ప్రజల్ని క్రమశిక్షణా మార్గంలో నడిపించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలూ చట్టాల్ని అమలు చేస్తాయి. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన చట్టం అమల్లో ఉంటుంది. స్థానిక అవసరాలు, సంస్కృతి, సంప్రదాయాల దృష్ట్యా అనేక దేశాలు తమ చట్టాల్ని రూపొందించుకుంటాయి. చట్టాల్లోని ఈ వైవిధ్యం మూలంగా ఒక దేశంలో నేరం కాని పని, మరో దేశంలో శిక్షార్హమైనది కావొచ్చు. అందుకే కొన్ని దేశాల్లోని చట్టాలు వింతగా అనిపిస్తాయి. అలా ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న కొన్ని వింత చట్టాల గురించి తెలుసుకుందాం..
అధిక బరువూ తప్పే..
సుమో రెజ్లింగ్‌కు ప్రసిద్ధి చెందిన దేశం జపాన్. అధిక బరువు కలిగిన వారితో సుమో రెజ్లింగ్ నిర్వహించే జపాన్ ఓ కొత్త చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం 45-74 ఏళ్లు కలిగిన పౌరులు ఎవరైనా అధిక బరువు కలిగి ఉండడం నేరం. ఈ వయసున్న ప్రజల నడుము చుట్టు కొలత 32 అంగుళాలు దాటితే నేరంగా పరిగణిస్తారు. అయితే ఇలాంటివాటికి అధికారులు పెద్దగా జరిమానాలు, శిక్షలు విధించడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టం తెచ్చినట్లు జపాన్ వెల్లడించింది. మధుమేహం, రక్తపోటు వంటి అనేక వ్యాధులకు స్థూలకాయం కారణమవుతున్న దృష్ట్యా ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో జపాన్ ఈ చట్టం చేసింది.
పెట్రోల్ అయిపోతే జరిమానే..
ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ఇంధనం అయిపోవడం, వాహనాలు ఆగిపోవడం మన దేశంలో సర్వ సాధారణం. కానీ జర్మన్‌లోని ఆటోబాన్ హైవేపై మాత్రం ఇంధనం అయిపోయి వాహనాలు ఆగిపోతే జరిమానా చెల్లించాల్సిందే. నిత్యం ఎక్కువ వాహనాలు ప్రయాణించే ఈ హైవేపై ఎలాంటి స్పీడ్ లిమిట్ లేదు. వాహనదారులు తమకు నచ్చిన వేగంలో వెళ్లొచ్చు. అతివేగంతో వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి రహదారిపై ఎలాంటి వాహనమూ ఆపడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లోనే ఈ మార్గంలో వాహనాల్ని నిలిపి వేయాలి. ఇంధనం అయిపోయి వాహనాల్ని నిలిపి ఉంచినా నేరంగానే పరిగణిస్తారు.
నవ్వుతూ ఉండాల్సిందే..
సంతోషం కలిగినప్పుడు నవ్వుతూ ఉండడం, బాధలో ఉన్నప్పుడు విచార వదనంతో ఉండడం మనుషుల సహజ స్వభావం. ఎవరికైనా సమస్యలుంటే వారు మూడీగానే ఉంటారు. మీ మూడ్ బాగోలేకపోతే మూడీగా ఉండడం ఎక్కడైనా కుదురుతుందేమో కానీ ఇటలీలోని మిలాన్ నగరంలో మాత్రం కుదరదు. ఎందుకంటే అక్కడి చట్టం ప్రకారం మిలాన్ నగరంలో ఉన్న వారెవరైనా నిత్యం నవ్వుతూ ఉండాల్సిందే. పెదవులపై ఎప్పుడూ చిరునవ్వుని చెదరనివ్వకూడదు. ఒకవేళ ఎవరైనా మూడీగా ఉన్నట్లు కనిపిస్తే వారికి అక్కడి అధికారులు జరిమానా విధిస్తారు. అంత్యక్రియల సందర్భంగా, ఆసుపత్రులకు వెళ్లినప్పుడు మాత్రమే అక్కడ విచార వదనంతో ఉండవచ్చు. అంతకుమించి మరెక్కడైనా మూడీగా కనిపిస్తే స్థానిక చట్టాల ప్రకారం జరిమానా చెల్లించాల్సిందే.
బల్బు మార్చాలన్నా...
మీ ఇంట్లో విద్యుత్ బల్బు పాడైతే ఏం చేస్తారు? వెంటనే మీరే ఇంకో బల్బు మార్చేస్తారు కదూ. సాధారణంగా ఇలాంటి చిన్న పనులకు ఎలక్ట్రిషియన్‌ను పిలవరు. అనవసర ఖర్చు కాబట్టి. మనదేశంలోనైతే పర్లేదు కానీ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో మాత్రం ఇలా ఎవరికి వారే ఇంట్లోని బల్బును మార్చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో విద్యుత్ బల్బును మార్చాలన్నా సరే సుశిక్షితులైన ఎలక్ట్రిషియన్‌ను పిలవాల్సిందే. స్థానిక చట్టం ప్రకారం లెసైన్స్ కలిగిన ఎలక్ట్రిషియన్ మాత్రమే విద్యుత్ బల్బును మార్చాల్సి ఉంటుంది. పొరపాటున చిన్న పనే కదా అని సాధారణ ప్రజలు ఎవరైనా బల్బును మారిస్తే వారికి పది ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధిస్తారు. ఇది ఎప్పటినుంచో అమలవుతున్న చట్టం. దీన్ని అక్కడి ప్రజలు తప్పనిసరిగా అనుసరిస్తున్నారు. విద్యుత్ సంబంధిత పనులను లెసైన్స్ ఉన్న ఎలక్ట్రిషియన్‌లే చేపట్టాలనేది అక్కడి చట్టం.
నో బిల్..
ప్రపంచంలోని అనేక దేశాల్లో హొటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లించడం మామూలే. వడ్డించిన ఆహారం తక్కువైనా, కడుపునిండా తిన్నా, తినకున్నా అడిగినంత బిల్లు చెల్లించాల్సిందే. కానీ డెన్మార్క్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన విధానం అమల్లో ఉంది. స్థానిక చట్టం ప్రకారం అక్కడి రెస్టారెంట్లలో భోజనం చేసిన వారెవరైనా తమకు వడ్డించిన ఆహారం చాల్లేదనిపిస్తే బిల్లు చెల్లించనవసరం లేదు. ఒకవేళ కడుపునిండా తిని సరిపోలేదని చెప్పినా ఎవరూ ఏమీ పట్టించుకోరు. ఆయా రెస్టారెంట్లలో ఎవరికి వారు తమకు ఆహారం సరిపోలేదనిపిస్తే బిల్లు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు. ఆతిథ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే దేశం కాబట్టి డెన్మార్క్‌లో ఈ చట్టం అమల్లో ఉంది. పిల్లలు ఎవరైనా కార్లో నిద్రపోతున్నారో లేదో చూసుకోకుండా అక్కడ కార్ స్టార్ట్ చేస్తే దాన్ని కూడా డెన్మార్క్‌లో నేరంగానే పరిగణిస్తారు.