
ఇదేం క్రమశిక్షణ?!
విడ్డూరం
పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి పాఠశాలల్లో పలు రకాల నియమాలు పెడుతుంటాయి యాజమాన్యాలు. అయితే అమెరికాలోని కొన్ని స్కూళ్లలో ఉన్న రూల్స్ చిట్టా కాస్త విచిత్రంగా ఉంది. మీరే చూడండి...
ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలోని కొన్ని పాఠశాలల్లో పిల్లల పరీక్ష పేపర్లను పచ్చ ఇంకుతో దిద్దుతారు. ఎరుపురంగు విప్లవభావాలకు ప్రతీక కాబట్టి ఆ రంగు సిరాని వాడరు. దీన్ని ఈ మధ్య అమెరికాలోని కొన్ని పాఠశాలలు కూడా అవలంబిస్తున్నాయి!
న్యూయార్‌కలోని ఓ పాఠశాలకి బస్సులు ఉండవు. మరీ చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు దింపవచ్చు కానీ, కాస్త ఎదిగాక కచ్చితంగా సైకిల్ మీదే రావాలి. స్థూలకాయం రాకుండా నివారించడానికి ఈ రూల్ పెట్టారట!
మిచిగన్‌లో ఉన్న ఓ స్కూల్లో ప్రతి విద్యార్థికీ ఓ లాకర్ ఇస్తారు. క్యాంటీన్‌కి, తరగతి గదులకు మధ్య ఉండే ఈ లాకర్లలో పుస్తకాలు, లంచ్ బాక్సులు పెట్టుకోవాలి. ప్రతి పీరియడ్‌కి ముందు అక్కడికి వెళ్లి కావలసిన పుస్తకాలు తెచ్చుకోవాలి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఏర్పాటు చేశారట!
మసాచుసెట్స్‌లోని ఓ పాఠశాలలో బేక్ చేసిన ఫుడ్ అమ్మరు. పిల్లలు ఇళ్ల నుంచి తెచ్చుకోవడానికి కూడా వీల్లేదు!
కొలరాడోలోని ఓ స్కూల్లో పిల్లలు 18వ అంకె ప్రింట్ చేసి ఉన్న దుస్తులు వేసుకోకూడదు. ఎందుకంటే అక్కడ ‘ఎయిటీన్‌త స్ట్రీట్ గ్యాంగ్’ అనే రౌడీ మూక ఉంది. కాబట్టి ఆ అంకెకు దూరంగా ఉండాలనే నియమం పెట్టారు!
ఫ్లారిడాలోని ఓ స్కూల్లో విద్యార్థులు ఒకరినొకరు వాటేసుకోకూడదు. అలా చేస్తే శిక్ష తప్పదు. పోయినేడు నిక్ మార్టినెజ్ అనే అమ్మాయి ఫ్రెండ్‌ని హగ్ చేసుకుందన్న కారణంతో సస్పెండ్ చేశారు!
సౌత్ కరొలినాలోని పాఠశాలలకు పిల్లలు వెరైటీ హెయిర్ స్టయిల్స్‌తో రాకూడదు. జుత్తుకి రంగులు కూడా వేయకూడదు. స్కూలువాళ్లు ఒక హెయిర్‌స్టయిల్ చెబుతారు. కచ్చితంగా పిల్లలంతా అలాగే దువ్వుకోవాలి!
వర్జీనియాలో కాల్వర్‌ట హైస్కూల్లో స్కర్టులు ధరిస్తే ఇష్టపడరు. ఒకవేళ స్కర్కులు వేసుకోవాలని ఉంటే యాజమాన్యం చెప్పిన కొలతలతో కుట్టించుకుని వేసుకోవాలి!
పెన్సిల్వేనియాలో విద్యార్థులు చేతులకు బ్యాండ్‌స పెట్టుకోకూడదు. పెట్టుకున్నారో... స్కూల్లోంచి తీసేస్తారు!