
కాపురం చేయను.. కానీ విడాకులూ వద్దు..
లీగల్ స్టోరీస్
‘చేతకానివాడికి పెళ్లెందుకు? పెళ్లామెందుకు?’ తన భార్య తిట్లలోని చివరి మాటలు.. చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి.. అవి కూత పెట్టినప్పుడల్లా ప్రశాంత్ దవడలు బిగుసుకుంటున్నాయి.. చేతులు టూ వీలర్ స్పీడ్‌ను రైజ్ చేస్తున్నాయి.. అతని అహాన్ని దెబ్బతీస్తున్నాయి.. అలా ఆ మాటలు గుర్తుకొచ్చే ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ బైక్ వేగమూ పెరుగుతోంది.. ప్రశాంత్ చూపులు రోడ్డు మీద ఉన్నాయి కాని వాటికి సందేశాలిచ్చే పనిని నుంచి మెదడు ఎప్పుడో తప్పుకుంది. అందుకే బైక్ స్పీడోమీటర్ వందను దాటేసింది.. అప్పుడు అతని మైండ్‌కి తాను చేయాల్సిన పని గుర్తొచ్చినట్టుంది చేతులతో సడెన్ బ్రేక్ వేయించింది. దేన్నో ఢీకొట్టబోయి ఆగాడు ప్రశాంత్. అప్పటి దాకా అతని చెవుల్లో మోగిన రొద ఒక్కసారిగా ఆగిపోయింది. ఈలోకంలోకి వచ్చాడు. జరగబోయే ప్రమాదం తల్చుకొని ముచ్చెమటలు పోశాయి! ‘ఇలా అయితే లాభం లేదు.. ప్రాణాలు పోయేట్టున్నాయి.. సొల్యూషన్ కావాలి.. ’ ఓ నిశ్చయానికి వచ్చాడు.
ఆ సమస్య ఏంటి?
‘తన పేరు వెన్నెల. పేరుకు తగ్గట్టే అందంగా.. ప్రశాంతంగా ఉంటుంది మొహం. బంధువుల పెళ్లిలో ఆ అమ్మాయిని చూసి మా అమ్మ, అక్క ఇష్టపడ్డారు. పెళ్లిచూపుల పేరుతో నాకూ చూపించారు. వాళ్ల టేస్ట్‌ను మనసులో ఎన్నిసార్లు మెచ్చుకున్నానో! దిగువ మధ్యతరగతి. ఆ కుటుంబంలో సంప్రదాయానిదే ఇంపార్టెంట్ రోల్. అందుకే అమ్మాయి చాలా అణకువగా... వినయంగా ఉంది. మా వాళ్లు, నేను ఈ సంబంధాన్ని కాదనలేకపోవడానికి అవీ కారణాలే. అందుకే కట్నానికి ప్రయారిటీ ఇవ్వకుండా పెళ్లికి ఒప్పేసుకున్నాం. పెళ్లి చూపులైన నెలకే పెళ్లి అయిపోయింది. ఆ నెల రోజుల్లో తనతో ఫోన్లోనే సంభాషణ. డిగ్రీ చదివింది. వంచిన తలెత్తని రకం. అభిరుచులు, ఆశలు, ఆశయాలు - పెద్దగా ఏమీ లేనట్టనిపించింది ఆమె మాటల్లో. ఏదడిగినా.. ‘మీకు ఎలా కన్వీనియెంట్‌గా ఉంటే అలాగే’ అనేది. మనసులో మురిసిపోయాను.
ఫస్ట్ నైట్ అప్పుడు మొదలైంది..
‘ఊ.. చెప్పు’ అన్నాను. ‘ఏం చెప్పను’ అంది. అప్పటిదాకా ఉన్న సిగ్గు, బిడియం ఏమీ కనిపించలేదు. ఒకరకంగా నిర్లక్ష్యంగానూ వినిపించింది. విస్తుపోయా.. పెరిగిన చనువు వల్లనేమో అని వెంటనే సర్దుకున్నా. ‘పోనీ ఏదైనా అడుగు’.. మంచం మీద ఆమెకు కాస్త దగ్గరగా జరుగుతూ తన చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ అడిగా! వెంటనే తన చేతిని వెనక్కి లాగేసుకుంటూ.. కాళ్లను మంచమ్మీద పెట్టేసుకొని బాసింపట్టు వేసుకొని నాకు ఎదురుగా డెరైక్షన్ మార్చుకుంది అడగడానికి సిద్ధమవుతున్నట్టుగా! నవ్వుకున్నాను. ‘మీ జీతం ఎంత?’ అడిగింది. చెప్పాను. ‘మీ ఉద్యోగం గురించి తప్ప మీ ఆస్తుపాస్తుల గురించి మావాళ్లేమీ అడగలేదు. నాకు చెప్పండి’ అంది. అవసరమే అనిపించి వివరించా! ‘మీ అక్కకు కట్నమెంత ఇచ్చారు?’ తర్వాత ప్రశ్న. ‘ఎంక్వయిరీనా?’ సహనంగా అడిగా. ‘ఏదో అనుకొని చెప్పండి.. ఇప్పుడు మీ ఊళ్లో పొలాలు గట్రాలో కూడా ఆమెకేమన్నా వాటా ఉందా?’ తన ధోరణిలో తను. సహనం చిరాగ్గా మారింది. తమాయించుకుని చెప్పాను. ‘మీ అమ్మకు ఏవేం నగలున్నాయి?’ చిరాకు కోపానికి ట్రాన్స్‌ఫర్ కాకుండా జాగ్రత్తపడ్డాను. ఆ రాత్రి తీపి జ్ఞాపకంగా మిగలదని అర్థమైపోయింది. ఆమె అడిగినవి చెప్పి పడుకున్నా.
ఫ్లైట్ జర్నీ.. పుట్టినరోజు గ్రాండ్ పార్టీ
నాకున్న సెలవులు, బడ్జెట్ దృష్ట్యా హానీమూన్‌కి దగ్గరి డెస్టినేషన్ ఎంచుకున్నా. టికెట్స్ రిజర్వ్ చేసే ముందు వెన్నెలకు చెప్పా. ‘ఎక్కడికి వెళ్లాలో మీరొక్కరే నిర్ణయించుకుంటే ఎలా? జీవితంలో హనీమూన్ ఒక్కసారే వస్తుంది. కాబట్టి మంచి ప్లేస్‌కే వెళ్దాం. నాకు ఎప్పటి నుంచో ఫ్లయిట్ ఎక్కాలని కోరిక. ఫ్లయిట్‌లో వెళ్లే ప్లేస్‌కి హానీమూన్ టూర్ పెట్టండి’ అని ఆర్డర్ వేసింది. నిజమే మొదటిసారి పదే పదే రాదు కదా.. అని ఫ్లయిట్‌లో వెళ్లే ప్లేస్‌కే హానిమూన్ డెస్టినేషన్ మార్చా. పెళ్లయిన నాలుగు నెలలకు తన పుట్టినరోజు. తనెప్పుడూ బర్త్‌డే చేసుకోవడం ఎరగననీ, అందుకే గ్రాండ్‌గా చేసుకోవాలనుందని కోరింది. అప్పటికీ ఖర్చుల మోత ఎక్కువవుతున్నా.. పెళ్లాయ్యాక తన తొలి పుట్టినరోజు కదా.. ఆమె ఆశ నెరవేర్చడం భర్తగా నా బాధ్యత అనుకొని ఓ త్రీస్టార్ హోటల్‌లో టేబుల్ రిజర్వ్ చేశా. కానీ ఆమె సంతృప్తి పడలేదు. పుట్టినరోజు కానుకగా కనీసం ఓ ఉంగరం కూడా కొనపెట్టలేదనే కంప్లయింట్.
దాని తాలూకు నసను ఓ నెల రోజులు కంటిన్యూ చేసింది. ఎక్స్‌పెక్ట్ చేస్తోంది కదా అని తనకు నచ్చిన ఉంగరం కొనిపెట్టా. ఆ తర్వాత నెలకు ఇంకో విష్. అలా చీరలు, నగలు, ఇంట్లో వస్తువులు.. చిట్టా పెరుగుతోంది. సాధింపు భరించలేక క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేస్తూ అడిగింది తెచ్చిపడేస్తున్నా. సాయంత్రం అయిందంటే చాలు ఇంటికెళ్లడానికే భయపడే పరిస్థితి వచ్చింది. ఆమె అడిగింది ఏదైనా కాదంటే, వంట కూడా చేయట్లేదు. నేను బయట తింటున్నా.. తను ఉపవాసం ఉంటోంది. శ్రుతి మించుతోందని భయమేసి ఒకరోజు వాళ్ల పేరెంట్స్‌కి చెప్పా. అడ్జస్ట్‌మెంట్‌కు మారుపేరు వాళ్లమ్మాయి అన్నారు. నేనే కట్నం కోసం అలా అబద్ధాలు చెప్తున్నానని నింద వేశారు. సమస్య ఇంకో రూపం తీసుకుంటుందేమోనని నోర్మూసుకున్నా!.
త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్‌కి గురి..
ఓ రోజు... తన ఫ్రెండ్ వచ్చింది. గృహప్రవేశమట.. ఇన్వయిట్ చేయడానికి. ఆమె వెళ్లిపోయాక.. మొదలైంది దెప్పడం.. ‘మనకన్నా రెండు నెలలు లేట్‌గా పెళ్లయింది వాళ్లకు. మీ కన్నా తక్కువ జీతం. అయినా ఇంత త్వరగా ఫ్లాట్ కొనేసుకున్నారు. నాకు తల తీసేసినట్టుగా ఉంది తన ముందు. మీరూ ఉన్నారు.. ఏ ప్లాన్ లేకుండా!’ అంటూ. ‘పెళ్లయినప్పటి నుంచి నాకు ఊపిరి సలపనిచ్చావా? ఏ నెల ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా నన్ను ఖాళీగా ఉంచావ్? పెళ్లయిన ఏడాదిలోపు మనమెంత వేస్ట్ ఖర్చు చేశామో.. క్రెడిట్ కార్ట్స్‌కి ఎంతెంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నామో లెక్క తీయ్. నువ్వు నీ కోరికలు కంట్రోల్ చేసుకుంటే త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనొచ్చు’ అని విసురుగా వెళ్లిపోయా! కానీ తను ఊరుకోలేదు... తెల్లవారి నుంచి రోజూ పోరడమే! ఊళ్లో నా పేరు మీదున్న పొలం అమ్మి, త్రీబెడ్‌రూమ్ ఫ్లాట్ కొనమని! ఆ పోరు నరకాన్ని తలపిస్తోంది. ఓ రోజు కూర్చోబెట్టి నా జీతం, ఖర్చులు, అప్పులు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ‘పొలం నాన్న ఇచ్చిన ఆస్తి. దాన్ని వీలయితే పెంచుతా... లేదంటే తాత గుర్తుగా నా పిల్లలకు పంచుతా.
అంతేకాని అమ్మను’ అని స్పష్టంగా చెప్పా. ‘ఒక్క ఏడాది ఓపిక పడితే ప్రమోషన్ వస్తుంది.. ఈ అప్పులూ తీర్చేస్తా.. అప్పటి దాకా నీ ఖర్చులు తగ్గించుకో. తర్వాత లోన్ తీసుకొని ఫ్లాట్ కొనుక్కుందాం... కాస్త ఓపిక పట్టు’ అంటూ బతిమాలుకున్నా. అప్పుడు ఊరుకుంది. అర్థం చేసుకుందని అపోహ పడ్డా. తెల్లవారి నుంచి డబుల్ టార్చర్ స్టార్ట్ చేసింది. ‘నన్నే పోషించలేని వాడికి... నాకే ఓ ఇల్లు సమకూర్చలేనివాడికి... ఇంకా పిల్లలనే ఆశ కూడానా! నన్ను ఖర్చులు తగ్గించుకోమంటున్నావ్.. రేపు పిల్లలు పుడితే ఎలా మెయిన్‌టెయిన్ చేస్తావ్.
ఇద్దరికే ఇన్ని అప్పులు చేసినవాడివి... రేపు నన్ను, నా పిల్లలనూ అమ్మేస్తావేమో. అసలు నిజంగా నువ్ టీమ్ లీడర్‌వేనా? నీకు అంత సీన్ ఉందా..? ఇల్లు కొనలేని వాడివి, పెళ్లాం అడిగింది తెచ్చివ్వడం చేతకానివాడికి పెళ్లెందుకు? పెళ్లాం ఎందుకు?’ అంటూ హిస్టీరియా వచ్చినదానిలా అరిచింది. ఆ మాటలకు నాకూ కోపం, ఆవేశం వచ్చాయి. అక్కడే ఉంటే అదుపు తప్పి, తనను ఎక్కడ కొడతానో అని బయటకు వెళ్లిపోయా.
కాపురం చేయను.. కానీ విడాకులూ వద్దు..
చాలా భరించాను. తను నా ఉద్యోగం, జీతం గురించి మా ఆఫీస్ వాళ్లతో ఎంక్వయిరీ చేసుకుంది. ఆ విషయం తెలిసినా ఊరకున్నా. ఇప్పుడు ఆమె మాటలతో నా ప్రాణమే పోయేది యాక్సిడెంట్ అయి. కలిసి ఉండడానికే కదా బతుకుతుంది. కానీ మా కాపురం ప్రాణాలు తీసే స్థితికి చేరుకుంది. విషయం ఇంత వరకు రావడంలో నా తప్పూ ఉండొచ్చు. స్వతహాగా వెన్నెల మంచిదే. లేమిలో పెరగడం వల్ల మనసులో దాచుకున్న కోరికలన్నిటినీ నా ద్వారా తీర్చుకోవాలనుకుంటుంది కాని నా ఆర్థికపరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు. అంచనా వేయట్లేదు. ఆమెను కంట్రోల్ చేయలేకపోతున్నా. కలిసి ఉండడం నా వల్ల కాదు. అలాగని ఆమెకు విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలనీ లేదు. చాలు. పెళ్లంటేనే విరక్తి పుడుతోంది. దయచేసి భార్యభర్తలుగానే మేము విడివిడిగా.. ప్రశాంతంగా బతికే సొల్యూషన్ చెప్పండి. తను విడిగా ఉంటే నెలకు ఎంత ఖర్చు అవుతుందో అంతా ఇవ్వడానికి నేను సిద్ధమే. నాకు మానసిక ప్రశాంతత కావాలి’. లాయర్ దగ్గర బావురుమన్నాడు ప్రశాంత్. ‘మీరు అడిగిన దాన్ని బట్టి మీకు ఉన్న మార్గం.. జ్యుడీషియల్ సపరేషన్’ అని చెప్పారు లాయర్.
జ్యూడిషయల్ సపరేషన్ అంటే: ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 10 జ్యుడీషియల్ సపరేషన్ గురించి చెబుతోంది. భార్యాభర్తలు కోర్ట్ ద్వారా విడివిడిగా జీవించడానికి పొందే ఆదేశాలనే ‘న్యాయనిర్ణయ వేర్పాటు’ (జ్యుడీషియల్ సపరేషన్) అంటారు. ఈ సెక్షన్ ప్రధానోద్దేశం పార్టీలు రాజీపడడానికి పునరాలోచించుకునే అవకాశాన్ని కల్పించడం. దంపతుల్లో ఎవరైనా సరే కుటుంబ న్యాయస్థానాల్లో దీనికి సంబంధించిన పిటీషన్ వేసుకోవచ్చు. తొందరపడి వివాహబంధాన్ని రద్దు చేసుకోకుండా ఉండేందుకు ఇదొక మంచి ఆప్షన్. జ్యుడీషియల్ సపరేషన్ డిక్రీ పొందిన వ్యక్తులు వేరువేరుగా నివసించాలి. అంతేకానీ వివాహ బంధం రద్దు కాదు. అంటే విడాకులు కావు. వారసత్వ హక్కులూ రద్దు కావు. అలాగని జ్యుడీషియల్ సపరేషన్‌లో ఉన్న భార్యాభర్తలు వేరేవారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇతరులతో శారీరకసంబంధాలూ ఏర్పరచుకోకూడదు. అంటే వీళ్లు చట్టప్రకారం భార్యాభర్తలే కానీ సంసారం చేయాల్సిన పనిలేదన్నమాట. వివాహబంధాన్ని కాక కలిసి జీవించవలసిన అవసరాన్ని, బాధ్యతను రద్దు చేస్తుందీ జ్యుడీషియల్ సపరేషన్. - parvathiadvocate2015@gmail.com
-- సరస్వతి రమ