
చలికాలం కురుల సహజత్వాన్ని కాపాడుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. లేదంటే వెంట్రుకలు పొడిబారడం, చిట్లడం, చుండ్రు సమస్య తలెత్తడం వంటివి చూస్తుంటాం. వీటికి విరుగుడుగా..
అలొవెరాతో కండిషనర్
షాంపూలు, కాలుష్యం, గాలిలో తేమ తగ్గడం.. వంటి వాటి వల్ల ఈ కాలంలో వెంట్రుకలు త్వరగా పొడిబారడం, చిట్లడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. వీటి వల్ల జుట్టు నిస్తేజంగా కనిపిస్తుంది. అలొవెరా ఆకులను పేస్ట్ చేసి, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 15–20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలొవెరా రసం జుట్టు్టకు కావలసినంత కండిషన్ లభించేలా చేస్తుంది. దీంతో జుట్టు మెత్తగా, నిగ నిగలాడుతూ ఉంటుంది. అలోవెరా జెల్‌ను రాత్రి పడుకునే ముందు మాడుకు పట్టించి, మరుసటి రోజు శుభ్రపరుచుకోవాలి. ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది, చుండ్రు కూడా తగ్గుతుంది.
ఉసిరితో మర్దన
ఉసిరి, మందార పువ్వులు మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే వెంట్రుకలు చిట్లే సమస్య తగ్గుతుంది. కురుల మృదు త్వం పెరుగుతుంది.
బీట్‌రూట్ థెరపీ
బీట్‌రూట్‌ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.