ప్రేమించుకోవడం... ప్రమాణాలు చేసుకోవడం...
నువ్వు లేనిదే నేను బతకలేను... నీతోనే నాజీవితం...
నేను ముందే చనిపోతే...
నిన్ను కూడా నా వెంటే తీసుకువెళతాను...
అంతేకాని...
ఒంటరిగా బతకను... బతకలేను...
ఇటువంటి మాటలు ప్రేమికుల మధ్య సర్వసాధారణం...
కాని ఈ మాటలే నిజమైతే ఏమవుతుందో...
‘స్విచ్’ లఘుచిత్రం ద్వారా చూపాడు వై. వెంకట్‌రెడ్డి
డెరైక్టర్స్ వాయిస్
మాది ప్రకాశంజిల్లా కందుకూరు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఏ సినిమా విడుదలైనా తప్పకుండా చూసేవాడిని. పెరిగి పెద్దయ్యాక సినిమా మీద ఉన్న అభిమానం కాస్తా సినిమా తీయాలనే ఆకాంక్షగా మారింది. డిగ్రీ పూర్తయ్యాక చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఇంటర్‌ఫేస్ డిజైనర్‌గా పని చేసి, ప్రస్తుతం ఉద్యోగం మానేశాను. సినిమాల మీదే మనసు లగ్నం చేస్తున్నాను. తెలుగు చలనచిత్రం రంగంలో మంచి దర్శకుడిగా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. మా తల్లిదండ్రులు, స్నేహితులు నాకు ఎంతగానో సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తు న్నారు. హారర్ సినిమా తక్కువ నిడివిలో ఉంటే ప్రేక్షకులను భయపెట్టడం కష్టమైన విషయమని చిత్రసీమకు చెందిన కొందరు మిత్రులు సలహా చెప్పడంతో, వారి మాటలను చాలెంజ్‌గా తీసుకుని ఈ సినిమా తీశాను. ఈ కథ నేపథ్యం గురించి చెప్పాలంటే... మనం సాధారణంగా చూసే స్విచ్ దానంతట అదే ఆన్/ఆఫ్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ చిత్రం తీయడానికి మొదటి అడుగు వేశాను. నా మిత్రుడు వంశీ ఈ సినిమాకి ఆర్థిక సహాయం అందచేశాడు. ఈ సినిమా కోసం మేము పదిరోజులు కష్టపడ్డాం. కొన్ని కొన్ని సార్లు సీన్లు అనుకున్న విధంగా రాకపోతే మళ్లీ మళ్లీ చిత్రీకరించాం. మా కెమెరామెన్ రమేష్ తన పూర్తి సహకారం అందించటం వల్ల సినిమా బాగా తీయగలిగాం. లో బడ్జెట్ సినిమా కావడంతో, ఈ చిత్రానికి ఎడిటింగ్ నేనే చేశాను. ఇంటర్‌నెట్‌లో నుంచి మ్యూజిక్ తీసుకుని మిక్స్ చేశాను. సినిమాని యూ ట్యూబ్‌లో పెట్టిన తర్వాత, చిత్రాన్ని చూసినవారంతా ‘మంచి హారర్ ఫిల్మ్ తీశావు’ అని నన్ను మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ‘కిడ్నాప్’ అనే కామెడీ చిత్రం చేస్తున్నాను.
షార్ట్‌స్టోరీ
కొత్తగా ఇంట్లోకి వచ్చిన వ్యక్తికి... ఆ ఇంట్లో భయానకమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో స్విచ్ దానంతట అదే ఆన్ అయ్యి అతడిని భయపెడుతుంది. లైట్ ఎన్నిసార్లు ఆపినా మళ్లీ వెలుగుతూ ఉంటుంది, మళ్లీ దానంతట అదే ఆరిపోతూ ఉంటుంది. క్రమేణా ఒక ఆడగొంతు ఏడుస్తూ వినిస్తుంది. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తోందో, ఎవరిదో అర్థం కాదు. భయపడుతూనే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూంటాడు. ఆ క్రమంలో, జరిగిన సంగతులకు కారణం దెయ్యం అని తెలుస్తుంది. ఆ దెయ్యం ఎవరు, ఎందుకు ఇలా ఇతడిని వెంటా డింది, అతడిని ఏమి చేసింది అనేదే క్లుప్తంగా ఈ చిత్ర కథ.
కామెంట్
హారర్ సినిమాలను ఇంటరెస్టింగ్‌గా చూపడం చాలా కష్టం. కెమెరా యాంగిల్స్, వింత వింత ధ్వనులతోనే హారర్ సినిమాను భయంకరంగా, ఉత్సుకత చూపేలా తీయగలరు. ఆవిషయంలో ఈ దర్శకుడు నూటికి నూరు శాతం సక్సెస్ అయినట్లే. కెమెరాను బాగా ఉపయోగించుకున్నాడు. భయపడటం, భయపెట్టడం విషయంలో ఈ యువకుడు పూర్తి విజయం సాధించినట్లే. భయాన్ని అందరూ భయపడేలా చాలా భయంకరంగా చూపాడు. శబ్దాలతో ఉలిక్కిపడేలా చేశాడు. దెయ్యంగా వేసిన అమ్మాయి, హీరోయిన్‌గా కంటె దెయ్యంగా చాలా బాగా ఎక్స్‌ప్రెషన్స్ చూపింది. తెర మీదకు ఆ అమ్మాయి రాగానే ఒక్కసారిగా జడుసుకుంటాం. ఈ చిత్రం చూసిన తర్వాత ఎవరికైనా సరే స్విచ్ చూస్తే భయం వేయకమానదు. అయితే ఇందులో చిన్నచిన్న లోపాలు లేకపోలేదు. ఎడిటింగ్ ఇంకా బాగా చేయాలి. నటన విషయంలో మరింత పరిణతి ఉండాలి. అలాగే డైలాగ్ డెలివరీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఇటువంటివి సరిచేసుకుంటే ఈ దర్శకుడు మరింత మంచి పేరు సంపాదించుకోగలుగుతాడు.
- డా.వైజయంతి
స్విచ్‌లో దెయ్యం!
Published Wed, Dec 18 2013 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement