అంగళ్లులో జరిగిన ఘటన
ఆచూకీ చెబితే పారితోషికం
కురబలకోట : ఇన్నాళ్లు పర్సులు కొట్టేసే దొంగలను చూశాం.. ఇంట్లో చొరబడి బంగారో..నగదో చోరీ చేసిన వాళ్లనూ చూశాం.. కానీ ఏకంగా పెద్ద జంతువులలో ఒకటైన ఒంటెనే ఎత్తుకెళ్లే ఘనులుంటారని ఇప్పుడే చూస్తున్నాం. అవును.. అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం అంగళ్లులో ఒంటెను ఎత్తుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు..త్వరలో జరగబోయే బక్రీద్‌కు అంగళ్లుకు చెందిన మిత్రులు కొందరు 13 రోజుల క్రితం రూ.1.25 లక్షలతో ఒంటెను కొన్నారు.
పరిసర ప్రాంతాల్లో మేపుతూ రాత్రి వేళ ఇంటి వద్ద కట్టేసేవారు. ఆదివారం వేకువ జామున లేచి చూస్తే ఒంటె కాస్తా కన్పించలేదు. తాడు తెంపుకుని బయటకు వెళ్లిందోమోనని తొలుత భావించారు. స్థానికంగా వెతికినా కన్పించలేదు. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకే కాకుండా రాత్రి పొద్దుపోయే వరకు కూడా స్నేహితులు కలసి అంతటా గాలించారు. పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టినంత పనిచేశారు. సమీపంలోని గుట్టలు, వాగులు, వంకలతో పాటు పరివాహక ప్రాంతాల్లో కూడా వెతికారు. ఎక్కడా ఆచూకీ కన్పించలేదు. గుర్తు తెలియని వారు ఎవరైనా తోలుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు.
పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఒంటె జాడ మాత్రం కన్పించలేదు. అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె నుంచి మదనపల్లెకు కొత్తగా వేస్తున్న బైపాస్ మీదుగా ఒంటెను తోలుకెళ్లిన ఆనవాళ్లు, అడుగులు కన్పించినట్లు చెబుతున్నారు. సాధారణంగా ఏనుగులు, ఒంటెలు లాంటి భారీ సైజు వాటిని చోరీ చేయడం ఆషామాషీ కాదు. కష్టంతో పాటు సాహసంతో కూడుకున్న పని. ఇలాంటి పెద్ద ఒంటెనే అంగళ్లులో ఏకంగా చోరీ చేశారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. ఆచూకీ తెలిస్తే 8978126623 మొబైల్ నెంబరుకు సమాచారం ఇస్తే తగిన పారితోషికం ఇస్తామని బాధితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment