
తెలుగు, మలయాలం, తమిళం మూడు భాషల్లోనూ బుల్లితెర నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు జై ధనుష్. ‘తూర్పు–పడమర’, ‘కొంచెం ఇష్టం కొంచె కష్టం’, ‘తరంగాలు’, ‘ఆడదే ఆధారం’, ‘నెం.1 కోడలు’.. ఇలా వరుసగా సీరియల్స్‌చేస్తున్నాడు జైధనుష్. ‘అన్ని వయసులవారి అభిమానాన్ని సంపాదించాలన్నదే నా లక్ష్యం’ అంటూ చెబుతున్న ముచ్చట్లివి..
‘ఇతర రాష్ట్రాల టీవీ ఆర్టిస్టులు ఇక్కడ సీరియల్స్ చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. తెలుగు నటుడిగా కొనసాగుతూనే తమిళం, మలయా ళం సీరియల్స్ చేస్తూ అభిమానులను సంపాదించుకోవడం ఆనందంగా ఉంది. ఆ రాష్ట్రాల్లో కూడా నన్ను వాళ్లలో మనిషిలో చూస్తున్నారు. మలయాళంలో ‘అలియంబల్’, తమిళంలో ‘చంద్రలేఖ’, ఇక్కడ జీ తెలుగులో ‘నెం.1 కోడలు’లో లీడ్ రోల్ చేస్తున్నాను.
ప్రభాస్‌తో కలిసి..
చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేది. విశాఖపట్టణంలో మా నాన్నగారికి బిజినెస్ ఉండటంతో కాలేజీ టైమ్‌లో అక్కడ ఉన్నాను. మా ఇంటికి దగ్గరలో యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. సెలవు రోజుల్లో అక్కడకెళ్లి చూసేవాడిని. ఆ ఇన్‌స్టిట్యూట్ సర్ మా నాన్నగారికి ‘మీ అబ్బాయి యాక్టింగ్‌కి బాగా పనికివస్తాడు. హాలీడేస్ టైమ్‌లో పంపించమ’ని అడిగారు. అలా యాక్టింగ్ నేర్చుకున్నాను. సినీ హీరో ప్రభాస్ నేనూ ఒకే బ్యాచ్. సినీ పరిశ్రమలో మా బ్యాచ్ అందరికీ మంచి అవకాశాలు వచ్చాయి. యాక్టింగ్ కోర్స్ పూర్తయ్యాక నాకు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 1–2 ట్రయల్స్‌లోనే ‘పోతేపోనీ’ సినిమాలో అవకాశం వచ్చింది.
ఆ తర్వాత మనోరమ, అభిలాషి
సినిమాల్లో చేశాను. ఈ సినిమాలకు నంది అవార్డ్సు వచ్చాయి. కానీ, కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఆశించినంత గుర్తింపు రాలేదు. దీంతో నా దారి సీరియల్స్ వైపుగా మళ్లించుకున్నాను.
నటి– నటుడు– ఓ ఫ్యామిలీ
సీరియల్ నటి కీర్తి నా భార్య. తనది బెంగళూరు. సీరియల్ నటి పరిటాల మంజుల చెల్లెలు. ‘తూర్పు–పడమర’ సీరియల్‌లో చేసే సమయంలో ప్రేమించుకున్నాం. ఆరేళ్ల పాటు ఇద్దరం మా కెరియర్స్ చూసుకుంటూనే మా జర్నీ కొనసాగించాం. ఒకరి మీద ఒకరికున్న నమ్మకం, ప్రేమ చూసి ఇరుకుటుంబాలు మా పెళ్లికి అంగీకరించారు. ఇప్పుడు మాకో పాప. తన పేరు తనీహా.
