివేడిగా అందించాలి.

బీట్‌రూట్‌ కబాబ్‌
కావలసినవి:  బీట్‌రూట్‌ తురుము – కప్పు; పనీర్‌ తురుము – అర కప్పు; వెల్లుల్లి ముద్ద – అర టేబుల్‌ స్పూను; ఆమ్‌చూర్‌ పొడి – టేబుల్‌ స్పూను; వేయించిన నువ్వుల పొడి – టేబుల్‌ స్పూను; చాట్‌ మసాలా – చిటికెడు; ఉప్పు – తగినంత; సన్నగా తరిగిన జీyì పప్పులు – పావు కప్పు; పొడి చేసిన ఓట్స్‌ – అర కప్పు; నూనె – తగినంత
తయారి: ∙ఒక పాత్రలో బీట్‌రూట్‌ తురుము, పనీర్‌ తురుము, వెల్లుల్లి ముద్ద, ఆమ్‌చూర్‌ పొడి, చాట్‌ మసాలా, ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసి, చేతిలోకి తీసుకుని ఒక్కో ఉండను చేతితో అదమాలి ∙జీడిపప్పు పొడిని మధ్యలో ఉంచి చుట్టూ మూసేయాలి ∙ఓట్స్‌ పొడిలో దొల్లించి పక్కన ఉంచాలి ∙పాన్‌ మీద నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కబాబ్‌లను రెండు వైపులా కాల్చి కొత్తిమీర చట్నీతో అందించాలి.

గాజర్‌ హల్వా
కావలసినవి: గాజర్‌ తురుము – కప్పు; పాలు – అర లీటరు; పంచదార – 3 టేబుల్‌ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూన్‌; జీడి పప్పు పలుకులు – టేబుల్‌ స్పూన్‌; కిస్‌మిస్‌ – టేబుల్‌ స్పూన్‌.
తయారి: ∙స్టౌ మీద బాణలిలో పాలు పోసి మరిగించాలి ∙బాగా మరిగి సగం అయ్యేవరకూ కలుపుతుండాలి ∙వేరొక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక గాజర్‌ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి మరిగిన పాలలో వేయాలి ∙బాగా కలుపుతూ, పంచదార జత చేసి సన్నని మంటపై ఉడికించాలి ∙బాణలిలో నెయ్యి వేసి, కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి ఉడికిన గాజర్‌ హల్వాలో వేయాలి ∙ఏలకుల పొడి జత చేసి, బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement