
ధ్యానం ద్వారానే శక్తి చేకూరుతుంది...
అకుంఠిత దీక్ష, సూక్ష్మ దృష్టి, నిశిత బుద్ధి, గొప్ప సామర్థ్యం లాంటి సుగుణాలను ఎవరు కల్గి ఉంటారో వాళ్ళే ఘనకార్యాలు సాధిస్తారు. దానికంతటికి ఎంతో శక్తి అవసరం. దాన్ని అన్వేషించగలిగితే విజయాల పరంపరే. అది ఎక్కడి నుంచి వస్తుందన్నదే అందరి ప్రశ్న. శక్తి అనేది భక్తి భావంతో కూడిన ధ్యానం ద్వారానే సాధ్యం అని శ్రీ కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి అభిప్రాయపడ్డారు.
శిష్యుల్లో చైతన్యం కల్గించేవారే గురువు. ఉత్తమ గురువనే వారు విజ్ఞాన సంపన్నుడై ఉండాలి. లౌకిక - అలౌకిక విషయాలపై పూర్తి అవగాహన కల్గి ఉండాలి. వాటిని చేధించే మార్గాలు తెలిసి, శిష్యులచే సాధన చేయించే సామర్థ్యం కల్గి ఉండాలి. ఉత్తమ శిష్యులకు విజ్ఞానం - తపస్సాధన ఈ రెండు లక్షణాలు తప్పని సరి. ప్రతి వ్యక్తీ తన జీవితం సుఖవంతం కావటానికి సద్గురువును ఆశ్రయించాలి. గురువు అనుగ్రహం పొందగలిగినప్పుడే జీవితం ఫలప్రదమవుతుంది.
మానసిక ప్రశాంతత..
ఇప్పుడు తరచు వినవస్తున్న ప్రశ్న మానసిక ప్రశాంతత. ఇది రెండు మూడు రకాలుగా వస్తుంది. దీన్ని సాధించడం సులువే. వివేకం.. ధ్యానం.. సాధన.. ఎవ రైతే వీటిని చిత్తశుద్ధిగా ఆచరించగలుగుతారో వారు నిజజీవితాన్ని జయించినట్లే. ఇవి సాధించటం కష్టసాధ్యమేమీ కాదు... చాలా సంఘటనలు బయట వింటూ ఉంటాం. ఓ పరిశ్రమకు కొత్త అధికారి వస్తారు. ఆయనకు ధ్యానంపై అవగాహన ఉంటుంది. రోజూ తమ ఉద్యోగులతో కొంత సేపు ధ్యానం చేయిస్తాడు. తర్వాతనే విధుల్లోకి పంపుతారు. అలా చేయటంతో పరిశ్రమ పురోభివృద్ధి చెందిందని వింటూ ఉంటాం. అలాగే మానసిక ప్రశాంతతకు కూడా ధ్యానమే సరైన మార్గం అంటాను.
యువత - కార్యసాధన..
యువత కార్యసాధకులు అవ్వాలి. అమృతం లభించేవరకు పాల సముద్రాన్ని మధించినట్లుగా. జీవిత పయనంలో ఎన్నో ఎన్నో ఎదురౌతాయి. వాటిని నిరంతర భక్తి ద్వారానే ఎదుర్కొవచ్చు. ధీరులు ఎన్ని ఆటంకాలు కలిగినా పూనుకొన్న పని నెరవేరే వరకూ వదలనే వదలరు. ఉత్తమ శిష్యులకు ఒక తలంపు రావాలి. అదే భక్తి భావం. ఆకలితో అలమటిస్తున్నవారకి ఆహారం ఇస్తే అది దైవానికి సమర్పించే నైవేద్యం వంటిదే. ‘దుఃఖపూరితమైన ఈ ప్రపంచంలో నిజమైనది ప్రేమ బిందువే. అది సముద్రమంత గొప్పది. కష్టనష్టాల తర్వాతే సుఖాలు.
ఆధ్యాత్మిక సాధన...
వివేకవంతంగా ధ్యానం కొనసాగిస్తే దైవభక్తి అబ్బుతుంది. ఒకవేళ ఆ మార్గంలో అవరోధాలేమైనా ఎదురైతే వాటిని దైవానుగ్రహంతో జప, హోమాలతో ఎదుర్కొనవచ్చు. మానవుడికి ఎదురయే కష్టనష్టాలను తొలగించగలిగేది దైవానుగ్రహమొక్కటే! అందుకు సాధన చాలా ముఖ్యమైంది. దైవం బోధపడితే దైవధర్మం బోధపడుతుంది.
మోక్ష మార్గం..
మానసిక సన్యాసం చాలా ముఖ్యమైంది. దీన్ని పొందగలిగినవాడు మోక్షాన్ని పొందగలడు. ఈ సృష్టిలో కనిపించేదంతా అశాశ్వతం. ఆ విషయాన్ని బాగా తెలుసుకొన్న వారెవరైనా సరే మోక్షానికి దగ్గరైనట్లే. జీవితంలో మార్పులన్నింటికీ కాలమే ప్రధాన కారణం. బుద్ధిమంతులు సమయాన్ని సద్వినియోగం చేసుకొని పాపాలన్నింటినీ పోగొట్టుకుంటారు. ఆ తర్వాత సాత్వికుడుగా మారిపోతారు. దీనిని ఇప్పుడిప్పుడే అందరూ గ్రహిస్తున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అది సంతోషకర పరిణామం.
వివేకవంతులు...
ప్రవాసాంధ్రులు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని అంటున్నారు గదా. వారు వివేకవంతులు కాబట్టే పుట్టిన గడ్డను వదిలి దూరంగా ఉన్నా ఇష్టంగా ఆచరిస్తున్నారు. వివేకవంతులకు సూక్ష్మదృష్టి ఉంటుంది. అందుకే వారు ఖండాంతరాల్లో కూడా విజయకేతనం ఎగురవేస్తున్నారు. ప్రజ్ఞావంతులకు వారిలోని ప్రజ్ఞతోబాటు భక్తి, ప్రేమ, కరుణ, దయ అన్నీ తగుపాళ్లలో ఉంటాయి. అందుకే స్వదేశంలోనే కాదు, విదేశాలలో కూడా రాణించి, నిలదొక్కుకొని విజేతలు అవుతున్నారు. ఇక్కడ అలా జరగటం లేదు. ఏదేమైనా సకల జనులకు భక్తి భావం అబ్బి, సుఖసంతోషాలతో వించాలని ఆశిస్తున్నాను. ఆశీర్వదిస్తున్నాను.
- కోన సుధాకర్ రెడ్డి, సాక్షి