నెల్లూరు: వ్యాపారినంటూ నమ్మించి స్థానికుల నుంచి రూ.మూడు కోట్లను కాజేసి వ్యక్తి పరారైన ఘటన ఆత్మకూరు పరిధిలోని నెల్లూరుపాళెంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన ఓ వ్యక్తి తన పేరు భాస్కర్‌రెడ్డి అంటూ నెల్లూరుపాళెం వద్ద మక్కెన రోశయ్య ఇంట్లో మూడు నెలల క్రితం అద్దెకు చేరారు.
ఆత్మకూరు సమీపంలోని నాగులపాడు రోడ్డులో గోడౌన్ లాంటి ఇంటిని అద్దెకు తీసుకొని లారీల్లో చక్కెర బస్తాల ఎగుమతి, దిగుమతి చేస్తూ హడావుడి చేశారు. నెల్లూరుపాళెంలోని పాత ఆర్టీఏ కార్యాలయ సమీపంలో మరో ఇంటిని అద్దెకు తీసుకొని గెస్ట్‌హౌస్‌గా వినియోగించసాగారు. తాను చక్కెరతో పాటు వర్జీనియా పొగాకుతో ఐటీసీ తయారు చేసిన సిగరెట్ల హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నానని చుట్టుపక్కల వారిని నమ్మించారు. తన వ్యాపారానికి కోట్లు అవసరమని.. పెట్టుబడి పెడితే రూ.లక్షకు రోజుకు రూ.1500 వడ్డీని ఏరోజుకా రోజు చెల్లిస్తానని చెప్పారు.
దీనికి ఆశపడిన రోశయ్య రూ.కోటిన్నరను ఆయనకు ముట్టజెప్పారు. చెప్పిన విధంగా రూ.2.25 లక్షల చొప్పున అధిక వడ్డీని క్రమం తప్పకుండా అందించసాగారు. విషయం తెలుసుకున్న నెల్లూరుపాళెం సెంటర్‌లోని వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు ఎగబడ్డారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.30 లక్షలను సమర్పించారు. అనంతరం భాస్కర్‌రెడ్డి పత్తా లేకపోవడంతో కంగారుపడిన బాధితులు ఆయన గురించి ఆరాతీశారు.
ఇదే తరహాలో బుచ్చిరెడ్డిపాళెంలోనూ పలువుర్ని నమ్మించి నగదుతో పరారయ్యాడని తెలుసుకొని లబోదిబోమంటూ ఆత్మకూరు పోలీసులను ఆశ్రయించారు. అతని ఫోన్ లోకేషన్‌ను పరిశీలించి బద్వేల్‌లో ఉన్నారని గుర్తించి పోలీసుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. సుమారు రూ.మూడు కోట్ల మేర కాజేసి ఉడాయించారని బాధితులు రోశయ్య, చెరుకూరి కామాక్షయ్య సన్నిబోయిన ప్రభాకర్, ఈదల సురేష్, ప్రసాద్, ఖాజారహంతుల్లా, మాదాల విష్ణు, బొబ్బల రాజా, ముక్కాల శ్రీనివాసులు, పుచ్చకట్ల రమణయ్య, మాదాల కృష్ణయ్య, తదితరులు తెలిపారు. ఫిర్యాదు మేరకు డీఎస్పీ కోటిరెడ్డి, ఎస్సైలు ముత్యాలరావు, రాజేష్ దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment