
శశి థరూర్
పుస్తకాలు చదవని వాళ్లు రాజకీయాల్లో ఎక్కువగా ఉండటం మంచిదయ్యింది. లేకుంటే కాంగ్రెస్ పాలకుల మీద, ఎమర్జెన్సీ మీద బోలెడన్ని వ్యంగ్య వాఖ్యలు చేస్తూ....
25 ఏళ్ల పండుగలో...
పుస్తకాలు చదవని వాళ్లు రాజకీయాల్లో ఎక్కువగా ఉండటం మంచిదయ్యింది. లేకుంటే కాంగ్రెస్ పాలకుల మీద, ఎమర్జెన్సీ మీద బోలెడన్ని వ్యంగ్య వాఖ్యలు చేస్తూ ‘ది గ్రేట్ ఇండియన్ నావెల్’ నవల రాసిన శశి థరూర్ కాంగ్రెస్ పార్టీలో హాయిగా (ఈ మధ్యే పార్టీ పదవి పోయిందనుకోండి) ఉండేవాడు కాదు. శశి థరూర్ మేధావి అని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని, రచయితగా కూడా ప్రసిద్ధుడని చదువరులకు తెలుసు.
పదేళ్లకే పత్రికల్లో అచ్చయ్యే కథ రాసిన ఈ పెద్దమనిషి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో Operation Bellows అనే నవలను 11 ఏళ్ల వయసులో రాసి స్టేట్స్‌మెన్ పత్రికలో సీరియలైజ్ చేశాడు. ఇక ఇతడు 1989లో రాసిన ‘ది గ్రేట్ ఇండియన్ నావెల్’ అతడికి తెచ్చిన పేరు ఎంత పెద్దది అన్నది కాకుండా రచయితగా ఇతనికి ఇంత సృజన ఎక్కడిదా అని అచ్చెరువు కలిగించింది.
మహాభారతాన్ని తీసుకొని దానిని వర్తమానానికి అనుసంధానిస్తూ అందులో ఉన్న పద్దెనిమిది పర్వాలకు మల్లే ఇక్కడ కూడా పద్దెనిమిది భాగాలుగా నవల రాస్తూ స్వాతంత్య్రోద్యమాన్ని తదనంతర పరిణామాలని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని, ఆ కాలంలో జరిగిన చోద్యాన్ని వ్యంగ్యంగా, తీక్షణంగా, బోలెడన్ని నవ్వులతో వ్యాఖ్యానించిన నవల ఇది. నవల వచ్చి 25 ఏళ్లు అవుతున్నా ఇంత వరకూ పాఠకాదరణ కోల్పోలేదు. 42 సార్లు రీప్రింట్ అయ్యింది. తాజాగా రజతోత్సవ ప్రచురణ మార్కెట్‌లోకి వచ్చింది. శశి థరూర్‌కి ఇదంతా ఆశ్చర్యమే. ‘ఆ నవల ఇప్పుడు కనుక ఫ్రెష్‌గా మార్కెట్‌లోకి వచ్చి ఉంటే కచ్చితంగా బేన్ అయి ఉండేది’ అంటాడు.
‘భారతీయులు ఈ మధ్య మరీ భావుకులుగా తయారయ్యారు. మన సెన్సాఫ్ హ్యూమర్ పోయినట్టుంది’ అన్నాడు దిగులు నిండిన నవ్వుతో. ‘ఐక్యరాజ్య సమితిలో పని చేయడం, రాజకీయాల్లో తల మునకలు కావడం... వీటి వల్ల రాయడానికి వీలు చిక్కడం లేదు. కాని ఏదో ఒక రోజున మళ్లీ రాసి తీరుతాను’ అని వ్యాఖ్యానించాడు. కాని భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద హఠాన్మరణం ఇప్పుడప్పుడే ఆయనను కలం అందుకోనివ్వకపోవచ్చు. ఈ చికాకులన్నింటి మధ్యా తన పాత నవల కొత్త ఉత్సాహంతో పాఠకుల ముందుకు రావడమే అతడికి దక్కే కాసింత ఓదార్పు కావచ్చు.