శ్రీరామ నవమి నాడు పానకం ప్రసాదంగా స్వీకరించడం మన సంప్రదాయం. కేవలం ఒక ప్రసాదంగా మాత్రమే కాదు... అందులోనూ ఎన్నో పోషకాలూ, ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.
బెల్లం
♦ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఆహారం బాగా జీర్ణమయ్యేలా తోడ్పడుతుంది బెల్లం. జీర్ణ వ్యవస్థ మీద, పేగుల మీద భారాన్ని తొలగిస్తుంది
♦ బెల్లం శ్వాసకోశ వ్యవస్థనూ, జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది
♦ బెల్లంలో పీచు ఎక్కువ. అందుకే ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాదు... ఈ పీచుపదార్థాలే బెల్లాన్ని మంచి క్లెన్సర్‌గా పనిచేసేలా చేస్తాయని ప్రతీతి. క్లెన్సర్‌గా ఇది కాలేయాన్ని సైతం శుభ్రపరుస్తుంది
♦ బెల్లంలో ఖనిజాలు, లవణాలు చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా ఐరన్ ఎక్కువ
♦ బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వల్ల అవి ఒంట్లోని ఫ్రీరాడికల్స్‌ను హరిస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది
♦ కీళ్ల నొప్పులు ఉన్నవారి బాధలకు బెల్లం కాస్త ఉపశమనం కలిగిస్తుంది.
మిరియాల్లో...
♦ మిరియాలలోని పైపరిన్ అనే పోషకం మెదడులోని కణాలను ఉత్తేజపరుస్తుంది. అందువల్ల మెదడు చురుగ్గా ఉండటంతో పాటు మతిమరుపు, అలై్జమర్స్ లాంటి అనేక సమస్యలు నివారితమౌతాయి
♦ మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను మిరియాలు సమర్థంగా అరికట్టి ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు సమర్థంగా తోడ్పడతాయి, మలబద్దకాన్ని, డయేరియాను సైతం నివారిస్తాయి ∙జలుబు, దగ్గులకు తొలి చిట్కా మిరియాలే ∙ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు ఆ సమస్యను తక్షణం ఉపశమింపజేస్తాయి. సైనసైటిస్ సమస్యకు మిరియాలు మంచి ఉపశమనం.
యాలకులు... శ్రీరామ నవమి వేసవిలో వచ్చే పండుగ. ఈకాలంలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరని గుణాన్ని నివారించడానికి తోడ్పడేవి యాలకులు. శ్రీరామ నవమి పానకానికి మంచి రుచి, సువాసనను ఇస్తాయవి. వాటితోనూ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సుగంధద్రవ్యం వల్ల కలిగే ప్రయోజనాలలో కొన్ని...
♦ ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్లతోపాటు గుండెజబ్బులనూ నివారిస్తాయి
♦ దేహంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ లేదా ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా యాలకులు నివారిస్తాయి
♦ యాలకుల్లో మూడ్‌ను బాగుండేలా చేసే లక్షణంతో పాటు డిప్రెషన్‌ను దూరం చేసే గుణం ఉంది
♦ నోటి పరిశుభ్రతనూ, ఆరోగ్యాన్ని (ఓరల్ హైజీన్)ను కాపాడతాయి.
ఇక నవమి ప్రసాదంలోని వడపప్పులో...
పెసర్లలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలివి...
♦ పెసర్లలో పీచు పాళ్లు ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇవి ఎంతగానో మేలుచేస్తాయి. మలబద్దకాన్ని నివారించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి
♦ ఒంట్లోని కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి
♦ పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి
♦ పెసర్లలో ఐరన్ పుష్కలం. రక్తహీనతను తగ్గించడానికి అవి తోడ్పడతాయి.
కొబ్బరిలో...
వడపప్పులో చిన్నచిన్న కొబ్బరి ముక్కలు, కొబ్బరి కోరు వేస్తారు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని...
♦ కొబ్బరిలో 61 శాతం డయటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి అది ఒంట్లోకి విడుదల అయ్యే చక్కెరను చాలా నెమ్మదిగా అయ్యేలా చూస్తుంది
♦ కొబ్బరిలోని సైటోకైనిన్స్, కైనెటిన్, ట్రాన్స్ జీటిన్ అనే అంశాలు వయసును తగ్గిస్తాయి. కొబ్బరి తినేవారు దీర్ఘకాలం యౌవనంతో ఉంటారు
♦ కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి తినేవారిలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాదు... ఆహారంలో కొబ్బరిని ఎక్కువగా వాడేవారికి గొంతు ఇన్ఫెక్షన్లు, బ్రాంకైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన రావు కొబ్బరిలో కొవ్వుల పాళ్లు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. కొబ్బరి తిన్నప్పుడు ఆ కొవ్వుల కారణంగా ఆకలి అంతగా అనిపించదు. అందుకే కొబ్బరి తినేవారిలో ఆకలి కాస్త తగ్గడం వల్ల తినే కోరిక కూడా తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఆరోగ్యవంతమైన బరువు తగ్గే సాధనంగా కొబ్బరిని ఎంచుకొని, దాని వాడకం పెంచుకోవడం మంచిదనేది ఒబేసిటీని తగ్గించే నిపుణులు చెబుతున్న మాట.
మన సంప్రదాయంలో స్వాభావికంగానే ఆరోగ్యాన్ని కాపాడే మంచి లక్షణాలు ఉన్నాయి. శ్రీరామనవమి నాటి వడపప్పులో, పానకంలో కూడా. అందుకే నవమి నాటి ప్రసాదాలను స్వీకరిస్తే... దైవకృపకు కృప... ఆరోగ్యానికి ఆరోగ్యం.
Comments
Please login to add a commentAdd a comment