త్రీ సోల్జర్స్
ఆర్మీ క్యాంప్‌లోకి ఉగ్రవాది చొరబడ్డాడు! ‘భారత్ మాతాకీ జై’ అంటూ.. వెంకట రమణ తెగబడ్డాడు. అతడి పోరాట పటిమకు త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అతడి శ్వాసతో మువ్వన్నెల గుండె.. జెండాలా ఎగసింది! రక్తాన్ని చిందించి.. తల్లి భారతికి ప్రాణాభిషేకం చేశాడు. శక్తికి, శౌర్యానికి.. కాషాయం. శాంతికి, సత్యానికి.. తెలుపు. సస్యానికీ, సాఫల్యానికీ ఆకుపచ్చ. జెండాలోని మూడు రంగులివి. త్యాగం అనే నాలుగో రంగు అద్ది అమరుడయ్యాడు రమణ! భార్యాబిడ్డల్లో సోల్జర్ ఆత్మను నింపి వెళ్లాడు రమణ! అతడి ఆశయం కోసం ఇప్పుడీ త్రీ సోల్జర్స్... ఉగ్ర విధితో పోరాడుతున్నారు!
‘అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తాడు’ అని అడిగిన చిన్మయితో ‘రెండు రోజుల్లో వచ్చేస్తాడమ్మా’ అని చెప్పింది తల్లి అనిత.. కానీ ఆమెకు అప్పుడు తెలియదు ఒకరోజు ముందే విగతజీవిగా తన భర్త వస్తాడని. ఏడాదిలో వచ్చేది ఒకసారే.. ఉండేది రెండు నెలలే.. ఆ రెండు నెలల పండుగకు పది నెలలుగా ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఆ ఎదురు చూపులు మరో రెండు రోజులే అనుకుంటున్న సమయంలో ఉగ్రరక్కసి కాటేసింది. జమ్మూకాశ్మీర్‌లోని కుంపరాస్ పంజగ్రామ్ ఆర్మీక్యాంప్‌పై ఏప్రిల్ 27 తెల్లవారు జామున ఆర్మీ క్యాంప్‌లో ప్రవేశించి టెర్రరిస్టులు దాడి చేయడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ ఆయుష్ యాదవ్, రాజస్థాన్‌కు చెందిన సబ్ బూప్‌సింగ్ గుజ్జార్‌లతో పాటు విశాఖపట్నం నగర పరిధిలోని ఆసవానిపాలెం గ్రామానికి చెందిన బివి రమణ అసువులు బాసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కథనం.
పెద్ద కుటుంబం
పద్దెనిమిదేళ్లుగా ఆర్మీలో సేవలందిస్తూ ‘నాయక్’ హోదాకు చేరుకున్న రమణకు భార్య అనిత, పాప చిన్మయి, బాబు గణేష్ ఉన్నారు. తల్లిదండ్రులు రాములమ్మ, కుంచయ్య, ఇద్దరు తమ్ముళ్లు అప్పలరాజు, కోటేశ్వరావు, మరదళ్లు లీల, రాజేశ్వరి, వాళ్ల పిల్లలు... వీరందరికీ అతనే పెద్ద దిక్కు. తనతోపాటు పెద్దతమ్ముడు అప్పలరాజును కూడా ఆర్మీలోకి తీసుకువెళ్లాడు రమణ. తల్లిదండ్రులకు, వదినలకు చేదోడు వాదోడుగా చిన్న తమ్ముడు కోటేశ్వరరావు విశాఖలోనే ఉండి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
ఉన్నంతలో అంతా సాఫీగానే గడిచిపోతోందనుకునేలోగానే ఉగ్రరక్కసి వెంకట రమణ నిండుప్రాణాలను బలిదీసుకుంది. దాంతో ఆ కుటుంబం దిక్కుతోచనిదైపోయింది. జీవితాంతం తోడు ఉంటాడనుకున్న భర్త వెంకట రమణను విధి వేరు చేయడంతో భార్య అనిత జీవితం ఒక్కసారిగా చీకటైపోయింది.. అయినప్పటికీ, దేశం కోసం తన భర్త ప్రాణాలు అర్పించాడన్న ఆత్మ సంతృప్తి, తానూ తన పిల్లలూ కలిసి దేశానికి ఇంకా ఏదయినా చేయాలన్న తపనతో పొంగుకొస్తున్న కన్నీటి ఉప్పెనను రెప్పల మాటునే దాచుకుంటూ భర్త రమణీయ స్మృతులను సాక్షితో పంచుకున్నారు.
‘‘ముందు రోజు రాత్రే ఫోన్ చేశారు. తనకు రిలీవ్ దొరకలేదని, దొరికిన వెంటనే రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. ఆయన వస్తున్నారన్న మాట మాలో ఎంతో ఆనందాన్ని నింపింది. పిల్లలు నాన్న వస్తున్నారని తెలిసి సంబరపడిపోయారు. ఆ రాత్రంతా నిద్రకూడా పోలేదు. నాకయితే తెల్లవారగానే ఏదో అలజడి, మనసు కీడు శంకిస్తోంది. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఉదయం 10.30కి మావయ్య ఫోన్ చేశారు. రమణకు ఏవో దెబ్బలు తగిలాయంట, హాస్పిటల్‌లో ఉన్నాడంట అని. ఆ మాటలకే నాకు గుండె ఆగిపోయినంత పనైంది. ఆయనకు ఏదైనా జరగకూడనిది జరిగితే... అన్న ఆలోచనకే నాకు కాళ్లూ చేతులూ ఆడలేదు. అందరూ ఏం కాదులే’’ అని ధైర్యం చెబుతున్నా, తెలియని భయంతో గుండె బరువెక్కుతోంది. నాకు తెలిస్తే ఏమైపోతానోనని వారికి ఉదయమే తెలిసినా ఆ బాధను దిగమింగుకుని నన్ను మానసికంగా సిద్ధం చేసి అప్పుడు చెప్పారు. అంతే! ఒక్కసారిగా ప్రపంచం శూన్యంగా కనిపించింది. అయినా మనసు పొరల్లో గర్వంగా కూడా ఉంది. నా భర్త దేశం కోసం ప్రాణాలిచ్చాడు. మాతృభూమి రుణం తీర్చుకుని వీరుడిలా మరణించాడు. ఆయన పంచిన జ్ఞాపకాలతో ఆయనిచ్చిన పిల్లలను పెంచి ప్రయోజకులను చేసి ఆయనలా గొప్పవాళ్లను చేస్తాను. పాప మూడవ తరగతి, బాబు ఒకటవ తరగతి శ్రీ శారదా విద్యానిలయంలో చదువుతున్నారు. ఇకపై వాళ్లే నా లోకం.
‘‘ఏడాదిలో రెండు నెలలే
ఇంటి దగగర ఉంటాను. మిగతా అన్ని రోజులూ నువ్వే పిల్లల్ని, అమ్మానాన్నలను చూసుకోవాలి. నేనున్నా లేకున్నా నువ్వు ధైర్యంగా ఉంటాలి’’ అంటూ మా పెళ్లి చూపుల్లోనే ఆయన చెప్పిన మాటలు నేను
ఎప్పటికీ మర్చిపోను’’.
దేశానికి అంకితం చేశాను
కూలి చేసుకుని బతికేవాడినైనా నా ముగ్గురు కొడుకుల్లో ఇద్దరిని దేసేవకు పంపించాను. కుటుంబానికి ఒకరన్నా ఆసరా ఉండాలని మూడవ వాడిని మాత్రం పంపలేదు. ఇప్పుడు అన్నయ్య స్థానంలో వాడు వెళతానంటున్నాడు. పంపడానికి నేను సిద్ధం.
– కుంచయ్య, రమణ తండ్రి
నా బాబు మాయమైపోయాడు
అమ్మా, రెండ్రోజుల్లో వచ్చేస్తా నేనొచ్చాక ఆస్పత్రికి తీసుకువెళతా అన్నాడు. నా పెద్ద కొడుకు ఇలా వస్తానని అలా మాయమైపోయాడు. ఇక తిరిగి రాడనే నిజాన్ని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు. డ్యూటీకి ఒక్కరోజు కూడా ఆలస్యంగా వెళ్లేవాడు కాదు.’’
– రాములమ్మ, రమణ తల్లి
అన్నయ్యే స్ఫూర్తి
అన్నయ్య ఆర్మీలోకి వెళ్లి దేశసేవ చేస్తుంటే ఆయన స్ఫూర్తితో నేనూ వెళ్లాను. ముంబైలో సేవలందిస్తున్నాను. ఆ రోజు విషయం తెలియగానే శ్రీనగర్‌కు వెళ్లిపోయాను. అప్పటికే అన్నయ్య సజీవంగా లేడు. తమ్ముడితో మాట్లాడాలని ఆఖరి క్షణంలో అన్నాడంట.
– అప్పలరాజు, రమణ పెద్ద తమ్ముడు
నా గుండెల్లో ఉన్నాడు!
చిన్నప్పటి నుంచీ అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఆయనే నాకు దేవుడు. అన్నయ్య పేరును గుండెలపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాను. అన్న మమ్మల్ని ఏ పనీ చేయనిచ్చేవాడు కాదు. ఏదైనా తనే చూసుకునేవాడు. అలాంటి అన్నయ్య లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.
– కోటేశ్వరరావు, రమణ చిన్న తమ్ముడు
గాయపడి ఉంటారనుకున్నాం
ఆ రోజు టీవీల్లో స్క్రోలింగ్ చూశాం. కాశ్మీర్‌లో కాల్పులు, ముగ్గురు జవాన్లు మృతి, ఐదుగురికి గాయాలు అని వస్తోంది. ఆ ఐదుగురిలో మా బావ ఉంటాడనుకున్నాం. వెంటనే నా భర్తకు ఫోన్ చేసి విషయం తెలుసుకోమని చెప్పాను. తీరా ప్రాణాలే లేవని తెలిసింది!
– లీల, రమణ పెద్ద మరదలు
మా పెద్ద దిక్కు
మొదట ఆర్మీ ఆఫీసు నుంచి నా భర్తకే ఫోన్ వచ్చింది. కచ్చితంగా బతికి ఉంటారనుకున్నాం. కానీ నిజం కాలేదు. రమణ బావ ఉండే రెండు నెలల్లోనే ఎవరికి ఏ పని కావాలన్నా చేసిపెట్టేవారు. మాకు ఆయనే పెద్ద దిక్కు. ఇప్పుడాయనే లేకపోయేసరికి దిక్కుతోచడం లేదు.
– రాజేశ్వరి, రమణ చిన్న మరదలు
– బోణం గణేష్, సాక్షి, విశాఖపట్నం