రైట్‌ సిస్టర్స్‌ | special story to women Aircraft drivers | Sakshi
Sakshi News home page

రైట్‌ సిస్టర్స్‌

Published Tue, Mar 20 2018 12:47 AM | Last Updated on Tue, Mar 20 2018 12:47 AM

special story to women Aircraft drivers - Sakshi

ఆల్‌ ఉమెన్‌ క్రూ’ బోయింగ్‌ విమానంలోని మహిళా సిబ్బంది

ఏరోప్లేన్‌ని కనుగొన్నది రైట్‌ బ్రదర్స్‌.ఇప్పుడు ఎగరేస్తున్నది రైట్‌ సిస్టర్స్‌.ఆడపిల్లలకు సహజంగానే రెక్కలు ఉంటాయి. మగ ప్రపంచమే అసహజంగాపంజరాల్లో ఉంచుతోంది. ఏదో.. ఇలా ఒకసారి ఓ గొప్ప అద్భుతం  ఆవిష్కృతమైనప్పుడు..ఆడపిల్ల మళ్లీ రెక్కలు తొడుగుతోంది. ఇప్పటిదాకా ఆడపిల్లలకు రాంగే జరిగింది. ఇప్పుడు రైట్‌ జరుగుతోంది. వియ్‌ ఆర్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యు. మహిళా నువ్వు.. మహా ‘ఇల’. 

ఎయిర్‌ ఇండియా తొలిసారిగా గత ఏడాది ఢిల్లీ నుంచి కాలిఫోర్నియాకు నడిపిన ‘ఆల్‌ ఉమెన్‌ క్రూ’ బోయింగ్‌ విమానంలోని మహిళా సిబ్బంది. (మెయిన్‌ ఫొటో). అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్టారా, స్పైస్‌ జెట్‌.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ‘ఆల్‌–ఉమెన్‌ క్రూ’ విమానాలను నడిపాయి. ఒక్క ఎయిర్‌ ఇండియానే ఒకే రోజు అంతా మహిళా సిబ్బందే ఉన్న ఎనిమిది ఇంటర్నేషనల్‌ ఫ్లయిట్స్‌ని ఆపరేట్‌ చేసింది! 

ఫిబ్రవరి 26, 2017. ఢిల్లీ. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌. ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 777–200 ఎల్‌.ఆర్‌. ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన 16 మంది మహిళా సిబ్బందితో కూడిన బృందం డిస్పాచ్‌ యూనిట్‌లో కూర్చుని ఉన్నారు. కొద్ది క్షణాల్లో చరిత్ర సృష్టించబోతున్నారు. అందరిలో  ఉద్విగ్నత, ఆనందం. ఆ భావాలే వాళ్ల సంభాషణల్లో, బాడీ లాంగ్వేజ్‌లోనూ! బోర్డింగ్‌ స్టార్ట్‌ అయింది. పదహారు మందీ ఒకొక్కరే ఠీవిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఫ్లయిట్‌లోకి. ప్రయాణికులందరూ బోర్డ్‌ అయ్యారు. సీట్‌ బెల్ట్‌ గురించి, ఇతరత్రా జాగ్రత్తలూ చెప్పడం పూర్తయింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి ఆ ఫ్లయిట్‌ కెప్టెన్‌ సునీతా నరూలా టేకాఫ్‌ కోసం ఇన్‌స్ట్రక్షన్స్‌ మొదలయ్యాయి ‘‘సర్‌’’ అంటూ!

నో ‘సర్స్‌’.. ఓన్లీ లేడీస్‌ 
సునీతా నరూలా సహా కాక్‌పిట్‌లో ఉన్న కోపైలట్స్‌ నవ్వుకున్నారు ఆ పిలుపుకి. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది కూడా నవ్వారు అలవాటులో  పొరపాటుకి. ‘‘డజంట్‌ మ్యాటర్‌’’ అంటూ రన్‌వే మీద పరుగులు తీసి,  క్షణాల్లో టేకాఫ్‌ అయింది ఆ ఫ్లయిట్‌.  టేకాఫ్‌ అయ్యాక... ‘‘అటెన్షన్‌ లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’’ అంటూ ఎనౌన్స్‌ వినపడటంతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో గుబులు! ఏమన్నా అపశకునమా? వాళ్లు ఆ అనుమానంలో ఉండగానే.. ‘‘ఈ ఫ్లయిట్‌ ఆల్‌ ఫిమేల్‌ క్య్రూతో నడుస్తోంది. పదహారు మంది సిబ్బందీ మహిళలే. ఈ వార్తను సంతోషంగా మీతో పంచుకుంటున్నా...’ అనే మాట ఇంకా పూర్తి కానేలేదు.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికుల నుంచి చప్పట్లు. ‘కుడోస్‌’ అంటూ ఆ ఫ్లయిట్‌లో ఉన్న 250 మంచి థంబ్స్‌ అప్‌ చేశారు. తమ మధ్య కూర్చున్న లేడీ ప్యాసెంజర్స్‌నూ ప్రశసించారు ఆడవాళ్లూ మీకు జోహార్లూ అంటూ!

ఫాస్ట్‌గా.. నాన్‌–స్టాప్‌గా..
గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో 15 వేల 300 కిలోమీటర్లు.. 13 టైమ్‌ జోన్స్‌ను దాటుతూ పదిహేను గంటల పదినిమిషాలు గాల్లో  ఎగిరి.. గమ్యస్థానం అయిన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ల్యాండ్‌ అయింది విమానం. సీట్‌ బెల్ట్‌ తీసేసి అందరూ ఒక్కసారిగా.. ‘‘హుర్రే’’అంటూ జయజయ«ధ్వానాలు చేశారు. ఆ తర్వాత అనౌన్స్‌మెంట్‌లో వినిపించింది. ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించిన నాన్‌స్టాప్‌ ఫ్లయిట్‌ అని. ఇది రికార్డ్‌.  రైట్‌ బ్రదర్స్‌ విమానాన్ని కనిపెట్టిన తర్వాత ఫ్లయిట్‌ వింగ్స్‌ను కంట్రోల్‌ చేస్తోంది పురుషాధిపత్యమే. కమర్షియల్‌ పైలట్స్‌గా మహిళలు ఉన్నా.. ఫ్లయిట్‌ మొత్తం మహిళా బృంద నిర్వహణలో టేకాఫ్‌ తీసుకోవడం ఇదే తొలిసారి కావచ్చు. పైగా ఇంత దూరం ప్రయాణం. శాన్‌ఫ్రాన్సిస్కోలో విమానంలోంచి ప్రయాణికులు దిగుతున్నప్పుడు ఆ కెప్టెను, కో పైలట్స్‌ను చూడాలని తాపత్రయపడ్తున్నారు. తోసుకుంటున్నారు... ప్రయాణికులు. 

ప్యాసెంజర్స్‌ సెల్యూట్‌ కొట్టారు
ఒక తల్లి.. తన పదకొండేళ్ల కూతురికి క్షమతాను చూపిస్తూ.. ‘‘పెద్దయ్యాక నువ్వు ఆమెలా కావాలి’’ అంటూ స్ఫూర్తి నింపుతోంది. అది చూసిన క్యాబిన్‌ క్య్రూ రోమాంచితమైంది. ఈ తరానికి తాము రోల్‌మోడల్స్‌! ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది? గుండెనిండుగా ఆత్మసంతృప్తిని నింపుకొని.. ఆత్మవిశ్వాసం నడిపిస్తుంటే అదే ఠీవితో పదహారు మంది కదులుతుంటే.. ప్యాజెంజర్స్‌ సెల్యూట్‌ చేశారు. ఇది విజయం! స్త్రీ శక్తి గెలుపు. అదే ప్రేరణ, అదే పదహారు మంది సిబ్బందితో ఆ ఫ్లయిట్‌ ఢిల్లీకి కూడా తిరుగు ప్రయాణం చేసింది! ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యాక కూడా సేమ్‌ ఫీలింగ్‌. ఆ స్ఫూర్తి ఎంతో మంది ఆడపిల్లలకు రెక్కలు తొడిగింది. కొత్త లక్ష్యాలను ఏర్పర్చింది. 

శక్తికి సారథులు.. వారధులు
స్టీరియో టైప్‌ను బ్రేక్‌ చేసి, కొత్త శక్తికి సారథ్యం వహించినవాళ్లు.. కెప్టెన్‌ సునీతా నరూలా,  క్షమతా బాజ్‌పేయి, కెప్టెన్‌ ఇందిరా సింగ్, కెప్టెన్‌ గుంజన్‌ అగ్రవాల్‌. పైలట్‌గా వీళ్లందరిదీ 20 నుంచి 30 ఏళ్ల అనుభవం. కాక్‌పిట్‌ క్య్రూ, క్యాబిన్‌ క్య్రూ, చెక్‌ ఇన్‌ స్టాఫ్, డాక్టర్, కస్టమర్‌ కేర్‌ స్టాఫ్, ఏటీసీ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) సహా టెక్నీషియన్స్, ఇంజనీర్స్, ఫ్లయిట్‌ డిస్పాచర్, ట్రిమ్మర్‌ సహా అందరు మహిళలే ఆ రోజు సేవలందించారు. ఇది రికార్డ్‌. అంతేకాదు లైన్‌ ఆపరేషన్‌ ఆడిట్‌ సేఫ్టీని నిర్వహించింది కూడా మహిళే. హర్‌ప్రీత్‌ సింగ్‌. వరల్డ్‌ ట్రిప్‌కి ఓ మహిళా ఆఫీసర్‌ ఆడిట్‌ నిర్వహించడం అదే తొలిసారి. మహిళా దినోత్సవానికి తమ సంస్థ తరఫున కానుకగా ఎయిర్‌ ఇండియా సంస్థ ఆ నిర్ణయాన్ని తీసుకొని అమలు చేసిందట. ‘‘అలాగని ఈ రంగంలో వివక్ష లేదని చెప్పలేం. అధిగమించడం వాళ్ల వాళ్ల శక్తిసామర్థ్యాలను బట్టి ఉంటుంది. నేను  1980ల్లో ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. నా వయసప్పుడు 20లో ఉంది. అప్పుడున్న మగ పైలట్లందరూ 40 పైబడ్డవాళ్లే. నన్ను భయపెట్టేవాళ్లు. అయితే తర్వాత కొద్ది రోజులకే నా ఎబిలిటీస్‌తో వాటన్నిటినీ అధిగమించాననుకోండి’’ అంటూ నాటి రోజులను గుర్తు చేసుకుంటుంది సునీతా నరూలా.

ఎయిర్‌ ఇండియా
ఎయిర్‌ ఇండియా సంస్థ 1956లో తొలిసారిగా మహిళా పైలట్‌ను నియమించింది. ఆమె పేరు దర్బా బెనర్జీ. 1990లో 26 ఏళ్ల నివేదితా భాసిన్‌ అనే పైలట్‌ జెట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను నడిపి సివిల్‌ ఏవియేషన్‌ హిస్టరీలోనే అత్యంత పిన్నవయసు పైలట్‌గా పేరు నమోదు చేసుకుంది. 
– శరాది


ఫస్ట్‌ : దర్బా బెనర్జీ


యంగెస్ట్‌: నివేదితా భాసిన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement