
సేవ కూడా సాధనే...
ధ్యానమార్గం
యోగ, ధ్యానం ఇవి శరీరాన్ని, మనసును మలినాల నుంచి విముక్తం చేసినా అసలైన సంతృప్తి మాత్రం స్వార్థ రహితమైన సేవ నుంచే వస్తుందని కొందరు యోగ సాధకుల ఉవాచ. పుణ్యక్షేత్రాల సందర్శన, పవిత్ర స్నానాలు, మొక్కులు ఇవి ఊరటను కలిగించవచ్చేమోగాని సాటి మానవునికి సేవ చేయడంలో వచ్చే సంతృప్తికి సమానం కాదని అంటున్నారు.
సేవలో నిమగ్నమైతే- కష్టంలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి సాయం చేయడంలో నిమగ్నమైతే మనసు దాదాపు ధ్యానంలో నిమగ్నమైనంతగా శుభ్రపడుతుందని అంటున్నారు. ద్వేషాన్ని నాటితే ద్వేషం, సేవను నాటితే సంతోషం ఫలాలుగా దక్కుతాయనేది గుర్తుంచుకోవాలంటున్నారు. మరణం అనివార్యం. అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కనుక ఈ రోజే సత్యమని ఈ క్షణమే శాశ్వతమని నిష్కల్మషమైన మనసుతో సాటి వారికి ఆనందం కలిగించే పని చేస్తే దైవాన్ని దర్శించినట్టే అని యోగసాధకుల ఉవాచ.