కంచు మోగుతుందని తెలుసు.కంచు మోగినట్టు కనకమ్ము మోగదని తెలుసు.కానీ, నేరం దాగదు.దుర్భుద్ధి బయటపడకా మానదు.దొంగ బంగారం నిప్పులా కాలుతుంది.దొంగ దొరికేవరకు మోగుతూనే ఉంటుంది.
డిసెంబర్ 26, 2006.ఉదయం 7 గంటలు.గుంటూరు జిల్లా నరసరావుపేట.చలి దుప్పటి కప్పుకున్న సూర్యుడు బద్దకంగా ఒళ్లు విరుచుకుంటున్నాడు. జనం వెచ్చదనాన్ని తొడుక్కోవడానికి ఇళ్ల నుంచి మెల్లగా బయటకు వస్తున్నారు. కొంతమంది చలిని ధిక్కరిస్తూ పనుల్లో పడిపోయారు.ఆ సమయంలోనే చిన్న కలకలం.గీతామందిర్ రోడ్డులో పోలీసుల వాహనాలు ‘రయ్‌మ’ని దూసుకుపోతున్నాయి.వెనకనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లూ దౌడు తీస్తున్నాయి.దుమ్ము రేపుకుంటూ వెళుతున్న వాహనాలను చూసి ‘ఏం జరిగిందిరా..’ అని ఆందోళనగా అడిగాడు టీ స్టాల్ యజమాని తన సర్వెంట్‌తో. ‘అదే తెలియడం లేదు ..’ వాహనాలు వెళ్లినవైపునే చూస్తూ అన్నాడు సర్వెంట్.చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందని తెలుసుకునే లోపునే టీవీల్లో బ్రేకింగ్ న్యూస్.. ‘నరసరావుపేటలో బ్యాంకు దోపిడీ’ అని. దోపిడి ఎలా జరిగిందనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇంతకూ ఏం జరిగింది?
నరసరావుపేట గీతామందిర్ రోడ్డులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు.డిశంబరు 22న పనివేళలు ముగియగానే సిబ్బంది ఎప్పటిలాగే తాళాలు వేసి వెళ్ళారు.23, 24, 25 తేదీలు వరుసగా సెలవులు. 26వ తేదీ ఉదయం 6:15 గంటలకు బ్యాంక్ మెసెంజర్ కమ్ స్వీపర్ వెంకటేశ్వర్లు బ్యాంకు తాళాలు తీసేందుకు వచ్చాడు.కాని బ్యాంకు మెయిన్‌డోర్ తాళాలు తీసి పక్కన పడేసి వుండటాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేసి ‘సార్, బ్యాంక్‌లో దొంగలు పడ్డట్టున్నారు. తాళాలు పగలగొట్టి కిందపడేసి ఉన్నాయి’ అన్నాడు. హుటాహుటిన మేనేజర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించి బ్యాంకుకు చేరుకున్నాడు.సీఐ ప్రసాద్ బ్యాంకు వద్దకు చేరుకొని, బ్యాంక్ మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.ఎస్పీ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. క్లూస్, డాగ్ స్వా్కడ్‌లకు సమాచారం చేరింది.వాళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. బ్యాంకు లోపలంతా పరిశీలించారు. ఎక్కడా ఫైళ్లు గానీ, ఫర్నీచర్‌గానీ దెబ్బతినలేదు. బంగారం ఉంచిన లాకర్ మాత్రం ఓపెన్ చేసి ఉంది. ఆ లాకర్‌ని గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు నిందితులు. అందులో వున్న రూ 3.75 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయని తేలింది. దాదాపు కిలో బంగారపు ముద్ద కిందపడి ఉండటం గమనించారు. లాకర్‌ను కట్ చేసే క్రమంలో వేడికి ఆభరణాలు కరిగి ముద్దగా మారి ఉంటాయి. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో బ్యాంకు వైపుగా వచ్చేవారు లేకపోవడంతో గుర్తించడానికి సమయం పట్టింది. నగదు పోలేదని నిర్ధారణకు రావడంతో ఇది ఎవరో తెలిసిన వ్యక్తుల పనేనని పోలీస్ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. బ్యాంకులో పనిచేసే సిబ్బంది అందరినీ విచారించారు. ఎవరినీ అనుమానించలేని విధంగా సమాధానాలు రావడంతో మిస్టరీని ఛేదించలేక పోలీసులు తలలు పట్టుకున్నారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులకు ఇన్సూరెన్స్ కంపెనీ అప్పటి మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించింది.రెండేళ్లు గడిచాయి.
నిందితుల ఆచూకీ దొరక్కపోవడంతో కేసును 2008 నవంబరు 24న సెంట్రల్ క్రై ం స్టేషన్ (సీసీఎస్)కు బదిలీ చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. బ్యాంకు సిబ్బందిని మరోసారి విచారించారు. అందరి జీవనవిధానాన్ని పరిశీలనలో ఉంచారు. బ్యాంక్ స్వీపరు కమ్ మెసెంజర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లు దగ్గర బ్యాంకు మెయిన్‌డోరు తాళాలు ఉంటాయి. ముందుగా చిన్నవెంకటేశ్వర్లను పోలీసుస్టేషన్‌కి పిలిపించారు.‘వెంకటేశ్వర్లూ.. దోపిడీకి ముందు వారం రోజులు ఏమేం జరిగిందో చెప్పు..’ అని అడిగారు. ‘సార్.. నాకేం తెలియదు. మెయిన్ డోర్ తాళాలు ఒక్కటే నా దగ్గర ఉంటాయి. రోజూ వచ్చి బ్యాంకు తలుపులు తీసి చిమ్ముతుంటాను. లోపలి తాళాలు నా దగ్గర ఉండవు.. ’ అతను చెబుతుండగానే ‘మాకుతెలుసు. దొంగతనం జరగడానికి వారం ముందు ఏమైందో అది చెప్పు’ మరోసారి రెట్టించారు. అతని దగ్గర నుంచి వస్తున్న వాసనను పసిగట్టి ‘నువ్వు మందు తాగుతావా’ అని అడిగారు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకొని ‘అప్పుడప్పుడు తాగుతాను సార్’‘దొంగతనానికి ముందు వారంలో ఎవరెవరితో కలిసి మందు తాగావు ’కొన్ని నిమిషాలు ఆలోచనలో పడ్డ వెంకటేశ్వర్లు..‘స్నేహితులతో కలిసి తాగాను సార్. గోవిందం, రాములు, ఖాజాబాబు..’ అని పేర్లు చెబుతుండగా..‘ఖాజాబాబు ఎవరు?’ అని అడిగారు.‘బ్యాంకు అప్రయిజర్ వహీద్ కొడుకు సార్’పోలీసులకు ఏదో అర్ధమైనట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.‘కేసు పూర్తయ్యేవరకు స్టేషన్‌కి వస్తూ ఉండాలి’ ఆర్డర్ వేశారు పోలీసులు. అలాగే అంటూ వారి వద్ద సెలవు తీసుకున్నాడు వెంకటేశ్వర్లు.
అప్పటికే అబ్దుల్ వహీద్ అతని కొడుకు ఖాజాబాబుకు సంబంధించిన ఫైల్ టేబుల్ మీద ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్లు భారీగా స్థలాలు, వాహనాలు కొనుగోలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి.‘అబ్దుల్ వహీద్, ఖాజాబాబుల ఆస్తుల వివరాలే క్లూ అవనున్నాయా!’ ఫైల్ ఓపెన్ చేస్తూ అన్నాడు సీఐ.‘సార్, అతనికి సంపాదించే కొడుకులు ఉన్నారు. వారి పిత్రార్జితం ఆస్తి కూడా వచ్చిందని తెలుస్తోంది. అతన్నెలా అనుమానించగలం..’ అంటున్న సిబ్బందిని వారిస్తూ.. ‘గతంలో అతనికి పెద్దగా ఆస్తులు లేవు. కానీ ఈ రెండేళ్లలోనే అతనూ, అతని కొడుకు కొన్న ఆస్తుల వివరాలు ఇవి. ఒక సాధారణ ఉద్యోగి ఇతను. ప్రస్తుత ఖర్చు లక్షల్లో ఉంది. ఇందంతా ఎలా సాధ్యం? ఈ రెండేళ్లలో బ్యాంకు మిగతా సిబ్బంది ఆస్తులు కొన్నట్టు రుజువులు లేవు. బ్యాంకు దోపిడీ ఒక్కరితో అవదు. ఇది కొంతమంది కలిసి చేసిన పని. బంగారం మాత్రమే దోపిడీ జరిగిందంటే తెలిసినవారి పనే అయ్యుండాలి. విచారిస్తే .. వివరాలు అవే తెలుస్తాయి’ దృఢంగా అన్నాడు సీఐ.అంతే, తర్వాత పోలీసుల పని వేగవంతమైంది.
అబ్దుల్ వహీద్, ఖాజాబాబులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విచారించడం మొదలుపెట్టారు. వివరాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బ్యాంక్ అప్రయిజర్‌గా పని చేస్తున్న వహీద్‌కు బ్యాంకులో తాకట్టుగా చాలా బంగారం వచ్చి చేరిందని అర్థమైంది. దాని మీద అతడు కన్నేశాడు. అయితే బ్యాంకులోకి అడుగుపెట్టడం చాలా కష్టమైన పని. ముఖ్యంగా మెయిన్‌డోర్‌ను ఛేదించాలి. ఛేదించాలంటే వాటి తాళాలు కావాలి. అందుకే తన కుమారుడు ఖాజాబాబును రంగంలోకి దించాడు. తండ్రి కోసం బ్యాంకుకు వస్తూ పోతున్నట్టు నటించిన ఖాజాబాబు వెంకటేశ్వర్లుతో స్నేహం చేశాడు. అతనికి మద్యం బలహీనత ఉన్నట్టు కనిపెట్టి తరచూ తాగుడులో కూచోబెట్టేవాడు. ఒకరోజు మద్యం మత్తులో వుండగా అతని వద్ద వున్న బ్యాంక్ మెయిన్ డోర్ తాళాల ముద్రలను సేకరించాడు ఖాజాబాబు. తర్వాత ఆ ముద్రలతో డూప్లికేట్ తాళాలు చేయించాడు. తండ్రితో పాటు బందువు జానీబాషా, గ్యాస్ కట్టర్ షేక్ సుబానీ, స్నేహితులైన షేక్ మౌలాలి, అబ్దుల్ ఖాదర్, పఠాన్ ములాసాఫ్‌లను ఈ దోపిడీలో భాగస్తులను చేసి, ప్లాన్ రచించాడు ఖాజాబాబు.
డిసెంబరు 22 అర్థరాత్రి డూప్లికేట్ తాళాలతో సునాయాసంగా బ్యాంకు తలుపులు తెరిచి, లోపలకు వెళ్లారు.బ్యాంకులో బంగారం ఎక్కడ ఉంచుతారో వహీద్‌కు తెలుసు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం లాకర్ రూమ్ తాళాలను పగలగొట్టారు. అయితే, లాకర్‌ని తెరవడం అంత సులువు కాలేదు. గ్యాస్ కటర్ షేక్ సుభాని కటర్‌తో లాకర్‌ని తెరిచే ప్రయత్నం చేశాడు. ఈ కటింగ్ టైమ్‌లోనే వేడికి లాకర్‌లో ఉన్న బంగారం కొంత కరిగి కిందపడింది. లాకర్‌ని కట్ చేసి లోపలున్న బంగారం తీసి మూటగట్టారు.వచ్చిన దారినే చీకట్లో కలిసిపోయారు.దోపిడీ చేసిన బంగారంమూటను టౌన్‌లోని వరవకట్ట సమీపంలోని బావిలో పడేశారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.తర్వాత శని, ఆది, సోమవారం క్రిస్‌మస్.. ఇలా వరసగా సెలువులు అవడంతో విషయం వెలుగులోకి రాలేదు.విచారణలోనూ వీరి మీద అనుమానం ఎవరికీ రాలేదు.మూడు నెలలు ఓపిక పట్టారు.తర్వాత బంగారం మూటను బావిలో నుంచి బయటకు తీసి, కరిగించి, బిస్కెట్ల రూపంలోకి మార్చారు. వాటిని అమ్మి నగదు చేసుకున్నారు. కొంత బంగారాన్ని అందరూ కలిసి పంచుకున్నారు. దీంట్లో పెద్ద మొత్తం వహీద్, ఖాజాబాబులు సొంతం చేసుకున్నారు. పోలీసులు రికవరీలో భాగంగా బంగారంతో పాటు వారందరి స్థిర, చర ఆస్తులనూ సీజ్ చేశారు.
సీసీఎస్ సీఐ విజయభాస్కరరావు దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా ఇద్దరు కానిస్టేబుళ్ళు బి.నరశింహారావు, అబ్రహాంలను పూర్తి స్థాయిలో నిఘాకు కేటాయించారు. బ్యాంకు సిబ్బంది లావాదేవీలు గమనించడమే వీరి పని. ఎవరూ పెద్దగా ఆస్తుల కొనుగోళ్లకు దిగలేదు. కాని వహీద్ జీవన శైలి మాత్రం ఒక్కసారిగా మారింది. అదే క్లూగా తీసుకుని పై అధికారులకు తెలియచేశారు కానిస్టేబుళ్లు. దీని ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. దోపిడీకి పాల్పడింది బ్యాంకు అప్రయిజర్ వహీద్, అతని బృందమే అని నిర్ధారించారు.
2009 జూన్ 5న అప్పటి ఎస్పీ లడ్హా కేసు దర్యాప్తులో ప్రతిభను చూపిన సీఐ సి.విజయ భాస్కరరావు, కానిస్టేబుళ్ళు అబ్రహాం, నరశింహారావులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. స్వా«ధీనం చేసుకున్న రూ 3.25 కోట్ల విలువచేసే బంగారం, వాహనాలు, స్థలాలను కోర్టుకు అప్పగించి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది.
ఒరిజినల్‌గా పడే కష్టంతో వచ్చే సంపాదనలో ప్రశాంతత ఉంది.ఎప్పుడైతే డూప్లికేట్ మార్గంలో దిగుతామో జీవితం నాశనమవుతుంది.
– వుయ్యూరు శ్రీహరిబాబు, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment