కోపమేనా గూడు కట్టుకుని ఉండేది? ప్రేమా లోలోపల ఘనీభవిస్తూ ఉంటుంది. గూడు కట్టుకున్న కోపంలా.. ఘనీభవించిన ప్రేమ బద్దలు కాదు. కానీ.. ఇప్పుడైంది!
సుశాంత్‌పై ప్రేమ ‘లైక్’లుగా భళ్లుమంది. ‘దిల్ బేచారా’కు కోటి లైక్‌లు! మూవీ ట్రైలర్స్‌లో ఆల్‌టైమ్ రికార్డు. యూట్యూబ్ లైక్‌ల చరిత్రలో.. మరో ‘డెస్పసీతో’.. దిల్ బేచారా!!
ఇద్దరూ చనిపోతారా చివర్లో!
కిజీ బసుకు థైరాయిడ్ క్యాన్సర్.
ఇమ్మాన్యుయేల్ రాజ్‌కుమార్ జూనియర్‌కు ఆస్టియోసర్కోమా. ఇదీ క్యాన్సరే. అయితే ఆమెకు ఉన్నంత తీవ్రంగా ఉండదు అతడికి. ‘కిజీ తర్వాతే నువ్వు’ అన్నట్లు ఉంటుంది.. తీసుకుపోవడానికి.
కిజీ.. మన్నీకి దూరదూరంగా ఉంటుంది. అతడికి తనకు దగ్గరవకుండా ఉండటం కోసం. మన్నీ అంటే.. మన ఇమ్మాన్యుయేలే. దగ్గరవొద్దంటే దూరంగా ఉండే రకమా! నీ దూరం నీది. నా దగ్గర నాది అంటాడు.
ప్రేమ వాళ్లలో ప్రాణాన్ని పంప్ చేస్తుంటుంది. దిగ్.. దిగ్.. దిగ్...
కిజీ.. ‘దిల్ బేచారా’ హీరోయిన్. మన్నీ ‘దిల్ బేచారా’ హీరో.
ఇద్దరూ చనిపోతారా చివర్లో!
‘జనన మరణాలు మన చేతుల్లో లేకపోవచ్చు. ఎలా జీవించాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది’.. ఈ మూవీ ట్రైలర్‌లో వస్తుందీ మాట.
కానీ.. సుశాంత్, మరణాన్ని కూడా జీవించడంలోని ఒక భాగంగా చేసుకుని వెళ్లిపోయాడా!
‘దిల్ బేచారా’లోని హీరో మన్నీ.. సుశాంతే! లేడు ఇప్పుడు. హీరోయిన్ కిజీ.. సంజనా సంఘీ ముంబైలో లేదు ఇప్పుడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆమ్మాయి ఢిల్లీకే తిరిగి వెళ్లిపోయింది. ఇద్దరూ కలిసి ఇక నటించేది లేదు. ఇద్దరూ కలిసి ఈ సినిమాను చూసుకునేది లేదు. ఇద్దరూ ఉన్న.. ఈ ఇద్దరు మాత్రమే ఉన్న ట్రైలర్ ఇప్పుడు ‘లైక్ ’ల రికార్డులతోపాటు, చూస్తున్న వారి హార్ట్‌లనూ బ్రేక్ చేస్తోంది. చనిపోయిన చిన్నవాడు కళ్లముందు నవ్వుతూ కనిపిస్తున్నాడు.
∙∙
‘దిల్ బేచారా’ ట్రైలర్ జూలై 6న యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ పది రోజుల్లోనే 7 కోట్ల 45 లక్షల 72 వేల మందికి పైగా ట్రైలర్‌ని వీక్షించారు. కోటి మంది ‘లైక్’ చేశారు. ఒక సినిమా ట్రైలర్‌కు ఇన్ని లైక్‌లు రావడం యూట్యూబ్ చరిత్రలోనే ఇది రికార్డు. ఆల్‌టైమ్ రికార్డు లైక్స్ ఉన్న 2019 నాటి హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ ట్రైలర్‌ను కూడా ‘దిల్ బేచారా’ ట్రైలర్ ఎక్కడో దూరంగా ఉంచేసింది. అసలు ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 40 లక్షల 80 వేల మంది లైక్ చెయ్యడం ‘దిల్ బేచారా’కు నమోదైన మొదటి రికార్డు. అయితే మూవీ ట్రైలర్స్ అని వేరు చేయకుండా అసలు మొత్తం మీద యూట్యూబ్ చరిత్రలో ఇప్పటి వరకు మోస్ట్–లైక్డ్ వీడియో మాత్రం ‘డెస్పసీతో’.
2017 జనవరిలో విడుదలైన ఈ 4.41 నిముషాల స్పానిష్ పాప్ వీడియో సాంగ్‌కి ఇంతవరకు 3 కోట్ల 80 లక్షల మందికి పైగా ‘లైక్’ కొట్టారు.
‘దిల్ బేచారా’ స్త్రీ పురుషుల మధ్య ప్రేమ. నిస్సహాయమైన రెండు హృదయాల స్పందన. ‘డెస్పసీతో’ దేహ సాన్నిహిత్యంతో జీవితాన్ని ప్రేమించడం! ఆగి, మెల్లిగా జీవితపు క్షణాల్లోని ప్రేమకణాలను జ్వలింపజేసుకోవడం. డెస్పసీతో అంటే స్పానిష్‌లో.. ‘నెమ్మదిగా’ అని. ప్యూర్టొరికో గాయకుడు లూయీ ఫాన్సీ (42), ప్యూర్టొరికో ర్యాపర్ డాడీ యాంకీ (43) కలిసి చేసిన ఈ పాప్ వీడియో అగ్గిలా భగ్గుమనడానికి ఇందులోని థీమ్ ఒక కారణమైతే.. వీyì యో రిలీజ్ అయిన మూడో నెలలోనే కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ దీనికి రీమిక్స్ వెర్షన్‌ని సృష్టించడం వల్ల వచ్చిన పాపులారిటి మరొక కారణం. దాన్ని చూసి దీన్ని, దీన్ని చూసి దాన్ని చూడ్డం వల్ల కూడా డెస్పసీతో లైక్‌లు, వీక్షణలు వరదనీటి మట్టంలా పెరిగిపోయాయి.
∙∙
‘దిల్ బేచారా’ గుడ్ లవ్. ‘డెస్పసీతో’ నాట్ టూ గుడ్. సుశాంత్, సంజనాల్లోని అమాయ కత్వం లూయీ ఫాన్సీ, డాడీ యాంకీల డెస్పసీతోలో కనిపించదు. ఆ సాంగ్‌ను ‘ఛీ’ అన్నవారూ ఉన్నారు. ‘‘ఏంటిది! ఓప్పం గంగ్నమ్ స్టెయిల్లా! వేలం వెర్రి కాకపోతే’’ అని. ఐనాగానీ.. లాటిన్, అర్బన్ మ్యూజిక్ రిథమ్స్ ‘డెస్పసీతో’ను నిలబెట్టాయి. దిల్ బేచారాలో ‘‘కిస్సీ అని నీకెవరు పేరు పెట్టారు?’’ అని కావాలని అడుగుతాడు సుశాంత్.. కిజీ బసుని. ‘‘కిజీ నా పేరు. ఇటీజ్ జడ్ అంటుంది’’ కిస్ అనే మాట రిపీట్ కాకుండా కిజీ. అంత ఫ్రెష్ లవ్ వాళ్లది. డెస్పసీతో లోనివన్నీ గాఢమైన చుంబన భావనలు. ‘నా ముద్దులతో నీ దుస్తులను తొలగించాలని ఉంది’ అంటాడు. కొద్దికొద్దిగా ముద్దులతో మనం దగ్గరవుదాం’ అంటాడు. అలాంటప్పుడు జీవితాన్ని ప్రేమిస్తున్నట్లుగా ఉండదు. దేహాన్ని వ్యామోహిస్తున్నటు అనిపిస్తుంది. బహుశా డెస్పసీతోకు వచ్చిన మూడు కోట్లకు పైగా లైక్‌లలో మగపిల్లలు, మగవాళ్లు కొట్టినవే ఎక్కువగా ఉండి ఉండాలి.
రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ చరిత్ర ట్యూబుల్లో ఉండిపోయేవి. వాటితో నిమిత్తం లేకుండా మనసులలో కొన్ని రికార్డు అయిపోతూ ఉంటాయి. లైక్‌లు కొట్టనివాళ్లలో కూడా సుశాంత్ అభిమానులు కోటికి మించే ఉండరంటారా?!
Comments
Please login to add a commentAdd a comment