బంగారు లక్ష్ములు | Telugu Serial Banagaru Panjaram Starts In Star Ma Tv | Sakshi
Sakshi News home page

బంగారు లక్ష్ములు

Published Wed, Oct 23 2019 4:47 AM | Last Updated on Wed, Oct 23 2019 4:47 AM

Telugu Serial Banagaru Panjaram Starts In Star Ma Tv - Sakshi

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మధురగా కల్పిత సుపరిచితమే. ఇప్పుడు చెల్లి లిఖిత ‘బంగారు పంజరం’తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతోంది. బెంగుళూరులో పుట్టి తెలుగు బుల్లితెర ద్వారా ఆకట్టుకుంటున్న ఈ అక్కాచెల్లెళ్ల టీవీ ప్రయాణం గురించి వారి మాటల్లోనే..

‘మా నాన్న బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌. అమ్మ గృహిణి. అక్క, నేను.. ఇదీ మా కుటుంబం. అక్క కాలేజీ రోజుల్లో నటిస్తూనే పీజీ పూర్తి చేసింది. ‘ఒకరికి ఒకరు’ సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన కల్పిత కన్నడ సీరియల్స్‌లోనూ నటిస్తోంది. మా ఇంట్లో తను ఎంత చెబితే అంత. తనే నాకు అన్ని విషయాల్లో అడ్వైజర్‌. మోడల్‌.

మంచితనమే ఆభరణంగా!
‘స్టార్‌ మా టీవీలో వచ్చే ‘బంగారు పంజరం’ సీరియల్‌లో మహాలక్ష్మిగా నటిస్తున్నాను. ఈ సీరియల్‌లోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నేనే పెద్దదాన్ని. అమ్మానాన్నలు చనిపోవడంతో కుటుంబం అంతా తాత బ్రహ్మయ్య బొమ్మల తయారీమీద వచ్చిన ఆదాయంతోనే బతుకుతుంటుంది. తాత బొమ్మలతో పాటు చిన్న చిన్న నగలను కూడా తయారు చేసి అమ్ముతుంటాడు. పేదరికంలో ఉన్నా మా సంతోషాలకు ఎలాంటి లోటూ లేదు. ఒకసారి జమిందారీ కుటుంబం ఆ గ్రామంలోని దేవాలయంలో దేవతా విగ్రహాలను ప్రతిష్టించడానికి పూనుకుంటుంది. అందుకు విగ్రహాలు, నగలు చేయమని ఆ పనిని మా తాతకు అప్పజెబుతుంది. పని అంతా పూర్తి చేస్తాడు మా తాత. ఇది గిట్టని వాళ్లు విగ్రహప్రతిష్టకు ముందు రోజు నన్ను కిడ్నాప్‌ చేస్తారు.

రోజంతా ఒక ఇంట్లో ఉంచి,  మరుసటి రోజు వదిలేస్తారు. అందరూ మహాలక్ష్మి శీలాన్ని శంకిస్తుంటారు. దీంతో తాత బ్రహ్మయ్య చాలా బాధపడతాడు. తమవల్ల బ్రహ్మయ్య కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఆ పేరు పోగొట్టడానికి తమ కంపెనీ మేనేజర్‌తో మహాలక్ష్మిని పెళ్లి చేసుకోమని చెబుతాడు జమిందార్‌. కానీ పెళ్లి సమయానికి ఆ మేనేజర్‌ పారిపోవడంతో జమిందారే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. జమిందార్‌ ఇంట్లో ఇల్లాలిగా అడుగుపెట్టిన మహాలక్ష్మికి అప్పటికే అతనికి పెళ్లయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసి షాకవుతుంది. అలా బంగారు పంజరంలో చిక్కుకుపోయి విలవిల్లాడుతుంది. ఎంతో అమాయకత్వం, మరెంతో మంచితనం గల అమ్మాయి మహాలక్ష్మి పాత్ర పోషిస్తున్నందుకు, ఇలా మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

చదువంటేనే ఇష్టం
అక్క నటిగా మారి నాకూ ఓ మార్గం వేసింది.. అని ఈ సీరియల్‌ ద్వారా అర్థమైంది. నాచేత ఫొటో షూట్స్‌ చేయించడం, ఫొటోగ్రాఫ్స్‌ సీరియల్‌ టీమ్స్‌కి పంపించడం.. అన్నీ తనే చూసుకుంది. అయితే, ముందు ఇదంతా నాకు తెలియదు. తను చేయమన్నట్టు చేసేదాన్ని. ఒక రోజు సీరియల్‌ టీమ్‌ అడుగుతున్నారు, అందులో యాక్ట్‌ చే యాలి అని తను నన్ను అడిగినప్పుడు చదువంటేనే ఇంట్రస్ట్‌ అని చెప్పాను. అవకాశాలు అందరికీ రావు, వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అని తనే నచ్చజెప్పింది. నా చదువుకి ఇబ్బంది లేకపోతే ఓకే అన్నాను. ఎందుకంటే ఇప్పుడు బీకామ్‌ సెకండియర్‌ చదువుతున్నాను. సీఎ చేద్దామన్నది నా ఫ్యూచర్‌ ప్లాన్‌. మా లెక్చరర్స్, ఫ్రెండ్స్‌ని కలిసి అక్కనే మాట్లాడింది. వాళ్లూ సపోర్ట్‌ చేస్తామన్నారు. అక్క నా పట్ల చూపిస్తున్న శ్రద్ధ కాదన లేక నటిగానూ ప్రూవ్‌ చేసుకుందామని ఇలా యాక్టింగ్‌ వైపు వచ్చాను.

లలిత సంగీతం
చదువుతోపాటు పాటలు పాడటం, డ్యాన్స్‌ చేయడం, పెయింటింగ్స్‌ వేయడం.. వీటి కోసం ఎన్ని గంటల సమయమైనా కేటాయిస్తాను. సింగర్‌గానూ రాణించాలని తొమ్మిదేళ్ల పాటు లలిత సంగీతం నేర్చుకున్నాను. అక్క మాటను కాదనలేక  ఒక సీరియల్‌ అనుకున్నాను. కానీ, నటిగా రాణించడంలోనూ, ప్రూవ్‌ చేసుకోవడంలోనూ నూటికి నూరుపాళ్లు ఇన్‌వాల్వ్‌ అవుతున్నాను. ఇదే ఇకముందు నా ప్రపంచం అనిపిస్తోంది. ఇప్పుడు బాగుంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. నేనూ అక్కలా పీజీ చేసి ఈ ఇండస్ట్రీలోనే స్థిరపడాలని, మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలని ఇప్పుడు అనుకుంటున్నాను.
– ఆరెన్నార్‌

ఇద్దరిదీ ఒకే మాట
మా ఇద్దరి అక్కచెల్లెళ్లది ఒకే మాట. ఇద్దరం సీరియల్స్‌ చూస్తాం. సీరియస్‌గా డిస్కషన్‌ చేస్తుంటాం. అందులోని నటీనటుల యాక్టింగ్‌ గురించి, వారి క్యాస్ట్యూమ్స్‌ గురించి... ప్రతీది చర్చిస్తుంటాం. ఇద్దరం యాక్టింగ్‌ పీల్డ్‌లో ఉన్నాం కాబట్టి నటనలో మెలకువల గురించి, ఎలా చేస్తే ఫ్యూచర్‌ బాగుంటుందో మాట్లాడుకుంటూ ఉంటాం. మా అమ్మానాన్నలు మా ఇద్దరి గురించి ఎవరితోనైనా చెప్పేటప్పుడు ‘మా ఇంటి బంగారు లక్ష్ములు’  అని గర్వంగా చెబుతుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement