ఆడపిల్ల పుట్టిన వెంటనే ఈడ పిల్ల కాదు.. అని తల్లే చెప్పింది! అంటే.. ఎప్పటికైనా ఇంకొకరి ఇంటి పిల్లే అని చెప్పడం కాబోలు! లేక.. నువ్వు నా బాధ్యత కాదు అనడం కాబోలు! ఈడ పిల్లని ఆడకి పంపితే.. అక్కడా.. కాదన్నారు! ఎంత అసమానత? ఎంత వివక్ష! ఆరింటి నుంచి వంచిన నడుం ఎత్తకుండా పనిచేస్తున్నా ఎంతకీ పని తరగదే! వాకిట్లో ముగ్గు పెట్టడం నుంచి, రాత్రి పదకొండింటికి వంటగదిని తుడిచి శుభ్రంచేసే వరకు మధ్యలో బడికెళ్లినప్పుడు తప్ప మిగిలిన సమయమంతా పనే! తన ఈడు మగపిల్లలంతా ఎందుకంత హాయిగా ఆడుకుంటుంటారు. తనెందుకు ఎప్పుడూ పని చేయవలసి వస్తోంది? అర్థం కాదు!
జీవితం ఎంత కష్టంగా ఉన్నా చదువంటే మాత్రం నాకు చాలా ఇష్టం. అందుకే అన్నయ్యతో పోటీపడి చదివేదాన్ని. కానీ నాన్న నన్ను చదవనివ్వలేదు.
– వెంకటలక్ష్మి (పేరు మార్చాం)
‘చదువుకుంటా నాన్నా’ అన్నాను
అసలు ఇంత చాకిరీ చేయాల్సి వస్తుందని నేనస్సలు అనుకోలేదు. అమ్మపెడితే తిని ఆడుతూ పాడుతూ తిరిగేదాన్ని. అమ్మ దూరమైన దుఃఖం నుంచి తేరుకోకముందే బండెడు చాకిరీ భారం నా బాల్యాన్ని మింగేసింది. ఎప్పుడూ అమ్మ ఒక మాట అంటుండేది.. ‘ఏ పనికైనా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ, వంటపనికి ఉండదెందుకనో’ అని. అమ్మా, అమ్మమ్మా, అత్తయ్యా, ఇప్పుడు నేను! రేపోమాపో నా కూతురికీ ఈ వంటగది తప్పదు. ఎవరు శాసించారో వంటగదిని ఆడాళ్లకి శాశ్వత చిరునామాగా?! అందుకే అడిగాను మొదటిసారిగా.. నాన్న తీరిగ్గా ఉన్న సమయం చూసుకుని.
‘‘నాన్నా! నాకు చదువుకోవాలనుంది’’ అని! నాన్న మౌనంగా ఉన్నాడు. వినపడలేదేమోనని రెండోసారి కొంచెం గట్టిగా చెప్పాను.
‘ఎలారా నువ్వు లేకుండా’ అన్నాడు
‘‘చిన్నపిల్లవి! అమ్మపోయాక నీతో వంట పనిచేయించుకోవడం నాక్కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేయనూ? ఆడదిక్కు లేని ఇల్లు కదమ్మా! ఇప్పుడు నువ్వే మా అమ్మవి!’’ అన్నాడు. నా ప్రశ్నకి అది సమాధానం కాదని తెలిసినా, అమ్మపోయాక మా అమ్మ పనీ, నాన్నమ్మపనీ నాకు తప్పవని అర్థం అయ్యింది. ఆ పని చేస్తూనే నా చదువు కొనసాగించాలి. అది మొదలు ఒళ్లొంచి చాకిరీ చేయడమే జీవితమైపోయింది నాకు.
మూడు గేదెల పోషణా పడింది
మాది విశాఖపట్నంలోని ఎండాడ. మాకు సొంతిల్లు, ఆస్తులున్నాయి. నన్ను ఎండాడ సర్కారు బళ్లో చేర్చారు. ఏడో తరగతి పూర్తి కాకుండానే మా అమ్మకు జబ్బు చేసి చనిపోయింది. దాంతో ఇంటి బాధ్యతలన్నీ నా భుజాల మీద పడ్డాయి. అన్నయ్య ఎంత హాయిగా కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నాడు! అన్నయ్యలా తనకి కూడా మంచి ప్రైవేటు స్కూల్లో చదువుకోవాలని కోరిక ఉండేది. కానీ ఈ వంట పని మూలంగానే తన కోరిక తీరలేదు. మా నాన్నకూ అన్నయ్యకూ వండి పెట్టడంతోనే నా బాల్యమంతా గడిచిపోయింది. దానికి తోడు మూడు గేదెల పోషణ భారం నాపైనే పడింది. పొద్దుపొద్దున్నే లేచి గేదెల చావిడి శుభ్రం చేసి పాలు పితికేదాన్ని. నెయ్యి చేసి అమ్మేదాన్ని. ఇంటి పని మొత్తం చేసి బడికి పోయేదాన్ని. సాయంత్రం బడి నుంచి రాగానే మళ్లీ పని! అంట్లు తోమడం, వంట చేయడం, ఇంట్లో వాళ్ల అవసరాలు చూసుకోవడం.
మేనమామకు ఇచ్చి చేశాడు
జీవితం ఎంత కష్టంగా ఉన్నా చదువంటే మాత్రం నాకు చాలా ఇష్టం. అందుకే అన్నయ్యతో పోటీపడి చదివేదాన్ని. కానీ నాన్న నన్ను చదవనివ్వలేదు. అన్నయ్యను మాత్రం బాగా చదివించి, విదేశాలకు పంపాడు. నన్నేమో ఇంటర్ చదువుతుండగానే చదువు మాన్పించేశాడు. మా మేనమామతో పెళ్లి జరిపించాడు. ఇప్పుడు నాకు ఇద్దరు మగపిల్లలు.
చివరికి మిగిలింది...!
నన్ను పనిమంతురాలంటారు! పుట్టింట్లో ఒంటి చేత్తో ఇల్లు చక్కబెట్టానంటారు. పుట్టింటికి చేసిన సేవలు గుర్తు చేస్తూ అత్తింటివారూ బాగా చాకిరీ చేయించుకుంటున్నారు. కానీ నా చాకిరీకి గుర్తింపు లేదు. నాకు బాధ్యతలే తప్ప హక్కులు లేవు. అప్పుడు పుట్టింట్లో ఇప్పుడు మెట్టినింట్లో... అదే చాకిరీ. బాగా చదువుకోవాలన్న నా కోరిక నెరవేరలేదు. భర్త సంపాదనతో ఇల్లుగడవడం కష్టమౌతోంది. కనీసం నాన్న పేరున ఉన్న ఆస్తిలో సగం వాటా రాసిమ్మని అడిగాను నాన్నని. అడిగినప్పుడల్లా దాటవేస్తున్న నాన్న ఓ రోజు గట్టిగా అడిగేసరికి ఇలా అన్నారు. ‘అన్న ఉన్నాడుగదా.. చూసుకుంటాడులే’ అని. నాన్నే చూసుకోంది అన్న చూసుకుంటాడా? అసలు నేను వాళ్లకోసం ఎంత చాకిరీ చేశాను! ఈ విషయాలు వాళ్లకు ఎందుకు గుర్తుకు రావు? నన్ను ఎందుకు తక్కువగా చూస్తున్నట్టు? నాకు మిగిలింది పనిమంతురాలనే పేరేనా?
గునపర్తి సైమన్, సాక్షి, విశాఖపట్నం, (కల్చరల్)
Comments
Please login to add a commentAdd a comment