రైలర్ : పులి
నిడివి : 55 సె.
హిట్స్ : 33,29,623
తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన ‘పులి’ సినిమాకు నాటి, నేటి సౌందర్య దివ్యతార శ్రీదేవి ప్రధాన ఆకర్షణగా మారారు. ఈ సినిమాలో ఆమె మహారాణి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర మేకప్ కోసం ఆమె ప్రతి రోజు కనీసం అయిదుగంటల సమయాన్ని వెచ్చించారట. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల విడుదలైన ‘పులి’ ట్రైలర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. యాక్షన్, అడ్వెంచర్ ఫాంటసీ చిత్రమిది.
టాక్ షో: మ్యాజిక్ మైక్-ఎక్స్‌ఎక్స్‌ఎల్
నిడివి: 8 ని. 19 సె.
హిట్స్: 12,45,352
అమెరికన్ టెలివిజన్ ‘ఎన్‌బిసి’లో ప్రసారమవుతున్న లేట్-నైట్ టాక్ షో ‘ది టునైట్ షో స్టారింగ్ జిమ్మి ఫాలన్’కు ప్రేక్షకులలో మంచి ఆదరణ ఉంది. ఈవారం లేట్-నైట్ టాక్ షోలో జూలై 1న విడుదల కానున్న ‘మ్యాజిక్ మైక్’ సినిమాపై అతిథి వ్యాఖ్యాతలు మాట్లాడారు. దీనిపై తాజాగా విడుదలైన టాక్-షో వీడియో అదుర్స్ అనిపించింది. ఈ అమెరికన్ కామెడీ-డ్రామాపై పిల్లలు రాసిన స్క్రిప్ట్‌ను అతిథులు చదివి వినిపించారు.
వీడియో గేమ్: ది రష్
నిడివి: 4 ని. 1 సె.
హిట్స్: 10,26,590
అమెరికాకు చెందిన అటారి గేమ్స్ కంపెనీ వారి ‘రష్’ వీడియో గేమ్‌లు ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు సీరిస్‌లో కొత్తదనం చేర్చడం వల్ల వాటి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. వింత ఆకార ‘జెర్గిలింగ్’ దాడి ఎలా ఉంటుందో, ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా ఎలా భయపెడుతుందో తాజా వీడియో చూస్తే తెలుస్తుంది. వీడియో గేమ్స్ ఇష్టపడే చిన్నారులైతే ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు.
ట్రైలర్: బజ్‌రంగి బైజాన్
నిడివి: 1 ని. 33 సె.
హిట్స్: 8,63,143
కరీనా అభిమానులు మాత్రమే కాదు... సాధారణ ప్రేక్షకులు సైతం ‘బజ్‌రంగి బైజాన్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ట్రైలర్. కొందరైతే ట్రైలర్ చూసి కథ ఊహించుకుంటున్నారు. హనుమాన్ వీర భక్తుడు పవన్ పాత్రలో సల్మాన్ నట విన్యాసాలకు ట్రైలర్ అద్దం పట్టేలా ఉంది. ఈ ట్రైలర్ రిలీజ్ రోజు బెబో(కరీనా కపూర్) అందం, అభినయం గురించి ఖాన్ తెగ పొగిడాడు.
టీజర్: సుల్తాన్
నిడివి: 33 సె.
హిట్స్: 5,75,643
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమా వచ్చే సంవత్సరం విడుదల అవుతోంది. అంతమాత్రాన ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన కబుర్లకేం లోటు లేదు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ రచన, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రెజ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హర్యానాకు చెందిన మల్లయోధుడిగా సల్మాన్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
షార్ట్ ఫిల్మ్: కన్యాదాన్
నిడివి: 2 ని. 45 సె.
హిట్స్: 5,16,455
గ్లామర్ ఒలకబోసే పాత్రల్లో ఎక్కువగా కనిపించే అదితిరావు హైదరి ఈసారి మాత్రం సామాజిక స్పృహ ఉన్న లఘు చిత్రంలో నటించారు. ‘కన్యాదాన్’ అనే ఈ చిత్రం తండ్రి-కూతుళ్ల అనుబంధం పైనే కాకుండా గృహహింసపై కూడా దృష్టి పెడుతుంది. ‘కన్యాదాన్’లో కూతురుగా ఆదితిరావు, తండ్రిగా దలిప్ తహిల్ నటించారు. ‘ఫాదర్స్ డే’ రోజు విడుదలైన ఈ లఘుచిత్రానికి యూట్యూబ్‌లో హిట్ల మీద హిట్లు పడుతున్నాయి.
ఈ వారం యూ ట్యూబ్ హిట్స్
Published Sun, Jun 28 2015 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM
Advertisement
Advertisement