ప్రేమగా చూసుకునేవారుంటే ఫర్వాలేదు కానీ... నా అన్నవారు లేక, ఒంటరిగా ఆశ్రమాల్లో పడి మగ్గిపోయేవారికి తెలుస్తుంది... వృద్ధాప్యం ఎంత పెద్ద శాపమో! అయితే లక్ష్మీమీనన్ పుణ్యమాని ఇప్పుడు కేరళలో వయసుడిగిన మహిళలెవరూ వృద్ధాప్యాన్ని శాపంగా భావించడం లేదు. లక్ష్మి చేయూతతో దాన్ని వరంగా మార్చుకుంటున్నారు. ముగిసిపోబోతున్న జీవితాలను మళ్లీ కొత్తగా జీవించడం మొదలుపెడుతున్నారు!
‘‘ఎందుకమ్మమ్మా ఈ వయసులో నీకింత శ్రమ?’’ అంది లక్ష్మీమీనన్ ఇంట్లోకి వస్తూనే.
భవానమ్మ నవ్వింది. ‘‘ఇందులో శ్రమేముంది? ఈ వయసులో ఊరికే కూర్చుంటే విసుగు పుడుతోంది. అందుకే ఈ పని చేస్తున్నా’’ అంది చేస్తున్న పని ఆపకుండానే.
లక్ష్మి నిట్టూర్చింది. 88 యేళ్ల వయసులో ప్రశాంతంగా ఉండమంటే ఉండకుండా చేతులు నొప్పెట్టేలా వత్తులు చేస్తూ ఉంటుంది అమ్మమ్మ. అది లక్ష్మికి బాధగా ఉంటుంది. కానీ ఎంత చెప్పినా ఆమె వినదు. అందుకే మరేమీ మాట్లాడకుండా ఊరకుండిపోయింది.
వారం రోజుల తర్వాత అమ్మమ్మతో పాటు బంధువులింట్లో ఫంక్షన్‌కి వెళ్లింది లక్ష్మి. అక్కడ అమ్మమ్మ తనతో తెచ్చిన ఓ గిఫ్టును ఆ ఇంట్లోవాళ్లకి ఇవ్వడం చూసింది. ‘‘నువ్వు బహుమతిని తెచ్చావా? ఏముంది అందులో’’ అంది కుతూహలంగా.
‘‘నేను చేసిన వత్తులు ప్యాక్ చేసి తీసుకొచ్చాను. వాళ్లకి పూజకి పనికొస్తాయి కదా’’ అంది భవానమ్మ. అప్పటికి లక్ష్మి మౌనంగా ఉండిపోయింది. కానీ అమ్మమ్మ సమాధానం ఆమె మెదడులో రకరకాల ఆలోచనలు రేపింది.
ఇంట్లో అందరూ ఎవరి పనుల మీద వాళ్లు వెళ్లిపోతుంటే పాపం అమ్మమ్మని ఒంటరితనం వేధిస్తోంది. అందుకే పొద్దుపోక వత్తులు చేస్తోంది. వాటినేం చేయాలో తెలీక ఇలా అందరికీ పంచి పెడుతోంది. ఈ వాస్తవం బోధపడగానే అమ్మమ్మ మీద చెప్పలేని జాలి కలిగింది లక్ష్మికి. ఇంట్లో, ఇంతమంది మధ్య ఉండే అమ్మమ్మకే ఇలా ఉంటే, వృద్ధాశ్రమాల్లో ఉండేవాళ్ల పరిస్థితి ఏమిటో కదా అనిపించింది. ఈ ఆలోచనలన్నీ కలిసి ఓ లక్ష్యంగా రూపుదిద్దుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.
అమ్మమ్మలకు అమ్మయ్యింది...
అమ్మమ్మకు ఒంటరితనాన్ని దూరం చేయాలన్న ఆలోచన వచ్చిన నాటినుండీ లక్ష్మి ఆలోచనలు పరిపరి విధాల పరుగుతీశాయి. తన అమ్మమ్మలాంటి వాళ్లందరి గురించీ వారాల తరబడి ఆలోచించింది. వాళ్ల ఒంటరితనాన్ని దూరం చేయాలనుకుంది. లక్ష్మి తన అమ్మమ్మ ద్వారా తెలుసుకున్న విషయం మరోటుంది. వయసయిపోయినంత మాత్రాన వారిలోని ఉత్సాహం, ఆసక్తి తగ్గిపోవు. ఒంట్లో ఓపిక ఉండాలేగానీ వాళ్లు ఏదైనా చేయగలరు. అందుకే అమ్మమ్మ ఇంకా పని చేయగలుగుతోంది. ఆ ఆసక్తిని, ఉత్సాహాన్ని ఆమెకే ఉపయోగపడేలా చేస్తే? తన ఆలోచన తనకే అద్భుతంగా అనిపించింది లక్ష్మికి. వెంటనే తన ఉద్దేశాన్ని తల్లి శ్రీదేవి, అమ్మమ్మ భవానమ్మలతో పంచుకుంది. కూతురు చెప్పింది విని చాలా మెచ్చుకున్నారు శ్రీదేవి. తప్పకుండా చేద్దామంటూ ఉత్సాహపడింది భవానమ్మ. ఆ ముగ్గురి కలయికతో 2012లో ‘విక్స్‌డమ్ ప్రాజెక్ట్’ ఊపిరి పోసుకుంది.
మొదటగా తమ స్వస్థలమైన తిరువనంతపురంలో ఉన్న వృద్ధాశ్రమాలకు వెళ్లింది లక్ష్మి. అక్కడి స్త్రీలతో మాట్లాడింది. వారిలో చాలామంది తన అమ్మమ్మలాగే ఆలోచించడం గమనించింది. ఖాళీగా ఉండటాన్ని ఇష్టపడనివారు, ఏదో ఒక పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నవారు చాలామంది ఉన్నారు. దాంతో తన ఆలోచన సరైనదేననే నిశ్చయానికి వచ్చింది లక్ష్మి. ఆశ్రమ మేనేజర్లతో మాట్లాడింది. ఆసక్తి, ఓపిక ఉన్న మహిళలందరినీ రమ్మని ఆహ్వానించింది. అమ్మమ్మ పర్యవేక్షణలో అందరితోనూ వత్తులు చేయించడం మొదలుపెట్టింది.
వత్తులు చేయడానికి అవసరమైన పత్తిని అందరికీ ఉచితంగానే పంచుతారు. ఇన్ని చేయాలి, ఇంత సమయంలో చేయాలి అని నియమమేమీ లేదు. ఎవరి ఇష్టాన్ని బట్టి, శక్తిని బట్టి వాళ్లు ఎన్నైనా చేయవచ్చు. ముప్ఫై వత్తుల్ని కలిపి ఓ కట్ట కడతారు. కట్టని ఐదు రూపాయల చొప్పున అమ్ముతారు. వత్తులు చేయడం వరకే వీరి పని. మార్కెటింగ్ వ్యవహారాలు, డబ్బు లెక్కలు అన్నీ లక్ష్మి తల్లి చూసుకుంటారు.
విదేశాల్లోనూ...
చెప్పుకోవడానికి ఇదో చిన్న పనిలా అనిపిస్తుంది. కానీ ‘విక్స్‌డమ్’ వత్తులు కేరళలో చాలా పెద్ద వ్యాపారమే చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని దేవాలయాలన్నీ విక్స్‌డమ్ ద్వారా తయారైన వత్తుల్నే వాడుతున్నాయి. డీసీ బుక్స్ యజమాని రవి అయితే ఆ మధ్య మూడు లక్షల వత్తులు కొన్నారు. తమ సంస్థ ముద్రించిన పదివేల రామాయణం కాపీలతో పాటు ఈ వత్తుల్ని ఉచితంగా పంచారాయన. అలా పెద్ద మొత్తంలో వత్తుల్ని కొనేవారు చాలామందే ఉండడంతో విక్స్‌డమ్ వ్యాపారం విజయవంతంగా సాగిపోతోంది. దీన్ని మరింత విస్తరించాలనుకుంటున్నారు లక్ష్మి. అందుకే తమ ప్రాజెక్టు గురించి పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాలో తన అన్న వాసుదేవ్ నారాయణన్ నడుపుతున్న ఫౌండేషన్ ద్వారా అమెరికాలో కూడా మార్కెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొన్ని విదేశీ వెబ్‌సైట్లతో మాట్లాడి, విక్స్‌డమ్ గురించి ప్రచారం చేయమని కోరారు. వారు అందుకు సంతోషంగా అంగీకరించారు. విక్స్‌డమ్ గురించి తీస్తోన్న డాక్యుమెంటరీకి ఉచితంగా వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ముందుకొచ్చారు. ఇలా విక్స్‌డమ్ పేరు మెల్లగా అంతటా వ్యాపిస్తోంది. అయితే వీటన్నిటికంటే... వృద్ధ మహిళల కళ్లలో కనిపిస్తోన్న తృప్తి, ముఖాల్లో కనిపించే ఆనందమే తనకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తోందంటారు లక్ష్మి. నిజమే. లక్ష్మి వేసిన ఒక్క అడుగు ఎంతోమంది మహిళల వార్థక్యానికి ఓ అర్థం కల్పించింది.
ఒకప్పుడు వాళ్లు ప్రతిదానికీ ఆశ్రమంపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు తమకంటూ కొంత డబ్బు వెనకేసుకుంటున్నారు. నచ్చినవి కొనుక్కుంటున్నారు. ఇంతకు ముందులా ఒంటరితనం లేదు. ఒకరి మీద ఆధారపడ్డామన్న బాధలేదు. ఇదంతా లక్ష్మి వల్లనే. తన అమ్మమ్మ ద్వారా మొదలైన ఆలోచనకు ఓ రూపమిచ్చి, ఇంతమంది అమ్మమ్మలకు అమ్మగా మారి, వారికో కొత్త జీవితాన్నిచ్చిన లక్ష్మి గురించి ఎంత చెప్పినా తక్కువే!
- సమీర నేలపూడి
స్ఫూర్తిని రగిలిస్తోంది!
లక్ష్మిది కేరళలోని తిరువనంతపురం. విక్స్‌డమ్ ప్రాజెక్టును ప్రారంభించేనాటికే ఆమె పర్యావరణ పరిరక్షణకై పాటు పడుతోంది. ప్రస్తుతం విక్స్‌డమ్‌తో వృద్ధులకు భరోసా కల్పిస్తూనే యువతలో స్ఫూర్తిని రగిలించేందుకు ప్రయత్నిస్తోంది లక్ష్మి. గత యేడు మేలో కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు వెళ్లింది. ఒక మంచి పని చేయాలనుకుంటున్నానని, దానికోసం ఒక్కపూట కేటాయించమని అడిగింది.
130 మంది యువతీ యువకులు ఉత్సాహంగా ముందుకొచ్చారు. వారితో కలిసి వత్తులు తయారు చేసే పని మొదలుపెట్టింది లక్ష్మి. గంటకు పది వేల చొప్పున ఓ పూటంతా వత్తులు చేస్తూనే ఉన్నారు. వాటిని అమ్మి, ఆ సొమ్ముని క్యాన్సర్ పేషెంట్లకు విరాళంగా ఇచ్చేసింది. యేటా ఇలాంటి కొన్ని కార్యక్రమాల్ని నిర్వహించి, సమాజానికి వీలైనంత సేవ చేయాలనుకుంటోంది. యువత ముందుకొస్తేనే ఏదైనా సాధ్యమంటుందామె!
చివరి దశలో చిరుదీపం
Published Mon, Mar 17 2014 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement
Advertisement