సహనం.. త్యాగం... ఈ పండుగ సందేశం! | Today bakrid | Sakshi
Sakshi News home page

సహనం.. త్యాగం... ఈ పండుగ సందేశం!

Published Thu, Sep 24 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

సహనం.. త్యాగం...  ఈ పండుగ సందేశం!

సహనం.. త్యాగం... ఈ పండుగ సందేశం!

నేడు  బక్రీద్
 
ఎన్నో త్యాగాలు... మరెన్నో బలిదానాలు... ఒక మానవమాత్రుని సహనానికి పరాకాష్ఠ అనదగిన అనేక పరీక్షలు... అన్నిటినీ తట్టుకుని మేరుపర్వతంలా నిలిచిన అపూర్వ వ్యక్తిత్వం... ఎన్నో ఉలిదెబ్బల తర్వాత శిల శిల్పంగా మారుతుంది. కంసాలి కొలిమిలో కాలిన తరువాతనే నగ అద్భుతరూపాన్ని సంతరించుకుంటుంది. ఇది మానవజీవితానికి కూడా వర్తిస్తుంది. సయ్యద్ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితమే దీనికి చక్కని చారిత్రక ఉదాహరణ. ఇయన అనేక పరీక్షలు ఎదుర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. విగ్రహారాధన, అధర్మవ్యాపారం వద్దన్నందుకు తండ్రి ఇంట్లోంచి గెంటేశాడు. సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలను వ్యతిరేకించినందుకు సమాజం కన్నెర్రజేసింది. అధికారాన్ని, దైవత్వాన్ని ప్రశ్నించినందుకు పాలకుల ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది. కళ్లముందే అగ్గిరాజేసి, ఉవ్వెత్తున ఎగసిపడే కీలల్లో పడేసినా ప్రాణత్యాగానికే సిద్ధమయ్యారు కానీ, రాజును దైవాంశ సంభూతునిగా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. చివరికి దేశం నుండి బహిష్కరించినా సంతోషంతో సంచారజీవనం సాగించారాయన.
 అయినా పరీక్షల పరంపర అంతం కాలేదు. అదనంగా మరో పరీక్ష ఎదురైంది.

ఈసారి మానవుల నుండి కాదు, సాక్షాత్తూ దైవం నుండి. కట్టుకున్న భార్యను, కన్నకొడుకునూ జనసంచారం లేని ఎడారి ప్రాంతంలో వదిలేయమని దైవాజ్ఞ. ఎందుకూ? అన్న ప్రశ్న కాదుగదా, కనీసం అలాటి ఊహ కూడా మనసులో లేకుండా ఓ నిర్జన ఎడారి ప్రాంతంలో వదిలేశారు. కనీసం నాలుక తడుపుకోవడానికి సైతం గుక్కెడు మంచినీళ్లు కరువైన ఆ ప్రదేశంలో, చిన్నారి పసికందు ఇస్మాయిల్ దాహంతో గుక్కపట్టి ఏడుస్తూ, కాళ్ల మడిమెలతో రాసిన చోట అల్లాహ్ మహిమతో బ్రహ్మాండమైన నీటి ఊట ఉబికింది. ‘జమ్ జమ్’ అనే పేరుగల ఆ పవిత్ర జలంతో తల్లీబిడ్డలు దాహం తీర్చుకున్నారు. ఆనాడు రెండు ప్రాణాల కోసం వెలసిన ఆ నీరు ఈనాడు లక్షలాదిమంది అవసరాలు తీరుస్తూ, తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం దేవుని ప్రత్యక్ష మహిమకు తిరుగులేని నిదర్శనం.

 కొన్నాళ్ల తరువాత ఆ మహనీయునికి మరో కఠినపరీక్ష వచ్చి పడింది. మానవేతిహాసంలో కనీవినీ ఎరుగని పరీక్ష అది. దైవాదేశపాలనలో ప్రేమానురాగాలకు, వాత్సల్యాలకు అణుమాత్రమైనా చోటు లేదని రుజువు చేసిన పరీక్ష అది. సుదీర్ఘ ఎడబాటు తరువాత భార్యాబిడ్డలను కలుసుకున్న ఆనందం కూడా తీరకముందే, ప్రాణసమానమైన పుత్రరత్నాన్ని దేవుని మార్గంలో త్యాగం చేయాల్సి రావడం మామూలు పరీక్ష కాదు. హజ్రత్ ఇబ్రాహీం (అ) దానికీ సిద్ధమయ్యారు. శ్రీమతినీ, పిల్లాడినీ కూడా సంప్రదించారు. లేక లేక అల్లాహ్ మనకు అనుగ్రహించిన వరం ఇస్మాయీల్. తిరిగి ఆ వరాన్ని ఆయనే కోరుకుంటున్నప్పుడు సమర్పించుకోవడమే మన ధర్మం. అంతా దైవలీల’’ అన్నారు శ్రీమతి హాజరా (అ).

 ‘‘దైవాజ్ఞ పాలనలో ఆలస్యం చేయకండి నాన్నా! దైవచిత్తమైతే నన్ను మీరు సహనవంతునిగా చూస్తారు’ అన్నారు చిన్నారి ఇస్మాయీల్. ఆ సమయాన తండ్రీకొడుకుల మధ్య జరిగే సంభాషణ విన్న సృష్టిలోని అణువణువూ అవాక్కయిపోయింది. ఈ అచంచల, అద్వితీయ విశ్వాస బలాన్ని నివ్వెరపోయి చూస్తున్న ప్రకృతి ఒక్కసారిగా స్తంభించిపోయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అల్లాహ్ పవిత్రనామాన్ని స్మరిస్తూ, తనయుని మెడపై కత్తిపెట్టి జుబహ్ చెయ్యడానికి ఉద్యుక్తులయ్యారు హజ్రత్ ఇబ్రాహీం (అ). దీంతో తన ప్రియప్రవక్త ఇబ్రాహీం పట్ల దైవప్రసన్నత పతాకస్థాయిన ప్రసరించింది. తన ఆజ్ఞాపాలనలో వారు మానసికంగా సిద్ధమైన క్షణంలోనే ఆయన వారిపట్ల అమిత ప్రసన్నుడై, వారి త్యాగాన్ని స్వీకరించాడు. చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో జుబహ్ చెయ్యడానికి ఓ స్వర్గలోకపు పొట్టేలును ప్రత్యక్షపరిచాడు.

 ఇదీ నాటి త్యాగానికి సంబంధించిన సంక్షిప్త గాథ. ఇందులో మనందరికీ చక్కటి ఆదర్శం ఉంది. మంచికోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మసంస్థాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. అందుకని, పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్ఫూర్తి తొణికిసలాడాలి. దైవప్రసన్నత కోసం, ఇహపర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్థయిర్యాలు కనబరిచారో మనం కూడా అలాంటి ప్రయత్నం చెయ్యాలి. సచ్ఛీలత, సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నింటికన్నా ముఖ్యమైనది. ఈదుల్ అజ్ హా పర్వం మానవాళికి నేర్పిస్తున్న సందేశం ఇదే.
 యండీ ఉస్మాన్‌ఖాన్
 అక్షరసాహితి అధ్యక్షులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement