విషాద యమున
కాలుష్యం
యమున... జమున... పేరు ఏదైనా అది భారతీయులకు పవిత్రమైనది. వసుదేవుడు శ్రీకృష్ణుని తల మీద పెట్టుకుని యమునా నదిని దాటే యశోద వద్దకు చేర్చాడు. షాజహాన్ ఈ యమునా నది ఒడ్డునే తాజ్ మహల్ కట్టించాడు. భారతీయులలో ఉండే సనాతన సౌభ్రాతృత్వాన్ని ‘గంగా–జమునా తెహజీబ్’ అంటారు. యమున సూర్యుని పుత్రిక. యముడి సోదరి. కనుక యమునలో స్నానమాచరిస్తే అకాల మృత్యుదోషం హరించుకుపోతుందని ఒక నమ్మకం. కాని ఢిల్లీలో ఉన్న యమునా నదిలో స్నానమాచరిస్తే మృత్యువు ఖాయం అని అక్కడ ఉన్న కలుషిత యమున హెచ్చరిస్తోంది. యమునా నది హిమాలయ పర్వతాలలో ‘యమునోత్రి’లో జన్మించి ఉత్తరాఖండ్, హిమాచల ప్రదేశ్, హర్యాన, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీల గుండా ప్రవహిస్తుంది.
ఇది నేరుగా సముద్రంలో కలువకుండా త్రివేణి సంగమంతలో తిరిగి గంగా నదితో సంలీనం చెందుతుంది. యమునా పరీవాహక ప్రాంతాలలో యమునా నగర్, ఢిల్లీ, మధుర, ఆగ్రా, ఇటావా, అలాహాబాద్ నగరాలు ఉన్నాయి. ఈ నగరాల కాలుష్యం యమునను భారతదేశంలో అత్యంత కలుషితమైన నదిగా మారుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో 22 కిలోమీటర్ల మేర ప్రవహించే యమునా నది ఢిల్లీ వాసుల మల మూత్రాలతో పరిశ్రమల కాలుష్యంతో నిండి ఉంది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఢిల్లీలో ప్రవేశించే యమునా నది ప్రవాహాన్ని వజీరాబాద్ బ్యారేజీ వద్ద ఆపేసి నీటిని నిల్వ చేస్తారు. అక్కడి నుంచి యమున చుక్క నీరు కూడా రాదు. అంటే ఢిల్లీలో ప్రవహించే యమున అంతా ఢిల్లీ వాసుల మురుగు నీరే. అందులోనే భక్తులు పుణ్యస్నానాలు, క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. యమునను శుద్ధి చేయాలని పర్యావరణ ప్రేమికులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు.
తాజాగా వచ్చిన బిజెపి ప్రభుత్వం యమునను శుభ్రం చేస్తానని ఆర్భాటం చేసింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ యమున బాగోగులు మూడేళ్లలో తేలుస్తామని అంటోంది. కాని యమున నది మాత్రం ఢిల్లీలో రోజు రోజుకీ మురికి కూపంగా మారి ప్రజలకు విషం సరఫరా చేస్తోంది. దీని చుట్టుపక్కల పండే ఆకుకూరలు, కూరగాయలు కేన్సర్ కారకాలని పరీక్షలు నిర్థారణ చేస్తున్నాయి. యమున విషకాసారం కావడం వల్ల చుట్టుపక్కల పల్లెల్లోని భూగర్భ జలాలు విషతుల్యమై కీళ్ల నొప్పులు, వాతం, ఇతర అనారోగ్యాలు కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ఢిల్లీ పేదసాదలు యమునపై భక్తితో ఈ మురికి యమునలోనే మునకలు వేస్తుంటారు. సంధ్య వారుస్తుంటారు. పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. ఈ విషాదం నుంచి యమున ఎప్పటికి విముక్తమవుతుందో! మానవ పాపాల నుంచి ఎప్పటికి బయట పడుతుందో!!