అక్టోబర్ 2 గాంధీ జయంతిగా జరుపుకుంటారు. భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ 1869, అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ. బాపూజీ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించారు.
స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులను ఏకంచేసి, అహింసా మార్గాన్ని అనుసరించి, దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్యమైన భూమికను అందించారు. భారతదేశంలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన మోహన్‌దాస్ అనంతరం ఇంగ్లండ్‌కు వెళ్లారు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లి, వలసదారుల హక్కులను కాపాడేందుకు అక్కడ సత్యాగ్రహం నిర్వహించారు.
నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ ఎలా జాతిపిత అయ్యారు? ప్రతి భారతీయుడు ఆయనను బాపు అని ఎందుకు పిలుస్తారనే దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. గాంధీజీ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఇందులో సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ మొదలైనవి ఉన్నాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ అహింసా సూత్రాన్ని పాటించారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పెంచేందుకు నిరంతరం ప్రయత్నించారు.
భారత స్వాతంత్ర్యం తరువాత గాంధీజీ భారతీయ సమాజానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సంస్కరణల కోసం పనిచేశారు, హిందూ-ముస్లిం ఐక్యతను ప్రోత్సహించారు. సత్యం, సంయమనం, అహింసల మార్గాన్ని అనుసరించాలని చెబుతూ, అందుకు స్ఫూర్తిగా నిలిచారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ తన సర్వస్వం త్యాగం చేశారు. సాదాసీదా జీవితమే మనిషికి ఆనందాన్నిస్తుందని ఆయన తన నడత ద్వారా చూపారు. గాంధీజీ ఒక అన్వేషకునిగానూ ప్రసిద్ధి చెందారు. సరళత, నిర్లిప్తత, ఆత్మతో అనుసంధానం అనే భావనలతో గాంధీజీ జీవించారు. ధోతీ ధరించి, ఎక్కడికైనా కాలినడకనే ప్రయాణించి, ఆశ్రమాలలో కాలం గడిపిన గాంధీజీ భారతీయులకు తండ్రిలా మారారు. ఈ కారణంగానే ప్రజలు ఆయనను బాపు అని పిలవడం ప్రారంభించారు.
మహాత్మా గాంధీని ‘జాతి పితామహుడు’ అని పిలిచిన మొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గాంధీజీని ‘జాతి పితామహుడు’ అని పిలిచి గౌరవించారు. మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటంలో విశేష కృషి చేసిన కారణంగానే బోస్.. గాంధీజీని ఉన్నతునిగా పేర్కొన్నారు. అప్పటి నుండే అందరూ గాంధీజీని ‘జాతిపిత’ అని పిలుస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు?
Comments
Please login to add a commentAdd a comment