జ్ఞాపకాల దొంతర | Stack of Spiritual Memoir | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాల దొంతర

Nov 4 2017 12:04 AM | Updated on Nov 9 2018 6:23 PM

Stack of Spiritual Memoir - Sakshi

ఒకప్పుడు నీళ్లు తోడే చేద బకెట్లు, కడవలు బావిలో పడిపోతే పెద్దవాళ్లు గాలం వేసి గాలించి దానిని వెలికి తీసేవారు. కాలక్రమేణా వస్తున్న మార్పులతో ఇప్పుడు బావులు పూడిపోతే వాటితోపాటు గాలాలు ఆ పూడికలో కూరుకుపోయాయి. నీళ్లు కాచుకునేందుకు రాగికాగులను ఉపయోగించేవారు. పదిమంది అతిథులు వస్తే వండి వార్చడానికి వీలుగా గాడిపొయ్యిలు, వాటిమీద పెట్టి వండేందుకు పెద్ద పెద్ద ఇత్తడి గుండిగలు, గంగాళాలు ఉండేవి. వాటర్‌ హీటర్‌లు, గీజర్‌లు రావడంతో రాగికాగులు కాస్తా చిలుం పట్టిపోయాయి. కిరోసిన్‌ స్టవ్వులు, గ్యాస్‌ స్టవ్‌లు, కుకర్‌లు, కరెంట్‌ కుకర్‌లు వచ్చి పొయ్యిల్ని పూడ్చేసి, గుండిగలను, గంగాళాలను ముందు అటకమీదికి, ఆ తర్వాత పాత ఇత్తడి సామాన్ల కొట్టుకు తరలించేశాయి. పెద్దవాళ్లు సేదతీరడానికి ఉపయోగించిన పడక్కుర్చీలను ఈజీచైర్లు, రివాల్వింగ్‌ చైర్లు పొయ్యిలోకి నెట్టేశాయి. నాయనమ్మ, తాతయ్యలు నడుంవాల్చిన నులకమంచాలు, గర్భిణులు, బాలింతలకు విశ్రాంతినిచ్చిన పట్టెమంచాలు, నవదంపతుల సల్లాపాల జోరుకు ఊతమిచ్చిన నగిషీలు చెక్కిన పాతకాలపు పందిరి మంచాలు పాత ఫర్నీచర్‌ షాపులకు ఎప్పుడో తరలి వెళ్లిపోయాయి.

వాటిస్థానంలో కూర్చుంటే కూరుకుపోయేంత మెత్తగా ఉండే డన్‌లప్‌ పరుపులు, నడుం నొప్పి వాళ్లకు ఒకింత గట్టిగా ఉండే కాయిర్‌ పరుపులు, అత్యాధునిక హంగులుండే డబుల్‌ కాట్‌ మంచాలే ఇప్పుడు పల్లెటూళ్లలోనూ దర్శనమిస్తున్నాయి. ఇళ్లముందు నలుగురైదుగురు అమ్మలక్కలు కూర్చుని కబుర్లు చెప్పుకునే అరుగులు, గ్రామకచేరీలు, గ్రామచావడిలు, గ్రామఫోన్‌లు ఎప్పుడో కనుమరుగై పోగా, లౌడ్‌ స్పీకర్లు, మైక్‌సెట్లు, పెద్దలు తీర్పులు చెప్పే రచ్చబండలు, జెండాచెట్లు మాత్రం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. పప్పు  రుబ్బురోళ్లు, కారం దంచుకునే రోళ్ల సంగతి సరేసరి! పైన చెప్పుకున్న వస్తువులన్నీ ఒకనాటి జ్ఞాపకాలు. మీ ఇంటిలో పెద్దవాళ్లుంటే వీలైతే వాళ్లున్నంత కాలం ఆ వస్తువులని కూడా ఉండనివ్వండి. కనీసం వాళ్లు ఆ వస్తువులతోనైనా తమ భావాలను పంచుకుంటారు. గోడు వెళ్లబోసుకుంటారు. ఊసులాడుకుంటారు. పాతరేసిన జ్ఞాపకాల తేగలను తవ్వుకుని, కమ్మటి అనుభూతులను పొందుతారు. నోట్లు, బంగారం, వెండి పాత బడినా వాటి విలువ తగ్గదు కదా. అలాగే పెద్దవాళ్లు, వాళ్లు వాడిన వస్తువులనూ గుర్తుంచుకుంటే చాలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement