ఆత్మన్యూనత... ఆత్మవిశ్వాసం
ఎన్నో మంచిగుణాలున్న వారు కూడా, తమలో ఒక చిన్న గుణాన్ని భూతద్దంలో చూస్తూ, తాము దేనికీ పనికిరామని భావిస్తూ, ఆత్మన్యూనతలో విలువైన కాలాన్నీ, జీవితాన్నీ వృథా చేసుకుంటుండటం చూస్తుంటాం. చక్కని మాటకారి కాదని, చూడచక్కని రూపం లేదని, పెద్ద చదువులు లేవని, సిరిసంపదలు లేవని, లలితకళలు లేవని, ఇవన్నీ కాకపోతే అదృష్టహీనులనీ పక్కవారితో పోల్చుకుంటూ అనుక్షణం బాధపడేవారు కోకొల్లలు. అటువంటి ఆత్మవిశ్వాసం లేనివారికి ధైర్యం కలిగించేలా చాణక్యుడు చక్కని ఉదాహరణను చెప్పాడు. మొగలి పొదలు బురదలో పెరుగుతాయి.
విషసర్పాలు చుట్టుకుని ఉంటాయి. ఆకులనిండా ముళ్ళు ఉంటాయి. మొగలి పూరేకులు, ఆకులు వంకరగా, అడ్డదిడ్డంగా, క్రమపద్ధతి లేకుండా పెరుగుతాయి. ఇన్ని అవలక్షణాలున్నా మొగలిపూవుకున్న ఒకే ఒక సుగుణం మైమరపించే సువాసన మాత్రమే. ఆ ఒక్క పరిమళంతో అందరినీ ఇట్టే తనవైపునకు ఆకర్షిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనే ఒక్క సుగుణం ఉంటే చాలు... వారికి ఏ విధమైన ప్రత్యేకతలు లేకపోయినా ఎటువంటి వారైనా వారికి దాసోహ మనవలసిందే.