గాంధర్వ గాయని | Subbulakshmi birth centenary festival from Monday | Sakshi
Sakshi News home page

గాంధర్వ గాయని

Published Mon, Sep 19 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

గాంధర్వ గాయని

కంచిపట్టు చీరతో, చక్కని ముఖ వర్చస్సుతో వేదిక మీద కనిపించే సుబ్బులక్ష్మి పాట ఎంతో పవిత్ర భావనను వెదజల్లేది. అందుకే ‘ఆమె కర్ణాటక సంగీత రాజ్యానికి రాణి’ అన్నారు జవహర్‌లాల్. ‘భారత కోకిల’ అన్నారు కవికోకిల సరోజినీదేవి. ఆమె ‘సుస్వరలక్ష్మి’ అని కీర్తించాడు బడే గులాం అలీఖాన్. ఒక సందర్భంలో ఏపీజే అబ్దుల్‌కలాం తన జీవితంలో ముగ్గురు తల్లులు ఉన్నారని చెప్పారు. ఆ ముగ్గురు - ఒకరు కన్నతల్లి, మరొకరు మదర్ థెరిసా, మూడో తల్లి - ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఎంఎస్ సుబ్బులక్ష్మి ‘తపస్విని’ అన్నారు లతా మంగేష్కర్. ఇటీవలే సెప్టెంబర్ 16న విశ్వవ్యాప్త సంగీత ప్రపంచం సుబ్బులక్ష్మి శత జయంతిని జరుపుకుంది. ఆ సందర్భంగా ఎంఎస్ బయోగ్రఫీ.
 
రాగం మీద మరింత దృష్టిని ప్రతిష్టించడానికి ప్రతి కీర్తనకు ముందు ఆమె క న్నుల మీద సుతారంగా వాలేవి రెప్పలు. ఇప్పుడు సంగీత ప్రియుడైన ఏ భారతీయుడు కర్ణాటక సంగీతాన్ని తలుచుకుంటూ ఎప్పుడు అలా కళ్లు మూసుకున్నా వాళ్ల దృష్టిపథంలోకి ఆమె ప్రత్యక్షమవుతారు. ఆమె.. మదురై షణ్ముఖవాదివు సుబ్బులక్ష్మి. ఇరవయ్యో శతాబ్దపు కర్ణాటక సంగీత సంప్రదాయానికి ప్రత్యేక కీర్తిని సాధించిపెట్టిన అపురూప భారతీయ వనిత. ఏడు దశాబ్దాల పాటు అలుపనేది లేకుండా గానించిన గళం ఆమెదే. ఎలాంటి ఇతర పోకడలకు చోటులేని వంద శాతం కర్ణాటక సంప్రదాయాన్ని ఎంఎస్ గొంతు సొంతం చేసుకుంది. 1927లో పదకొండేళ్ల ప్రాయంలో తిరుచిరాపల్లిలో ఒక కచేరీతో ఆరంభమైన ఆ గాన వాహిని చివరి వరకు గానప్రియులను అలరిస్తూనే ఉంది.
                                                           
ఒక జన్మలో వీలయ్యేదా?!
సుబ్బులక్ష్మిని 20వ శతాబ్దపు కర్ణాటక సంగీతానికి ప్రతీక అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆమె ఇచ్చిన కచేరీలు వేల సంఖ్యలో ఉంటాయి. వాటిలో చాలావరకు కొన్ని సంస్థలకు నిధులు సమకూర్చిపెట్టడానికి ఆమె ఉచితంగా పాడారు. తొలిరోజులలోనే రికార్డిస్టుగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఎన్నో రికార్డులు ఇచ్చారు. ప్రపంచం ఆమె పాటను మైమరచి ఆలకించింది. ఇంత కృషి మరో కళాస్రష్ట జీవితంలో సాధ్యమయ్యేది కాదేమో! ఒక జన్మలో చేయడానికి వీలయ్యేది కూడా కాదేమో! రికార్డింగ్ సంస్థల కోసం ఆమె పాడిన మొదటి పాట ‘మరకతం వడివుయం’. ఈ పాటకి పక్క వాయిద్యాలను అందించిన వారిలో షణ్ముఖివాదివు కూడా ఉన్నారు.

ఆమె గొప్ప వైణికురాలు. సుబ్బులక్ష్మి కన్నతల్లి. అమ్మమ్మ వాయులీనంలో ప్రావీణ్యం కలిగి ఉండేవారు. రికార్డిస్టుగా ‘స్టార్’ హోదా రావడంతో స్వస్థలం మదురై నుంచి ఆ కుటుంబం మద్రాసుకు తరలి వచ్చింది. కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి సాంస్కృతిక రాజధాని వంటి చెన్నపట్టణానికి ఆమె గాన మాధుర్యం పరిచయం కావడం ఎంతో యాదృచ్ఛికంగా జరిగిపోయింది. సరస్వతి కటాక్షించినట్టే జరిగింది. ప్రఖ్యాత మద్రాసు మ్యూజిక్ అకాడమిలో ఏర్పాటయిన కచేరీని, నాటి సంగీత విద్వాంసులలో ఒకరైన అరియకుడి రామానుజ అయ్యంగార్ హఠాత్తుగా అస్వస్థులు కావడం వల్ల రద్దు చేసుకున్నారు. నిర్వాహకులు సుబ్బులక్ష్మి చేత మొదటిసారి పాడించారు. 1933 డిసెంబర్‌లో ఇది జరిగింది. తరువాత కొన్నేళ్లకి ఆ అకాడమి ఇచ్చే అత్యుత్తమ పురస్కారం ‘సంగీత కళానిధి’ సుబ్బులక్ష్మి స్వీకరించారు.
                                                             
వెండితెరపై సువర్ణగాత్రం
ఎంఎస్ సువర్ణగాత్రం వెండితెర మీద కూడా వెన్నెలలు విరబూయించింది. అక్కడ కూడా ఆమె ఒక వెలుగు వెలిగారు. మున్షీ ప్రేమ్‌చంద్ అద్భుత నవల ‘సేవాసదన్’ ఆధారంగా నిర్మించిన చిత్రంలో ఎంఎస్ నటించారు. 1938లో ఆ చిత్రం విడుదలయింది. వారణాసి నేపథ్యంలో ఒక సాధారణ గృహిణి ఎలాంటి పరిస్థితులలో గడప దాటిందో ఈ కథలో ఆ మహా రచయిత మహోన్నతంగా ఆవిష్కరించారు. ఇందులో కట్నం సమస్యను కూడా ప్రస్తావించారాయన. ఆ ఒక్క చిత్రంతోనే సుబ్బులక్ష్మి గాయక నటిగా వినుతికెక్కారు. 1940లో ఎల్లిస్ దున్గన్ ఎంఎస్‌తోనే శకుంతల చిత్రం నిర్మించారు. ఆ తరుణంలోనే ‘కల్కి’ సదాశివంతో వివాహమైంది. సదాశివం ‘కల్కి’ పత్రిక నడిపేవారు. సి. రాజాజీకి సన్నిహితుడు.

జాతీయోద్యమంలో పనిచేసేవారు. ‘కల్కి’ పత్రికకు నిధులు సమకూర్చడానికి ఎంఎస్ 1941లో నారద పాత్రతో ‘సావిత్రి’ చిత్రంలో కనిపించారు. అలనాటి ప్రఖ్యాత హిందీనటి శాంతా ఆప్టే సావిత్రి పాత్రలో కనిపించారు. మళ్లీ 1945లో ఎల్లిస్ దున్గన్ దర్శకత్వంలోనే ఎంఎస్ ‘మీరా’ చిత్రంలో కథానాయిక పాత్ర ధరించారు. మీరా చిత్రాన్ని జవహర్‌లాల్ నెహ్రూ, భారత ఆఖరి వైశ్రాయ్ మౌంట్‌బాటన్‌తో కలసి ఢిల్లీలో చూశారు. ఈ చిత్రంలో అన్ని పాటలూ ఎంఎస్ ఒక్కరే పాడారు. ఆ సినిమా చూసి, ఆ పాటలకు మైమరచి సరోజినీ నాయుడు ఎంఎస్‌ను ‘భారత కోకిల’ అని శ్లాఘించారు. ప్రాగ్, వెనీస్‌లలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా మీరాను ప్రదర్శించారు. ఎంఎస్ కీర్తి నలుదిశలా వ్యాపించింది. కానీ అదే ఆమె ఆఖరి చిత్రమైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎంఎస్ చలనచిత్ర జీవితానికి శుభం కార్డు వేసి, కర్ణాటక సంగీతానికే పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేశారు.

అంతర్జాతీయ వేదికలపై...
1960లో అంతర్జాతీయ వేదిక మీద పాడేందుకు సుబ్బులక్ష్మికి మొదటిసారి అవకాశం వచ్చింది. అప్పటికే ఆకాశవాణి ద్వారా, కచేరీల ద్వారా కర్ణాటక సంగీత ప్రియులకు ఆరాధనీయ గాయనిగా మారిన ఎంఎస్‌ను ఎడిన్‌బరో ఉత్సవానికి ఆహ్వానించారు. 1963లో అక్కడ కచేరి జరిగిన తరువాత మరుసటి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంలో పాడేందుకు రావలసిందిగా నాటి ప్రధాన కార్యదర్శి యు థాంట్ ఆహ్వానించారు. 1966లో సమితి జనరల్ అసెంబ్లీలో కూడా ఆమె పాడారు.

ఇది సుబ్బులక్ష్మి శతజయంతి అయితే, జనరల్ అసెంబ్లీలో ఆమె పాట పాడి యాభై ఏళ్లు పూర్తి కావడం కేవలం యాదృచ్ఛికం (జనరల్ అసెంబ్లీలో పాడిన మొదటి గాయని ఎంఎస్. రెండోసారి ఆగస్టు 16, 2016న అదే అవకాశాన్ని పొందిన వారు ఏఆర్ రెహమాన్. ఆ సందర్భంలో రెహమాన్ ఎంఎస్‌కు ఘనంగా నివాళి సమర్పించారు). ఈ కచేరీ నిజంగా చరిత్రాత్మకం. ఆ కార్యక్రమంలో ఆమె మొత్తం 30 గీతాలు పాడారు. అవి ఆరు భాషలకు చెందినవి. అదొక అపురూప ఘట్టం. జెనీవాలోని రెడో విల్లాలో పాడే అవకాశం కూడా భారతదేశం నుంచి ఎంఎస్‌కే లభించింది. విశ్వవిఖ్యాత సంగీతకారుడు బీతోవెన్ ఒకసారి కచేరి చేసిన వేదిక అది. పారిస్, లండన్, న్యూయార్క్ నగరాలు కూడా ఎంఎస్ గానవాహినలో తడిసినవే.
                                                    
ఔన్నత్యంలో తపస్విని
ఎంఎస్ జీవితాంతం ఆరాధించిన కళ, ఆమెను భూగోళానికి పరిచయం చేసిన పాట ఎంఎస్‌ను ఒక తపస్విని స్థాయికి తీసుకువెళ్లాయి. సుబ్బులక్ష్మి, మరో ప్రఖ్యాత విదుషీమణి డీకే పట్టమ్మాళ్ చెన్నైలో ఒకే వీధిలో ఉండేవారు. ఆ వీధికి సుబ్బులక్ష్మి పేరు పెట్టదలిచామని మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. కానీ అందుకు ఎంఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ వీధికి ఏదైనా ఒక పేరు పెట్టాలి అంటే, అది పట ్టమ్మాళ్ పేరు మాత్రమే అయి ఉండాలని చెప్పారామె. ఆమె సంగీత సామ్రాజ్యంలో రాణి అయినా, ఔన్నత్యంలో మాత్రం తపస్వినే. అదే చెబుతోంది ఈ ఉదంతం. మీరా భజన్‌లు అద్భుతంగా ఆలపించిన ఆ దక్షిణాది గాయని ఉత్తర భారత ప్రజల హృదయాలను అలవోకగా గెలిచారు. పురుషాధిపత్యంతో సాగుతున్న కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో మహిళ గొంతును ప్రథమంగా బలంగా వినిపించారు.
 
ఎంఎస్ సంగీతానికి శరీరం రాగమే కావచ్చు. కానీ దాని ఆత్మ భక్తి. ఆమె ఆలపించిన ఏ రాగమైనా భక్తిభావంతోనే తొణికిసలాడేది. భక్తిగీతమే ఈ చరాచర ప్రపంచంలో ఎక్కడ ఉన్న మనిషి హృదయాన్నయినా తాకగలుగుతుందని ఆమె విశ్వసించారు. చిరస్మరణీయం అయ్యారు.
- డాక్టర్ గోపరాజు నారాయణరావు
 
దేశానికి ఇష్టమైన పాట
శంకర భగవత్పాదుల గీతాలు, శ్లోకాలు; మరాఠీ భక్తకవి తుకారామ్ గీతాలు, గురుగ్రంథ సాహెబ్‌లోని గీతాలు, మీర్జా గాలిబ్ ఉర్దూ ఘజల్స్  కూడా ఎంఎస్ గానం చేశారు. ఆమె పాడిన అన్నమాచార్య కీర్తనలు, వెంకటేశ్వర సుప్రభాతం ఏదో సందర్భంలో ఆలకించని ఇల్లు దక్షిణ భారతదేశంలో ఉండదు. ఇక బెంగాలీ భాషలో ప్రఖ్యాత జాతీయవాద కవి ద్విజేంద్రలాల్ రాయ్ రాయగా, ఎంఎస్ పాడిన పాట, ‘ధనో ధన్య పుష్పో భరా’ మన దేశంలో ఎందరికో అత్యంత ఇష్టమైన పాట.
 
కాలాతీత గాత్ర మాధుర్యం
గాంధీజీ టేప్ చేయించుకుని మరీ విన్నారు!
గాంధీజీ 78వ జన్మదినం. ఆ అక్టోబర్ 2న గాంధీజీ కోసమే ఢిల్లీలో కొన్ని సంగీత కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, ఆ రోజున ఎంఎస్ వచ్చి, గాంధీజీకి ఎంతో ఇష్టమైన మీరా భజన్ ‘హరి తుమ్ హరో’ పాడగలరా అని అడుగుతూ ‘కల్కి’ కార్యాలయానికి ఫోన్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేత సుచేతా కృపలానీ ఆ ఫోన్ చేశారు. అయితే ఆ భజన్ ఎంఎస్‌కు రాదనీ, అలాగే ఆ వారం ఢిల్లీకి రావడం కూడా సాధ్యం కాదనీ సదాశివం చాలా హుందాగా సుచేత ఆహ్వానాన్ని తిరస్కరించారు. మరెవరితో అయినా పాడించమని సలహా ఇచ్చారు.

ఇక పుట్టినరోజు రెండు రోజులు ఉందనగా మళ్లీ ఫోన్. ఆ భజన్‌ను వేరొకరి కంఠం నుంచి వినడం కంటే, ఎంఎస్ ఆ పాటను టేప్ చేసి పంపితే వింటానని గాంధీజీ మరీ మరీ కోరినట్టు సుచేత చెప్పారు. ఇక తప్పలేదు. గాంధీజీ మీద గౌరవంతో సదాశివం ఆగమేఘాల మీద మద్రాసులోని ఆకాశవాణిలో రికార్డ్ చేయించి, ఢిల్లీ పంపించారు. ఆ విధంగా గాంధీజీ తన పుట్టిన రోజున ఆ భజన్ చెవులారా విన్నారు. కానీ, 1947లో జరిగిన ఆ పుట్టినరోజే చివరి పుట్టినరోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు. జనవరి 30, 1948న గాంధీజీ హత్యకు గురైయ్యారు. ఆ సమయంలోనే ఆకాశవాణి ఆయనకు నివాళిగా ఒక పాటను వినిపించింది. అది గాంధీగారి కోసం ఆ రోజు సుబ్బులక్ష్మి మద్రాసు ఆకాశవాణిలో రికార్డు చేసి పంపినదే. దానితో ఆమెపేరు ఇంటింటా మారుమోగింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement