పెద్ద దర్శకులంటే, పెద్ద హీరోలంటే.. ఇండస్ట్రీలోని పెద్దపెద్దవాళ్లే వణికి చస్తుంటారు. ఈ హీరోయిన్‌లు చూడండీ.. స్వరా భాస్కర్, పార్వతి.. మనసులో ఉన్నది ఎలా ధైర్యంగా మాట్లాడేశారో! దమ్మున్న అమ్మాయిలు అనిపించారు. స్వరా భాస్కర్ బాలీవుడ్ నటి. ‘పద్మావతి’ సినిమా చూసొచ్చి భన్సాలీని పబ్లిక్‌గా తిట్టేసింది.
లాస్ట్ సీన్ ఆమెకు నచ్చలేదు.. దీపికా పదుకోన్, వందల మంది మహిళల్ని వెంటేసుకుని.. ఖిల్జీ నుంచి తప్పించుకోడానికి.. వెళ్లి అగ్నిగుండంలో పడిపోవడం! ‘స్త్రీకి బతికే హక్కులేదా? స్త్రీ అంటే ఇక వేరే అర్థం లేదా? స్త్రీ దేహానికి ఇంకో పరమార్థమే లేదా’ అనే అర్థం వచ్చేలా కాస్త తీవ్రంగానే భన్సాలీపై ఆమె విరుచుకుపడింది. ఇక అప్పట్నుంచీ స్వరా భాస్కర్‌కు భన్సాలీ అభిమానుల టార్చర్ మొదలైంది.
ఇంకో అమ్మాయి పార్వతి. మలయాళీ నటి. ‘కసాబా’ (2016) చిత్రంలో మమ్ముట్టీ.. మహిళా పోలీస్ బాస్‌ను అభ్యంతరకరంగా తిడతాడు. ఆ డైలాగ్‌తో ఆ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పించడం డైరెక్టర్ ఉద్దేశం కావచ్చు కానీ, స్త్రీని అనకూడని మాట అది! స్త్రీ దేహధర్మాలను కించపరిచే డైలాగ్ అది. దానిపై మమ్ముట్టిని, డైరెక్టర్‌ను తిట్టిపడేసింది పార్వతి. ఏడాదిగా తిడుతూనే ఉంది.
డిసెంబర్‌లో మళ్లీ ఒకసారి క్రిటిక్‌ల సభలో ఆమె ఈ విషయాన్ని ఉతికి ఆరేసింది. మమ్ముట్టి అభిమానులు కూడా ప్రతీకారంగా పార్వతిపై ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉన్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. సినిమాల్లోనే కాదు, సినిమాల బయటా ధైర్యంగా ప్రశ్నించే అమ్మాయిలు ఉన్నారు!
Comments
Please login to add a commentAdd a comment