సగ్గుతో నెగ్గు | Super fast food | Sakshi
Sakshi News home page

సగ్గుతో నెగ్గు

Published Fri, Jul 28 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM

సగ్గుతో నెగ్గు

సగ్గుతో నెగ్గు

ఓ కోడలమ్మా..!
ఊరి నుంచి బంధువులొస్తున్నారేమ్‌!
ఆటో వీధి మలుపు తిరిగిందట
ఏదైనా చేసి పెట్టరాదూ!!
ఓ క్వీన్‌ వైఫ్‌!
ఫ్రెండ్స్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఇక్కడే చూస్తారట
మంచింగ్‌కి ఏమైనా...!
ఓ మమ్మీ!
సంజయ్, లీలా, లక్ష్మీ, అనంత్, సౌరవ్,


సోనూ సింగ్, బెనర్జీ, యూసుఫ్‌.. అందరికీ ఆకలేస్తోంది ఏముంది తినటానికి..? జీవితంలో ఎక్కడైనా గెలవచ్చు కానీ వంటగదిలో గెలవడం కొద్దిగా కష్టమే చక చకా వండి నెగ్గుకురావాలంటే ఏం చేయాలి?! మేడమ్‌.. సగ్గుతో నెగ్గండి! మనింట్లో చేసుకునే సూపర్‌ఫాస్ట్‌ ఫుడ్‌!

ఇడ్లీ
కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు ఇడ్లీ రవ్వ – కప్పు పెరుగు – 2 కప్పులు నీళ్లు – ఒకటిన్నర కప్పు (తగినన్ని) ఉప్పు – తగినంత
బేకింగ్‌ సోడా – పావు టీ స్పూన్‌ జీడిపప్పులు – 16 (సగం పలుకు) నూనె – ఇడ్లీ ప్లేట్‌కి రాసేటంత

తయారీ: పెద్ద గిన్నెలో సగ్గుబియ్యం (కడగకూడదు), ఇడ్లీ రవ్వ, 2 కప్పుల పెరుగు, కప్పు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా లేదా 8 గంటలు అలాగే ఉంచాలి. మరుసటి రోజు పిండిని ఎక్కువ కలపకూడదు. నానిన సగ్గుబియ్యం మరీ మెత్తగా అయిపోతాయి. ఇడ్లీ చేసే ముందు పావు కప్పు నీళ్లు, సరిపడా ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి కలపాలి. ఇడ్లీ ప్లేట్స్‌కి నూనె రాసి, జీడిపప్పు పలుకులు ఒక్కొక్కటి పెట్టి, పిండి సర్దాలి. ఈ ప్లేట్‌ని ఇడ్లీపాత్రలో పెట్టి ఆవిరి మీద కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. మంట తీసేసాక ఐదు నిమిషాలు అలాగే ఉంచి, అప్పుడు ఇడ్లీలు తీయాలి. ఏదైనా నచ్చిన చట్నీతో సర్వ్‌ చేయాలి.

నోట్‌: సగ్గుబియ్యం కుకర్‌లో పెట్టి ఉడికించి కూడా పిండిని సిద్ధం చేసుకోవచ్చు. ఇందుకు తక్కువ సమయం పడుతుంది.

బనానా కోకనట్‌ మిల్క్‌
కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు; పంచదార పొడి – అర కప్పు; అరటిపండ్లు – 2; కొబ్బరిపాలు – కప్పు; వేయించిన నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ:  ∙సగ్గుబియ్యం కడిగి, నీళ్లు పోసి, ఆ నీళ్లను వడకట్టాలి. తర్వాత నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. లేదంటే కుకర్‌లో పెట్టి ఉడికించవచ్చు. ఈ సగ్గుబియ్యంలో 2 కప్పుల నీళ్లు, పంచదార పొడి, చిటికెడు ఉప్పు సాస్‌పాన్‌లో పోసి సన్నని మంట మీద మళ్లీ ఉడికించాలి. ∙అరటి పండుపై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఈ ముక్కలను ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి 3 నిమిషాలు ఉంచాలి. అరటిపండు ముక్కలు మరీ మృదువుగా అవుతాయి. దీంట్లో కొబ్బరి పాలు పోసి మంట తీసేసి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమంలో పైన వేయించిన నువ్వులు, మామిడిపండు ముక్కలు వేసి చల్లగానూ, వేడిగానూ అందించవచ్చు.

కిచిడి
కావల్సినవి:  సగ్గుబియ్యం – కప్పు; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; జీలకర్ర – టీ స్పూన్‌; బంగాళదుంప ముక్కలు – ముప్పావు కప్పు ; ఉప్పు – తగినంత; వేరుశనగపొడి – అర కప్పు ; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; పంచదార – 2 టీ స్పూన్లు

తయారీ:
∙ సగ్గుబియ్యం కడిగి, ముప్పావు కప్పు నీళ్లుపోసి నానబెట్టాలి.
∙ నూనె వేసి, వేడయ్యాక నాన్‌స్టిక్‌ పాన్‌లో జీలకర్ర వేసి వేయించాలి. పోపుగింజలు, ఉడికిన బంగాళదుంప ముక్కలు, బాగా నానిన సగ్గుబియ్యం, ఉప్పు, వేరుశనగపొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం, పంచదార, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టాలి.
∙ వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

పకోడీ
కావల్సినవి:  సగ్గుబియ్యం – 2 కప్పులు; బియ్యప్పిండి – 2 కప్పులు; మజ్జిగ – 3 కప్పులు; కారం – టీ స్పూన్‌; పచ్చిమిర్చి – 4; ఉప్పు – తగినంత; ఉల్లిపాయలు – 2; నూనె – వేయించడానికి తగినంత

తయారీ:   సగ్గుబియ్యం కడిగి మజ్జిగలో గంట సేపు నానబెట్టాలి. దీంట్లో బియ్యప్పిండి, కారం కలపాలి. నీళ్లు కలపకూడదు. ఉప్పు, ఉల్లిపాయల తరుగు, టీ స్పూన్‌ నూనె వేసి బాగా కలపాలి. స్టౌ మీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. సిద్దంగా ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి అన్ని వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి.

ఖీర్‌
కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు; పాలు – 2 కప్పులు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – 5 టేబుల్‌స్పూన్లు; యాలకులు – 5 (పొడి చేయాలి); జీడిపప్పు, బాదంపప్పు పలుకులు – 2 టేబుల్‌ స్పూన్లు; కిస్‌మిస్‌ – అర టేబుల్‌ స్పూన్‌; కుంకుమపువ్వు – 5 రేకలు
తయారీ:  సగ్గుబియ్యం , 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత మందపాటి గిన్నెలో సగ్గుబియ్యం, నీళ్లు కలిపి ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత పాలు పోసి మళ్లీ మరిగించాలి. దీంట్లో పంచదార, యాలకుల పొడి వేసి సన్నని మంట మీద ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికాక వేయించిన జీడిపప్పు , బాదం పలుకులు, కిస్‌మిస్, చివరగా కుంకుమపువ్వు వేసి మంట తీసేయాలి. సర్వ్‌ చేసేముందు టీ స్పూన్‌ నెయ్యి వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది.

వడ
కావల్సినవి: సగ్గుబియ్యం – అర కప్పు; ఉడకబెట్టిన బంగాళదుంపలు – కప్పు; వేరుశనగపప్పు (కచ్చాపచ్చాగా దంచాలి)– ముప్పావుకప్పు
జీలకర్ర – అర టీ స్పూన్‌; అల్లం తరుగు – టీ స్పూన్‌; పచ్చిమిర్చి తరుగు – ఒకటిన్నర టీ స్పూన్‌; కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు;
నిమ్మరసం – అర టీ స్పూన్‌; పంచదార – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – వేయించడానికి తగినంత

తయారీ:
∙ సగ్గుబియ్యం కడిగి ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి.
∙ బాగా ఉడికిన సగ్గుబియ్యంలో మిగతా దినుసులన్నీ వేసి కలపాలి. దీనిని 8 భాగాలు గా చేయాలి. ఒక్కో భాగాన్ని ఉండగా, చేసి అరచేత్తో అదమాలి.
∙ మూకుడులో నూనె పోసి, కాగాక సిద్ధం చేసుకున్న వడలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని టిష్యూ పేపర్‌ మీద వేసి, తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. గ్రీన్‌ చట్నీ లేదా పంచదార కలిపిన పెరుగుతో వడ్డించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement