
జుబాన్ మీఠా హై తో జమానా మీఠా హై మాట తియ్యనిదైతే అందరి మనసులు తియ్యగా ఉంటాయి. ఇంకో వారం రోజుల్లో రంజాన్ మనకి కష్టం ఉన్నా ఇతరులకు తీపి పంచే ఔదార్యం ఉన్న పండుగ. అలాంటి గొప్ప పండుగ చేసుకునే మనందరికీ ఇదిగో ... ఏక్ మీఠా దావత్ !
కాజు హల్వా
కావలసినవి :జీడి పప్పులు – ఒక కప్పు; మైదా పిండి – అర కప్పు; నీళ్లు – మూడున్నర కప్పులు; నెయ్యి – అర కప్పు; పంచదార – ఒక కప్పు; కుంకుమ పువ్వు – మూడు నాలుగు రేకలు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; బాదం పప్పు తరుగు – పావు టీ స్పూను.
తయారీ: ∙జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నీళ్లు పోసి మరిగాక, పంచదార వేసి బాగా కరిగేవరకు కలుపుతుండాలి ∙కుంకుమ పువ్వు జత చేసి మరో నిమిషం పాటు మరిగించి కిందకు దింపేయాలి ∙స్టౌ మీద వెడల్పాటి పాత్రను వేడి చేసి, అందులో నెయ్యి వేసి కరిగాక మైదాపిండి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుతుండాలి ∙మిశ్రమం గోధుమరంగులోకి మారేవరకు ఐదారు నిమిషాలు ఉడికించాక, పంచదార పాకం జత చే సి మిశ్రమం దగ్గర పడేవరకు కలుపుతుండాలి ∙ఏలకుల పొడి, బాదం పప్పు తరుగు జత చేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని వేరొక పాత్రలోకి తీసుకుని వేడిగా కాని చల్లగా కాని అందించాలి.
ఫ్రూట్ ఖీర్
కావలసినవి :బియ్యం – ఒకటి ముప్పావు కప్పులు; పాలు – ఒక లీటరు; బటర్ – 2 టేబుల్ స్పూన్లు; సపోటా ముక్కలు – పావు కప్పు; అరటి పండు ముక్కలు – పావు కప్పు; ఆపిల్ ముక్కలు – పావు కప్పు; కిస్‌మిస్ ద్రాక్ష – పావు కప్పు; మామిడి పండు ముక్కలు – పావు కప్పు; పంచదార – నాలుగు టేబుల్ స్పూన్లు; కార్న్‌ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూను; రోజ్ సిరప్ – ఒక టీ స్పూను; పిస్తా తరుగు – ఒక టేబుల్ స్పూను
తయారీ: ∙స్టౌ మీద పాన్‌లో బటర్ వేసి కరిగాక పండ్ల ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి ∙ఒక టేబుల్ స్పూను పంచదార జత చేసి కొంతసేపు ఉడికించి, సర్వింగ్ డిష్‌లోకి తీసుకోవాలి ∙అదే పాన్‌లో బియ్యం వేసి దోరగా వేయించాలి. (అవసరమనుకుంటే మరి కాస్త బటర్ జత చేయొచ్చు) ∙పాలు జత చేసి అన్నం బాగా మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి కొద్దిగా నీళ్లల్లో కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి, ఉడుకుతున్న అన్నంలో వేసి కలపాలి ∙మిగిలిన పంచదార జత చేసి మరోమారు కలపాలి ∙రోజ్ సిరప్ జత చేసి, తయారుచేసి ఉంచుకున్న పండ్ల ముక్కల మీద వేయాలి ∙పిస్తా ముక్కల తరుగుతో అలంకరించి, చల్లగా అందించాలి.
షాహీ టుక్‌డా
కావలసినవి:రబ్రీ కోసం: పాలు – లీటరు; పంచదార – రెండున్నర టేబుల్ స్పూన్లు; పాల పొడి – 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; రోజ్ వాటర్ – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా పంచదార పాకం కోసం: పంచదార – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను టుక్‌డా కోసం: బ్రెడ్ స్లయిసెస్ – 6 ; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు గార్నిషింగ్ కోసం: బాదం పప్పులు – 15; కుంకుమ పువ్వు – కొద్దిగా
తయారీ: ∙ఒక పాత్రలో కప్పుడు నీళ్లు పోసి మరిగించాలి ∙మరుగుతున్న నీటిలో పిస్తా పప్పులు, బాదం పప్పులు వేసి ఒకసారి కలిపి దింపేసి, మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙చల్లారాక బాదం పప్పులు, పిస్తా పప్పుల తొక్క తీసేయాలి.
రబ్రీ తయారీ
∙వెడల్పాటి పాత్రలో లీటరు చిక్కటి పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙పాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జత చేసి కలిపి దింపేయాలి ∙పంచదార జత చేసి కరిగేవరకు బాగా కలిపి బాదం పప్పుల తరుగు, పిస్తా తరుగు, రోజ్ వాటర్ వేసి కలపాలి.
(నోట్: చిక్కగా, చక్కగా, రుచిగా తయారుకావడానికి సుమారు గంట సమయం పడుతుంది. మీగడ వచ్చినప్పుడల్లా తీసి పక్కన ఉంచాలి. అప్పుడు పాలు గోధుమవర్ణంలోకి మారవు. మరగడం పూర్తయ్యాక మీగడ జత చేయాలి)
టుక్‌డా తయారీ
∙బ్రెడ్ చుట్టూ ఉండే గట్టి పదార్థాన్ని తీసేసి, ముక్కలుగా కట్ చేయాలి ∙స్టౌ మీద పెనం పెట్టి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక బ్రెడ్ ముక్కలను రెండువైపులా కాల్చి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.షాహీ టుక్‌డా కోసం
పంచదార పాకం తయారీ
∙ఒక పాత్రలో అర కప్పు పంచదార, అర కప్పు నీళ్లు వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, మరిగించి తీగ పాకం వచ్చాక దింపేయాలి ∙ఏలకుల పొడి జత చేయాలి ∙బ్రెడ్ ముక్కలు జత చేసి బాగా కలపాలి.
షాహీ టుక్‌డా తయారీ
∙పంచదార పాకంలో బ్రెడ్ ముక్కలు మునిగేలా వేసి కొద్దిసేటి తరవాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙వాటి మీద రబ్రీ సమానంగా పోయాలి ∙బాదం తరుగు, పిస్తా తరుగులతో అందంగా అలంకరించాలి ∙అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అందించాలి.
బ్రెడ్ హల్వా
కావలసినవి: బ్రెడ్ స్లయిసెస్ – 4; పంచదార – పావు కప్పు; కరిగించిన నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు – 5; నీళ్లు – అర కప్పు
తయారీ:బ్రెడ్ స్లయిసెస్ అంచులను తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙బ్రెడ్ స్లయిసెస్ వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, చల్లారాక ముక్కలు చేసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి ∙కొద్దికొద్దిగా బబుల్స్‌లా వస్తుండగా, బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి ∙బ్రెడ్ ముక్కలు మెత్తగా అయ్యేలా గరిటెతో మెదపాలి ∙ఉడుకుతుండగా, ఒక్కో స్పూను నెయ్యి వేస్తూ కలపాలి ∙బాగా ఉడికిందనిపించాక, వేయించిన జీడిపప్పులు జత చేసి ఒకసారి కలిపి దింపేయాలి.
స్వీట్ కోకో బర్ఫీ
కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; కోకో పౌడర్ – అర కప్పు; పాలు – తగినన్ని; బాదం పప్పుల తరుగు – ఒక టీ స్పూను; పంచదార – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – అర కప్పు
తయార:∙మందపాటి పాత్రను వేడి చేసి, నెయ్యి వేసి కరిగించి మంట బాగా తగ్గించాలి ∙మైదా పిండి జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకువేయించి, పిండిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో పాలు పోసి సన్న మంట మీద మరిగించాక, పంచదార జత చేసి కరిగించాలి ∙పాలుకొద్దిగా చిక్కబడ్డాక, మైదా పిండి, కోకో పొడి జత చేసి ఉండ కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి, అందులో ఈ మిశ్రమాన్ని పోసి సమానంగా పరిచి, బర్ఫీ ఆకారంలో కట్ చేయాలి ∙చల్లారాక ముక్కలను జాగ్రత్తగా తీసి, బాదం పప్పుల తరుగుతో అలంకరించి అందించాలి.
ఖజూర్ హల్వా
కావలసినవి: గింజలు లేని ఖర్జూరాలు – 200 గ్రా.; పాలు – ఒక కప్పు; పంచదార పొడి – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – పావు కప్పు; జీడి పప్పులు – 100 గ్రా.; ఏలకుల పొడి – పావు టీ స్పూను
తయారీ: ∙ఒక పాత్రలో పాలు, ఖర్జూరాలు వేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙మంట బాగా తగ్గించి పాలు చిక్కబడి, ఖర్జూరాలు ఉడికే వరకు కలుపుతుండాలి ∙మిశ్రమం బాగా చిక్కబడ్డాక పంచదార పొడి, నెయ్యి, జీడిపప్పులు వేసి బాగా కలిపి మరోమారు ఉడికించాలి ∙ఏలకుల పొడి జత చేసి కలిపి దింపేయాలి ∙ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ప్లేట్‌లో పోసి పల్చగా పరవాలి ∙బాగా చల్లారాక, కావలసిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసి అందించాలి.
షీర్ ఖుర్మా
కావలసినవి :పాలు – అర లీటరు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; రోస్టెడ్ సేమ్యా – అర కప్పు; జీడిపప్పులు – 8; బాదం పప్పులు – 10 (ముక్కలు చేయాలి); అన్ సాల్టెడ్ పిస్తా – 10 (ముక్కలు చేయాలి); గింజలు లేని ఖర్జూరాలు – 10; ఏలకుల పొడి – టీ స్పూను; చిరోంజీ – ఒక టేబుల్ స్పూను; కిస్‌మిస్ – ఒక టేబుల్ స్పూను; రోజ్ వాటర్ – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా
తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి ∙ఒక పాత్రలో సన్న మంట మీద పాలు మరిగించి, చిక్కబడేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙రోస్టెడ్ సేమ్యా, పంచదార జత చేసి బాగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలపాలి ∙డ్రైఫ్రూట్స్, ఏలకుల పొడి, రోజ్ వాటర్ జత చేసి బాగా కలిపి దింపేయాలి ∙పంచదార తక్కువగా అనిపిస్తే మరికాస్త జతచే సుకోవచ్చు ∙షీర్ ఖుర్మా బాగా చల్లారాక కుంకుమ పువ్వుతో అలంకరించి అందించాలి.
రోజ్ ఫిర్నీ
కావలసినవి:బాదం పప్పులు – 10; బాస్మతి బియ్యం – 4 టేబుల్ స్పూన్లు; పాలు – అర కప్పు + రెండున్నర కప్పులు; పంచదార – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా (ఒక టీ స్పూను పాలలో కలపాలి); రోజ్ వాటర్ – కొద్దిగా.
గార్నిషింగ్ కోసం
బాదం పప్పుల తరుగు – టీ స్పూను; పిస్తా తరుగు – టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా
తయారీ: మిక్సీలో బాదం పప్పులు, కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్‌లా చేసి చిన్న పాత్రలోకి తీసుకోవాలి ∙బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అర గంట సేపు నానబెట్టాక, నీరు ఒంపేయాలి ∙మిక్సీ జార్‌లో బియ్యం, కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్‌లా చేసి, చిన్న పాత్రలోకి తీసి, అర కప్పు పాలు జత చేయాలి ∙రెండున్నర కప్పుల పాలను ఒక పెద్ద పాత్రలో పోసి, స్టౌ మీద ఉంచి, పాలు మరుగుతుండగా, పాలు+బియ్యం మిశ్రమం జత చేసి, మంట తగ్గించి, ఆపకుండా కలుపుతుండాలి ∙సుమారు ఏడు నిమిషాల తరువాత మిశ్రమం చిక్కగా మారుతుంది ∙పంచదార, ఏలకుల పొడి, పాలలో కలిపిన కుంకుమపువ్వు జత చేసి మరోమారు కలపాలి ∙బాదం పప్పు పేస్ట్, రోజ్ వాటర్ జత చేసి, కొద్దిసేపు ఉడికించి దింపేయాలి ∙తయారయిన మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి ∙పైన మూత పెట్టి, ఫ్రిజ్‌లో సుమారు రెండు గంటలు ఉంచి, బయటకు తీసి చల్లగా అందించాలి.(ఇంటికి వచ్చిన అతిథికి రాత్రి భోజనం తరువాత ఫిర్నీ అందిస్తే, పండుగ భావన కలుగుతుంది).
వంటింటి చిట్కాలు
బియ్యం, తృణధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేకలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి n పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా మారితే, దాని మీద సబ్బు నీళ్లు పోసి సన్నటి సెగ మీద ఉంచి, చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది n రాగి సామగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్తవాటిలా మెరిసిపోతాయి n పచ్చి బఠాణీలు ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి n చపాతీలు ఒత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనె వేసి మడతలుగా చేసి కాల్చి, హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడు గంటలపాటు మెత్తగా ఉంటాయి n చపాతీ పిండిలో ఉడికిన బంగాళదుంపను వేసి బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు ఎక్కువసేపు మృదువుగా ఉంటాయి n పరగడుపున ఉసిరికాయ, భోజనం చేశాక అరటిపండు, సాయంత్రం వెలగపండు తింటే అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు n పెరుగు పచ్చడి మరింత రుచిగా రావాలంటే, పోపులో టీ స్పూను నెయ్యి కలిపితే సరి n గులాబ్‌జామ్ తయారుచేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీర్ జత చేస్తే, మృదువుగా, రుచిగా ఉంటాయి n దోసెల పిండి బాగా పులిస్తే, అందులో రెండు టీ స్పూన్ల గోధుమపిండిని కలిపితే రుచిగా వస్తాయి.
మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్. familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.
– నిర్వహణ వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment