భర్త యాక్షన్‌ చెప్తే భార్య కట్‌ చెప్తుంది | special story to pushkar -gayatri | Sakshi
Sakshi News home page

భర్త యాక్షన్‌ చెప్తే భార్య కట్‌ చెప్తుంది

Jan 2 2018 12:21 AM | Updated on Jan 2 2018 12:21 AM

special  story to  pushkar -gayatri - Sakshi

భార్యాభర్తలై జంటగా పని చేసే నటులున్నారు..
కొరియోగ్రాఫర్లు ఉన్నారు... సింగర్లు ఉన్నారు...
కాని భార్యాభర్తలై జంటగా పని చేసే దర్శకులు
మొత్తం ఆసియా ఖండానికి ఒకే ఒకరు ఉన్నారు.
వారే పుష్కర్‌–గాయత్రి. వారిరువురు కలిసి
డైరెక్ట్‌ చేసి తాజా తమిళ సినిమా ‘విక్రమ్‌ వేదా’
 పన్నెండు కోట్ల పెట్టుబడికి 90 కోట్లు 
సంపాదించి సంచలనం సృష్టిస్తోంది.

చెట్టు మీద ఉన్న శవాన్ని దింపి భుజాన వేసుకుని నడుస్తున్న విక్రమార్కుడితో బేతాళుడు రోజుకో కథ చెబుతాడు. చిత్ర విచిత్రమైన కథలు. గాయత్రి–పుష్కర్‌ల కథ కూడా కొంచెం విచిత్రమైనదే. దర్శకత్వం వహించే భార్యాభర్తలుగా వీళ్లు ఒక ట్రెండ్‌ సృష్టించారు. గతంలో మనం ‘భారతి–వాసు’  వంటి స్నేహితులు, అబ్బాస్‌– మస్తాన్‌ వంటి అన్నదమ్ములు కలిసి దర్శకత్వం వహించిన సందర్భాలు ఉన్నాయి. కాని భార్యాభర్తలు కలిసి దర్శకత్వం వహించడం వింత. ఎవరు యాక్షన్‌ చెప్తారు, ఎవరు కట్‌ చెప్తారు, ఎవరు స్క్రీన్‌ ప్లే రాస్తారు, ఎవరు డైలాగ్‌ ఎక్స్‌ప్లయిన్‌ చేస్తారు.. ఇదంతా అంత సులభం కాదు. కాని మా విషయంలో ఇది చాలా ఈజీ అంటారు గాయత్రి–పుష్కర్‌. పెళ్లే మాకు దర్శకత్వం లాంటిది... దర్శకత్వమే మాకు పెళ్లి లాంటిది అంటారు వాళ్లు.

మెడ్రాస్‌ కపుల్‌
పుష్కర్‌–గాయత్రిలు పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. అందుకే వారి నరనరాన చెన్నై ప్రవహిస్తూ ఉంటుంది. ఇద్దరూ లయోలా కాలేజ్‌లో విజువల్‌ కమ్యూనికేషన్స్‌ చదువుతూ ఉండగా ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. ఆ రోజులను తలుచుకుంటూ గాయత్రి ఇలా అంది– ‘ఇద్దరికీ ఒకేరకమైన ఇష్టాలు ఉండటం గమనించాం. ఇద్దరికీ ఒకే రకమైన సినిమాలు ఇష్టం. పుస్తకాలు ఇష్టం. ఇద్దరం ఒకే నాటకానికి కలిసి వెళ్లే వాళ్లం. ఇద్దరం డైరెక్షన్‌లోకి రావాలని అప్పుడే నిర్ణయించుకున్నాం’ అందామె. డిగ్రీ అయ్యాక సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడో ఒక చోట అసిస్టెంట్స్‌గా చేరి కెరీర్‌ మొదలెడతారు. కాని పుష్కర్‌–గాయత్రీలు సినిమా నియమబద్ధంగా చదవాలని నిర్ణయించుకున్నారు. అందుకే గాయత్రి షికాగోలో, పుష్కర్‌ న్యూ ఓర్లెన్స్‌లో సినిమా కళను అభ్యసించారు. అక్కడి నుంచి వచ్చాక పి.సి.శ్రీరామ్, మానవ్‌ మీనన్‌ వంటి వారి దగ్గర యాడ్‌ రంగంలో పని చేశారు. ఇక చాలు అనుకొని 2007లో ‘ఓరమ్‌ పో’ సినిమాతో దర్శకత్వంలోకి వచ్చారు.

బ్లాక్‌ కామెడీ
ఇండియన్‌ సినిమాలో బ్లాక్‌ కామెడీతో వచ్చే సినిమాలు తక్కువ. అమర్యాదకరమైన, నలుగురు బహిరంగంగా చర్చించని విషయాలను వేదికగా తీసుకుని హాస్యాన్ని పండించే ఈ తరహా సినిమాలనే పుష్కర్‌–గాయత్రీలు సినిమాలుగా తీయాలని నిశ్చయించుకున్నారు. వాళ్ల మొదటి సినిమా ‘ఓరమ్‌ పో’ చెన్నై అర్ధరాత్రిళ్లు ఆటో రేసింగ్‌ పెట్టుకునే ఆటోడ్రైవర్ల మధ్య నడిచే సినిమా. ఈ సినిమాతో పుష్కర్‌–గాయత్రీలు కొత్త ప్రేక్షకులను సృష్టించుకున్నారని చెప్పవచ్చు. వీరి తర్వాతి సినిమా ‘వా–క్వార్టర్‌ కట్టింగ్‌’ కూడా కొత్తరకం కథే. ఉద్యోగం కోసం సౌదీకి వెళ్లాలనే కుర్రాడు తాను సౌదీకి వెళ్లబోయే రాత్రి ఇక సౌదీకి వెళ్లాక అక్కడ మద్యం తాగలేనని గ్రహించి జీవితంలో ఇప్పటిదాకా మద్యం ముట్టలేదు కనుక ఒక్కసారి ముట్టి వెళ్లిపోదామని అనుకుంటాడు. అయితే ఆ రోజు ఎలక్షన్లు జరుగుతుంటాయి కనుక అది డ్రై డే. ఇక అతడు, అతడి స్నేహితులు మద్యం కోసం ఎన్ని పాట్లు పడ్డారన్నది కథ. దీనికి కూడా ప్రేక్షకులు హిట్‌ టాక్‌ ఇచ్చారు.

అద్వైతం
పుష్కర్‌–గాయత్రీలు ఇద్దరు కాదు. దాదాపు ఒక్కరే అన్నట్టుగా కలిసిపోయారు. ‘మీకు విభేదాలు రావా?’ చాలామంది వారిని ప్రశ్నించారు. ‘మేము ఒకరి కళ్లలో మరొకరు కళ్లు పెట్టి చూసిన వెంటనే ఒకరి అభిప్రాయం మరొకరికి తెలిసిపోతుంది. తప్పును ఆపేస్తాం. ఒప్పును కొనసాగిస్తాం’ అంటుంది గాయత్రీ. ఇంట్లో అయినా లొకేషన్‌లో అయినా వీరి మధ్య వాదన ఉండదు చర్చ ఉంటుంది. అందుకే మా జంట సక్సెస్‌ అయ్యింది అంటారు వాళ్లు. విక్రమ్‌ వేదా సూపర్‌ హిట్‌ తర్వాత రజనీకాంత్‌ అంతటి వ్యక్తి ప్రత్యేకంగా వీరిని అభినందించాడు. వీరికి చాలా డిమాండ్‌ ఏర్పడింది. ఇద్దరూ విడివిడిగా దర్శకత్వం వహించవచ్చు కదా అని అడిగితే వాళ్లు చెప్పే జవాబు ‘అంత అవసరం ఏమొచ్చింది?’ అని.
ఈ జంట చాలా జంటలకు ఆదర్శం అవ్వాలి.
 

విక్రమ్‌ వేదా
పుష్కర్‌–గాయత్రీలు చాలా ఒరిజినల్‌ స్క్రిప్ట్‌ కోసం ప్రయత్నించే దర్శకులు అని చెప్పుకోవచ్చు. అందుకే వారు పదేళ్ల కాలంలో కేవలం మూడు సినిమాలే తీశారు. మొదటి రెండు సినిమాల తర్వాత వాళ్లు ఏడేళ్లు గ్యాప్‌ తీసుకుని ‘విక్రమ్‌ వేదా’కు దర్శకత్వం వహించారు. దీనికి ముందు ఒకటి రెండు స్క్రిప్ట్‌లు అనుకున్నా వారిని అవి ఉత్సాహపరచలేదు. ఆ సమయంలో వారి దృష్టి బేతాళ కథల మీద పడింది. విక్రమార్కునితో బేతాళుడు రోజుకో కథ చెప్పడం దానికి అనూహ్యమైన జవాబును విక్రమార్కుడు చెప్పడం ఇలా సాగే కథలాగా ఒక సినిమా తీయాలనుకున్నారు. అదే విక్రమ్‌ వేదా. ఇందులో విక్రమ్‌ అనే సిన్సియర్‌ పోలీసాఫీర్, వేదా అనే రౌడీ ఎలా ఒకే ఘటనకు తమ తమ దృక్కోణం నుంచి జవాబులు చెప్పారో ఆసక్తికరంగా ఉంటుంది. విక్రమ్‌ తన వాదన వినిపిస్తుంటే వేదా తన వాదన వినిపిస్తాడు. మనిషి పూర్తిగా మంచి పూర్తిగా చెడ్డ ఉండడని మధ్యలో కొన్ని గ్రే ఏరియాలు ఉంటాయని ఈ కథ చెబుతుంది. అనూహ్యమైన మలుపులతో చెన్నై ఒరిజినాలిటీతో సాగే ఈ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పలికారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement