తండ్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌తో మణిబెన్
మణి.. అమూల్యమైనది.‘ఉక్కు’కు తోడైన ఆ మణి..తండ్రి జీవితాన్నుండి ప్రభావితమైతండ్రి జీవితాన్ని ప్రభావితం చేసి..వారసత్వానికే వన్నె తెచ్చింది.ఉక్కు సంకల్పం నాన్నది. ఉద్యమ గుణం మణిది. అందుకే మణిబెన్.. ఉక్కుమణి! నేడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి.
నేడే గుజరాత్‌లో పటేల్ ఐక్యతా ప్రతిమ ఆవిష్కరణ. ఈ సందర్భంగా ఆ ఉక్కుమనిషికి చివరి వరకు బాసటగా ఉన్న కుమార్తె మణిబెన్ పటేల్ గురించి స్ఫూర్తిదాయకమైన విశేషాలు, విశేషాంశాలూ ఇవి.‘నేనూ పెద్దవాడినైపోయాను. ఇప్పటికైనా ఏదో మార్గం ఎంచుకోవాలి నువ్వు!’ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 1944లో తన ఏకైక కుమార్తె మణిబెన్ పటేల్‌కు ఇచ్చిన సలహా ఇది. ‘పటేల్: ఏ లైఫ్’ పేరుతో గాంధీజీ మనుమడు రాజ్‌మోహన్ గాంధీ రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారు. కూతురితో ఈ మాట అనే నాటికి సర్దార్ స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ కుడిభుజం. తొందరలోనే స్వరాజ్యం వస్తుందని అంతా నమ్ముతున్న కాలం. ఆ అంచనా వాస్తవం కూడా. గాంధీజీకి ముఖ్య అనుచరుడిగా, జవహర్‌లాల్ నెహ్రూకు సముడిగా స్వతంత్ర భారతదేశంలో పటేల్ స్థానం ఏమిటో ఊహించడం కష్టం కాదు. అయినా ఆయన కూతురికి ఇలాంటి సలహా ఇచ్చారు. అంటే తన సంతానం రాజకీయాలలోకీ, ప్రభుత్వ పదవులలోకీ రావాలని ఆయన ఎంతమాత్రం అనుకోలేదు. సర్దార్ పటేల్, జవేర్బాయి పటేల్‌లకు ఒక కూతురు, కొడుకు. కూతురే మణిబెన్. కొడుకు దహ్యా పటేల్. పటేల్‌కు 33 ఏళ్ల వయసులో భార్యా వియోగం జరిగింది. పటేల్‌కు సంతానమంటే ఎంతో అనురాగం. ద్వితీయ వివాహం చేసుకుంటే సమస్యలు ఎదురవుతాయనీ, అవి పిల్లలను ఇబ్బంది పెడతాయనీ చేసుకోలేదు. ఆ మరుసటి సంవత్సరమే బారిస్టర్ చదువు కోసం సర్దార్ టెంపుల్ టౌన్‌కు (ఇంగ్లండ్) వెళ్లారు. అప్పుడే చాలాకాలం మణిబెన్ నానమ్మ దగ్గర, పెదనాన్న విఠల్‌భాయ్ పటేల్‌ల దగ్గర పెరిగింది. విఠల్‌భాయ్ పటేల్ కూడా చరిత్ర ప్రసిద్ధుడే.
జీవితాంతం తండ్రికి బాసట
మణి, దహ్యా కూడా గుజరాత్ విద్యాపీలో చదువుకున్నారు. మణి గుజరాతీ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. నిజానికి మణిబెన్ (1903–1990) దేశ సేవకు అంకితమైంది. ఆమె స్వాతంత్య్రోద్యమంలో తండ్రితో, గాంధీజీతో కలసి నడిచారు. జీవితాంతం తండ్రికి బాసటగా ఉన్నారు. మణిబెన్ తండ్రికి కార్యదర్శి, వ్యక్తిగత సేవిక, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే న ర్స్. ఇంటర్వ్యూలను ఏర్పాటు చేసే పని కూడా ఆమెదే. ఆయన బట్టలు కూడా ఉతికేవారు. తండ్రి జీవిత చరమాంకంలో ప్రతిక్షణం ఆయనను వెన్నంటే ఉన్నారు మణి. అందుకే ఆమె రాసిన డైరీ ‘ఇన్‌సైడ్ స్టోరీ ఆఫ్ సర్దార్ పటేల్: ది డైరీ ఆఫ్ మణిబెన్ పటేల్’ ఎన్నో కీలక చారిత్రకాంశాలను, ఇంకా చెప్పాలంటే చరిత్ర పుటలకు ఎక్కడం సాధ్యంకాని రహస్యాలను నిక్షిప్తం చేసుకున్న పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్‌లోని కరంసద్‌లోనే (సర్దార్ పటేల్ పూర్వీకుల స్వగ్రామం) మణి జన్మించారు. స్వస్థలంలోను, గుజరాత్ విద్యాపీuŠ‡లోను చదువుతున్నప్పుడే గాంధీజీ ఉపన్యాసాలు, బోధనలు ఆమెకు ఉత్తేజం కలిగించాయి. 1918లో ఆమె అహమ్మదాబాద్‌లోని గాంధీజీ ఆశ్రమంలో చేరారు.
మనవరాలి పెళ్లి గురించి పటేల్ తల్లి లాద్బా (తండ్రి పేరు జవేర్భాయ్, పటేల్ భార్య పేరు కూడా దీనికి దగ్గరగానే ఉంటుంది) తపన పడుతూ ఉండేవారు. కానీ పెళ్లి విషయంలో కూతురి అభిప్రాయం ఏమిటో, పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఆయన అడగలేదు. కారణం– ఆ ఇంట పిల్లలు పెద్దల ఎదుట నోరు విప్పరు. పెద్దలు కూడా అంతే. పిల్లలతో చాలా తక్కువ మాట్లాడతారు. తాను 33వ ఏట కూడా చుట్టు పక్కల పెద్దలు ఉంటే పెదవి కదపలేదని ఒక లేఖలో పటేల్ రాశారు. 1926లో మరోసారి మణి అహ్మదాబాద్‌లోని గాంధీ ఆశ్రమానికి వెళ్లారు. 1927 జనవరిలో గాంధీజీ నుంచి పటేల్‌కు ఒక లేఖ అందిది. ‘వివాహం చేసుకునే యోచన ఏదీ ప్రస్తుతం మణి దగ్గర లేదు. ఆ విషయం గురించి మీరు ఆందోళన చెందవద్దు. నాకు వదిలిపెట్టండి!’ ఇదీ సారాంశం. చివరికి ఆమె అవివాహితగానే ఉండిపోయారు.
సత్యాగ్రహంలో మూడో పటేల్
సహాయ నిరాకరణోద్యమంలో ఆమె గాంధీజీ, తన తండ్రిలతో కలసి పాలు పంచుకున్నారు. శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాలలో కూడా ఆమె పాల్గొన్నారు. గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలోనూ కొద్దికాలం ఉన్నారు. 1928 నాటి బార్డోలీ సత్యాగ్రహంలో ముగ్గురు పటేళ్లు కనిపిస్తారు. మొదటివారు, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన సర్దార్ పటేల్. రెండు, ఆయన అన్నగారు విఠల్‌భాయ్ పటేల్. మూడు, మణిబెన్ పటేల్. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మణి అరెస్టయ్యారు. పూనా దగ్గరి ఎరవాడ జైలుకు ఆమెను పంపారు. గాంధీజీ చరిత్రలోనే కాకుండా, ఉద్యమ చరిత్రలో కూడా కీలకమైన రెండు ఘట్టాలు అక్కడే చోటు చేసుకున్నాయి. ఆ జైలుకు వెళ్లిన పదిరోజులలోనే గాంధీజీకి ఎంతో ఆప్తుడు, ఆయన కార్యదర్శి మహదేవ దేశాయ్ అనార్యోంతో హఠాత్తుగా కన్నుమూశారు. తరువాత కొద్దికాలానికే కస్తూర్బా కూడా అక్కడే కన్నుమూశారు. అంటే గాంధీజీని బాగా కదిలించిన, కుంగదీసిన రెండు ఘటనలకు మణి ప్రత్యక్ష సాక్షి.
నెహ్రూ తీరుకు నిరాశ!
1950లో తండ్రి మరణించిన తరువాత మణిబెన్ ప్రథమ ప్రధాని నెహ్రూను కలవడానికి ఢిల్లీ Ðð ళ్లారు. ఆ క్షణాలను గురించి అమూల్ రూపశిల్పి వర్ఘీస్ కురియన్ (‘నాకూ ఉంది ఓ కల’ పుస్తకంలో) మనసును కదిలించే ఒక ఘట్టాన్ని నమోదు చేశారు. మణిబెన్ స్వయంగా కురియన్‌కు ఈ సంగతి చెప్పారు. ‘నీవు మాత్రమే ఈ పని చేయాలి’ అంటూ తండ్రి చివరి క్షణాలలో పెట్టిన షరతు మేరకు ఒక పెద్ద సంచి, పద్దుల పుస్తకం ఒకటి నెహ్రూకు అప్పగించారు మణి. ఆ సంచిలో 35 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ పుస్తకం పార్టీ ఖర్చులు, విరాళాల వివరాల పుస్తకం. ఈ రెండు అప్పగించిన తరువాత నెహ్రూ నోటి నుంచి ఒక మాట కోసం మణి ఎదురు చూశారట. అదేమిటని కురియన్ అడిగారు. ‘ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న మాట ఆయన నోటి నుంచి వస్తుందని అనుకున్నాను. కానీ ఆయన (నెహ్రూ) ‘థాంక్స్’ అనే వెళ్లిపోయారు’ అని సమాధానమిచ్చారామె. నెహ్రూకూ, పటేల్‌కు మధ్య వైరుధ్యాలు ఆ కాలానికి ఎంత తారస్థాయిలో ఉండేవో దీనిని బట్టే అర్థమవుతుంది. పటేల్ మరణించడానికి రెండు నెలలముందు జరిగిన ఒక ఉదంతం గురించి మణిబెన్ డైరీలో ఏం రాశారో అహ్మదాబాద్‌కు చెందిన రతీన్‌దాస్ వెల్లడించారు. ‘బాబ్రీ మసీదు జీర్ణోద్ధరణ, సోమ్‌నాథ్ ఆలయ పునర్ నిర్మాణం వేరువేరు అంశాలు.సోమ్‌నాథ్ ఆలయం కోసం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడం లేదు’ అని పటేల్ వివరణ ఇవ్వగానే నెహ్రూ మౌనం వహించారన్నదే ఆ పేజీలోని మాటల సారాంశం.
మరోసారి ‘మణి’ దండి యాత్ర
గాంధీజీ మరణించే వరకు ఢిల్లీలోని బిర్లా భవన్‌లోనే మణిబెన్ కూడా ఉన్నారు. ఆయన హత్యకు గురైన తరువాత కూడా కొద్దికాలం అక్కడ ఉండవలసిందని బిర్లాలు కోరారు. అందుకు ఆమె అంగీకరించలేదు.తన బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. మణిబెన్ 1976లో మరోసారి దండి యాత్ర జరిపారు. కారణం– భారత ప్రజానీకంలో ధైర్య సాహసాలను పునరుద్ధరించడమే. అది ఎమర్జెన్సీ కాలం.అరెస్టయి జైళ్లలో మగ్గుతున్న నాయకులను విడుదల చేయాలనీ, ఎమర్జెన్సీ ఎత్తివేయాలనీ, పత్రికల మీద సెన్సార్ షిప్‌ను వెంటనే తొలగించాలనీ నినాదాలు ఇస్తూ ఆమె దండి యాత్ర నిర్వహించారు.ఇందిరాగాంధీ ప్రభుత్వం అరెస్టు చేసింది. మణిబెన్ ఆధునిక భారతదేశ చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలను వీక్షించి 1990లో అంతిమ శ్వాస విడిచారు. ‘పటేల్‌ది ఒక తాత్విక వారసత్వం.దానిని మేం సొంతానికి ఉపయోగించుకోవాలని అనుకోవడం లేదు. దానిని ప్రజలే అర్థం చేసుకోవాలి. అనుసరించాలి. రుద్దే ఆలోచన మాకు లేదు’ అంటున్నారు పటేల్ వారసులు.
ముందే రాజకీయాల్లోకి రాలేదు
పటేల్ మరణించిన తరువాత మాత్రమే మణిబెన్ రాజకీయాలలోకి వచ్చారు. గుజరాత్ కాంగ్రెస్ శాఖకు కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఎన్నో సాంఘిక, విద్యా సంస్థల కోసం పనిచేశారు. నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ తరఫున తొలి లోక్‌సభకు (1952–1957) ఆమె దక్షిణ కైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తరువాత రెండో లోక్‌సభకు (1957–1962) ఆనంద్ నియోజక వర్గం నుంచి గెలిచారు. 1964–70 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.
– గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment