స్టైల్ సందడి
గలగల గోదావరికి చీరకడితే... కుదురు గోదావరి అవుతుంది! నింగి విహంగానికి చీరకడితే... హరివిల్లై ఒద్దికగా వాలుతుంది! చీరంటేనే.. పద్ధతీ, పెద్దరికం. మరి ఈ ‘స్టైల్’ ఏమిటి? ‘సందడి’ ఏమిటి?! గౌరాంగ్ షా క్రియేట్ చేశారు. కుదురైన స్టైల్... పెళ్లి సందడికి ఒదిగేలా!
పసుపు రంగు అంచు, బూడిదరంగు టై అండ్ డై ఇకత్ కంజీవరం చీరలో సినీ నటి కాజల్ అగర్వాల్. ఈ చీరను సంప్రదాయ కొరవాయి, కంచిపురం, ఇకత్ చేనేత కళలను ఇనుమడింపజేసి డిజైన్ చేశారు.మరుగునపడిపోయిన కళను వెలికితీసే బాధ్యతను తలకెత్తుకున్నట్టు కనిపిస్తాయి గౌరాంగ్ షా డిజైన్లను పరిశీలిస్తే. ఎక్కడ ఉన్నా కళ్లను కట్టిపడేసే రంగులు, సంప్రదాయ చేనేత హంగులు, వాటిలోనే అల్లుకుపోయే డిజైన్లు చూపుతిప్పుకోనివ్వవు. భారతీయ సంప్రదాయ కళకు ప్రాణం పోసే గౌరంగ్ షా కంజీవరం, ఇకత్ వంటి చేనేతలకు జమదాని కళతో కనువిందు చేసేలా తీర్చిదిద్దడంలో సిద్ధహస్తులు. గౌరంగ్ షా డిజైన్ శారీస్‌ను చూస్తే ఒక అద్భుతమైన పెయింటింగ్ కాన్సెప్ట్ మన కళ్లకు కడుతుంది. భారతీయ హస్తకళలలో ప్రముఖంగా నిలిచే బెంగాలీయుల కాంతా వర్క్, హైదరాబాదీల జర్దోసీ పనితనం, హుబ్లీ వారి కసుటి, రాజస్థాన్ మరోది, లక్నో చికంకారి, కశ్మీర్ కశిదకారి, కచ్ బంధని-పార్శి, ముంబయ్ గర వర్క్స్ ప్రధానంగా కనిపిస్తాయి. తెలుగు నేల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఎదిగిన ఫ్యాషన్ డిజైనర్ గౌరాంగ్ షా!
సమకాలీన రంగులతో డిజైన్ చేసిన డబుల్ ఇక్కత్ చీరలు ఇవి. వీటికి జమదాని బ్లౌజ్‌లను జత చేశారు.ఇండిగో ఖాదీ చేనేత శారీ ఇది. పూర్తి జమదాని కళానైపుణ్యాన్ని మేళవించి ఈ చీరను రూపొందించారు. నెమలిపింఛం రంగు, జరీ పనితనంతో నేసిన ఈ సంప్రదాయ కంజీవరం చీరలో సినీ నటి తాప్సీ. లైన్ ఆఫ్ కింగ్ కాన్సెప్ట్‌తో తీసుకువచ్చిన ఈ చీరలో ఎవరైనా మహారాణి కళతో వెలిగిపోవాల్సిందే!గౌరాంగ్ షా డిజైన్ చేసిన కాంతులీనే పైథాని పట్టు చీరను ధరించిన బాలీవుడ్ నటి విద్యాబాలన్.