ఒకే మాట.. ఒకే బాట..!
‘మార్పు అనేది నీ నుంచే మొదలవ్వాలి’ అన్నారు మహాత్మాగాంధీ. ఆ మాట తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ... ఆ ఊరివాళ్లు గాంధీగారి మాటను అక్షరాలా నిజం చేశారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూస్తూ కూచోకుండా తమ ఊరిని, తమ జీవితాలను బాగు చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు!
ముంబైకి ఎనభై - తొంభై కిలోమీటర్ల దూరంలో... ఠాణే జిల్లా, షాపూర్ తాలూకాలో ఉంది కుడిశేత గ్రామం. చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని పొలాలతో ఎంతో అందంగా ఉంటుంది. ఆ ఊరిలో అంతకంటే ఆకర్షించే విషయం ఒకటుంది. అదే... గ్రామస్తుల ఐక్యత. వారంతా ఒకే మాట మీద ఉంటారు. ఒకే తాటి మీద నడుస్తారు. ఒక ఇంటిలోని వారే ఒక్కటిగా ఉండలేకపోతున్న ఈ రోజుల్లో... ఒక ఊరివారంతా అంతగా కలసి మెలసి ఉంటున్నారంటే నిజంగా గొప్ప విషయం. అంత గొప్ప సంస్కారానికి పునాది వేసింది ఓ వ్యక్తి. ఆయన గురించి తెలుసుకుంటే... ఈ రోజు కుడిశేత ఆదర్శగ్రామంగా ఎలా నిలిచిందో తెలుస్తుంది.
మాటతోనే మార్పునకు శ్రీకారం...
ఒకప్పటి కుడిశేత గ్రామానికి, నేటి కుడిశేతకి అసలు పోలికే లేదు. ఒకనాడు ఆ ఊరిలో మద్యం ఏరులై పారేది. అందరూ మద్యానికి బానిసలైపోయేవారు. ఏ పనీ చేసేవారు కాదు. కుటుంబాలను పట్టించుకునేవారు కాదు. దాంతో ప్రతి గడపలోనూ పేదరికం తాండవించేది. అభివృద్ధి అనేది ఆ గ్రామానికి ఆమడ దూరంలో ఉండేది. విద్యుత్, నీటి సరఫరా, రోడ్లు... ఏ వసతులూ ఉండేవి కావు. కనీసం ఒక పాఠశాల కూడా ఉండేది కాదు. ఈ పరిస్థితి ఓ వ్యక్తిని కదిలించింది. ఎలాగైనా ఆ ఊరిని మార్చాలన్న పట్టుదలను రేకెత్తించింది. ఆ పట్టుదలే ఆయనను అభివృద్ధి దిశగా అడుగులు వేయించింది. ఆయన పేరు... గోమా దాదా ఉగరా, కుడిశేత గ్రామ మాజీ సర్పంచ్!
నిజానికి సర్పంచ్ కాకముందే కుడిశేతను మార్చేందుకు కృషి చేయడం మొదలు పెట్టారు ఉగరాకి. కుడిశేతలో నెలకొని ఉన్న సమస్యలన్నింటికీ మద్యపానమే కారణమని అనిపించిందాయనకి. దాంతో మద్యం వల్ల కలిగే అనర్థాల గురించి గ్రామస్తులందరి చెవిలో ఇల్లు కట్టుకుని పోరారు. మొదట్లో ఆయన మాటను ఎవరూ లెక్క చేయలేదు. కానీ నెలలు, సంవత్సరాల తరబడి అదే పనిగా బోధించేసరికి కొద్దికొద్దిగా మారడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా మద్యానికి దూరమవుతూ వచ్చారు. దాంతో తన మిగతా ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెట్టేందుకు నడుం కట్టారు ఉగరా.
ఆర్థిక స్వావలంబన కోసం ఏం చేయాలో గ్రామస్థులకు వివరించారు. అందరం కలసి శ్రమిస్తే ఊరిని స్వర్గం చేసుకోవచ్చని చెప్పారు. ఆయన మాటలు వారి మీద బాగానే పని చేశాయి. మీరెలా చెబితే అలా చేస్తామన్నారు. శ్రమదానంతో ఊరిని మార్చుకోవడానికి సిద్ధపడ్డారు. నీటిని పొదుపు చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. రోడ్లు వేసుకున్నారు. పాఠశాలను కట్టించారు. చీకటి నిండిన గ్రామంలో సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అభివృద్ధి దిశగా అత్యంత వేగంగా పయనించసాగారు.
ఇప్పుడు కుడిశేత గ్రామంలో ప్రతి ఇంటా సౌర విద్యుత్ దీపాల కాంతి పరచుకుంటోంది. పెద్దలంతా పనులు చేసుకుంటున్నారు. పిల్లలంతా చదువుకుంటున్నారు. ఇదంతా ఉగరా చలవే అంటారు గ్రామస్థులంతా. ఆయన చూపిన బాటలో సాగినందువల్లే తమ జీవితాలు మారిపోయాయి అంటారు వారు. ఉగరా మరణించిన తర్వాత ప్రస్తుతం ఉగరా సోదరుడు కాలూరామ్ సర్పంచ్‌గా ఉన్నారు. ఆయన కూడా ఆ ఊరి బాగోగుల కోసం శ్రమిస్తున్నారు.
చిన్న చిన్న చెక్ డ్యామ్స్‌ని నిర్మించారు. త్వరలో నీటి కొళాయిలను కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆయన మాత్రమే కాదు... ఆ ఊరిలోని ప్రతి వ్యక్తీ ఉగరా చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నారు. నేటికీ ఎవ్వరూ అక్కడ మద్యం ముట్టరు. ఆ మాటే ఎత్తరు. ఊరిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతారు. కలసి కట్టుగా మెలగుతారు. ఒకరు ఇల్లు కట్టుకుంటే మిగతా వారంతా వెళ్లి సాయం చేస్తారు. ఆ ఐకమత్యమే వారి జీవితాలను బాగు చేసింది. ఆ ఐకమత్యమే వారిని ఈ రోజు ఆదర్శవంతులుగా చేసింది, వారి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దింది!
- గుండారపు శ్రీనివాస్, ఫొటోలు: పిట్ల రాము, సాక్షి ముంబై
ఒక ఊరు... ఒకే గణపతి
మహారాష్ట్రలోని చాలా గ్రామాల్లో ‘ఒక గ్రామం - ఒకే గణపతి’ అన్న సంప్రదాయం ఉంది. ఖర్చును తగ్గించడానికి, కాలుష్యాన్ని నివారించడానికి ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు వారంతా. ఒక్కోచోట ఒక్కో విగ్రహాన్ని ప్రతిష్టించే బదులు ఊరి మొత్తానికి ఒకే విగ్రహాన్ని పెడదాం, అందరం కలిసి పండుగ చేసుకుందాం అన్న ఉగరా ఆలోచన ఫలించింది. అందరూ కలసి పండుగ చేసుకునే విధానంతో గ్రామస్తుల మధ్య ఐక్యత పెరిగింది. ప్రారంభించిన ఆ విధానాన్నే కుడిశేత గ్రామస్తులు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ప్రతి యేటా ఒకే ఒక్క వినాయకుణ్ని ప్రతిష్టిస్తున్నారు. ఒక్కటిగా పండుగ చేసుకుంటున్నారు.