
శునకో రక్షతి రక్షితః
కనకపు సింహాసనమున కాదు హృదయపు సింహాసనము నీకు వేసెద’ నంటూ తన పెట్‌డాగ్‌ను ముద్దులతో ముంచెత్తుతోందట జోసీకాన్లాన్.
చదివింత...
- సత్యవర్షి
‘కనకపు సింహాసనమున కాదు హృదయపు సింహాసనము నీకు వేసెద’ నంటూ తన పెట్‌డాగ్‌ను ముద్దులతో ముంచెత్తుతోందట జోసీకాన్లాన్. ఇంగ్లాండ్‌లోని స్టాక్‌టాన్-ఆన్-టీస్ టౌన్‌లో నివసించే జోసీ కాన్లన్ (46) దగ్గర టెడ్ అనే రెండేళ్ల వయసున్న పెట్‌డాగ్ ఉంది. అది కొన్ని రోజులుగా తన యజమాని ఛాతీని ఊరికే వాసన చూడడం, కదపడం, ఏడవడం చేస్తుంటే... ఏదో సందేహం వచ్చిన జోసీ వైద్య పరీక్షలు చేయించుకుంది.
ఈ పరీక్షల్లో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తేలింది. ఈ గ్రేడ్ 3 ట్యూమర్ చాలా తీవ్రమైందనీ, శరవేగంగా వ్యాపించే గుణం కలదనీ కూడా డాక్టర్లు చెప్పారట. అయితే సరైన సమయంలో డిటెక్ట్ చేయడంతో 18వారాల కీమో థెరపీ, 4 వారాల రేడియోథెరపీ చికిత్స చేసి తొలగించగలిగారు. దీంతో నా పెట్‌డాగ్ టెడ్ చేసిన మేలు ఏజన్మలోనూ మర్చిపోలేనంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది జోసీ.
గతంలో యజమానుల చేతిలో చిత్రహింసలకు గురవుతున్న టెడ్‌ను రక్షించి ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటున్న జోసీ... అందుకు ప్రతిఫలంగా తనకు ప్రాణదానం చేసిందంటూ టెడ్‌ను వేనోళ్ల పొగడుతోంది. అంతేకాదు.. ‘‘పెట్‌డాగ్స్ మన శరీరంలోని ఏదైనా ప్రదేశంలో ఎక్కువగా దృష్టి పెడితే వాటిని తోసేసి ఊరుకోకుండా కొంచెం పట్టించుకోండి’’అంటూ పెట్ ఓనర్స్‌కు సలహా కూడా ఇస్తోంది.