సీన్లో ‘పడ్డారు’ | Telugu Heros Injured While Shooting | Sakshi
Sakshi News home page

సీన్లో ‘పడ్డారు’

Published Tue, Jun 18 2019 8:16 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Telugu Heros Injured While Shooting - Sakshi

ఫైటింగ్‌ జరుగుతూ ఉంటుంది. కెమెరా క్లోజప్‌ నుంచి లాంగ్‌ షాట్‌కు మారుతుంది. అంటే డూప్‌ వచ్చాడని అర్థం. అంతవరకూ క్లోజప్‌లో హీరో ఒక స్పీడ్‌తో చేస్తుంటాడు. లాంగ్‌ షాట్‌లో డూప్‌ అంతకు మించిన స్పీడ్‌తో చేస్తుంటాడు. ప్రేక్షకులకు హీరో ఎవరో డూప్‌ ఎవరో తెలిసిపోతూ ఉంటుంది. అయినప్పటికీ డూప్‌తో పాటుగానే హీరోని యాక్సెప్ట్‌ చేసేవారు. కాని రాను రాను రోజులు మారాయి. సొంతంగా ఫైట్స్‌ చేసుకునేవారికి విలువ పెరిగింది. తెలుగులో చిరంజీవి ఇలాంటి ధోరణికి తెర తీశారు. ‘గూండా’ సినిమాలో ఆయన రైలు కింద కడ్డీ పట్టుకుని ఒరిజినల్‌గా చేసిన స్టంట్‌ అప్పట్లో న్యూస్‌కెక్కింది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కూడా ఫైట్స్‌లో డూప్‌ లేకుండా తన సత్తాను చూపించారు. సుమన్, భానుచందర్‌లాంటి హీరోలు రియల్‌ ఫైట్స్‌తో జనాన్ని ఆకర్షించారు.

రాను రాను స్టంట్స్‌లో సేఫ్టీ మెజర్స్‌ పెరిగాయి. చాలా జాగ్రత్తలు తీసుకొని ఫైట్స్‌ను కంపోజ్‌ చేస్తున్నారు. కనుక హీరోలు కూడా డూప్‌ల అవసరం లేకుండా తామే ఫైట్స్‌ చేస్తామని ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కుర్ర హీరోలు కయ్యానికి ఒరిజినల్‌గా కాలు దువ్వుతున్నారు.  ‘నా స్టంట్స్‌ నేనే చేసుకుంటా’ అని  బిల్డింగులు దూకుతున్నారు. అయితే ఇలాంటి రిస్క్‌తో కూడుకున్న యాక్షన్‌ సన్నివేశాలకు ఊహించని ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది. జాగ్రత్తలు పాటించినా అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే, కట్టిన తాడు గట్టిగా నిలవకపోతే గాయాలతో బెడ్‌ మీద పడాల్సిందే. అనుకోకుండా ఈ ఏడాది మన టాలీవుడ్‌లో చాలా మంది యంగ్‌ హీరోలు గాయాలపాలయ్యారు. వారం వ్యవధిలోనే నలుగురు హీరోలు ప్రమాదాలకు గురయ్యారు. విలన్లను దెబ్బ తీయాల్సిన వీళ్లు ఇలా దెబ్బలు తగిలించుకోవడం ఇటు అభిమానులకు, అటు ఇండస్ట్రీకూ కలవరమే.

గాయాల గూఢచారి
శత్రువుల రహస్యాలను చేధించడానికి గూఢచారి ప్రాణాలకు తెగించాల్సి ఉంటుంది. ప్రమాదం ఏ దిక్కు నుంచి వస్తుందో ఊహించలేం. ప్రస్తుతం అలాంటి గూఢచారి పాత్రనే ‘చాణక్య’ సినిమాలో పోషిస్తున్నారు గోపీచంద్‌. తిరు దర్శకత్వం వహి స్తున్న ఈ స్పై సినిమా కోసం పాకిస్తాన్‌–ఇండియా బోర్డర్‌లో షూటింగ్‌ చేశారు. అక్కడ ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని చేస్తూ గోపీచంద్‌ గాయపడ్డారు. గాయం తీవ్రమైంది కావడంతో 45 రోజులు విశ్రాంతి తీసుకుని, మళ్లీ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ కంగార్‌
మనకున్న టాప్‌ కమర్షియల్‌ డైరెక్టర్స్‌లో అతి పెద్ద హింసావాది రాజమౌళి. ఆయన సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాలు చూస్తే ఆ మాట అనకుండా ఉండలేం. ‘మగధీర’లో వందమందితో ఫైట్,  ‘విక్రమార్కుడు’ ఇంటర్వెల్‌ సీన్, ‘బాహుబలి’లో యుద్ధ సన్నివేశాలు ఒక్కసారి గుర్తుచేసుకోండి. తాజాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే పీరియాడికల్‌ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ మొదలైన కొన్ని రోజుల్లోనే చరణ్, ఎన్టీఆర్‌ ఇద్దరూ గాయపడ్డారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ చరణ్‌ గాయపడగా, ఫైట్‌ సీన్‌ చేస్తున్న సమ యంలో ఎన్టీఆర్‌ చేతికి గాయం అయింది. దీంతో ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి చిన్న బ్రేక్‌ వచ్చింది. ఇటీవలే కోలుకున్న ఈ హీరోలు మళ్లీ షూట్‌లో జాయిన్‌ అయ్యారు. రాజమౌళి హీరోలు గాయపడటం చాలా సాధారణమే. ‘మగధీర’లో రామ్‌చరణ్, ‘బాహుబలి’లో ప్రభాస్‌ గాయాలపాలయ్యారు. 

గ్యాంగ్‌లీడర్‌కు గాయం 
‘మనం’, ‘24’ ఫేమ్‌ విక్రమ్‌ కె.కుమార్‌ ప్రస్తుతం నానీని ‘గ్యాంగ్‌లీడర్‌’గా మార్చారు. ఈ సినిమాలో ఓ యాక్షన్‌ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా నాని గాయపడ్డారు. ప్రస్తుతం రెస్ట్‌ తీసుకుంటున్న నాని త్వరలోనే  షూటింగ్‌కు సిద్ధమవుతారు. ‘జెర్సీ’లోనూ క్రికెట్‌ ఆడుతూ ముక్కుకి గాయం చేసుకున్నారు నాని.

వారం గ్యాప్‌లో నలుగురు
హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ ‘వాల్మీకి’గా మారిన సంగతి తెలిసిందే. షూటింగ్‌లో పాల్గొన డానికి హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వెళుతున్నప్పుడు ఆయన ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో పెద్ద గాయాలేమీ అవలేదని టీమ్‌ తెలిపింది. గతంలో ‘మిస్టర్‌’ షూటింగ్‌ సమయంలోనూ కాలికి గాయం చేసుకున్న సంగతి తెలిసిందే. విలన్లను పట్టుకోవడానికి వైజాగ్‌ వీధుల్లో పరిగెడుతున్నాడు నాగశౌర్య. అతçను హీరోగా నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం కోసం బిల్డింగ్‌ మీద నుంచి జంప్‌ చేసే సీన్‌లో డూప్, రోప్‌ ఏదీ లేకుండా స్వయంగా దూకారు శౌర్య. దాంతో కాలికి బలమైన గాయం కావడంతో 25 రోజులు రెస్ట్‌ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. 

తెనాలికి తగిలింది
మాటల్ని మెలికలు తిప్పడం తెనాలి రామకృష్ణుని పని. కానీ మాటలు సరిపోవని యాక్షన్‌లోకి దిగారు. కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా చేస్తున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ ఎల్‌.ఎల్‌.బి’. కర్నూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో బాంబ్‌ బ్లాస్ట్‌లో జరిగిన తప్పిదం వల్ల గాజు పెంకులు సందీప్‌ కిషన్‌ ఛాతీకి, చేతికీ గుచ్చుకున్నాయి. కంటి కింద కూడా గాజు పెంకులు గుచ్చు కున్నాయని తెలిసింది. ‘96’ రీమేక్‌ షూటింగ్‌ కోసం థాయ్‌ల్యాండ్‌లో స్కై డైవింగ్‌కు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నారు శర్వా. మూడు రోజులు ప్రాక్టీస్‌ బాగానే సాగింది. డైవ్‌ చేసి, నేల మీదకు ల్యాండవుతూ గాయపడ్డారు శర్వా. భుజం దగ్గర ఫ్రాక్చర్‌ అయింది. సోమవారం సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, విశ్రాంతి తర్వాత షూట్‌లో జాయిన్‌ అవుతారని శర్వా సన్నిహితులు తెలిపారు. 

కామ్రేడ్‌ కూడా
విజయ్‌ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ సినిమాలో వేగంగా వెళ్లే రైలుని ఎక్కే సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో స్లిప్‌ అయ్యి ప్లాట్‌ఫామ్‌ మీద పడటంతో విజయ్‌ గాయపడ్డారు. ‘జీవితంలో ఏదీ ఊరికే రాదు. చివరికి గాయాలు కూడా. వాటిని కూడా మనం సెలబ్రేట్‌ చేసుకోవాలి’ అంటూ స్పిరిట్‌ చూపించారు విజయ్‌. 

కల్కికీ దెబ్బలు తగిలాయి
రాజశేఖర్‌ లేటెస్ట్‌ చిత్రం ‘కల్కి’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్‌ మూవీను ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించారు.  ఈ సినిమా షూటింగ్‌ సమయంలో రాజశేఖర్‌ తలకు, భుజానికి గాయమైంది. సీన్‌ కంప్లీట్‌ చేసిన తర్వాతే డాక్టర్‌ దగ్గరికి వెళ్లారాయన. గతంలో ‘మగాడు’ షూటింగ్‌ సమయంలో పెద్ద ప్రమాదం ఏర్పడటంతో చాలా కాలం విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక సుందర్‌ సి. దర్శకత్వంలో సినిమా చేస్తున్న విశాల్‌ ఇటీవల ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. టర్కీలో ఓ గ్రాండ్‌ చేజింగ్‌ సీన్‌ చిత్రీకరణ సమయంలో విశాల్‌ బైక్‌ స్కిడ్‌ కావడంతో కాలికి పెద్ద గాయం అయి, షూటింగ్‌కు బ్రేక్‌ పడింది.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే...
‘బాహుబలి’ చిత్రీకరణలో ప్రభాస్‌ రెండుసార్లు గాయపడ్డారు. ‘లక్ష్మీ కల్యాణం’ సినిమా షూటింగ్‌లో కాలికి గాయం చేసుకున్నారు కల్యాణ్‌రామ్‌. ‘ఆచారి అమెరికా యాత్రలో’ కోసం మలేషియాలో యాక్షన్‌ సీన్‌ తీస్తున్నప్పుడు బైక్‌ కంట్రోల్‌ తప్పడంతో మంచు విష్ణు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ఇతర హీరోలందరూ ఏదో ఒక షూటింగ్‌లో గాయాలపాలైనవారే.

ఎన్టీఆర్‌ – ఏయన్నార్‌ – కృష్ణ
ఎద్దుతో ఫైట్‌ చేయాలి. హీరో అంటే రిస్క్‌ అవుతుందేమో. డూప్‌తో చేయిద్దామంటే హీరో ఒప్పుకోవాలి కదా. నిజమైన ఎద్దుని తీసుకు రండి అన్నారు ఎన్టీఆర్‌. ఫైట్‌ మొదలైంది. ఎద్దు కొమ్ములతో ఫైట్‌. ఆ పోరాటంలో ఎన్టీఆర్‌ కుడి చెయ్యి విరిగింది. పుత్తూరు కట్టు కట్టారు. ఆ తర్వాత ‘లక్ష్మీ కటాక్షం’ షూటింగ్‌లో ఇదే చెయ్యికి దెబ్బ తగిలింది. ఎన్టీఆర్, జగ్గారావు మీద ఫైట్‌ సీన్‌ తీయడానికి రెడీ అవుతోంది యూనిట్‌. జగ్గారావు కత్తి ఫైట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అనుకోకుండా కత్తి ఎన్టీఆర్‌ కుడి చేతికి తగిలింది. ఇంకోసారి ‘సర్దార్‌ పాపారాయుడు’ షూటింగ్‌లోనూ ఇదే చేతికి ప్రమాదం జరిగింది. మోటార్‌ బైక్‌పై ఎన్టీఆర్‌ వెళ్లే సీన్‌ తీస్తుండగా కింద పడి పోయారు. విశ్రాంతి తీసుకోవాల్సినంత గాయమే అయినా అప్పటొకే ‘గజదొంగ’తో పాటు మరికొన్ని సినిమాలు ఒప్పుకుని ఉండటంతో మొండిగా షూటింగ్‌ చేశారు.

కుటుంబ కథలతో పోల్చితే అక్కినేని నాగేశ్వరరావు యాక్షన్‌ సినిమాలు చేసింది తక్కువ. అందుకని పెద్దగా ప్రమాదాలు ఎదుర్కోలేదు. కానీ ‘అదృష్టవంతులు’ సినిమా కోసం ట్రైన్‌ మీద ఫైట్‌ తీస్తున్నప్పుడు ఆయనకు గాయమైంది.  ఇక సూపర్‌ స్టార్‌ కృష్ణ విషయానికొస్తే.. ‘సిరిపురం మొనగాడు’ అప్పుడు ఆయనకు పెద్ద ప్రమాదం జరిగింది. ఊటీలో ఓ ఫైట్‌ సీన్‌లో భాగంగా కృష్ణ ఫిరంగి గొట్టంలోంచి చూస్తూ పేల్చాలి. పేల్చారు. అయితే అది రివర్స్‌లో పేలింది. కృష్ణ ఒక్కసారిగా వెనక్కి జరిగారు. లేకపోతే ముఖం ఛిద్రం అయ్యుండేది. అయితే గుండు వెళ్లి ఛాతీకి తగిలింది. అప్పటికప్పుడు ఆయన్ను చెన్పైలోని ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేశారు. దాదాపు నెల రోజులు కృష్ణ విశ్రాంతి తీసుకుకోవాల్సి వచ్చింది. ఆ తరంలో ఇతర హీరోలకు కూడా అడపా దడపా ఇలాంటి ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి.

చిరంజీవి–బాలకృష్ణ–నాగార్జున–వెంకటేశ్‌
‘బావగారు బాగున్నారా’లో బంగీ జంప్‌ చేయడం నుంచి అంతకుముందు, ఆ తర్వాతి సినిమాల కోసం చిరంజీవి రిస్కులు తీసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ‘సంఘర్షణ’ సినిమా సమయంలో ఓ ఫైట్‌ సీన్‌ తీస్తున్నప్పుడు ఆయన నడుముకి దెబ్బ తగిలింది. డూప్‌ లేకుండా ఫైట్స్‌ చేయడానికే బాలకృష్ణ మొగ్గు చూపుతారు. ‘బాబాయ్‌ అబ్బాయ్‌’ సినిమాలో హీరోయిన్‌ అనితా రెడ్డి హీరో బాలకృష్ణను కారుతో ఢీ కొట్టే సీన్‌ ఆ సినిమా చూసినవారికి గుర్తుండి ఉంటుంది. అనితాకి కారు నడపడం తెలియదు. అప్పటికప్పుడు నేర్చుకుని నడిపింది. కానీ సీన్‌ తీసేటప్పుడు నిజంగానే బాలకృష్ణను ఢీ కొడితే అమాంతం ఎగిరి పడ్డారు. అలాగే ‘భార్యా భర్తల బంధం’ సినిమాలో గోడ మీద నుంచి దూకే సీన్‌లో స్లిప్‌ అవ్వడంతో కాలు ఫ్రాక్చర్‌ అయింది. ఆ తర్వాత ‘విజయేంద్ర వర్మ’ షూటింగ్‌ అప్పుడు కూడా కాలు ఫ్రాక్చర్‌ కావడంతో దాదాపు రెండు నెలలు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. నాగార్జున, వెంకటేశ్‌లు కూడా అప్పుడప్పుడూ చిన్న చిన్న ప్రమాదాలకు గురయ్యారు. ఎక్కువగా యాక్షన్‌ సీన్స్‌ చేయడంతో నాగార్జున మోకాలి నొప్పి ఉండేది. అలాగే సినిమాలు కంటిన్యూ చేస్తూ తర్వాత ఎప్పుడో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. వెంకటేశ్‌కి కూడా చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి.

దెబ్బకు క్లైమాక్స్‌ మార్చేశారు
1983లో ‘కూలీ’ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. ప్రాణం పొయేంత. ఫైట్‌ చేస్తూ టేబుల్‌ మీద జంప్‌ చేయాలి అమితాబ్‌. జంప్‌ చేసేటప్పుడు జరిగిన రాంగ్‌ క్యాలిక్యులేషన్‌ వల్ల టేబులు అంచు అమితాబ్‌ పొట్టలో గుచ్చుకుంది. పేగులను చీల్చేసింది. కొన్ని సర్జరీలు తర్వాత మళ్లీ స్పృహలోకి వచ్చారాయన. ఆ సంఘటనను ఉద్దేశిస్తూ ‘మరో జన్మ’ అంటారు బిగ్‌ బి. విశేషం ఏంటంటే ముందు అనుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం అమితాబ్‌ పాత్ర క్లైమాక్స్‌లో చనిపోతుంది. ఈ ప్రమాదం తర్వాత హీరో పాత్ర చనిపోతే బావుండదని చిత్రబృందం క్లైమాక్స్‌ను మార్చేసింది. 

సూపర్‌ కారు తెచ్చిన ప్రమాదం
నూటొక్క జిల్లాల అందగాణ్ణి అనేది ఓ సినిమాలో నూతన్‌ ప్రసాద్‌ పంచ్‌ డైలాగ్‌. అదే కాదు  ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’ అనేది కూడా పాపులర్‌. అయితే ‘బామ్మ మాట బంగారు బాట’ సినిమాలో చేసిన సూపర్‌ కార్‌ విన్యాసం ఆయన్ను వీల్‌ చైర్‌కి పరిమితం చేసింది. సూపర్‌ కార్‌ గాల్లో తేలే సన్నివేశంలో క్రేన్‌ కేబుల్‌ కట్‌ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. నడుము కింద భాగం పక్షవాతానికి గురై వీల్‌చైర్‌లో స్థిరపడ్డారు. ఆ తర్వాత పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశారాయన.  

హీరోయిన్లు కూడా
స్క్రిప్ట్‌ కోరితే సుకుమారాన్ని పక్కన పెట్టి స్టంట్స్‌ను ఓ పట్టు పట్టడానికి రెడీ అంటున్నారు హీరోయిన్లు. ఆ స్టంట్స్‌ చేస్తూ గాయాల పాలవుతున్నారు. లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘మణికర్ణిక’ షూటింగ్‌ సమయంలో చాలాసార్లు గాయపడ్డారు కంగనా రనౌత్‌. ఆమె ముఖానికి గాయం అయింది. గుర్రపు స్వారీ సన్ని వేశాల్లో కాలు ఫ్రాక్చర్‌ చేసుకున్నారు. ‘అదో అంద పరవై పోల’ అనే అడ్వెంచర్‌ డ్రామా చేస్తున్న అమలా పాల్‌ చిత్రీకరణ సమయంలో  చేతి వేళ్లను విరగ్గొట్టుకున్నారు. ‘బ్రహ్మాస్త్రా’ సినిమా షూటింగ్‌ సమయంలో మోచేతిని ఫ్రాక్చర్‌ చేసుకున్నారు ఆలియా భట్‌.  ‘భారత్‌’లో దిశా పాట్నీ సర్కస్‌ ట్రూప్‌లో పని చేసే పాత్రలో కనిపించారు. ఈ పాత్ర కోసం చాలా శిక్షణ తీసుకున్నారు. ఈ సీన్లు చిత్రీకరిస్తున్నప్పుడు మోకాలికి గాయం చేసుకొని కొన్ని రోజులు రెస్ట్‌లో ఉన్నారు. ‘హాఫ్‌ గాళ్‌ఫ్రెండ్‌’ షూటింగ్‌లో శ్రద్ధాకపూర్‌ కాలికి గాయం అయింది. ‘స్పైడర్‌’ షూటింగ్‌ సమయంలో రకుల్‌ వేలికి గాయం అయింది. ‘కబాలి’లో రజనీకాంత్‌ కుమార్తెగా నటించిన ధన్సికకు ఫైట్‌ సన్నివేశాల్లో బీర్‌ బాటిల్‌ గాజు ముక్క గుచ్చుకుంది. హన్సిక తాజా చిత్రం ‘మహా’. ఈ సినిమాలోని ఫైట్‌ సన్నివేశంలో సమ్మర్‌సాల్ట్‌ కొడుతూ స్లిప్‌ అయి కాలికి గాయం చేసుకున్నారు హన్సిక.

ఏది ఏమైనా కట్టిన కట్టు విడిచి, పట్టిన పట్టు విడవకుండా మన హీరోలు మరింత స్ట్రాంగ్‌గా తిరిగి రావాలని, మరిన్ని స్టంట్స్‌తో మనల్ని ఎంటర్‌టైన్‌ చేయాలని కోరుకుందాం. అభిమానుల చప్పట్లు, విజిల్సే హీరో హీరోయిన్ల దెబ్బలు నయం చేసే సంజీవని.


గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement