రాధిక ఆప్తే.. ఆగదు!
రాధిక ఆపితే ఆగదు.
నడిచిన బాట మరోసారి తొక్కాలనుకోదు.
ఎక్కిన మెట్టు మళ్లీ ఎక్కాలనుకోదు.
కనిన కలను మళ్లీ చూడాలనుకోదు.
రాతి మీద గీతలు శాసనం అనుకోదు.
ఈ అహల్య బెల్లం కొట్టిన రాయిలా... మిగలాలనుకోలేదు.
నథింగ్ సర్‌ప్రైజెస్ హర్. నథింగ్ స్టాప్స్ హర్.
రజనీకాంత్‌తో నెక్స్ట్‌సినిమా.
అయినా బుల్లితెరపై ప్రయోగాలు ఆగలేదు.
క్రాస్ ఓవర్ సినిమాకు సంకెళ్లు వేయలేదు.
ఔను..! రాధిక ఆప్తే ఆగదు. చిన్నప్పుడు రాబర్ట్ ఫ్రాస్ట్
‘ద రోడ్ లెస్ ట్రావెల్డ్’ ఒంటబట్టిందేమో.
రాధిక ఈజ్ ర్యాడికల్.
పంజరమనుకున్న సినిమాను
ఆకాశమంత రంగస్థలంగా... మలచుకున్న రెక్కల కళ.
ట్రింగ్... ట్రింగ్... కాలింగ్ బెల్ అసహనంగా మోగింది. తలుపు తీసిన అందమైన అమ్మాయిని చూసి, ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేన్ (తోతా రాయ్ చౌధురి) ఆశ్చర్యపోయాడు. పొట్టి దుస్తుల్లో ఆ అమ్మాయి అందం... అతనికి పిచ్చెక్కిస్తోంది. ఏడుపదులు పైబడిన చిత్రకారుడు గౌతమ్ సాధు (సౌమిత్ర ఛటర్జీ)కి ఆమె కూతురనుకున్నాడు. తీరా... ఆమె తన భార్యన్నాడు గౌతమ్. మిస్సింగ్ కేస్ మిస్టరీని ఛేదించడానికొచ్చిన ఇన్‌స్పెక్టర్‌ను కెపైక్కించే చూపుల్తో మాటల్తో పడగొట్టిందా అమ్మాయి అహల్య. ఆ తర్వాత? షార్ట్‌ఫిల్మ్ ‘అహల్య’ చూసి తెలుసుకోవాల్సిన సస్పెన్స్.
పదిహేను రోజుల్లో ‘యూ’ట్యూబ్‌లో ఇప్పటిదాకా 44 లక్షలమంది పైనే చూసిన థ్రిల్లర్ ‘అహల్య’. రామాయణంలోని అహల్య పాత్రను కొత్త కోణంలో చూపెడుతూ అనురాగ్ కశ్యప్ తీసిన 14 నిమిషాల బెంగాలీ షార్ట్‌ఫిల్మ్. ఇప్పుడీ ఫిల్మే కాదు, అహల్య... రాధికా ఆప్తే కూడా ఫేమస్.
తార కాదు... నటి!
రాధికా ఆప్తే... బడా స్టార్ కాదు. బడా బడా ఖాన్‌దాన్‌ల నుంచి వారసత్వమూ లేదు. రికార్డు వసూల్ చిత్రాలతో బాక్సాఫీస్‌కు జాన్‌జిగిరీ అంత కన్నా కాదు. చేసిన సినిమాలూ కొన్నే. అయినా సరే ఇటు జనం, అటు సినీ జనం ఆమె గురించి చెప్పుకుంటున్నారు. ‘అహల్య’ పుణ్యం కొంత... నెట్‌లోకొచ్చిన న్యూడ్ ఫొటోలు, దృశ్యాల ప్రభావం ఇంకొంత... తాజాగా రజనీకాంత్ సరసన ఛాన్స్ మరికొంత... రాధిక ఇప్పుడు వీస్తున్న గాలి.
ఎవరూ నడవని దారుల్లో నడవడం ఆమె స్పెషాలిటీ. ‘అహల్య’తో ఇంత పేరొచ్చిన ఆమె, ‘‘నైతికంగా స్పష్టత లేని పాత్రలు పోషించడం నాకు ఈజీ’’ అంటారు. ఉంటే పూర్తిగా మంచిగానో, కాకుంటే పూర్తిగా విలనీతోనో ఒకే కోణంలో సాగిపోయే, కీలుబొమ్మ పాత్రలు చేయడం ఆమెకసలు ఇష్టం లేని పని. లార్జర్ దేన్ లైఫ్ పాత్రలంటే పారిపోతారు. అదే - రియలిస్టిక్ పాత్రలు... లేయర్లు, లేయర్లుగా సాగే క్యారెక్టరైజేషన్... ఛాలెంజింగ్ సీన్లు అంటే నల్లేరు మీద బండి నడకలా నటించేస్తారు!
ఆరు భాషల అభినేత్రి
బాలీవుడ్ ఆడియన్స్‌కు ఇప్పుడిప్పుడే సుపరిచితమవుతున్న రాధిక ఫిల్మ్‌మేకర్స్‌కు మాత్రం చాలాకాలంగా తెలుసు. సన్నివేశాన్ని పండించే టాలెంట్ ఆమె సొంతమనీ తెలుసు. నిజానికి, సినిమాల్లోకి రాధిక వచ్చి పదేళ్ళయింది. రంగస్థలంపై ప్రయోగాత్మక నాటకాలు వేస్తూ, సినిమాల్లోకి వచ్చిన అనుభవం ఆమెది. పుణేలోని అగ్రశ్రేణి న్యూరోసర్జన్ కుమార్తె. చదివింది పేరున్న ఫెర్గూసన్ కాలేజ్‌లో ఎకనామిక్స్. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ పట్ల ప్రేమతో ‘ఆసక్త’ అనే థియేటర్ గ్రూప్‌తో కలిశారు. అక్కడ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ. ‘వాహ్ లైఫ్ హోతో ఐసీ’ (2005) ఆమె తొలి చిత్రం.
అయితే, రాధిక హిందీకే పరిమితం కాలేదు. హిందీతో పాటు బెంగాలీ (‘అంతహీన్’), మరాఠీ (అమోల్ పాలేకర్ ‘సమాంతర్’), తమిళం (ప్రకాశ్‌రాజ్ ‘ధోనీ’), తెలుగు (‘రక్తచరిత్ర’, బాలకృష్ణ ‘లెజెండ్’, ‘లయన్’), మలయాళం (‘హరమ్’) - ఇలా ఆరు భాషల్లో నటిస్తున్నారు. ఇవి కాక విభిన్న తరహా సినిమాలు. చాలామంది తటపటాయించే ‘బోల్డ్’ సన్నివేశాలంటే ఇవాళ ఠక్కున గుర్తొచ్చే పేరు రాధికా ఆప్తే.
కలిసొచ్చిన ఏడాది
రాధికకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. హిందీ ‘బద్లాపూర్’లో చేసింది చిన్న పాత్రే. కానీ, బోలెడన్ని ప్రశంసలు వచ్చాయి. ఆ వెంటనే ‘పెద్దలకు మాత్రమే’ తరహా కామెడీ అనిపించే ‘హంటర్’్రలో పక్కింటి అమ్మాయిలా అనిపించే పాత్ర. అదీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడు దేశమంతటినీ తన అందంతో వలలో వేసుకున్న ‘అహల్య’ షార్ట్‌ఫిల్మ్. ఈ నెలలోనే రానున్న కేతన్ మెహతా సినిమా ‘మాంఝీ - ది మౌంటెన్ మ్యాన్’. ఆ వెంటనే రజనీకాంత్ సినిమా షూటింగ్. వెరసి, రాధికకిది డ్రీమ్న్.్ర
ఏ తెర అయినా... ఏ ఛాలెంజ్ అయినా...
సినిమాల్లో ఇలాంటి క్రేజీ చాన్స్‌లున్నప్పుడు టీవీలో ఎవరైనా చేస్తారా? ఎవరి సంగతి ఏమో కానీ, రాధిక చేశారు. రవీంద్రనాథ్ టాగోర్ కథల ఆధారంగా అనురాగ్ బసు రూపొందిస్తున్న ‘స్టోరీస్ బై రవీంద్రనాథ్ టాగోర్’ టెలీసిరీస్‌లో ఆమె భాగమయ్యారు. బెంగాలీ సాహిత్యంలో ప్రసిద్ధమైన ‘చోఖెర్ బాలీ’లో వితంతువు వినోదిని పాత్ర ధరించారు.
రాధిక పవర్‌ఫుల్ పెర్ఫార్మరని అనురాగ్ బసుకు తెలుసు. అందుకే, ప్రిపరేషనేమీ లేకుండా, రాధిక అప్పటికప్పుడు స్క్రిప్ట్ చూసుకొని నటిస్తుంటే, కెమెరాలో బంధించాలని అనురాగ్ అనుకున్నారు. అంతే! షూటింగ్‌కు ముందు రాధిక మొత్తం కథ కూడా చదువుకోలేదు. షూటింగ్ రోజున ఆమెకు సీన్ పేపర్లిచ్చారు. అప్పటికప్పుడు ఆమె నటించేశారు. అనురాగ్‌కు కావాల్సిన ఎఫెక్ట్ వచ్చింది. చూసినవాళ్ళకి రాధిక నటన నచ్చింది.
డిఫరెంట్ సినిమాలకు డార్లింగ్
వెండితెర మీదా ప్రయోగాలకు రాధిక సదా సిద్ధం. గుజరాత్‌లోని నలుగురు సామాన్య మహిళల చుట్టూ నడిచే ఇంగ్లీష్ సినిమా ‘పార్చ్డ్’లో ఆమెదీ ఓ ముఖ్యపాత్ర. ఈ ‘భారత- అమెరికా’ ప్రొడక్షన్ రానున్న టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ జరుపుకోనుంది. అలాగే, రానున్న హిందీ సినిమా ‘కౌన్ కిత్నే పానీ మే’ కూడా డిఫరెంట్ ఫిల్మే! రాజస్థాన్‌లోని గ్రామ ప్రజలు నీటికొరతతో ఎదుర్కొనే కష్టాల చుట్టూ ఆ సినిమా తిరుగుతుంది. ఇక, ఇండో -బ్రిటీష్ కోప్రొడక్షన్ ‘బొంబయిరియా’లో రాధికది సినిమా పబ్లిసిటీ ఆఫీసర్ పాత్ర. ‘‘పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న మసాలా సినిమాల కన్నా ప్రత్యామ్నాయ సినిమాల్లో ఎక్కువగా నటించాల’’ని ఆమె భావన. మరి మాస్ సినిమాలెందుకు చేస్తున్నారంటే, ‘‘వాటి వల్ల నటిగా కమర్షియల్ వ్యాల్యూ వస్తుంది. దాంతో, మనం ప్రత్యామ్నాయ సినిమాల్లో నటించిప్పుడు అవి ఎక్కువ మందికి చేరతాయి’’ అని లాజిక్ చెబుతారు.
ఎక్కడైనా, ఎప్పుడైనా... బ్రేక్ ది రూల్స్!
అందుకే, రాధికా ఆప్తే డిఫరెంట్. ప్రేమ, పెళ్ళి సంగతులు దాచేసే సగటు సినిమా హీరోయిన్స్ కన్నా చాలా డిఫరెంట్. ఇరవై ఏడేళ్ళు నిండీ నిండకుండానే, బెనెడిక్ట్ టేలర్ అనే బ్రిటిష్ సంగీత కళాకారుణ్ణి ఆమె పెళ్ళి చేసుకున్నారు. చాలాకాలం సహజీవనం చేసి, ఆనక పెళ్ళిగా పరిణమించిన వాళ్ళ ప్రేమకథ ఒక పన్నెండు రీళ్ళ, అదేనండీ పన్నెండునెలల సిన్మా.
సమకాలీన నృత్యం నేర్చుకోవడం కోసం నటనకు కామా పెట్టి, లండన్‌లో గడిపిన ఏడాది కాలంలోనే రాధికకూ, టేలర్‌కూ పరిచయం. ఆ పరిచయం స్నేహంగా... స్నేహం ప్రేమగా... ప్రేమ పెళ్ళిగా చకచకా మారింది. టేలర్ తన మ్యూజికల్ ఎసైన్‌మెంట్స్ పని మీద దేశదేశాలు తిరుగుతుంటారు. రంగస్థలంతో పాటు ఆరు భాషల సినిమాల్లో నటిస్తూ రాధిక దేశమంతటా తిరుగుతుంటారు. ఎవరికి కాస్తంత ఖాళీ దొరికినా, రెండోవాళ్ళ దగ్గరకు వెళతారు. కలసి జీవితం కలబోసుకుంటారు.
పెళ్ళి తరువాత రాధిక మునుపటి కన్నా బిజీ బిజీ. కెరీర్‌పై మరింత ఉత్సాహంగా దృష్టి పెడుతున్నారు. ఫోకస్ పెరిగింది. దూకుడు పెంచారు. సినిమాలూ పెరిగాయి. హీరోయిన్లు అంటే... పెళ్ళి కాని నటీమణులే అయ్యుండాలన్న ఫిల్మ్ ఇండస్ట్రీలోని ‘అన్‌రిటెన్ రూల్’ను బ్రేక్ చేశారు. ఇప్పుడు సాక్షాత్తూ రజనీకాంత్‌తో జోడీ కడుతున్నారు. ఆమె ఒక పక్క సినిమాలు చేస్తారు... మరోపక్క నాటకాలు వేస్తారు... ఇంకోపక్క మనసుకు నచ్చితే షార్ట్ ఫిల్మ్స్‌లోనూ చేస్తారు. వెరసి ఆమె తన మనసుకు నచ్చింది చేస్తారు. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. జీవితంలోనూ, కెరీర్‌లోనూ ర్యాడికల్ రాధిక అనిపించుకున్నారు.
అందుకే, మరో నెలరోజుల్లో 30 ఏళ్ళు నిండనున్న రాధికా ఆప్తే ఇండియన్ స్క్రీన్‌పై మరో బ్యూటీ విత్ బ్రెయిన్స్. దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నట్లు, ‘‘మనకున్న నటీమణుల్లో ఆమె అత్యంత ధైర్యవంతురాలు. ఫార్వర్డ్ థింకింగ్!’’ దటీజ్ వై పీపుల్ లుక్ ఫార్వర్డ్ టు రాధికా ఆప్టే అండ్ హర్ యాక్టింగ్!! బ్రేవో రాధిక... బ్రేవో!!
- రెంటాల జయదేవ
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్
కొద్ది నెలలుగా రాధికా ఆప్తే మీద వచ్చినన్ని వార్తలు, వివాదాలు మరొకరి మీద రాలేదేమో! మొన్న ఫిబ్రవరిలో రాధికా ఆప్టే బొమ్మలంటూ ఆన్‌లైన్‌లో కొన్ని నగ్నచిత్రాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేశాయి. అది సద్దుమణగక ముందే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో భాగంగా అనురాగ్ కశ్యప్ తీసిన ఫిల్మ్ నుంచి ఆమె నగ్నదృశ్యాలు లీకయ్యాయి. వాట్సప్‌లో, నెట్‌లో అవి వైరల్. ఆ సంగతి మర్చిపోక ముందే ‘కహానీ’ (శేఖర్ కమ్ముల ‘అనామిక’కు మాతృక) చిత్రఫేమ్ సుజయ్ ఘోష్ షార్ట్‌ఫిల్మ్ ‘అహల్య’ నెటిజన్లకు మరో హాట్ హాట్ విజువల్ ఫీస్ట్! సాక్షాత్తూ అమితాబ్ కూడా బాగుందన్నారు.
బాగుందన్నా, బాగా లేదన్నా రాధిక దారి రాధికదే! దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. దేని గురించైనా ధైర్యంగా మాట్లాడతారు. ‘ఎవరి ఫొటోలో పట్టుకొచ్చి, అవి నా ఫోటోలంటే ఎలా?’ అని నెట్‌లో న్యూడ్‌ఫొటోల గురించి అంటారు. లీకైన అర్ధనగ్న సన్నివేశాల మాటేమిటంటే, ఫిల్మ్ రిలీజయ్యాక చూస్తే ఆ సీన్‌స సందర్భం అర్థమవుతుందంటారు. రిలీజ్ కాగానే, తానే మాట్లాడతానంటారు. మాట్లాడాల్సిందీ చాలా ఉందంటారు. సినీ పరిశ్రమలో ఆడవాళ్ళను సరిగ్గా ట్రీట్ చేయరనీ, తెలుగు నిర్మాతలు ప్రొఫెషనల్ కారనీ రాధిక ఈ మధ్యే చేసిన వ్యాఖ్య అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్.