సినిమా డెరైక్టర్లుగా తమ ప్రతిభను నిరూపించుకోవాలనుకునే ఈతరం పిల్లలు మునుపటిలా సినిమా ఆఫీసుల చుట్టూ చెప్పులరిపోయేలా తిరగనక్కర్లేదు.
సినిమా డెరైక్టర్లుగా తమ ప్రతిభను నిరూపించుకోవాలనుకునే ఈతరం పిల్లలు మునుపటిలా సినిమా ఆఫీసుల చుట్టూ చెప్పులరిపోయేలా తిరగనక్కర్లేదు. ఆకట్టుకునేలా తీయగలిగే టాలెంట్ ఉంటే చాలు... అవకాశాలు అనేవి అడ్రస్ వెదుక్కుని వస్తాయి. మీ ఇంటి కాలింగ్ బెల్‌ను నొక్కుతాయి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక షార్ట్‌ఫిల్మ్‌ను తీయడమే. అందులో ఏ కాస్త సత్తా ఉన్నా... ఆ ఫిల్మ్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళుంది.
‘ఇదేదో బాగుందే’ అనుకొని ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చేతులు దులుపుకున్నంత మాత్రాన అవకాశం దరి చేరుతుందా? అదేమీ కాదు. లఘుచిత్రాల నిపుణులు, లఘుచిత్రాల ద్వారా చిన్న వయసులోనే ఖ్యాతి గడించిన దర్శకులు ఏమంటున్నారో వినండి...
‘‘చాలామంది కుర్రాళ్లకు షార్ట్‌ఫిల్మ్ తీయాలనే ఉత్సాహం ఉంటుంది గానీ ఏమి తీయాలో ఎలా తీయాలో అనే దాని గురించి బొత్తిగా అవగాహన ఉండదు’’ అని.
చేతిలో కెమెరా, నలుగురు ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రానే ‘షార్ట్ ఫిల్మ్’ రూపుదిద్దుకోదు. ‘తీయాలి కాబట్టి తీశాం’ అని తీస్తే అందులో ‘ఆత్మ’ అడ్రస్ గల్లంతవుతుంది. ఈ నేపథ్యంలో షార్ట్‌ఫిల్మ్ తీయాలనుకునే ఉత్సాహవంతులకు కొన్ని సూచనలు ఇవి...
ప్రీ-ప్రొడక్షన్: ఏదో ఒక కథను హడావిడిగా ఎంచుకోవడం కాకుండా నలుగురు మెచ్చే కథను తయారుచేసుకోండి. స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేయండి. మీకు స్క్రిప్ట్ సంతృప్తిని ఇచ్చాకే ప్లానింగ్‌లోకి దిగండి.
ప్రొడక్షన్: కథకు తగిన పరిసరాలు ఎంచుకోండి. నటుల విషయంలో మొహమాటాలొద్దు. ‘‘ఫ్రెండే కదా! ఏదో ఒక పాత్ర ఇస్తే సరి’’ అనుకోవడానికి లేదు. ఈ విషయంలో రాజీ పడవద్దు.
పోస్ట్-ప్రొడక్షన్: ఎడిటింగ్ ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయాలి. ఈ విషయంలో పెద్దల అభిప్రాయాలను తీసుకోండి. విజ్‌వల్ ఎఫెక్ట్స్ విషయంలో అతి ఉత్సాహం మంచిది కాదు. అపోహ: ఖర్చు ఎంత ఎక్కువగా చేస్తే ఫిల్మ్ అంత బాగా వస్తుందనేది అపోహ మాత్రమే. దాని నుంచి బయటపడాలి. చాలా తక్కువ ఖర్చుతో రూపొందించిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయాన్ని మరవొద్దు. షార్ట్‌ఫిల్మ్‌లు తీసి పేరు గడించిన వాళ్ల దగ్గరకు వెళ్లి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. వాళ్లతో మాట్లాడితే ‘షార్ట్ ఫిల్మ్ మేకింగ్’కు సంబంధించి కొన్ని మంచిపుస్తకాలు చదివినట్లే కదా!
ఇగోను పూర్తిగా వదిలేయండి. ‘ఫలానా సన్నివేశం బాగోలేదు’ అంటే కోపం తెచ్చుకోకుండా ఎందుకు బాగోలేదో అడగండి. తప్పులు సవరించుకోండి. ‘షార్ట్ ఫిల్మ్ తీయాలి’ అనే ఉత్సాహం మాత్రమే మిమ్మల్ని ‘బెస్ట్ డెరైక్టర్’ని చేయదు. ఎంత అందమైన భవనానికైనా, పెద్ద భవనానికైనా ‘పునాది’ ముఖ్యం. అది గట్టిగా ఉండాలి. డెరైక్టర్‌గా మన పునాది గట్టిగా ఉండాలంటే కెమెరా యాంగిల్స్‌లాంటి టెక్నికల్ విషయాలు మాత్రమే తెలిస్తే సరిపోదు. సాహిత్యాన్ని విరివిగా చదవాలి. ప్రపంచ ప్రసిద్ధ చిత్రాలను చూడాలి. అధ్యయన శక్తిని పెంపొందించుకోవాలి.
మ్యాట్ వైట్‌క్రాస్ అనే డెరైక్టర్ ఒకసారి ఇలా ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ‘‘కొన్నిసార్లు రెండు గంటలు చెప్పాల్సిన కథను పదినిమిషాల్లో చెప్పాను. పదినిమిషాల్లో ముగించాల్సిన కథను రెండు గంటలు సాగతీశాను. తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాం. అయితే వాటి నుంచి త్వరగా బయటపడడం అవసరం. నేను అదే చేశాను.’’
బ్యాడ్ ఫిల్మ్ తీయడం కంటే తీయకపోవడమే ఉత్తమం. కాబట్టి బెస్ట్ కథను ఎంచుకోండి. బెస్ట్ నటులను ఎంచుకోండి. బెస్ట్‌గా తీయండి. బెస్ట్ ఆఫ్ లక్!