వీడియో కాల్‌తో కనెక్ట్
ఇద్దరమూ ఆర్టిస్టులమే అవడంతో ప్లానింగ్ తప్పదు. ఇద్దరమూ తెలుగు, తమిళం సీరియల్స్ చేస్తున్నాం. దీంతో షూట్‌లో భాగంగా నేను చెన్నై వెళ్లినప్పుడు తను హైదరాబాద్ వస్తుంది. నేను హైదరాబాద్ వస్తే, తను చెన్నై వెళ్లాల్సి వస్తుంది. టూర్‌కి కరెక్ట్‌గా ప్లాన్ చేసినా చాలా సార్లు టికెట్స్ క్యాన్సల్ చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ఇన్‌స్టంట్ ప్లాన్‌కి ఫిక్స్ అయిపోయాం (నవ్వుతూ). నెలలో ఎప్పుడొస్తాయో తెలియని ఐదు రోజుల ఖాళీ సమయం దొరుకుతుంది. మా ఇద్దరి షూటింగ్స్ వల్ల పాప మా పేరెంట్స్‌తో ఎక్కువ ఉంటుంది. షూట్‌లో ఉన్నా రోజూ పడుకునేముందు అరగంట సమయం వీడియో కాల్‌లో కలుస్తాం. మా కుటుంబంలోనే నలుగురం టీవీ ఆర్టిస్టులం అవడంతో ఎప్పుడు కలిసినా మా మధ్య సీరియల్ టాపిక్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎవరి బిజీలో వారున్నా ఎవరినీ మిస్సవకుండా చూస్తాం.
వాగ్దేవి కొడుకు
‘జీ తెలుగు’లో వచ్చే ‘నెంబర్.1’ కోడలు సీరియల్స్ జాబితాలోనే పెద్ద బడ్జెట్ సీరియల్. నా మీద నమ్మకం పెట్టుకొని లీడ్‌రోల్ ఇచ్చారు. విద్యాసంస్థలు నడిపే వాగ్దేవికి కొడుకుగా చేస్తున్నాను. ఒక మహిళ ఏమనుకున్నా సాధించగలదు అనే క్యారెక్టర్ వాగ్దేవిది. ఏది చేసినా నెం.1 గా ఉండాలనేది తన లక్ష్యం. తన ఇద్దరు పిల్లలు నెం.1 గా ఉండాలి అనుకుంటుంది. నేను కూడా ఆవిడకన్నా ఎక్కువ పంతంతో ఉంటాను. ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలనుకుంటా. ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్న నాకు పూర్తి వ్యతిరేక మనస్తత్వం ఉన్న అమ్మాయి పరిచయం అవుతుంది. కానీ, ఆ అమ్మాయి అస్సలు చదువుకోలేదు. ఆమె మా కుటుంబంలోకి ఎలా వస్తుంది, అక్కడ ఎలా ఉంటుంది? అనేది కథ.
భిన్నమైన పాత్రలు
మూడు భాషల్లో నటించడం వల్ల ఎప్పుడైనా ఇతర దేశాలకు వెళ్లినప్పుడు మూడు భాషల వాళ్లు కలిసి ‘మీ సీరియల్స్ చూస్తాం, చాలా బాగుంటాయి’ అని వారి కుటుంబంలో వ్యక్తిలా కలుపుకుపోయి మాట్లాడుతుంటారు. సీరియల్‌లో ఒక పాత్ర ద్వారా చాలా భిన్నమైన మనస్తత్వాలు చూపించే అవకాశం లభిస్తుంది. మంచివాడుగా, చెడ్డవాడుగా, ప్రేమికుడిగా.. నిరూపించుకోవచ్చు. మునుపటిలా కాదు ప్రేక్షకుల అభిమానం క్షణాల్లో తెలిసిపోతుంది. సీరియల్ ఎపిసోడ్స్ సోషల్ మీడియాలో చూసిన అభిమానులు వెంటనే కామెంట్స్ పెట్టేస్తున్నారు.
నే చేస్తున్న ప్రతీ పాత్రకు ఆ కామెంట్స్ చాలా పాజిటివ్‌గా ఉంటున్నాయి. నటుడిగా ప్రేక్షకులు అభిమానం ఎప్పడూ ఇలా పొందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. అన్ని పాత్రల్లో నన్ను నేను చూసుకోవాలనుకుంటాను. అలాగే బడికెళ్లే వాళ్ల వయసు నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ వారి కుటుంబంలో ఒకరిగా ఉండాలనుకుంటున్నాను. సహజంగానే ప్రయాణాలంటే ఇష్టపడే నాకు ఎక్కడకు వెళ్లినా తమలో ఒకరిగా చూసే అభిమానం తోడవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment