కృత్రిమం టు ప్రకృతి | Synthetic to natural | Sakshi
Sakshi News home page

కృత్రిమం టు ప్రకృతి

Published Mon, Nov 7 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

కృత్రిమం టు ప్రకృతి

కృత్రిమం టు ప్రకృతి

హెర్బల్ ఉత్పత్తులు
 

కండిషనర్‌తో కలగలిసి గాఢమైనదాన్నంటూ ఒగలుపోతూ  ప్రొటీన్‌తో చిక్కనై జుట్టును నిగారింపజేస్తానంటూ   షాంపూలు గొప్పలకు పోయాయి. గొడవచేశాయి.  అంతలోనే ఏమైందో ఏమోగానీ...  శీకాకాయ సహిత కుంకుడుకాయ పులుసే రూపుమార్చుకొని
 మళ్లీ బాత్‌రూమ్ అరుగుమీద మరోమారు ప్రత్యక్షమౌతోంది.    పళ్లు తోమడం కోసం పేస్ట్ వంక చూడటానికి   కను గుడ్డు కనుకొనలకు కదిలే లోపే ...    వనమూలికా వజ్రదంతి అక్కడ దర్శనమిస్తోంది.  స్వాభావిక సాంప్రదాయిక సహితమైన ఆ వస్తువులు  పతంజలి ప్రాడక్ట్ అనో, హెర్బల్ కంజ్యూమర్ గూడ్ అనో...  విపణి వీధుల్లో ఇప్పుడు ప్రతిరోజూ ఇబ్బడి ముబ్బడిగా  కనిపిస్తున్నాయి. కనువిందు చేస్తున్నాయి. దాంతో...   ప్రతి రోజూ సెల్వార్ కమీజ్ చున్నీ దుపట్టాలతో కనిపించే అమ్మాయి అకస్మాత్తుగా పరికిణీ పావడా, పట్టు వోణీ,  అంచు నిండా జరీవిరి తీగలను    కవిగాంచకపోయినా.... కన్సూమ‘రవి’ గాంచుతున్నాడు.  న్యాచురల్, హెర్ ‘బల్’ థ్రిల్లింతలు కలిగిస్తున్న ఆ ప్రోడక్ట్‌ల తీరు తెన్నులు... ట్రెండీ వన్నెలపై ప్రత్యేక కథనమిది.
 
దీప్తికి చిన్నప్పుడు తలంటు స్నానమంటే నాయనమ్మ కుంకుడు కాయలు, సీకాకాయ పొడితో తలరుద్ది స్నానమే! పెరుగుతున్న వయసు, మారిన కాలానికి తగ్గట్లు తరువాత షాంపూలు, శాషేలకు మారింది. ఇప్పుడు నాలుగు పదుల వయసొచ్చి, ఇద్దరు ఆడపిల్లల తల్లి అయ్యాక తనకూ, పిల్లలకూ తల స్నానమంటే దీప్తి ఇప్పుడు ఆలోచనలో పడుతున్నారు. హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, అపార్ట్‌మెంట్‌లో బోర్ వాటర్, ఉత్తిపుణ్యానికే ఊడిపోతున్న జుట్టు మధ్య వారానికి రెండుసార్లయినా తప్పని తలస్నానం కోసం రకరకాల మార్గాలు అన్వేషించారు. భూమి గుండ్రంగా ఉన్నట్లు ఇప్పుడు మళ్ళీ ‘హెర్బల్’ ఉత్పత్తుల వైపు మొగ్గుతున్నారు. కాకపోతే, కుంకుడు కాయలు కొట్టి, నురుసు పోసుకొనే తీరిక, ఓపిక లేకపోవడంతో - కేశాలకు నష్టం చేయని హెర్బల్ షాంపూలు వాడడం మొదలుపెట్టారు.
 
చిన్నప్పుడు ఆయుర్వేద వనమూనికలున్న ‘వజ్రదంతి’ పళ్ళపొడి వాడి, పెద్దయ్యాక ఖరీదైన టూత్‌పేస్ట్‌లకు మారిన విశాఖపట్నం వాసి యాభై ఏళ్ళ శ్రీరామచంద్రమూర్తికి పంటి మీద ఎనామిల్ పోయి, ఏది నోట్లో పెట్టుకొన్నా పళ్ళు జివ్వున లాగేస్తున్నాయి. అందుకే, ఈ పంటి తీపులు తగ్గించుకోవడానికి వీలుగా మళ్ళీ చిన్నప్పటి వనమూలికల బాటపట్టారు. ఉదయాన్నే పళ్ళు తోముకోవడానికి హెర్బల్ టూత్‌పేస్ట్‌లను చేతపట్టారు.
 
ఏడున్నర పదులు దాటిన విజయవాడ విఠలేశ్వరమ్మ గారు రోజూ ఉదయాన్నే ఆరోగ్యం కోసం తీసుకొనే తేనె కోసం పెద్ద సంస్థల ప్రొడక్ట్‌లను ఇప్పుడు కాదంటున్నారు. కొడుకుకి చెప్పి, అడవి నుంచి గిరిపుత్రులు సేకరించిన ఉత్పత్తులు అమ్మే గిరిజన్ స్టోర్స్ నుంచే ఒకప్పటిలా తేనె తెప్పించుకుంటున్నారు. తిరుపతిలో ఉంటున్న వేణుగోపాలరావు ఇంట్లో ఇప్పుడు పిల్లల బిస్కెట్ల దగ్గర నుంచి ఇంట్లో వాడే గోధుమ పిండి, వగైరా దాకా ప్రతీదీ ‘పతంజలి’ హెర్బల్ ప్రొడక్టే!
 
దేశమంతటా... ‘హెర్బల్’ హవా!
ఒక్క తెలుగునాటే కాదు... ఇప్పుడు దేశమంతటా ఇదే పరిస్థితి. హెర్బల్ ప్రొడక్ట్‌లదే హవా! అనారోగ్యాలు, రకరకాల శారీరక సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్ళీ ఒకప్పటి దేశవాళీ ఆరోగ్య, ఆహార విధానాలను జనం అక్కున చేర్చుకుంటున్నారు. పర్యావరణ పరిస్థితులు, ఆహార, విహారాల్లోని సమస్యలన్నిటికీ ఔషధ ఉత్పత్తులే పరిష్కారమని నమ్ముతున్నారు. వెరసి, ‘త్వరితగతిన అమ్ముడయ్యే వినియోగదారుల ఉత్పత్తుల’ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ - ఎఫ్.ఎం.సి.జి) విభాగంలో ఇప్పుడు హెర్బల్ ప్రొడక్ట్‌ల అమ్మకాలు తారాపథానికి దూసుకుపోతున్నాయి.
 
నిజానికి, మన దేశంలో మొదటి నుంచి ఆయుర్వేద ఉత్పత్తులు, ఔషధ మూలికల ఉత్పత్తులకు పాపులారిటీ ఎక్కువే. ఆధునిక యుగంలో మధ్యలో కొంత వాటి ప్రాభవం తగ్గినట్లు అనిపించినా, ‘నేచురల్’ పద్ధతిలో అందం, ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరిగిన ఈ తరం మళ్ళీ ప్రాచీన విజ్ఞానానికే ఓటేస్తోంది. గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయిన ఆరు నెలల కాలంలో వివాదాస్పద బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని ‘పతంజలి’ సంస్థ ఉత్పత్తుల అమ్మకం ఏకంగా 64 శాతం పెరిగింది. ఇక, డాబర్, హిమాలయా లాంటి ఇతర ఔషధ ఉత్పత్తుల సంస్థల అమ్మకాలు కూడా మార్కెట్‌లో రెండంకెల్లో పెరిగాయి. టూత్‌పేస్ట్‌లు, షాంపూలు, జుట్టుకు రాసుకొనే నూనెలు - ఇలా అన్నింటిలోనూ ఇదే వరుస. కీలకమైన కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ విభాగాలన్నిటిలో వీటి మార్కెట్ వాటా బాగా పెరుగుతోందని మార్కెట్ రిసెర్చ్ సంస్థ ‘నీల్సెన్’ కూడా లెక్కలతో సహా తేల్చింది.
 
 ఎందుకీ కొత్త మోజు!
ఇంతకీ ఈ హెర్బల్ ప్రొడక్ట్‌ల అమ్మకాలకు ఉన్నట్టుండి ఇంత గిరాకీ ఎలా వచ్చినట్లు? దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. రసాయనాలతో తయారయ్యేవాటితో పోలిస్తే ఈ ఉత్పత్తుల్లో సహజ ముడి పదార్థాలు వాడతారు. ధర కూడా చౌక. పైగా, సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవని జనానికి నమ్మకం. ఆరోగ్యపరంగా లాభాలు సరేసరి. అందుకే, ప్రస్తుతం ఈ ‘నేచురల్’ ఉత్పత్తులకు తెగ పాపులారిటీ, జనంలో మోజు! అందుకు తగ్గట్లే ఇప్పుడు ఏ పచారీ సామాన్ల కొట్టుకు వెళ్ళినా, ఈ ‘నేచురల్’ ప్రొడక్ట్‌లు తెగ కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఉన్న డాబర్, ఇమామి, మ్యారికో లాంటి భారతీయ సంస్థల ఉత్పత్తులు ఎలాగూ ఉంటాయి. కొత్తగా ఆధ్యాత్మిక రంగంలోని బాబా రామ్‌దేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్ లాంటి వారి ‘పతంజలి’ తదితర సంస్థల డైలీ యూజ్ ప్రొడక్ట్‌లు దర్శనమిస్తున్నాయి.
 
మన ‘వన’ బాటలోకి... మల్టీ నేషనల్స్
విశేషం ఏమిటంటే, ఒకప్పుడు కేవలం చిన్న సంస్థలనుకున్న ఈ హెర్బల్ ప్రొడక్ట్ సంస్థలన్నీ ఇప్పుడు ఆయుర్వేదేతర సంస్థల మార్కెట్ వాటాను నెమ్మదిగా తమ వశం చేసుకుంటున్నాయి. తాజా గణాంకాలు ఆ సంగతి స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు, ‘ఫేస్ వాష్’ లాంటి ఉత్పత్తుల విభాగంలో ఆయుర్వేదేతర ప్రొడక్ట్స్ అమ్మకాల పెరుగుదల ఒక్క ఏడాదిలోనే 21 శాతం నుంచి 16 శాతానికి పడిపోయింది. ఇక, షాంపూల లాంటి వాటిలో అయితే ఆయుర్వేద బ్రాండ్‌ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ‘భారతీయ మార్కెట్ రిసెర్చ్ బ్యూరో (ఐ.ఎం.ఆర్.బి) ఇంటర్నేషనల్’ సర్వే ఈ షాంపూల కథ బయటపెట్టింది. ఈ దెబ్బకు ఇప్పటి దాకా మార్కెట్‌ను శాసించిన బడా సంస్థలు కుదేలవుతున్నాయి. దాంతో, అవి కూడా మన వనమూలికలతో ‘నేచురల్’, ‘ఆయుర్వేద’, ‘హెర్బల్’ బాట పట్టాల్సి వస్తోంది.
 గతంలో ‘ప్రామిస్’, ‘యాంకర్’, ‘అమర్’ లాంటి స్థానిక టూత్‌పేస్ట్‌లన్నీ మల్టీ నేషనల్ కంపెనీల చేతిలో నలిగిపోయాయి. కానీ ఇప్పుడు అచ్చంగా సీన్ రివర్స్ అయింది. దంత సంరక్షణ ఉత్పత్తుల్లో ‘పతంజలి’ వారి ‘దంత కాంతి’ టూత్‌పేస్ట్ నుంచి పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి ‘కాల్గేట్ - పామోలివ్’ వారు ‘వేద్ శక్తి’తో ముందుకు రావాల్సి వచ్చింది. ఉప్పు, బొగ్గుపొడితో పళ్ళు తోముకొనే భారతీయ తరహా విధానాన్ని ఒకప్పుడు తెగ విమర్శించిన బహుళ జాతి సంస్థలు ఇప్పుడు ‘యాక్టివ్ సాల్ట్ అండ్ చార్‌కోల్ టూత్‌పేస్ట్’ అంటూ అచ్చం అవే తయారుచేస్తున్నాయి. దీన్నిబట్టి పరిస్థితి ఎంత ‘నేచురల్’గా మారిందో అర్థం చేసుకోవచ్చు.
 
ఆహార ఉత్పత్తుల్లోనూ... అదే వరస!
కొన్నాళ్ళ క్రితం దాకా కేవలం చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ, దంత సంరక్షణ లాంటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ విషయంలోనే ఈ నేచురల్ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ ఉండేది. కానీ, ఇటీవలి కాలంలో ఆహారం, పానీయాలు, గృహసంరక్షణ ఉత్పత్తుల విషయంలోనూ ‘నేచురల్’ వాటి వైపే జనం మొగ్గుతున్నారు. బాబా రామ్‌దేవ్ ‘పతంజలి’ ప్రొడక్ట్స్ కేవలం ఒక్క ఏడాదిలో దాదాపు 80 శాతం మేర దేశంలో చొచ్చుకుపోవడమే అందుకు నిదర్శనం. బిస్కెట్లు, పానీయాల దగ్గర నుంచి నెయ్యి, నూనె, తేనె దాకా, గోధుమ పిండి నుంచి రకరకాల పిండ్ల దాకా అన్నింటిలో దేశవాళీ ఉత్పత్తిగా ‘పతంజలి’ ప్రత్యక్షమవుతోంది. సర్వసాధారణంగా మార్కెట్‌లో పాతుకుపోయిన బ్రాండ్‌లను కాదని, ఇలా దేశవాళీ సరుకుల వైపు జనం అంత తొందరగా రారు. కానీ, ఇప్పుడు ఆ అసాధరణ సంఘటనే జరుగుతోంది. అదే ఇప్పుడు మహా మహా మార్కెట్ పండితుల్ని సైతం ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది. ‘పతంజలి’ ప్రొడక్ట్స్ లాంటివి ఇక్కడ నుంచి కెనడా, అమెరికా, మారిషస్, బ్రిటన్ లాంటి అనేక దేశాలకు కూడా ఎగుమతి అవుతుండడం గమనించాల్సిన విషయం.  

వరుస చూస్తుంటే - తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలిలో కూడా కాలుష్యం పెరిగిపోతోందని వాపోతున్న ఆధునిక జీవన పరిస్థితుల్లో, జీవనశైలి రోగాలు పెరిగిపోతున్న రోజుల్లో - ఈ ‘నేచురల్’, ‘హెర్బల్’ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు రోజు రోజుకూ ఇంకా ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. అదే జరిగితే, ఇప్పటికే సాంప్రదాయిక హెర్బల్ ఉత్పత్తుల రంగంలో పాతుకుపోయిన సంస్థలకూ, పరిశోధన - నూతన ఉత్పత్తుల రూపకల్పన విభాగంలో బలమున్న సంస్థలకూ భవిష్యత్తు మరింత ఉజ్జ్వలంగా ఉండనుంది. మార్కెట్‌లో ఎటుచూసినా అప్పుడు ‘నేచురల్’ ప్రొడక్ట్స్‌లే! వాటిలో మెరుగైనవి ఏమిటనే కొత్త ప్రశ్న మొదలవుతుంది.
 - రెంటాల
 
ఎందెందు వెతకి చూసిన... అందందే!
ఇవాళ సామాన్య జనంతో పాటు, స్టాక్ మార్కెట్ కంపెనీల జాబితాలో లేకపోయినా మార్కెట్ నిపుణులు కూడా ఆసక్తిగా చూస్తున్న సంస్థ - ‘పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్’ (పి.ఎ.ఎల్). తలనొప్పి, కీళ్ళనొప్పులు, ఆస్త్మా, ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్ లాంటి అన్నిటికీ మందులు అందిస్తోంది. చిత్రం ఏమిటంటే, ఒక్క ఆయుర్వేదం మందుల్లోనే కాదు... ‘ఇందుగలడందు లేడని సందేహంబు వలదు’ అన్నట్లుగా  పప్పు ధాన్యాలు, మసాలా దినుసులు, చ్యవన్‌ప్రాశ్, టూత్‌పేస్ట్‌లు, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్‌లు, ఇన్‌స్టంట్ నూడుల్స్, టీ, జామ్, కార్న్‌ఫ్లేక్స్, చివరకు వృద్ధాప్యం కనపడనివ్వని యాంటీ ఏజింగ్ సౌందర్య ఉత్పత్తులు - ఇలా అన్నింటా ‘పతంజలి’ ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్రత్యక్షం. పదేళ్ళ క్రితం 2006లో రిజిస్టరైన ‘పతంజలి ఆయుర్వేద్’ సంస్థ ఏకంగా 350 రకాల ఉత్పత్తులు చేస్తోంది. చేతిలో 11 వేల పైగా సొంత దుకాణాలు, 20 వేల మందికి పైగా సిబ్బంది ఉన్నారు. హరిద్వార్ శివార్లలోని 150 ఎకరాల ప్రాంగణంలోని ఫ్యాక్టరీ నుంచి రోజూ 300 ట్రక్కుల సరుకులు రవాణా అవుతుంటాయి.  

సాంకేతికంగా చూస్తే - యోగా గురువు, టీవీ ప్రముఖుడైన బాబా రామ్‌దేవ్‌కు ఈ సంస్థలో వాటా లేదు. కానీ, నడిపేది ఆయన సహపాఠీ, శిష్యుడైన ఆచార్య బాలకృష్ణే. అలాగే ఈ ‘పతంజలి’ బ్రాండ్‌కు ఇంత పాపులారిటీ వచ్చిందంటే, అదంతా దేశవ్యాప్తంగా తన యోగా శిబిరాల్లో రామ్‌దేవ్ చేసిన మార్కెటింగ్ చలవే. దానికి తోడు బయటి ప్రొడక్ట్‌ల కన్నా వీటి రేటు కూడా సగటున 10 నుంచి 30 శాతం తక్కువ. అది కూడా కొనేవాళ్ళకు స్పెషల్ ఎట్రాక్షన్. అందుకే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఏకంగా రూ. 2 వేల కోట్ల ఆదాయం సంపాదించింది. లాభం సంగతికొస్తే, 2012 మార్చి నాటికి కోటి డాలర్ల పైగా ఉన్న ‘పతంజలి’ నికర లాభం, ఈ ఏడాది మార్చి నాటికి పదిన్నర కోట్ల డాలర్లకు దూసుకుపోయింది. రాగల రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని మరో 7 రాష్ట్రాల్లో కనీసం 1200 ఎకరాల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని ‘పతంజలి’ ప్లాన్. అందులో ఒక ఫ్యాక్టరీ అచ్చంగా విదేశాలకు ‘పతంజలి’ ఉత్పత్తుల ఎగుమతికే!
 
అప్పటి విజ్ఞానం... ఇప్పటి లేటెస్ట్ ఫ్యాషన్!
ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద, వన మూలికల విజ్ఞానం భారతీయుల సొంతం. వాటిని జీవితంలో భాగం చేసుకొన్న జీవనశైలీ ఉండేది. క్రమంగా వాటికి దూరమవుతూ వచ్చాం. అయితే, ఇటీవల కొద్ది కాలంగా బాబా రామ్‌దేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్ లాంటి ఆధునిక యోగ గురువులు ఆయుర్వేదం, యోగాలను ఆధ్యాత్మిక రంగానికి కొనసాగింపుగా పాపులర్ చేశారు. అదే సమయంలో పాశ్చాత్య వైద్య విధానంలోని లోపాలనూ, కొన్నిసార్లు జరుగుతున్న మోసాలనూ, ఆ దుష్ర్పభావాలనూ రామ్‌దేవ్ లాంటి వారు పదేపదే ప్రస్తావిస్తూ, జనంలోకి బాగా ప్రచారం చేశారు. దానికి తోడు భారతీయ సంస్కృతి, సంప్రదాయం, దేశీయత లాంటివి ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం హోరుకు సరిపోయాయి. ఖరీదైన మల్టీ నేషనల్ ప్రొడక్ట్‌ల కన్నా, చిన్నప్పుడు తాతయ్య, నాయనమ్మ చెప్పిన మన వనమూలికల విజ్ఞానంతో తయారైన ఈ హెర్బల్ ప్రొడక్ట్‌లు మిన్న అనే భావం మామూలు మధ్యతరగతి అందరిలో కలుగుతోంది. ఇవాళ్టి లేటెస్ట్ ‘హెర్బల్’ హవా వెనక ఇంత కథ ఉంది!
 
ఈ  లెక్కలే సాక్ష్యం!
భారతదేశంలో ఇవాళ ప్యాకేజ్డ్ కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్ విలువ దాదాపు రూ. 3.2 లక్షల కోట్లు  హెర్బల్ ప్రొడక్ట్స్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఒక్క ‘పతంజలి’ బ్రాండ్ ఈ ఎఫ్.ఎం.సి.జి. మార్కెట్‌లో 5 శాతం పైగా వాటా చేజిక్కించుకుంది. 2020 నాటి కల్లా అది 13 శాతానికి పెరుగుతుందని అంచనా. అదే పద్ధతిలో మిగిలిన హెర్బల్ ఉత్పత్తి సంస్థల పురోగతి సరేసరి  గత ఏడాది నవంబర్ నుంచి టీవీలో యాడ్స్ కూడా మొదలెట్టిన ‘పతంజలి’ అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి దాకా అయిదు నెలల్లో యాడ్స్‌కే దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు పెట్టినట్లు పరిశ్రమ వర్గాల అంచనా. ఈ సొంత ఉత్పత్తులన్నిటికీ తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాబా రామ్‌దేవ్ మాత్రం రూ. 60 కోట్లే ఖర్చు చేశామంటున్నారు  గడచిన నాలుగేళ్ళలో ‘పతంజలి’ పెరుగుదల ఏకంగా 1011 శాతం అన్న లెక్క చూశాక, ఆయుర్వేదేతర సంస్థలకు దిమ్మదిరిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement