పాదాలు పొడిబారుతుంటే...
వేసవిలో సంరక్షణ
బయటకు వెళ్లినప్పుడు ఎండ ప్రభావానికి ఎక్కువగా లోనయ్యేవి పాదాలు. అలాగని పాదాలకు అతి ఎక్కువగా సన్‌స్క్రీన్ లోషన్ రాయకూడదు. ఎండ వల్ల పాదాల చర్మం దెబ్బతింటున్నదా లేదా అని గమనించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే చాలు.ఎండ నేరుగా పాదాలపై పడటం వల్ల వేసవికాలంలో పాదాల చర్మం త్వరగా పొడిబారుతుంటుంది. ఫలితంగా పాదాల చర్మం గరుకుగా తయారవుతుంది. పగుళ్లు బారుతాయి. పాదాలు అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే...
వెచ్చని నీటిలో 10-15 నిమిషాలు పాదాలను ఉంచి, తర్వాత పమిస్ స్టోన్‌తో పాదాన్ని రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవుతుంది. వాడిన నీటిని తీసేసి, టబ్‌లో మరికొన్ని వెచ్చని నీళ్లు పోసి దాంట్లో టీ స్పూన్ షియా బటర్ (మార్కెట్‌లో లభిస్తుంది) వేసి కలపాలి. బటర్ కలిపిన నీటిలో పాదాలను మరొక పది నిమిషాలు ఉంచాలి.
పాదాలను బయటకు తీసి, పొడి టవల్‌తో తుడవాలి. కొద్దిగా షియా బటర్‌ను తీసుకొని పాదాలకు రాసుకోవాలి లేదా మాయిశ్చరైజర్‌ని వాడచ్చు. ఇలా చేయడం వల్ల పాదాల పైచర్మం మృదువుగా ఉంటుంది. పాదాలపై పడిన వేడి ప్రభావం తగ్గడానికి టబ్‌లో నీళ్లు పోసి, ఐస్ క్యూబ్స్ వేసి, పాదాలను దాదాపు 15 నిమిషాల పాటు ఉంచాలి. అధికంగా చెమటపట్టడం, ఎండ వల్ల కమిలిన చర్మం సాధారణ స్థితికి రావడం ఈ పద్ధతి వల్ల సాధ్యపడుతుంది. పగటిపూట మాటెలా ఉన్నా, రాత్రి పూట పడుకునే ముందు కొబ్బరినూనె పాదాలకు రాస్తే చర్మం మృదుత్వం దెబ్బతినదు.