భక్తితో ఆరోగ్యం.. ఆయుష్షు! | Teachings and services were ideal for others | Sakshi
Sakshi News home page

భక్తితో ఆరోగ్యం.. ఆయుష్షు!

Published Sat, Jun 16 2018 12:18 AM | Last Updated on Sat, Jun 16 2018 12:18 AM

 Teachings and services were ideal for others - Sakshi

ఆధ్యాత్మిక భావనలతో ఉంటూ, బోధలు, సేవలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండేవారు మిగిలిన వారితో పోలిస్తే ఓ నాలుగైదేళ్లు ఎక్కువకాలమే జీవిస్తున్నారని పాశ్చాత్య దేశాలలో జరిగిన తాజా పరిశోధననలో వెల్లడయింది!

ప్రపంచ గమనం వేగంగా మారింది. ఏదో సాధించాలనే తపన, ఎక్కడికో వెళ్లాలన్న హడావిడి.. ఏదో చేసేయాలన్న ఆత్రుత, తలపెట్టిన పని సవ్యంగా జరుగుతుందో లేదోనన్న ఆందోళన.. ఫలితంగా రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, వాతం వంటి రుగ్మతలు కమ్ముకొస్తాయి. దానికి తోడు నిర్వేదం, నిరాశ, మానసిక ఒత్తిడి మనిషిని మరింతగా కుంగదీస్తాయి. ఈ దౌర్బల్యం మనస్సును అంటకుండా ఉండడానికే యోగులు, రుషులు ధ్యానం చేసేవారు. ఈ సత్యాన్ని  తెలుసుకున్న ఆధునికులు కూడా ఇప్పుడు యోగ, ధ్యానం చేయడాన్ని, ఆధ్యాత్మిక భావాలతో జీవించడాన్నీ అలవరచుకున్నారు. తద్వారా ఆయుష్షును పెంచుకోగలుగుతున్నారు. ఎందుకంటే, ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగ సాధన చేసేవారు శరీరాన్నే కాదు, మనస్సును కూడా అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. ‘యోగ’సాధన వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. చేసే పనిపై ఇష్టం, ఆసక్తి పెరుగుతాయి. శరీరం బరువు తగ్గి, చురుకుదనం ఏర్పడుతుంది. శారీరక రుగ్మతలు ముఖ్యంగా, రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పుల వంటివి దరిచేరవు. వైద్యశాస్త్రానికి కూడా అంతుచిక్కని కొన్ని సమస్యలకు యోగ, ధ్యానం పరిష్కారం చూపుతున్నాయి.

యోగ సాధనలు మనస్సు, భావాలను నియంత్రించడానికి సాయపడతాయి. తద్వారా గర్వం, ఈర్ష్య, అసూయ, కోపం, వ్యామోహం వంటి భావాలు నశించి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా బీపీ, షుగర్, థైరాయిడ్‌ వంటి జబ్బులు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ఆరోగ్యంగా ఉండేవారి ఆయుఃప్రమాణం ఎలాగూ మిగతావారితో పోలిస్తే అంతో ఇంతో అధికంగానే ఉంటుంది. దాంతో ధ్యానం, యోగం, ఆధ్యాత్మిక సాధనలు కేవలం కొన్ని వర్గాలకు లేదా దేశాలకు  మాత్రమే పరిమితం కాలేదు. పాశ్చాత్య దేశాలకు సైతం పాకిపోయాయి. అందుకే కాబోలు, ఇంచుమించు అన్ని దేశాలలోనూ వివిధ యోగా పద్ధతులు, ఆధ్యాత్మిక బోధనలు విభిన్న రకాల వ్యక్తిత్వ వికాస పాఠాల దిశగా ఊపిరి పోసుకుంటున్నాయి. అయితే, ఇక్కడ ఆధ్యాత్మికత అనేదానిని మనం ఎలాగైతే మానవ సేవే, మాధవ సేవ అని అంటున్నామో, అక్కడి వారు కూడా సామాజిక సేవగా మార్చుతున్నారు. బిల్‌గేట్స్, రాక్‌ఫెల్లర్‌ వంటి వారు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి సామాజిక సేవకు ప్రాణం పోస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌లలో కొన్ని తాజా సర్వేలలో తేలినది ఏమంటే, ఆధ్యాత్మికంగా ఉంటూ, బోధలు, సేవలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండేవారు మిగిలిన వారితో పోలిస్తే ఓ నాలుగైదేళ్లు ఎక్కువకాలమే జీవిస్తున్నారట. అన్నింటికీ ఆ భగవంతుడే అండగా ఉన్నాడు అనే భావనే వారిలో ఆయుష్షు పోస్తోందేమో మరి!
– డి.వి.ఆర్‌. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement